వీటిలో నెగ్గితేనే.. త్రివిధ దళాల్లో ‘ఆఫీసర్’ కొలువు ఖాయం
త్రివిధ దళాలు.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్. యూపీఎస్సీ నిర్వహించే సీడీఎస్ఈ, ఎన్డీఏ, ఎన్ఏ రాత పరీక్షలు, ఏఎఫ్‌క్యాట్, టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ పరీక్షలు.. ఇవన్నీ త్రివిధ దళాల్లో అడుగుపెట్టేందుకు తొలిదశ మాత్రమే. ఇందులో మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు..
అత్యంత కీలకమైన ఎంపిక ప్రక్రియ.. సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూలోనూ సత్తా చాటాలి. రాత పరీక్ష కంటే క్లిష్టమైనదిగా భావించే ఎస్ఎస్బీ ఎంపిక ప్రక్రియలో ఐదు రోజులపాటు అనేక కోణాల్లో అభ్యర్థిని పరీక్షిస్తారు. ఈ నేపథ్యంలో.. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
ఎస్ఎస్బీ ఎంపిక ప్రక్రియను ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌గా పేర్కొంటారు. రాత పరీక్షల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు ఆయా విభాగాలు ప్రత్యేకంగా, వేర్వేరుగా ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయి. రాత పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సంబంధిత విభాగాలు.. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రత్యేకంగా సమాచారం ఇస్తాయి.
అయిదు రోజులు.. 15 లక్షణాలు :
ఎస్ఎస్బీ ఎంపిక ప్రక్రియ అయిదు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ మొత్తం ప్రక్రియలో అభ్యర్థుల్లోని, వ్యక్తిగత, మానసిక, శారీరక ద్రుఢత్వా లకు సంబంధించి మొత్తం 15 లక్షణాలను పరీక్షిస్తారు. ఇందుకోసం గ్రూప్ డిస్కషన్, సైకలాజి కల్ టెస్ట్‌లు నిర్వహిస్తారు. మొత్తంగా సదరు విభాగాల్లో ఆఫీసర్లకు ఉండాల్సిన లక్షణాలను (ఆఫీసర్స్ లైక్ క్వాలిటీస్) పరీక్షించే విధంగా ఈ ప్రక్రియ జరుగుతుంది.
ముందుగా రిపోర్టింగ్ :ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులు ముందుగా సంబంధిత కేంద్రం వద్ద అధీకృత అధికారి ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. సదరు అధికారి ఎస్ఎస్బీ ఎంపిక ప్రక్రియపై అభ్యర్థులకు అవగాహన కల్పిస్తారు. ఇదే సమయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (అభ్యర్థుల అకడమిక్ ధ్రువ పత్రాలు, రాత పరీక్ష ఫలితాల పత్రాలు తదితర)కూడా జరుగుతుంది. ఆ తర్వాత రోజు నుంచి అయిదు రోజుల ఎంపిక ప్రక్రియలో.. తొలిరోజు ప్రక్రియ మొదలవుతుంది. ఎయిర్‌ఫోర్స్, అదే విధంగా కొన్ని టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌ల విషయంలో మాత్రం సర్టిఫికెట్ వెరిఫికేషన్ రోజు నుంచే ఎస్ఎస్బీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
మొదటి రోజు మూడు పరీక్షలు :
మొత్తం అయిదు రోజుల ఎస్ఎస్బీ ఎంపిక ప్రక్రి యలో.. మొదటి రోజున అభ్యర్థులు మూడు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. అవి..
1. ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ (పేపర్-1, పేపర్-2)
2. పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్
3. డిస్కషన్ టెస్ట్.
పేపర్-1, పేపర్-2లుగా నిర్వహించే ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ ప్రధాన ఉద్దేశం.. అభ్యర్థి వ్యక్తిత్వం, పోటీతత్వ లక్షణాలను పరీక్షించడం. రెండు పేపర్లలోనూ వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పేపర్లో 40 ప్రశ్నలు అడుగుతారు. పేపర్-1కు 22 నిమిషాలు, పేపర్-2కు 17 నిమిషాల వ్యవధి లో సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో పొందిన మార్కులు, చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులకు అయిదు రకాలుగా(ఔట్ స్టాండింగ్, ఎక్సలెంట్, ఎబోవ్ యావరేజ్, యావరేజ్, బిలో యావరేజ్) రేటింగ్స్ ఇస్తారు. తర్వాత దశలో నిర్వహించే పిక్చర్ పర్సెప్షన్, డిస్కషన్ టెస్ట్‌లలో పొందిన మార్కులకు ఈ రేటింగ్స్‌ను కూడా కలుపుతారు. కాబట్టి ఇంటెలిజెన్స్ రేటింగ్ టెస్ట్ ఎంతో కీలకంగా మారుతోంది.
పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్:
మొదటి రోజు రెండో ప్రక్రియ పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్. ఇందులో అభ్యర్థుల ముందు ఒక సందర్భం లేదా సన్నివేశానికి సంబం దించిన చిత్రాన్ని 30 సెకన్లపాటు ప్రదర్శిస్తారు. ఆ చిత్రంలోని అంశాల ఆధారంగా అభ్యర్థులు నాలు గు నిమిషాల వ్యవధిలో ఒక చిన్న స్టోరీ రాయాల్సి ఉంటుంది. ఇందులో అభ్యర్థులు ఆ చిత్రం ప్రాధాన్యత, అందులో కనిపించిన సన్నివేశం, సందర్భం, ఆ చిత్రం సారాంశం గురించి వివరించాల్సి ఉంటుంది. అభ్యర్థులను 10 నుంచి 18 మంది చొప్పున బృందాలుగా విభజిస్తారు. గ్రూప్ డిస్కషన్ టెస్ట్: పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా విభజించిన బృందాలకు గ్రూప్ డిస్కషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థులు తాము రాసిన స్టోరీ(వివరణ) గురించి మౌఖికంగా చర్చించాల్సి ఉంటుంది. ప్రతి బృందంలోని అభ్య ర్థులందరూ ఆ చిత్రానికి సంబంధించి ఉమ్మడి అభిప్రాయానికి వచ్చే విధంగా ఉండాలి. ఈ మూడు టెస్ట్‌లలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి.. తదుపరి దశలో జరిగే టెస్ట్‌లకు ఎంపిక చేస్తారు.
రెండో రోజు.. సైకాలజీ టెస్ట్ :
రెండో రోజు సైకలాజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ముందుగా థీమాటిక్ అప్పెర్సెప్షన్ టెస్ట్, వర్డ్ అసెస్మెంట్ టెస్ట్, సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్, సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్‌లు ఉంటాయి.
థీమాటిక్ అప్పెర్సెప్షన్ టెస్ట్‌లో అభ్యర్థుల ముందు 12 చిత్రాలను ప్రదర్శిస్తారు. వాటిని చూసిన తర్వాత ఒక్కో చిత్రంపైనా నాలుగు నిమిషాల వ్యవధిలో స్టోరీ రాయాల్సి ఉంటుంది.
వర్డ్ అసోసియేషన్ టెస్ట్‌లో 15 సెకన్ల వ్యవధిలో 60 పదాలను ప్రదర్శిస్తారు. ఆ పదాల ఆధారంగా అభ్యర్థులు ఒక అర్ధవంతమైన వాక్యాన్ని రూపొందించాల్సి ఉంటుంది.
సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్: రెండో రోజు ఎంపిక ప్రక్రియలో నిర్వహించే సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ కొంత కీలకమైనదిగా పేర్కొనొచ్చు. ఈ టెస్ట్‌లో భాగంగా అభ్యర్థులకు 60 నిజ జీవిత సంఘటనలతో కూడిన బుక్‌లెట్‌ను ఇస్తారు. అభ్యర్థులు వీటికి సంబంధించి తమ అభిప్రాయా లను 30 నిమిషాల వ్యవధిలో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థుల్లోని సమయస్ఫూర్తి, టైమ్ సెన్స్, వ్యక్తిత్వ వికాస స్థాయిని పరీక్షించడమే సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ ఉద్దేశం.
సెల్ఫ్ డిస్క్రిప్షన్ టెస్ట్: ఈ టెస్ట్ సమయంలో అభ్యర్థులు వ్యక్తిగత సందర్భానికి సంబంధించిన అంశాలను రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు తమ తల్లిదండ్రులు, టీచర్లు, స్నేహితులపై తమకున్న అభిప్రాయం, వారు మెరుగుపరుచు కోవాల్సిన నైపుణ్యాలు వంటివి. దీనికి కేటాయించిన సమయం 15 నిమిషాలు.
రెండో రోజు నాలుగు టెస్ట్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి మూడో రోజు ఎంపిక ప్రక్రియకు అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
మూడో రోజు.. గ్రూప్ టెస్టింగ్-1 :మూడో రోజు గ్రూప్ టెస్టింగ్-1 పేరుతో నిర్వహించే ఈ ప్రక్రియలో అభ్యర్థులు ఔట్ డోర్, ఇన్డోర్ టెస్ట్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మూడో రోజు నిర్వహించే టెస్ట్‌ల వివరాలు… గ్రూప్ డిస్కషన్: ఏదైనా సమకాలీన అంశం లేదా సామాజిక అంశంపై 20 నుంచి 30 నిమిషాల వ్యవధిలో గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు.
గ్రూప్ ప్లానింగ్ ఎక్సర్సైజ్:ఈ ప్రక్రియలో ముందుగా 10 నుంచి 15 మంది అభ్యర్థులతో వేర్వేరు బృందాలుగా విభజిస్తారు. ఆ తర్వాత వారికి ఏదైనా ఒక సమస్యతో కూడిన స్టోరీని పేర్కొంటారు. దీనికి అభ్యర్థులు ఆ స్టోరీలోని సమస్యలను గుర్తించడం, వాటికి పరిష్కారాలు కనుగొనడం చేయాల్సి ఉంటుంది.
ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్: ఇది ఫిజికల్ యాక్టివిటీ టెస్ట్‌గా నిలుస్తోంది. ఈ ప్రక్రియలోనూ అభ్యర్థుల ముందు ఏవైనా నాలుగు వాస్తవ సమస్యలు ఇస్తారు. వాటికి పరిష్కారం చూపాల్సి ఉంటుంది. ఇవి సాధారణంగా ఔట్ డోర్ యాక్టివిటీస్‌గా ఉంటాయి. అదే విధంగా అభ్యర్థుల్లోని భౌతిక ద్రుఢత్వాన్ని పరీక్షించేవిగా ఉంటాయి. బరువులు మోయడం, లాంగ్ జంప్ వంటి పోటీల్లో తమ సత్తా చూపాల్సి ఉంటుంది. గ్రూప్ అబ్స్టాకిల్ రేస్: ఇందులో అభ్యర్థులు నిర్ణీత బరువుతో కూడిన వస్తువుతో పాకుతూ నిర్ణీత హద్దును చేరుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా అభ్యర్థులను బృందాలుగా విభజిస్తారు. అభ్య ర్థుల్లో బృంద స్ఫూర్తిని నింపే ఉద్దేశం, ఆ స్ఫూర్తి ఏ మేరకు ఉందో పరీక్షించడం ఈ గ్రూప్ అబ్స్టాకిల్ రేస్ లక్ష్యంగా నిలుస్తోంది.
హాఫ్ గ్రూప్ టాస్క్:ఇది కూడా దాదాపు ప్రోగ్రెసివ్ గ్రూప్ టాస్క్ మాదిరిగానే ఉంటుంది. బృందాలు-అభ్యర్థుల సంఖ్య కొంత తక్కువగా ఉంటుంది. అదే విధంగా ఏదైనా ఒక అడ్డంకిని మాత్రమే దాటాల్సి ఉంటుంది.
నాలుగో రోజు.. గ్రూప్ టెస్టింగ్-2 :
మూడో రోజు ఫిజికల్ యాక్టివిటీస్‌లో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా నాలుగో రోజు గ్రూప్ టెస్టింగ్-2 పేరుతో పలు అంశాల్లో అభ్యర్థులను పరిశీలిస్తారు.
అవి.. లెక్చరెట్: ఇందులో ప్రతి అభ్యర్థికి నాలుగు టాపిక్స్ ఇస్తారు. వాటి నుంచి తమకు ఆసక్తి ఉన్న ఏదో ఒక టాపిక్‌ను ఎంచుకొని ఆ టాపిక్‌పై మూడు నిమిషాల వ్యవధిలో మాట్లాడాల్సి ఉంటుంది.
ఇండివిడ్యువల్ అబ్స్టాకిల్స్: ఈ దశలో ప్రతి అభ్యర్థికి 10 ఫిజికల్ టెస్ట్‌లు ఇస్తారు. మహిళా అభ్యర్థులైతే ఏడు టెస్ట్‌లు ఉంటాయి. వీటిలో ప్రధానంగా హై జంప్, బ్యారెల్ జంప్, డబుల్ జంప్, టార్జాన్ స్వింగ్, టైగర్ లీప్, రోప్ క్లైంబ్, కమాండో వాక్, స్క్రీన్ జంప్, మంకీ క్రాల్ తదితర టాస్క్‌లు ఉంటాయి. వీటిని మూడు నిమిషాల వ్యవధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆయా టాస్క్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగా 1 నుంచి పది మార్కులు కేటాయిస్తారు.
కమాండ్ టాస్క్: ఇది ఒక విధంగా అభ్యర్థుల్లో క్షేత్ర స్థాయిలోని నాయకత్వ లక్షణాలు, భౌతిక ద్రుఢత్వాన్ని పరిశీలించే టాస్క్‌గా పేర్కొనొచ్చు. ప్రతి అభ్యర్థి వాస్తవంగా ఒక కమాండర్‌గా తనకు తాను ఊహించుకుని ఒక టాస్క్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం తమ బృందం నుంచే ఇద్దరు లేదా ముగ్గురు సహచరులను తన సహాయ కులుగా తీసుకునే అవకాశం కల్పిస్తారు. దీనిద్వారా అభ్యర్థులు తమకు ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇవి సాధారణంగా క్లైంబింగ్, మెటీరియల్ బ్రేకింగ్ వంటి అంశాలపై ఉంటాయి.
ఫైనల్ గ్రూప్ టాస్క్: ఫిజికల్ యాక్టివిటీస్ టెస్ట్ విభాగంలో దాదాపు ఇది చివరిది. ఇందులో అభ్య ర్థులందరూ కలిసి ఏదైనా ఒక ఫిజికల్ టాస్క్‌ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.
పర్సనల్ ఇంటర్వ్యూ: నాలుగో రోజు చివరి ప్రక్రియ పర్సనల్ ఇంటర్వ్యూ. వాస్తవానికి రెండో రోజు, మూడో రోజు టాస్క్‌లు పూర్తయిన తర్వాత కూడా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆ సమయంలో సంబంధిత రోజున చేసిన టాస్క్‌లు, అభ్యర్థుల వ్యక్తిగత అనుభవం, వారికి కలిగిన అభిప్రాయాల గురించి అడుగుతారు. నాలుగో రోజు చివరి ప్రక్రియగా నిర్వహించే పర్సనల్ ఇంటర్వ్యూలో ఎస్ఎస్బీలో అప్పటి వరకు జరిగిన ప్రక్రియల్లో అనుభవాలు, అదే విధంగా వ్యక్తిగతంగా అకడమిక్ నేపథ్యం, కుటుంబ నేపథ్యం, అకడమిక్‌గా చూపిన ప్రతిభ, జనరల్ అవేర్నెస్ అంశాలపై అభ్యర్థులను ప్రశ్నిస్తారు.
అయిదో రోజు.. కాన్ఫరెన్స్ :
అభ్యర్థులకు పర్మనెంట్ కమిషన్ ర్యాంకు హోదాలో ఉద్యోగం కల్పించేందుకు తుది అంకం.. అయిదో రోజు. ఇందులో భాగంగా ఒకే ఒక్క అంశంలో అభ్యర్థులు పాల్గొనాల్సి ఉంటుంది. అది.. కాన్ఫరెన్స్.
ఈ ప్రక్రియలో ముందుగా మూల్యాంకన చేసే అధికారి క్లోజింగ్ అడ్రస్(ముగింపు ప్రకటన) చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల కాన్ఫరెన్స్ మొదల వుతుంది. తర్వాత అభ్యర్థుల ప్రతిభను మదింపు చేసిన అధికారులతో బోర్డ్ కాన్ఫరెన్స్ జరుగుతుం ది. ఇందులో సదరు మూల్యాంకన చేసిన అధికా రులు.. తమ పరిధిలోని అభ్యర్థుల్లోని సామర్థ్యాన్ని, సర్వీస్‌కు సరితూగే అంశాలను చర్చిస్తారు.
ఆ తర్వాత అభ్యర్థులు వ్యక్తిగతంగా బోర్డ్ ముందు హాజరవ్వాల్సి ఉంటుంది. అక్కడే బోర్డ్ అధికారులు సదరు అభ్యర్థులకు వారు చూపిన ప్రతిభకు సంబంధించిన అంశాలను, తమ మూల్యాంకనను వివరిస్తారు. దానికి అనుగుణంగా సదరు అభ్యర్థులను సర్వీస్‌కు సిఫార్సు చేయడం జరుగుతుంది.
అనంతరం మొత్తం అయిదు రోజుల ప్రక్రియలో పొందిన మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తారు. షార్ట్ లిస్ట్‌లో నిలిచిన అభ్యర్థులకు తదుపరి దశలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
ఈ వైద్య పరీక్షల్లోనూ అన్ని రకాలుగా త్రివిధ దళాలకు సరితూగే విధంగా అభ్యర్థులు ఉన్నారని సంబంధిత వైద్యులు సిఫార్సు చేస్తే.. పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో కొలువు ఖాయమైనట్లే.
తక్కువ సంఖ్యలో ఎంపికవుతున్న అభ్యర్థులు :
సీడీఎస్, ఎన్డీఏ, ఏఎఫ్‌క్యాట్ రాత పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలో విజయం సాధించి త్రివిధ దళాల్లో అడుగు పెడుతున్నారు. ఎన్డీఏ 1- 2019లో 447 మంది మాత్రమే ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలో విజయం సాధించారు. డిగ్రీ అర్హతగా నిర్వహించే సీడీఎస్ విషయంలో సీడీఎస్2-2018లో మూడు దళాలకు సంబంధించి కేవలం 295 మంది ఎస్ఎస్బీ ఎంపికలో విజేతలయ్యారు. ఏఎఫ్‌క్యాట్‌ను పరిశీలిస్తే.. జూలై 2019లో 114 మంది అభ్యర్థులు మాత్రమే మెరిట్ లిస్ట్‌లో నిలిచారు. ఇలా రాత పరీక్షలో విజయం సాధించినప్పటికీ ఎస్ఎస్బీలో రాణించలేకపోవడానికి కారణం.. ఈ ఎంపిక ప్రక్రియపై అవగాహన లేకపోవడమే. తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వంటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌కు ఇంకొంచెం పదును పెట్టుకుంటే సీడీఎస్, ఎన్డీఏ పరీక్షల్లోనూ విజయం సాధించి.. ఆ తర్వాత ఎస్ఎస్బీ ఇంటర్వ్యూను కూడా సులభంగా ఛేదించే అవకాశం ఉంటుంది.
You must log in to post a comment.