ఏదైనా పాతకాలం వస్తువు, పెయింటింగ్ చరిత్ర తెలియాలంటే.. మ్యూజియానికి వెళ్లాల్సిందే! ఆయా పురాతన వస్తువులను సేకరించడానికి, వాటి చరిత్రను అధ్యయనం చేసి ప్రదర్శనలో ఉంచడానికి మ్యూజియాలజిస్టులు ఎంతో కృషి చేస్తారు.
|
![]() ఈ పురావస్తు ప్రదర్శనశాల నిర్వహణకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేందుకు దేశంలోని పలు యూనివర్సిటీలు ప్రత్యేకమైన కోర్సులు సైతం అందిస్తున్నాయంటే.. దీని ప్రాముఖ్యత ఎంతో అంచనా వేయవచ్చు. మ్యూజియం ప్రాధాన్యత, డాక్యుమెంటేషన్, రీసర్చ్, మ్యూజియం నిర్వహణ వంటివన్నీ మ్యూజియాలజీ కిందకు వస్తాయి. మ్యూజియం సంరక్షణ, పరిపాలన సైతం మ్యూజియాలజిస్టుల విధుల్లో భాగమే.
ఆసక్తికరమైన రంగం :
మ్యూజియాలజీ కోర్సులో భాగంగా పురావస్తు శాస్త్రం, చరిత్ర, పరిశోధన, ఆర్కైవింగ్ వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మ్యూజియాలజిస్ట్గా రాణించే వీలుంది. ప్రభుత్వ మ్యూజియంలలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రయివేట్ మ్యూజియాల్లో, ఆర్ట్ గ్యాలరీల్లో ఉపాధి లభిస్తుంది. చరిత్ర, చారిత్రక వస్తువుల సేకరణ, పరిరక్షణపై ఆసక్తి ఉన్న విద్యార్థులు మ్యూజియాలజీ కెరీర్ను ఎంచుకోవచ్చు. క్యూరేటర్: మ్యూజియం ఎడ్యుకేషనిస్ట్ :
పురాతన వస్తువులు, నిర్మాణాల చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలాంటి చరిత్రను సవివరంగా చెప్పే సౌలభ్యం మ్యూజియాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. మ్యూజియానికి వచ్చే సందర్శకులకు అర్థమయ్యే రీతిలో అక్కడి వస్తువుల చరిత్రను వివరించే వారే‡ ‘మ్యూజియం ఎడ్యుకేషనిస్ట్లు. వీరు సందర్శకులకు ఆయా పురాతన వస్తువులు గురించి పూర్తి అవగాహన కల్గించే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా అవసరాన్ని బట్టి పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణనిస్తారు. ఉపన్యాసాలు ఇవ్వడం, మోషన్ పిక్చర్స్, ఫిల్మ్ ట్రిప్స్, ప్రచురణలు మొదలైనవి కూడా వీరు చూసుకుంటారు. కో ఆర్డినేటర్స్– కన్సల్టెంట్స్ :
చరిత్రకు సంబంధించిన విషయాలను ప్రజా సమూహానికి చేరవేసేందుకు అనువైన వేదిక ప్రదర్శనలు(ఎగ్జిబిషన్స్). ఈ ప్రదర్శనల్లో కో ఆర్డినేటర్లు తమ బృందాన్ని సమన్వయం చేసుకుంటూ.. ప్రదర్శనల తీరుతెన్నులను పర్యవేక్షిస్తుంటారు. ఎగ్జిబిషన్ల నిర్వహణ వ్యూహాలు, ప్రణాళికలు, వాటికి రూపకల్పన, అవసరమైన సమాచారం అందించడం, ప్రోత్సాహం వంటి అంశాలను కన్సల్టెంట్స్ చూసుకుంటారు. కోర్సులు– అర్హతలు :
మ్యూజియం నిర్వహణ, పరిపాలన విభాగాల్లో ఉద్యోగాల కోసం డిగ్రీ తర్వాత సంబంధిత కోర్సులు పూర్తిచేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఎంఏ హిస్టరీ లేదా ఎంఎస్సీ మ్యూజియాలజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సుల తర్వాత ఆయా సబ్జెక్టుల్లో పీహెచ్డీ చేయవచ్చు. మ్యూజియాలజీకి సంబంధించిన పలు ఇనిస్టిట్యూట్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఇన్స్టిట్యూట్స్ :
నేషనల్ మ్యూజియం ఇన్స్టిట్యూట్(న్యూఢిల్లీ): కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ డీమ్డ్ యూనివర్సిటీ.. ఎంఏ మ్యూజియాలజీ, ఎంఏ ఆర్ట్ హిస్టరీ, ఎంఏ కన్జర్వేషన్ కోర్సులను అందిస్తోంది. పోస్టు గ్రాడ్యుయేషన్ తర్వాత పీహెచ్డీ సైతం చేయవచ్చు. ఇక్కడ చదివేందుకు విదేశీ విద్యార్థులు సైతం ఆసక్తి చూపడం విశేషం. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nmi.gov.in కల్కత్తా యూనివర్సిటీ: ఈ వర్సిటీ ఎంఏ/ఎంఎస్సీ మ్యూజియాలజీ కోర్సును అందిస్తోంది. ఇక్కడి మ్యూజియాలజీ విభాగంలో డాక్టరేట్, పోస్ట్ డాక్టోరల్ స్థాయిలో పరిశోధనలు చేయవచ్చు. ఈ విద్యాసంస్థ అందించే కోర్సులకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ జరిగే పరిశోధనలకు అంతర్జాతీయంగా మంచి పేరుంది. బనారస్ హిందూ యూనివర్సిటీ(వారణాసి): దేశంలోని పురాతన విశ్వవిద్యాల యాల్లో ఒకటి బనారస్ హిందూ యూనివర్సిటీ. ఈ వర్సిటీ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పలు ప్రొఫెషనల్ కోర్సులను అందిస్తున్నారు. వీటికి దేశవ్యాప్తంగా మంచి గుర్తిపు ఉంది. ఈ విభాగం ఎంఏ మ్యూజియాలజీ(రెండేళ్లు) ప్రొఫెషనల్ కోర్సును అందిస్తోంది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ(యూపీ): ఈ వర్సిటీ మ్యూజియాలజీ కోర్సును అందిస్తోంది. తొలుత ఏడాది కాలపరిమితిగల డిప్లొమా కోర్సుతో ప్రారంభించి.. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఎంఎస్సీ మ్యూజియాలజీని అందిస్తున్నారు. ఇందులో ఎంఫిల్/ డాక్టరేట్ చేసే అవకాశం కూడా ఇక్కడ ఉంది. తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ సైతం ఎంఏ ఆర్కియాలజీ పూర్తి చేసినవారి కోసం ఏడాది కాలపరిమితి గల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మ్యూజియాలజీ కోర్సును అందిస్తోంది. అవకాశాలు :
మ్యూజియాలజీ కోర్సులు పూర్తిచేసినవారికి అవకాశాలకు కొదవ లేదు. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. సొంతంగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకోవచ్చు. మ్యూజియాల్లో తరచు జరిగే ప్రదర్శనలు, ప్రత్యేక కార్యక్రమాల్లో పాలుపంచుకోవచ్చు. ప్రయాణాలు ఇష్టపడేవారికి కూడా ఈ కెరీర్ అనువుగా ఉంటుంది. వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, ఆయా చోట్ల దొరికే పురాతన వస్తు సంపదను సేకరించడం వంటివి చేయవచ్చు. దేశంలో దాదాపు 700కు పైగా చిన్నాపెద్దా మ్యూజియాలు ఉన్నాయి. మ్యూజియాలజీలో పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన వారికి వీటిలో తొలి ప్రాధాన్యం ఉంటుందని నిపుణలు చెబుతున్నారు!! |