వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ.. డిమాండ్ ఉన్న కోర్సు! ప్రస్తుతం జాతీయంగా, అంతర్జాతీయంగా పశువైద్యులకు కొరత నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ డాక్టర్ల సేవల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది.
డెయిరీ, పౌల్ట్రీ రంగాలతోపాటు పెట్లు, యానిమల్ హెల్త్‌కేర్‌కు ప్రాధాన్యం పెరగడమే ఇందుకు కారణం! మరోవైపు పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ఎన్నడూ లేనంత శ్రద్ధ కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు వెటర్నరీ రంగంలో చక్కటి కెరీర్ అవకాశాలకు మార్గం వేస్తోంది. ఈ నేపథ్యంలో.. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ విభాగంలో కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం…
‘వెటర్నరీ సైన్స్ చదివితే.. పశు వైద్యులుగానే స్థిర పడతాం. అవకాశాలు కూడా తక్కువే. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మాత్రమే కొలువులు దొరుకుతాయి’-ఇదీ గతంలో వెటర్నరీ సైన్స్ కోర్సుపై నెలకొన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వెటర్నరీ సైన్స్ చదివిన అభ్యర్థులు పశు వైద్యులుగానే కాకుండా.. పలు అనుబంధ విభాగాల్లోనూ కొలువులు సొంతం చేసుకునేందుకు వీలుంది. ఇటీవల కాలంలో పెంపుడు జంతువుల పట్ల వ్యక్తుల్లో ఆసక్తి పెరగడం, అవి అనారోగ్యానికి గురైతే ఖర్చు గురించి ఆలోచించకుండా.. పశువైద్యుల దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో వెటర్నరీ హెల్త్‌కేర్ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఏటా పదిశాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటోంది. దేశ వెటర్నరీ హెల్త్‌కేర్ మార్కెట్ 2024 నాటికి 1.17 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని ట్రాన్స్పరెన్సీ మార్కెట్ రీసెర్చ్ తాజా నివేదికలో వెల్లడైంది.
పశువైద్యుల కొరత :పలు గణాంకాల ప్రకారం- దేశంలో ప్రస్తుతం దాదాపు 1.8 లక్షల మంది వెటర్నరీ సైన్స్ నిపుణుల అవసరం నెలకొంది. కానీ.. ప్రతి ఏటా సర్టిఫికెట్లతో బయటికి వస్తున్న వారి సంఖ్య 80వేలు దాటడంలేదు. దీన్నిబట్టి వెటర్నరీ రంగంలో వైద్య కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశాలకు ఢోకాలేదని చెప్పొచ్చు. వెటర్నరీ సైన్స్, యానిమల్ హెల్త్‌కేర్ విభాగాలకు సంబంధించి వైద్యులు మొదలు.. రీసెర్చ్ నిపుణుల వరకు డిమాండ్ నెలకొంది. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎంఎస్) కోర్సు పూర్తిచేస్తే క్షేత్ర స్థాయిలో పశు వైద్యులుగా అవకాశం లభిస్తుంది. ఉన్నత విద్య పరంగా పీజీ, పీహెచ్డీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్‌లో చేరొచ్చు. తద్వారా యానియల్ హెల్త్‌కేర్‌కు సంబంధించి టీకాల తయారీ దిశగా కీలకమైన పరిశోధనలు సాగించే వీలుంది.
పరికరాల తయారీ సంస్థలు :వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్, పీజీ, పీహెచ్డీ స్థాయి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు జంతువుల ఆరోగ్య సంబంధిత పరికరాల తయారీ సంస్థల్లో కొలువులు లభిస్తున్నాయి. జంతువులకు వచ్చే వ్యాధుల నిర్ధారణకు అవసరమైన ఎక్స్-రే వంటి పరికరాల తయారీ సంస్థలు, ఆపరేషన్ థియేటర్ పరికరాల ఉత్పత్తి సంస్థలు, డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ తయారీ సంస్థలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీటిలో కొలువులు సొంతం చేసుకున్న వారికి నెలకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం లభిస్తోంది. ఈ పరికరాల తయారీ విభాగంలో మెర్క్ అండ్ కో; జోయెటిస్, ఎలాంకో, మెరియల్ యానిమల్ హెల్త్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.
లేబొరేటరీలు :
వెటర్నరీ ఆసుపత్రులతోపాటు యానిమల్ హెల్త్ డయాగ్నస్టిక్ లేబొరేటరీల ఏర్పాటు కూడా పెరుగుతోంది. ఎక్స్-రే టెక్నీషియన్స్, బ్లడ్ టెక్నీషియన్స్, స్కానింగ్ ఆపరేటర్ల అవసరం కూడా ఏర్పడుతోంది. వెటర్నరీ సైన్స్‌లో డిప్లొమా స్థాయి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు వీటిలో కొలువులు లభిస్తున్నాయి. నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనాలు సొంతం చేసుకునే అవకాశం ఉంది.
ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు :
వెటర్నరీ సైన్స్ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు దేశంలో ప్రభుత్వ రంగంలోని పశు వైద్య కేంద్రాలు, జూపార్క్‌లు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, పబ్లిక్ హెల్త్ లేబొరేటరీస్, రక్షణ, వ్యవసాయ విభాగాల్లో కొలువులు సొంతం చేసుకునే వీలుంది. ప్రైవేటు రంగంలో పౌల్ట్రీ ఫారాలు, హేచరీస్, ఆక్వా ఫామ్స్, బయలాజికల్ ప్రొడక్షన్ యూనిట్స్, డైరీ ఫామ్స్‌లో ఉద్యోగాలు అందుకోవచ్చు. ఇవే కాకుండా.. బ్యాంకులు, బీమా సంస్థలు, జంతు ప్రదర్శన శాలల్లో వెటర్నరీ సైన్స్ నిపుణులకు అవకాశాలు లభిస్తున్నాయి. వీటితోపాటు లైవ్‌స్టాక్ ఫీడింగ్ సంస్థలు, యానిమల్ డ్రగ్ ప్రొడక్షన్ సంస్థలు, డ్రగ్ ఫార్ములేషన్ సంస్థల్లోనూ వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఖాయం. బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులకు ప్రారంభంలో 20వేల జీతం లభిస్తోంది. అలాగే పీజీ ఉత్తీర్ణులు వారి స్పెషలైజేషన్ ఆధారంగా రూ.30వేల నుంచి రూ.40వేల వేతనంతో కెరీర్ ప్రారంభించొచ్చు.
అంతర్జాతీయంగానూ అవకాశాలు :వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీలో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల ఉత్తీర్ణులకు అంతర్జాతీయ అవకాశాలకు కొదవలేదు. ప్రధానంగా యూకే, ఆస్ట్రేలియా, అమెరికాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం- ఈ దేశాలు జీవజాతుల సంరక్షణపై భారీగా వ్యయం చేస్తున్నాయి. ఆయా దేశాల్లో పెంపుడు జంతువుల సంస్కృతి ఎక్కువ. కాని అక్కడ డిమాండ్‌కు తగ్గట్టు పశువైద్యులు అందుబాటులో లేరు. కాబట్టి మన అభ్యర్థులు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అవకాశాలు అందుకునే వీలుంది. మన దేశంలో బీవీఎస్సీ అండ్ ఏహెచ్ చేసిన అభ్యర్థులు సదరు దేశాలు వేర్వేరుగా నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. రాయల్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సర్జన్స్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే యూకేలో కొలువుకు అనుమతి లభిస్తుంది. అదే విధంగా యూఎస్‌లో అడుగు పెట్టాలంటే.. అమెరికన్ బోర్డ్ ఆఫ్ వెటర్నరీ ప్రాక్టీషనర్స్ సర్టిఫికేషన్ సొంతం చేసుకోవాలి.
రీసెర్చ్‌లో అవకాశాలు విస్తృతం : ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతో పోల్చితే పరిశోధన విభాగంలో ఆకర్షణీయ అవకాశాలు లభిస్తున్నాయి. దేశంలో జంతు సంపద వృద్ధి, సంబంధిత రంగాల్లో సమస్యల పరిష్కారం దిశగా రీసెర్చ్ నిపుణుల అవసరం పెరుగుతోంది. వెటర్నరీ సైన్స్, యానిమల్ హజ్బెండరీ, డెయిరీ టెక్నాలజీ, ఫిషరీస్ టెక్నాలజీల్లో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థులు.. ఆర్ అండ్ డీ యూనిట్స్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఇన్ కామెల్(బికనీర్) వంటి ప్రముఖ సంస్థల్లో అవకాశాలు దక్కించుకోవచ్చు. వీరు ప్రారంభంలోనే నెలకు రూ.80వేలకు పైగా వేతనంతో అధ్యాపక వృత్తిలో, పరిశోధనల విభాగంలో సైంటిఫిక్ ఫెలోస్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.
స్వయం ఉపాధి :వెటర్నరీ సైన్స్ సంబంధిత కోర్సులు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువే! సొంతంగా పెట్ కేర్ క్లినిక్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న పెట్ యానిమల్స్ కల్చర్.. వెటర్నరీ రంగంలో స్వయం ఉపాధికి ప్రధానంగా మారుతోంది. ఇలా స్వయం ఉపాధి ద్వారా నెలకు కనీసం రూ.40 వేల వరకు ఆర్జించే అవకాశం ఉంది.
బెస్ట్ స్పెషలైజేషన్స్ :
ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా బీవీఎస్సీ తర్వాత ఎంవీఎస్సీలో పలు స్పెషలైజేషన్లు ఉన్నప్పటికీ.. బ్యాక్టీరియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, లైవ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, లైవ్ స్టాక్ ప్రొడక్ట్ టెక్నాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్ అండ్ ఎపిడమాలజీలు బెస్ట్ స్పెషలైజేషన్లుగా మార్కెట్లో డిమాండ్ నెలకొంది.
వెటర్నరీ సైన్స్.. ముఖ్యాంశాలు :వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ, యానిమల్ హెల్త్‌కేర్ విభాగంలో రానున్న రెండేళ్లలో దాదాపు రెండు లక్షల మంది నిపుణుల అవసరం.
ప్రస్తుతం డిమాండ్ సప్లయ్ మధ్య దాదాపు 40 శాతం వ్యత్యాసం ఉంది.
వెటర్నరీ సంబంధిత విభాగాల్లో టీచింగ్/రీసెర్చ్ విభాగాల్లో రెండు వేలకుపైగా నిపుణులు అవసరం.
వెటర్నరీ సంబంధిత రంగాల్లో పారా సపోర్టింగ్ విభాగాల్లో దాదాపు మూడు లక్షల అవకాశాలు.
అంతర్జాతీయంగానూ భారీ డిమాండ్. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, కెనడాల్లో సులువుగా కొలువులు సొంతం చేసుకునే అవకాశం.
వెటర్నరీ హాస్పిటల్స్‌తోపాటు పరికరాల ఉత్పత్తి యూనిట్స్, లేబొరేటరీస్లోనూ అవకాశాలు.
అకడమిక్ కోర్సులు :
యానిమల్ హెల్త్‌కేర్ విభాగంలో కెరీర్ కోరుకునే విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ) కోర్సులో చేరొచ్చు. ఈ కోర్సు.. వెటర్నరీ రంగంలో కెరీర్ అవకాశాలకు, ఉన్నత విద్యకు తొలి అడుగుగా నిలుస్తోంది. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక వెటర్నరీ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పీజీ స్థాయిలో యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, వెటర్నరీ అనాటమీ అండ్ హిస్టాలజీ వంటి పలు స్పెషలైజేషన్స్ అందుబాటులో ఉన్నాయి. పీజీ అనంతరం పరిశోధనల దిశగా పీహెచ్‌డీలోనూ చేరే వీలుంది.
ప్రవేశం ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ(తిరుపతి); తెలంగాణలో పీవీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీల ఆధ్వర్యంలో బీవీఎస్సీ కోర్సుల ప్రవేశ ప్రక్రియ జరుగుతుంది. ఇందుకోసం అభ్యర్థులు ఇంటర్(బైపీసీ) ఉత్తీర్ణతతోపాటు ఎంసెట్‌లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్‌లో ర్యాంకు సొంతం చేసుకోవాలి. ఆ ర్యాంకు ఆధారంగా సదరు యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరై ప్రవేశం ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలు:
1. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-తిరుపతి
2. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-గన్నవరం
3. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్- ప్రొద్దుటూరు
4. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ -ముతుకూరు.
తెలంగాణలో కళాశాలలు:
1. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-హైదరాబాద్
2. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-కోరుట్ల
3. కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్-మామ్నూరు
4. కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్-పెబ్బేరు.
డిప్లొమా కోర్సులు :
వెటర్నరీ సైన్స్‌కు సంబంధించి డిప్లొమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు విభాగాల్లో 22 పాలిటెక్నిక్స్; తెలంగాణలో నాలుగు పాలిటెక్నిక్స్ ఉన్నాయి.
గ్లోబల్ కెరీర్ ఖాయం :
ప్రస్తుతం వెటర్నరీ సైన్స్ నిపుణులకు అంతర్జాతీయంగానూ డిమాండ్ నెలకొంది. మానవ వనరుల డిమాండ్ సప్లయ్ కోణంలో 40 శాతంపైనే వ్యత్యాసం ఉంది. కాబట్టి వెటర్నరీ కోర్సులు పూర్తి చేసిన వారికి గ్లోబల్ కెరీర్స్ ఖాయం అని చెప్పొచ్చు. ఇందులో ఎదగాలంటే.. పశు వైద్యంపై ఆసక్తి ఎంతో ముఖ్యం.