ఫ్రీలాన్సింగ్‌

కార్పొరేట్‌ కంపెనీల్లో పూర్తిస్థాయి ఉద్యోగులుగా చేరకుండా.. ఒకే సమయంలో అనేక కంపెనీలకు తమ∙సేవలను అందిస్తూ.. తమకు ఇష్టమున్నప్పుడే పనిచేస్తూ.. స్వయం ఉపాధిని పొందడమే ఫ్రీలాన్సింగ్‌! ఫ్రీలాన్సర్‌లు ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తూ.. పనికి తగ్గ ఆదాయం ఆర్జిస్తారు.

ఇటీవల కాలంలో మిలీనియల్స్‌లో ఫ్రీలాన్సింగ్‌ ట్రెండ్‌ బాగా నడుస్తోంది. కంపెనీలు సైతం వీరిని ప్రోత్సహిస్తున్నాయి. ఎందుకో తెలుసుకుందాం…!!
స్వేచ్ఛగా పనిచేసే సౌలభ్యం..
కంపెనీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగస్తులు స్థిర పని, నిర్దేశిత పనివేళలు, నిర్ణీత ఆదాయం పొందుతారు. కానీ ఎటువంటి నిర్ణీత సమయం, నిబంధనలు, బాస్‌ల బాదరబందీ లేకుండా.. స్వేచ్ఛగా పనిచేసే సౌలభ్యం ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలలో ఉంటుంది. ప్రస్తుతం చాలామంది ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలవైపు ఆసక్తి చూపడానికి కారణం కేవలం పని సౌలభ్యం కోసం మాత్రమే కాదు. ప్రీలాన్సింగ్‌ విధానంలో.. ఏదో ఒక సంస్థ కోసం మాత్రమే పని చేయడం కాకుండా.. ఒకే సమయంలో అనేక కంపెనీలకు పనిచేస్తూ.. తమ నైపుణ్యాల్ని, ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలుంటుంది. విభిన్న అవకాశాలు పొందడానికి ఫ్రీలానర్స్‌ ఉద్యోగం తోడ్పడుతుంది. కంపెనీలలో ఒకే రంగానికి సంబంధించిన ఉద్యోగాలు ఉంటాయి. నచ్చిన విభాగాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం ఉండదు. కానీ ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలలో అన్ని రంగాలకు సంబంధించిన పనులు ఉంటాయి. ఇష్టమైనది ఎంచుకొని పనిచేయవచ్చు.
ఫ్రీలాన్సింగ్‌ వైపు మొగ్గు..
అమెరికా వంటి విదేశాల్లో ఫ్రీలాన్స్‌ ఉద్యోగాల విధానం ఎప్పటి నుంచో ఉంది. మన దేశంలో మాత్రం ఇలాంటి ధోరణి ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. ఫ్రీలాన్స్‌ ఉద్యోగాలలో ఉన్న సౌలభ్యం ఏమిటంటే.. ఒత్తిడి తక్కువ, ఇష్టమున్నప్పుడు పనిచేయొచ్చు. ఎక్కువ పనిచేస్తే ఎక్కువ ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం యువత కంపెనీలలో ఉద్యోగం చేయడం కంటే.. ఫీలాన్స్‌ ఉద్యోగాలు చేయడానికే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.

ఫ్రీలాన్సింగ్‌కు కారణాలు

ఫ్రీలాన్సింగ్‌లో ఇంటి నుంచే పనిచేసే సౌలభ్యం ఉంటుంది. సౌకర్యవంతంగా, నచ్చిన సమయంలో పని చేయవచ్చు. ఒప్పందం మేరకు నిర్దేశిత గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేస్తే సరిపోతుంది.
స్థిరమైన ఆదాయ ప్రవాహం ఉండాలంటే.. ఫ్రీలాన్సర్‌లు మంచి క్లయింట్‌లను ఏర్పాటుచేసుకోవాలి. మంచి ప్రాజెక్టులు రావాలంటే.. ఫ్రీలాన్స్‌ సర్వీసు ప్రొవైడర్లతో సత్సంబంధాలు కొనసాగించాలి. దీనివల్ల మంచి క్లయింట్‌లను పొందడమే కాకుండా.. ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించే వీలుంటుంది.
ఫ్రీలానర్స్‌గా పనిచేస్తున్నప్పుడు ప్రాజెక్టులలో కొత్త ఆలోచనలను అమలు చేసే స్వేచ్ఛ ఉంటుంది. ఇది వృత్తిలో ఉన్నతికే కాకుండా.. వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకునేందుకు కూడా దోహదపడుతుంది.
ఫ్రీలాన్సింగ్‌.. దీర్ఘకాలిక, స్వల్పకాలిక అవకాశాలను అందిస్తుంది. 9 గంటల నుంచి 5 గంటల వరకు పనిచేసే ఉద్యోగాల మాదిరిగా కాకుండా.. ఫ్రీలానర్స్‌గా ఉండటం వల్ల ఎప్పడు పనిచేయాలో, ఎంత సేపు పనిచేయాలో నిర్ణయించుకోవచ్చు. అవసరం, పని లభ్యత ఆధారంగా దీర్ఘకాలిక, స్వల్పకాలిక ప్రాజెక్టులు చే యవచ్చు. ఒకవేళ 4–5 గంటలు మాత్రమే పనిచేయాలనుకుంటే.. అలాంటి సందర్భాల్లో స్వల్పకాలిక ప్రాజెక్టులు ఎంచుకుంటే సరిపోతుంది.
ఫ్రీలాన్సర్‌లకు బాస్‌ ఎవరూ ఉండరు. ఇందులో రాణించేందుకు నిజాయితీ, సమయస్ఫూర్తి, నిబద్ధత తప్పనిసరి. అదే సమయంలో పని ప్రామాణికత, విశ్వసనీయత, నాణ్యతకు కట్టుబడి ఉండటం చాలా అవసరం. ఫ్రీలాన్సింగ్‌ స్వతంత్రంగా ఎదగడానికి సహాయపడుతుంది.
శాశ్వత ఉద్యోగులకంటే…
కంపెనీలలో పనిచేసే ఉద్యోగులకు యాజమాన్యాలు స్థిర మైన పని వేళలు, నిర్ణీత వేతనాలు అందిస్తాయి. నేడు, అనేక చిన్న, పెద్ద కంపెనీలు శాశ్వత ఉద్యోగులను నియమించుకోవడం కంటే అవుట్‌సోర్సింగ్‌ విధానం వైపు మొగ్గుచూపుతున్నాయి. దీనివల్ల మానవ వనరులు, మౌలిక వసతులపై వ్యయం తగ్గుతుంది. కాబట్టి ఈ మారుతున్న ధోరణికి అనుగుణంగా నైపుణ్యాలు మెరుగుపరచుకుంటే.. ఫ్రీలాన్సింగ్‌లో రాణించే అవకాశం ఉంది.
%d bloggers like this:
Available for Amazon Prime