యూపీఎస్సీ ఏటా వెయ్యిలోపు పోస్టులకు సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల చేస్తే… లక్షల సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతుంటాయి. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల గురించి అభ్యర్థుల సందేహాలకు నిపుణుల సలహాలు…
ప్ర. సివిల్స్ సాధించడం కష్టమా..?
జ. దేశంలో నిర్వహించే పోటీ పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ అత్యున్నత పరీక్ష. ఇది అత్యంత క్లిష్టమైంది కూడా! ఇందులో విజయం సాధించాలంటే.. అంకితభావం, నిబద్ధతతో కూడిన దీర్ఘకాలిక ప్రిపరేషన్ తప్పనిసరి.
ప్ర. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించడం సాధ్యమేనా?!
జ. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలని అందరూ కోరుకుంటారు. కాని ఇది అనుకున్నంత తేలిక కాదు. ప్రత్యేక వ్యూహంతో, పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే.. అసాధ్యం కూడా కాదు. తొలిరోజు నుంచి చివరి దాకా సడలని ఆత్మవిశ్వాసం, పట్టుదలతో ముందుకెళ్లాలి. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చదివి అర్థం చేసుకొని.. అన్వయించగలిగే సామర్థ్యాలుంటే.. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించే అవకాశం ఉంది. ఏటా మొదటి అటెంప్ట్‌లోనే సక్సెస్ సాధిస్తున్న వారి సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటోంది.
ప్ర. ఐఏఎస్‌కు ఎంపికయ్యేందుకు ఎలాంటి లక్షణాలు ఉండాలి?
జ. చాలా మంది ఈ ప్రశ్న అడుగుతుంటారు. వాస్తవానికి ప్రజాసేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ సివిల్ సర్వీస్‌కు ప్రయత్నించొచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులంతా సివిల్స్‌కు హాజరవ్వొచ్చు. వయోపరిమితి 32 ఏళ్లు. సివిల్స్ ప్రిలిమ్స్‌కు గరిష్టంగా ఆరు సార్లు హాజరవ్వొచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 37 ఏళ్ల వరకు ఎన్నిసార్లయినా ప్రిలిమ్స్‌కు హాజరవ్వొచ్చు. మూడు దశల్లో(ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ) జరిగే సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. అభ్యర్థిలోని నాయకత్వ లక్షణాలు, పాలనా నైపుణ్యాలు, నిర్ణయాత్మక దృక్పథం, సబ్జెక్ట్ నాలెడ్జ్, కష్టపడేతత్వం, అంకితభావం, నిజాయతీ, కమ్యూనికేషన్ స్కిల్స్, నైతిక విలువలు, దేశభక్తి వంటి లక్షణాలను పరిశీలిస్తారు.
ప్ర. సివిల్స్‌లో వ్యక్తిత్వం పాత్ర ముఖ్యమా..?
జ. ఉన్నత వ్యక్తిత్వం, సేవా దృక్పథం, నిర్మాణాత్మక ఆలోచనలు కలిగిన అభ్యర్థులు సివిల్స్‌ను ఎంచుకోవచ్చు. దీంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సమస్యలపై నిర్దిష్ట అభిప్రాయాలు తప్పనిసరి. క్రమశిక్షణ, మంచి తెలివితేటలు సైతం ఉండాలి. అభ్యర్థులు స్వీయ బలాలు, బలహీనతలు గుర్తెరిగి.. తమదైన ప్రిపరేషన్ వ్యూహం అనుసరించినప్పుడు సివిల్స్‌లో విజయం సొంతమవుతుంది.
ప్ర. సివిల్స్ ప్రిలిమ్స్‌లో గట్టెక్కేందుకు ఎంత సమయం అవసరం..?
జ. ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. ఇది పూర్తిగా అభ్యర్థి సంకల్పం, పఠన సామర్థ్యం, గ్రహణ శక్తి, అన్వయ నైపుణ్యాలు తదితరాలపై ఆధారపడి ఉంటుంది. పరీక్ష కు ఎన్ని రోజులు ప్రిపరేషన్ సాగించారనే దానికంటే.. ఎంతటి అంకిత భావంతో చదివారనేది కీలకం.
ప్ర. సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కు ఏడాది సమయం సరిపోతుందా..?
జ. ఎలాంటి కోచింగ్ లేకుండానే ఒక ఏడాది ప్రిపరేషన్‌తో సివిల్స్ సాధించిన వారున్నారు. దృష్టి పెట్టి చదివితే తొలి అటెంప్ట్‌లోనే విజయం సాధించొచ్చు. సివిల్స్‌కు ప్రిపేరవడమనేది… ఫుల్ టైమ్ జాబ్ వంటిది. రోజుకు కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు ఏకాగ్రతతో చదివితే తొలి ప్రయత్నంలోనే సక్సెస్ సొంతం చేసుకోవచ్చు.
ప్ర. సివిల్స్ మెయిన్‌లో ఆప్షనల్‌ను ఎలా ఎంచుకోవాలి?
జ. సివిల్ సర్వీస్ పరీక్షల ప్రక్రియలో ఆప్షనల్ ఎంపిక ఎంతో కీలకమైంది. మెయిన్‌లో ఒక ఆప్షనల్ (రెండు పేపర్లు.. ఒక్కో పేపర్ 250 మార్కుల చొప్పున) 500 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులకు జరిగే సివిల్స్ మెయిన్ పరీక్షలో ఆప్షనల్ మార్కుల వెయిటేజీ 24.6శాతం. కాబట్టి ఆప్షనల్ ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలి. ఆప్షనల్ ఎంపికలో అభ్యర్థులు అపోహలను పక్కన పెట్టాలి. ఫలానా సబ్జెక్టు తీసుకుంటే ఎక్కువ మార్కులొస్తాయి అంటూ చెప్పే మాటలను పట్టించుకోవద్దు. యూపీఎస్సీ ఏ ఒక్క ఆప్షనల్కో ప్రయోజనం కలిగేలా వ్యవహరించదు. కాబట్టి..
- సదరు సబ్జెక్టుపై పట్టు /పరిజ్ఞానం
- సబ్జెక్టుపై ఆసక్తి, ఇష్టం
- మెటీరియల్ లభ్యత, కోచింగ్ అందుబాటు
- స్కోరింగ్ నేచర్ ఆఫ్ ది సబ్జెక్టు
- జీఎస్ సిలబస్‌లో మిళితమైన అంశాలు తదితరాలను పరిశీలించి ఆప్షనల్‌ను ఎంపిక చేసుకోవాలి.
ప్ర. సివిల్ సర్వీస్ సిలబస్ ఎక్కడ లభిస్తుంది?
జ. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ను మూడు దశల్లో నిర్వహిస్తోంది. మొదటి దశ ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్ తరహాలో, రెండో దశ మెయిన్‌ను డిస్క్రిప్టివ్ పద్ధతిలో, చివరిగా పర్సనాలిటీ టెస్టు చేపడుతుంది. వీటికి సంబంధించిన సిలబస్, పరీక్ష విధానాలను యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
వెబ్సైట్: https://www.upsc.gov.in
ప్ర. సివిల్స్ ప్రిపరేషన్‌కు ఉపయోగపడే పుస్తకాలేవి?
జ. సివిల్స్‌లో టాప్‌లో నిలిచిన అభ్యర్థుల అభిప్రాయాల ఆధారంగా పలు పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవచ్చు.
చరిత్ర: బిపిన్ చంద్ర-ఆధునిక భారత చరిత్ర, భారత స్వాతంత్య్రోద్యమం; ఆర్.ఎస్.శర్మ-ఇండియాస్ యాన్సియెంట్పాస్ట్; సతీష్ చంద్ర- ఎ హిస్టరీ ఆఫ్ మిడివల్ ఇండియా పుస్తకాలను అనుసరించొచ్చు.
కళలు, సంస్కృతి: ఏఎల్ భాషమ్-ది వండర్ దట్ వాజ్ ఇండియా, నితిన్ సింఘానియా- ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్.
ఇండియన్ జాగ్రఫీ: మాజిద్ హుస్సేన్, టీఎంహెచ్ పబ్లిషింగ్- జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ స్కూల్ అట్లాస్, గో చెంగ్ లియాంగ్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ, డీఆర్ ఖుల్లర్-ఇండియా అండ్ వరల్డ్ జాగ్రఫీ (ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లనేషన్స్).
పాలిటీ: లక్ష్మీకాంత్-ఇండియన్ పాలిటీ, డీడీ బసు-ఇంట్రడక్షన్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అరిహంత్ పబ్లికేషన్స్-ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఎన్డీ అరోరా, యాక్సెస్ పబ్లీషింగ్- ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, నేషనల్ మూవ్మెంట్.
ఇండియన్ ఎకానమీ: రమేష్ సింగ్-ఇండియన్ ఎకానమీ, సంజీవ్‌వర్మ- ది ఇండియన్ ఎకానమీ, ఉమా కపిల-ఇండియన్ ఎకానమీ (పెర్ఫార్మెన్స్ అండ్ పాలసీస్).
ఎన్విరాన్మెంట్: డీఆర్ ఖుల్లర్- ఎన్విరాన్మెంట్ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఆర్.రాజగోపాలన్- ఎన్విరాన్మెంటల్ స్టడీస్ (ఫ్రమ్ క్రైసిస్ టు క్యూర్).
మరికొన్ని ప్రిపరేషన్ టిప్స్..
- 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకూ ఎన్సీఈఆర్టీ పుస్తకాలను చదవడంతో ప్రిపరేషన్ ప్రారంభించాలి.
- పామాణిక దినపత్రికలను రోజూ చదువుతూ.. ముఖ్యాంశాలను నోట్ చేసుకోవాలి. తద్వారా జనరల్ అవేర్నెస్ను పెంచుకోవాలి.
- న్యూస్ ఛానెల్స్‌లో వచ్చే అర్థవంతమైన చర్చలను వీక్షించాలి. డీడీ, బీబీసీ, సీఎన్ఎన్, రాజ్యసభ ఛానెల్స్‌ను అనుసరించాలి.
- సివిల్స్ మొత్తాన్ని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్‌తో చూడాలి. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూలకు ఉమ్మడి ప్రిపరేషన్ సాగించాలి.
- ముందుగా ప్రిలిమ్స్ గట్టెక్కుతా.. ఆ తర్వాత మెయిన్ గురించి ఆలోచిస్తా అనే దృక్పథం మంచిది కాదు.
- పరీక్షకు ఇంకా చాలా సమయం ఉంది కదా… అనే భావనను విడనాడాలి.