వైరాలజీ (Virology)

వైరస్‌ను గడగడలాడించే వైరాలజిస్ట్

గతంలో జికా, ఎబోలా.. తాజాగా కరోనా(కొవిడ్–19)!! ఇలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త వైరస్లు ప్రబలుతూ మానవాళి ఉనికినే ప్రశ్నిస్తున్నాయి..! ఇలాంటి ప్రాణాంతక వైరస్ల గుట్టు విప్పి.. వాటిని నియంత్రించే మందులను, వ్యాక్సిన్లను కనిపెట్టే శాస్త్రవేత్తలే.. వైరాలజిస్ట్లు!! వైరస్‌లను అధ్యయనం చేసే శాస్త్రం… వైరాలజీ. వైరస్లు మానవాళిని గడగడలాడిస్తే.. వైరాలజిస్టులు వైరస్‌లకు దడపుట్టిస్తారు.
Career guidance

వైరాలజిస్టులు వైరస్‌లపై అధ్యయనం చేస్తారు. వైరస్ ఇన్ఫెక్షన్ల చికిత్స, నియంత్రణ, పరిశోధనల్లో పాల్గొంటూ.. ప్రజల ప్రాణాలను కాపాడుతారు. కరోనా వంటి వైరస్ల ఉధృతి కారణంగా ప్రస్తుతం వైద్య రంగంలో వైరాలజిస్టుల పాత్ర అత్యంత కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో.. వైరాలజీ అంటే ఏమిటి? వైరాలజిస్టుల విధులు, అందుబాటులో ఉన్న కోర్సులు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం..
మెడికల్ మైక్రోబయాలజీలో వైరాలజీ ఓ విభాగం. వైరాలజిస్టులు ప్రోటీన్ కవచం కలిగిన సబ్ మైక్రోస్కోపిక్, పారాసైటిక్ పార్టికల్స్, వైరస్‌లను పోలిన క్రియాజనకాలను అధ్యయనం చేస్తారు. వీటితోపాటు వైరస్ల నిర్మాణం, వర్గాలు, పరిణామక్రమం, ఆవాస కణాలకు సోకే–అక్కడి నుంచి వ్యాప్తి చెందే క్రమం, కణాలు, రోగనిరోధక శక్తిపై వైరస్ల ప్రభావం, వ్యాధి కారణాలు, దాన్ని కట్టడిచేసే విధానాల గురించి అధ్యయనం చేస్తారు.
ఎన్ఐవీ..
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్), రాక్ఫెల్లర్ ఫౌండేషన్ సహకారంతో పుణేలో 1952లో వైరస్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనికే 1972లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) హోదా కల్పించారు. దేశంలో వైరస్‌లపై పరిశోధనలు చేసే ప్రముఖ ఇన్స్టిట్యూట్.. ఎన్ఐవీ. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలకు ఎన్ఐవీ నోడల్ సెంటర్‌గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా వైరస్ల అధ్యయనానికి సంబంధించి డబ్ల్యూహెచ్‌వో సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ సెంటర్గానూ గుర్తింపు పొందింది.
ఎన్ఐవీ 2005 నుంచి పుణెలోని సావిత్రిబాయి ఫులే విశ్వవిద్యాలయం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మాటిక్స్ విభాగానికి అనుబంధంగా రెండేళ్ల ఎంఎస్సీ వైరాలజీ కోర్సును ఆఫర్చేస్తోంది. దేశంలో అతికొద్ది ఇన్స్టిట్యూట్లే ఈ కోర్సును అందిస్తున్నాయి. ఎన్ఐవీ ఈ కోర్సును అంతర్జాతీయ ప్రమాణాలతో అందిస్తుండటం విశేషం. ఎన్ఐవీలో ఆధునిక మాలిక్యులర్ వైరాలజీ, ఇమ్యునాలజీ పరిశోధనకు అత్యాధునిక మౌలిక వసతులు ఉన్నాయి. అడ్వాన్స్డ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ, యానిమల్ ఎక్స్పెరిమెంటల్ బీఎస్ఎల్–3, బీఎస్ఎల్–4 సదుపాయాలను కలిగుండటం ఎన్ఐవీ ప్రత్యేకత.

అర్హతలు:
కనీసం 60శాతం మార్కులతో ఎంబీబీఎస్/బీవీఎస్సీ/బీఎస్సీ (బయోటెక్నాలజీ/బోటనీ/కెమిస్ట్రీ/కెమికల్ లేబొరేటరీ సైన్స్/లైఫ్‌సైన్సెస్ /మైక్రోబయాలజీ/జువాలజీ) ఉత్తీర్ణులు ఎంఎస్సీ వైరాలజీలో ప్రవేశానికి అర్హులు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సరిపోతుంది.

ప్రవేశ పరీక్ష:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) అందించే ఎమ్మెస్సీలో ప్రవేశం పొందేందుకు ఎంట్రెన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఇది 200 మార్కులకు జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు.

ఉన్నత అవకాశాలు
బోధన, పరిశోధన, హెల్త్‌కేర్ రంగాలకు అవసరమైన సుశిక్షితులైన వైరాలజిస్టులను అందించే ఉద్దేశంతో ఎన్ఐవీ ఎంఎస్సీ వైరాలజీ కోర్సుకు రూపకల్పన చేసింది. దీంతో ఇక్కడ చదివిన విద్యార్థులు ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలను అందుకోవడంలో ముందు వరుసలో నిలుస్తున్నారు. విద్యార్థులకు ఉపయోగపడేలా ఎన్ఐవీ ఏటా క్యాంపస్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేస్తోంది. ఇదే సమయంలో దేశీయ అవసరాలను తీర్చేలా కృషి చేస్తోంది.
తాజాగా ఎన్ఐవీ బయోసేఫ్టీ, బయో సెక్యూరిటీకి సంబంధించిన సిలబస్‌ను సమూలంగా మార్పుచేసింది. దీంతో ఇక్కడ చదివిన విద్యార్థులు అన్ని పాథోజెనిక్ వైరస్లు లేదా ఆర్గానిజమ్స్ లేబొరేటరీల్లో పనిచేయగలిగే నైపుణ్యాలను కలిగుంటారు. ఎన్ఐవీలో ఎంఎస్సీ వైరాలజీ చదివిన విద్యార్థుల్లో ప్రస్తుతం 47శాతం మంది పీహెచ్‌డీలో చేరుతున్నారు. తద్వారా పరిశోధనల్లో నిమగ్నమవుతున్నారు. భారత్‌లో 35శాతం మంది, విదేశాల్లో 4శాతం మంది కొలువులు దక్కించుకుంటున్నారు.

శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం..
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1988లో వైరాలజీ డిపార్ట్మెంట్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఎంఎస్సీ వైరాలజీ, పీహెచ్డీ వైరాలజీ కోర్సులను అందిస్తున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎస్వీయూసెట్ ద్వారా ఎంఎస్సీ వైరాలజీ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. ఇప్పటికే వర్సిటీలో ఆయా కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులు గేట్, సీఎస్ఐఆర్ నెట్లలో ప్రతిభ చూపి.. ఎయిమ్స్, టీఐఎఫ్ఆర్, ఇక్రిశాట్ తదితర జాతీయ స్థాయి పరిశోధనా ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశం పొందారు.
మణిపాల్ వర్సిటీ: మణిపాల్ యూనివర్సిటీ రెండేళ్ల వ్యవధితో ఎంఎస్సీ క్లినికల్ వైరాలజీ కోర్సును అందిస్తోంది. మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్(మెట్) ద్వారా ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మే 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
అమిటీ వర్సిటీ: నోయిడాలోని అమిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ ఇమ్యునాలజీ.. రెండేళ్ల వ్యవధితో ఎంఎస్సీ వైరాలజీ కోర్సును ఆఫర్చేస్తోంది. లైఫ్ సైన్సెస్‌లో కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. ఇంటర్‌లోనూ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఉపాది వేదికలు..
ఎంఎస్సీ వైరాలజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఉపాది అవకాశాలు కల్పిస్తున్న సంస్థలు.. » ఆక్టిస్ బయలాజిక్స్ » భారత్ బయోటెక్ » హిందుస్థాన్ యూనిలీవర్ » నేషనల్ ఎయిడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ »నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ » నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ రీప్రొడెక్టివ్ హెల్త్ » సెరుమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా » టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ » వేంకటేశ్వర హ్యాచరీస్ తదితర సంస్థలతోపాటు అనేక మంది బెల్జియం, కెనడా, ఫిన్లాండ్, జర్మనీ, ఇండియా, ఇటలీ, సింగపూర్, థాయ్‌లాండ్, అమెరికాల్లోని వర్సిటీలు, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో రీసెర్చ్ విభాగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్http://www.niv.co.in

Related posts

%d bloggers like this: