కరోనా కారణంగా విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు.. అన్నింటికీ సెలవులు ప్రకటించారు. కాని ఇంకా అటు అకడెమిక్ పరీక్షలు కానీ.. ఇటు పోటీ పరీక్షలు కానీ పూర్తికాలేదు.
|
![]() ఇలాంటి కీలక సమయంలో తరగతి గది బోధన లేని లోటును తీరుస్తున్నాయి.. ఆన్లైన్ వేదికలు! ముఖ్యంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఆర్డీ) అందుబాటులోకి తెచ్చిన.. స్వయం, ఈ పాఠశాల, స్వయం ప్రభ, నేషనల్ డిజిటల్ లైబ్రరీ, ఈ–సోధ్ సింధు వంటివి విద్యార్థులకు వరంగా మారుతున్నాయి. ఇంట్లోనే ఉండి అవసరమైన సబ్జెక్టులను నేర్చుకునేందుకు వీలుండడం, ఎంతో అనుభవం ఉన్న అధ్యాపకులు చెప్పే పాఠాలు, వీడియో లెక్చర్స్ అందిస్తుండటంతో.. విద్యార్థులు ఆన్లైన్ లెర్నింగ్వైపు దృష్టి సారిస్తున్నారు. ఎంహెచ్ఆర్డీ అందిస్తున్న ఆన్లైన్ లెర్నింగ్ వేదికలపై ప్రత్యేక కథనం…
స్వయం
నాణ్యమైన, ఉత్తమమైన విద్యను, బోధనను ప్రతి ఒక్కరికి చేరువచేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ పోర్టల్.. ‘స్వయం’. ఇందులో అందుబాటులో ఉంచిన కోర్సులు.. దేశంలోని వెయ్యిమందికి పైగా అత్యుత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు కలిసి రూపొందించినవే కావడం విశేషం. స్వయం ద్వారా అందిస్తున్న కోర్సుల పాఠాలు వీడియోల రూపంలో, ప్రింటింగ్ డౌన్లోడ్ చేసుకునేలా పొందుపరిచారు. ఇందులో 4 వారాల నుంచి 24 వారాల కాలపరిమితి గల తొమ్మిదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ దాకా.. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సులను ఉచితంగా పొందవచ్చు. తరగతి గదిలో బోధించినట్టే ఇక్కడా పాఠాలు ఉంటాయి. వీటిని ఎవరైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. అంతేకాకుండా స్వీయ అంచనా వేసుకునేందుకు వీలుగా పరీక్షలు, క్విజ్లు, సందేహాల నివృత్తికి ఆన్లైన్ చర్చావేదికగా అందిస్తున్నారు. కొన్ని అంశాలను మల్టీమీడియా ద్వారా వివరిస్తూ నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నారు. స్వయం పోర్టల్‌లో కోర్సులకు నేషనల్ కోఆర్డినేటర్లుగా ఏఐసీటీఈ, ఎన్పీటీఈఎల్, యూజీసీ, సీఈసీ, ఎన్సీఈఆర్టీ, ఇగ్నో, ఐఐఎం బెంగళూరు, ఎన్ఐఓఎస్, ఎన్ఐటీటీఆర్ వ్యవహరిస్తున్నాయి. ఈ ఆన్లైన్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నారు. పైగా ఈ కోర్సుల క్రెడిట్స్‌ను రెగ్యులర్ కోర్సులతో కలుపుకోవచ్చు. సర్టిఫికెట్ పొందాలనుకునేవారు మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ–పాఠశాల
ఈ పాఠశాల ద్వారా ఆన్లైన్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు.. ఎన్సీఈఆర్టీ ‘ఈ–టెక్ట్స్ బుక్స్, సప్లిమెంటరీ బుక్స్, ఆడియో, వీడియో పాఠాలు’ అందుబాటులో ఉంచింది. అవసరమనుకుంటే పోర్టల్ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఉపాధ్యాయుల కోసం ఈ బుక్స్, టీచింగ్ నిబంధనలు, విధివిధానాలు, అభ్యాస ఫలితాలు(లెర్నింగ్ ఔట్‌కమ్స్).. చిన్నారులకు ఎలా అందించాలో వివరించే టెక్నిక్స్ కూడా ఉన్నాయి. ఈ రిసోర్సెస్ వంటి విభాగాల ద్వారా బోధనా ప్రమాణాలు పెంచే అంశాలను, ప్రామాణికంగా రూపొందించిన ఎడ్యుకేషనల్ జర్నల్స్‌ను అందుబాటులో ఉంచారు.విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపయోగపడే సమాచారం, విద్యావంతులకు అవసరమైన వివరాలు సైతం ఇందులో పొందవచ్చు. పాఠశాల విద్యలో గుణాత్మక మార్పులు తెచ్చేందుకు భారత ప్రభుత్వం 1961లో ఏర్పాటు చేసిన స్వయం ప్రతిపత్తి గల సంస్థ ‘నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్’ (ఎన్సీఈఆర్టీ). కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతమైన, మెరుగైన స్కూల్ ఎడ్యుకేషన్‌ను అందించేందుకు అవసరమైన సహాయ, సహకారాలను ఎన్సీఈఆర్టీ అందిస్తుంది. పాఠ్యపుస్తకాలు రూపొందించడం, విద్యా సంబంధ పరిశోధనలు చేపట్టడం, జర్నల్స్ వంటి అంశాలను ఈ సంస్థ పరిశీలిస్తుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్: http://www.epathashala.nic.in స్వయం ప్రభ
ఉపగ్రహం ద్వారా నిరంతరాయంగా నాణ్యమైన విద్యా కార్యక్రమాలు అందించేందుకు భారత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన 32 డీటీహెచ్ చానెళ్ల సమూహం ‘స్వయం ప్రభ’. ఈ చానెళ్ల ద్వారా ప్రతిరోజు నాలుగు గంటలపాటు కొత్త కంటెంట్‌ను ప్రసారం చేస్తారు. రోజులో ఐదు పర్యాయాలు తిరిగి అదే కంటెంట్ ప్రసారం చేస్తుండడంతో.. విద్యార్థులు తమకు అనువైన సమయంలో వాటిని వీక్షించే వీలుంది. ఉన్నత విద్యకు సంబంధించి యూజీ, పీజీ కోర్సుల విద్యార్థులకు ఉపయోగపడేలా కరిక్యులం ఆధారిత కంటెంట్‌ను అందిస్తున్నారు. ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్ వంటి విభాగాల విద్యార్థులు ప్రయోజనం పొందొచ్చు. ఈ చానెళ్ల ద్వారా పాఠశాల విద్య (9 నుంచి 12 తరగతులు)లో భాగంగా ఉపాధ్యాయుల శిక్షణా అంశాలను, పిల్లలకు పాఠ్యాంశాల బోధనను ప్రసారం చేస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అవసరమైన సమాచారం సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఈ పాఠాలను ఎన్పీటీఈఎల్, ఐఐటీలు, యూజీసీ, సీఈసీ, ఇగ్నో, ఎన్సీఈఆర్టీ, ఎన్ఐవోఎస్లు అందిస్తున్నాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://swayamprabha.gov.in నేషనల్ డిజిటల్ లైబ్రరీ
భారత మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ).. ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ’ (ఎన్ఎంఈఐసీటీ) కింద నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా(ఎన్డీఎల్ ఇండియా) పైలట్ ప్రాజెక్టును ఖరగ్‌పూర్ ఐఐటీ ఆధ్వర్యంలో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా ప్రవేశ పరీక్షలు, పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడే మెటీరియల్, కంటెంట్, టెక్ట్స్, వీడియో, ఆడియోల రూపంలో పొందుపరిచారు. వివిధ భాషల్లో స్కూల్ స్థాయి నుంచి పీజీ స్థాయి వరకు ఆయా సబ్జెక్టుల పాఠ్యాంశాలు.. సైన్స్, సోషల్ సైన్సెస్, టెక్నాలజీ, హుమానిటీస్, హిస్టరీ, జాగ్రఫీ వంటి వాటితోపాటు వివిధ కేసుల్లో కోర్టులు ఇచ్చిన తీర్పులు, జర్నల్స్లను ఇక్కడ చూడొచ్చు. ప్రఖ్యాత విద్యాసంస్థలు అందించే పాఠ్యాంశాలు ఇక్కడ కోకొల్లలుగా పొందవచ్చు. ప్రధానంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇదో అద్భుతమైన వేదికగా చెప్పవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://ndl.iitkgp.ac.in ఈ–సోధ్ సింధు
ఒకవిధంగా చెప్పాలంటే.. ఈ సోద్ సింధు కూడా ఆన్లైన్ లైబ్రరీ వంటిదే. ఇందులోని పాఠ్యాంశాలు, జర్నల్స్, ఆర్కైవల్స్ పొందేందుకు చందా చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానంగా విద్యా సంస్థలకు తక్కువ చందాతో విలువైన ఈ–పుస్తకాలను అందించేందుకు యూజీసీ–ఇన్ఫోనెట్ లైబ్రరీ కన్సార్టియం, ఎన్ఎల్ఐఎస్టీ, ఇన్డెస్ట్–ఏఐసీటీఈలను అనుసంధానం చేస్తూ.. ‘ఈ–సోధ్ సింధు’ను ఏర్పాటు చేశారు. దీనికి సైన్స్, ఆర్ట్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర రంగాలకు చెందిన ప్రసిద్ధ విభాగాల గ్రంథాలయాలను, పెద్ద సంఖ్యలో ప్రచురణకర్తలు, ఆగ్రిగేటర్లు, కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన సాంకేతిక సంస్థలు, విశ్వ విద్యాలయాలు, కళాశాలల డేటాబేస్‌ను అనుసంధానం చేశారు. పోర్టల్‌లో 10 వేలకు పైగా ఈ జర్నల్స్, 32 లక్షల ఈ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ప్రధాన లక్ష్యం ఏంటంటే.. శాశ్వత ప్రాతిపదికన ఈ–జర్నల్స్, ఈ–ఆర్కైవ్స్, ఈ–పుస్తకాలను అభివృద్ధి చేయడం. దాంతోపాటు అవగాహన, శిక్షణా కార్యక్రమాల ద్వారా మెంబర్షిప్ గల విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, సాంకేతిక సంస్థల్లో ఈ–వనరుల వినియోగాన్ని పర్యవేక్షించడం, ప్రోత్సహించడం. ఈ–సోధ్ సింధులో సభ్యత్వం తీసుకున్న కళాశాలలు , విద్యా సంస్థలకు దేశంలో ఏ యూనివర్సిటీ డేటాబేస్తోనైనా అనుసంధానం అయ్యే∙వీలుంటుంది. ఇప్పటికే ఇందులో 217 విశ్వవిద్యాలయాలు, 75 టెక్నికల్ ఇనిస్టిట్యూట్స్, 3200పైగా కళాశాలలు సభ్యత్వం పొందాయి. వీటి ద్వారా విద్యార్థులు ప్రయోజనం పొందొచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://ess.inflibnet.ac.in |