ఫోరెన్సిక్‌ సైన్స్‌

ఆ నేరం చేసింది నేను కాదు.. నేనంటే గిట్టని వాళ్లు చేసిన కుట్ర..! ఆ వాయిస్ నాది కాదు.. ఎవరో ఇమిటేట్ చేశారు..! ఆ డాక్యుమెంట్ల ఫోర్జరీతో నాకెలాంటి సంబంధం లేదు. కావాలనే నన్ను ఇరికించారు..! నా భార్యది హత్య కాదు, ఆత్మహత్య.. ఆమె అలా ఎందుకు చేసిందో నాకు తెలియదు..! ఇలాంటి వార్తలు మనం నిత్యం టీవీల్లో, పేపర్లలో, వెబ్‌సైట్లలో చూస్తుంటాం.
ప్రతి కేసులోనూ ఎన్నో ట్విస్టులు.. మరెన్నో సందేహాలు.. చాలా సందర్భాల్లో పోలీసులకు సైతం ఆధారాలు అంతుచిక్కని వైనం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కఠినమైన మిస్టరీలను ఛేదించడానికి అవసరమైన చదువే ఫోరెన్సిక్ సైన్స్. ఈ కోర్సులో చేరాలంటే.. ఎలాంటి అర్హతలుండాలి.. కోర్సులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయి.. ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి.. అవసరమైన నైపుణ్యాలు ఏమిటి..? వంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..

 

పోలీసులు సంధించే దివ్యాస్త్రం :
ఇప్పుడు ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, ఆర్థిక మోసాలు, లైంగిక దాడులు, హత్యలు ఎక్కువయ్యాయి. వీటిని ఛేదించాలంటే.. పోలీసులకు సైతం తలకు మించిన భారంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేరగాళ్లను గుర్తించడానికి ప్రత్యేక నైపుణ్యాలున్న వ్యక్తులపై ఆధారపడక తప్పని పరిస్థితి. ఆధారాలను అన్వేషించి, అసలు దోషుల గుట్టు విప్పడానికి అవసరమైన ఆయుధమే.. ఫోరెన్సిక్ సైన్స్. ఇది కేవలం హంతకులను గుర్తించే శాస్త్రమే కాదు.. మోసగాళ్ల ఆటలను పసిగట్టే దివ్యాస్త్రం కూడా! హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడం, ఇన్సూరెన్స్ కోసం వస్తువులను తగలబెట్టడం, సంతకాల ఫోర్జరీ, మార్ఫింగ్, సైబర్ నేరాలు, సైబర్ దాడులు.. ఇలా ఒక్కటేమిటి అత్యాచారాల నుంచి హైటెక్ మోసాల వరకూ… అన్నింటినీ శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించి పక్కా ఆధారాల్ని దర్యాప్తు సంస్థలకు అందించేదే ఫోరెన్సిక్ సైన్స్.

వీళ్లు ఏం చేస్తారంటే..
ఏదైనా ఘటన జరిగినప్పుడు అందుబాటులో ఉన్న ఆధారాలు సేకరించడం, దొరికిన సమాచారాన్ని విశ్లేషించి నేర నిర్ధరణ చేయడం ఫోరెన్సిక్ నిపుణుల ప్రథమ కర్తవ్యం. ఎలాంటి ఆధారాలు లభించని సమయంలో తర్కాన్ని ఉపయోగించి, పలు కోణాల్లో ఆలోచించి దోషులను గుర్తించాల్సి ఉంటుంది. దొంగతనం, అత్యాచార ఘటనల్లో ఫోరెన్సిక్ నిపుణుల సమర్థత బయటపడుతుంది. కేసును బాగా స్టడీ చేసి, క్షుణ్నంగా ఆలోచిస్తే ఏదో ఒక చిన్న క్లూ దొరుకుతుంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు.. చిన్న క్లూ సాయంతో సేకరించిన ఆధారాలను ప్రయోగశాలల్లో పలు పరికరాలు ఉపయోగించి అసలు దోషులను గుర్తించొచ్చు. ఫోరెన్సిక్ సైన్స్‌లో అంతర్గతంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మెడిసిన్, సైకాలజీ, స్టాటిస్టిక్స్.. ఇలా పలు సబ్జెక్టులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేసు తీవ్రతను బట్టి వివిధ విభాగాలకు చెందిన నిపుణులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.

మార్పుల దిశగా..!
{పపంచవ్యాప్తంగా ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే మన దేశం సైతం సన్నద్ధమవుతోంది. ఫోరెన్సిక్ రంగంలో పరిశోధనల కోసం ప్రత్యేకంగా ‘గుజరాత్ ఫోరెన్సిక్ సెన్సైస్ యూనివర్సిటీ’ ఏర్పాటైంది. మన దేశంలో ఫోరెన్సిక్ సైన్స్‌కు సంబంధించిన కోర్సులకు ఈ యూనివర్సిటీ ముఖ్యమైన సంస్థగా పేర్కొనొచ్చు. స్పెక్టోగ్రామ్స్‌పై వాయిస్ శాంపిల్స్ ఉపయోగించి సులువుగా ఆడియో టేపుల్లో గొంతును విశ్లేషించడానికి ఫోరెన్సిక్ స్పీచ్ సైన్స్ ఉపయోగపడుతుంది. అలాగే ఫోరెన్సిక్ అకౌంటింగ్ ద్వారా ఆర్థిక నేరగాళ్లను తెలుసుకోవడం, ఆర్థిక నేరాలను గుర్తించడం సాధ్యమవుతుంది. ఇంతటి కీలకమైన ఫోరెన్సిక్ స్పీచ్ సెన్సైస్, ఫోరెన్సింగ్ అకౌంటింగ్ కోర్సులను ఆలిండియా ఇన్‌సిట్యూట్ ఆఫ్ స్పీచ్ అండ్ హియరింగ్-మైసూర్ సంస్థ అందిస్తోంది.

అర్హతలు..
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో చేరొచ్చు. అలాగే సైన్స్ సబ్జెక్టుల్లో డిగ్రీ పూర్తిచేసిన వారు ఎమ్మెస్సీ ఫోరెన్సిక్ సైన్స్‌లో ప్రవేశం పొందొచ్చు. ఇందులో డిజిటల్ ఫోరెన్సిక్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, హోంల్యాండ్ సెక్యూరిటీ అండ్ యాంటీ టైజం వంటి విభాగాలున్నాయి. ఎంఏ క్రిమినాలజీకి మాత్రం ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులు. ఫోరెన్సిక్ సైన్స్‌లో పీజీ పూర్తిచేసిన విద్యార్థులకు పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంది. ఎంబీఏ చేయాలనుకునే వారికి ఫోరెన్సిక్ అకౌంటింగ్ కోర్సు.. ఎంటెక్ అయితే సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ కోర్సు.. పీజీ డిప్లొమా వాళ్లకు ఫోరెన్సిక్ టాక్సికాలజీ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

కోర్సులందిస్తున్న పలు వర్సిటీలు :

  • గుజరాత్ ఫోరెన్సిక్ సెన్సైస్ యూనివర్సిటీ
  • నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ
  • యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
  • పంజాబ్ యూనివర్సిటీ
  • ఉస్మానియా యూనివర్సిటీ
  • బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ
  • అమిటీ యూనివర్సిటీ.

కొలువులు..
ఎంచుకున్న స్పెషలైజేషన్‌పై ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ, ప్రయివేటు ఏజెన్సీలు, ఆసుపత్రులు, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. కొన్ని కార్పొరేట్ సంస్థలు ఫోరెన్సిక్ నిపుణులను డాక్యుమెంట్ రైటర్లుగా నియమించు కుంటున్నాయి. అలాగే యాంటీ టైస్ట్ ఆపరేషన్, మాస్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తదితర విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), పోలీస్ శాఖల్లో ఫోరెన్సిక్ ఉద్యోగాలుంటాయి. ఫ్రీలాన్సర్‌గా రాణించడానికి రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం నుంచి సర్టిఫికేషన్ తీసుకోవాలి. ఫోరెన్సిక్ టాక్సికాలజీ, ఫోరెన్సిక్ బయాలజీ, క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ విభాగాల్లో ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారు.

నైపుణ్యాలు :
పాఠ్యాంశాల ద్వారా సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే తెలుస్తాయి. కానీ వాస్తవ పరిస్థితులను నిశితంగా గమనించినప్పుడే ఏవైనా ఆధారాలు లభిస్తాయి. సేకరించిన సమాచారాన్ని భిన్న కోణాల్లో విశ్లేషించడం, తర్కం, ఆప్టిట్యూడ్‌లతో మరింతగా రాణించొచ్చు. అకడమిక్ పరిజ్ఞానంతో పాటు సైన్స్‌కు సంబంధించిన విభాగాల్లో అవగాహన ఉన్న వాళ్లు మరింత సమర్థవంతంగా రాణించగలరు. ఈ రంగంలో సునిశిత పరిశీలన, విశ్లేషణ సామర్థ్యం ఎంతో ముఖ్యం. సైన్స్ పట్ల ఆసక్తి, గణితంలో ప్రావీణ్యం, సమాచారాన్ని విశ్లేషించగలగడం, లోతుగా ఆలోచించడం, వాస్తవానికి దగ్గరగా ఊహించడం వంటి నైపుణ్యాలు ఉండాలి. కొన్నిసార్లు సైకాలజిస్టులు, స్టాటిస్టిక్ నిపుణులు వంటి ఇతర విభాగాలకు చెందిన నిపుణులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి మంచి కమ్యూనికేటర్‌గా, టీమ్ మెంబర్‌గా మెలగడం తప్పనిసరి. అప్పుడప్పుడు అవుట్ డోర్ పని కూడా ఉంటుంది. వీటన్నింటికీ సదా సిద్ధంగా ఉండాలి.

ఫోరెన్సిక్ ఉద్యోగ విభాగాలు :
ఫోరెన్సిక్ సెరాలజీ :

ఇది ముఖ్యంగా హత్యలు, భౌతిక దాడులు, దోపిడీలు,దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో లభ్యమైన ఆధారాలను పరిశీలిస్తుంది. రక్తాన్ని, వెంట్రుకలను విశ్లేషించి నేరస్తులను గుర్తిస్తారు. అలాగే డీఎన్‌ఏ పరీక్షల ద్వారా కూడా నేర నిర్ధరణ చేస్తారు.

ఫోరెన్సిక్ సైకియాట్రీ :
నేరం చేసిన వ్యక్తి మానసిక పరిస్థితిని అంచనావేసే డిపార్ట్‌మెంట్. ఉదాహరణకు వ్యక్తి నేరం చేసేటప్పుడు మతిస్థిమితం సరిగ్గా ఉందా లేదా, ఏదైనా మానసిక రుగ్మతలతో బాధ పడుతున్నాడా అనే విషయాలను పరిశీలిస్తారు. అలాగే కేసుకు సంబంధించి విచారణను ఎదుర్కొగలుగుతారా? లేదా? అని గమనిస్తారు. మానసిక రోగులు, సైకో దాడులు, హత్యకు సంబంధించిన కేసుల్లో వీరి అవసరం ఉంటుంది.

ఫోరెన్సిక్ ఇంజనీరింగ్ :
రోడ్ యాక్సిడెంట్స్, ఫైర్ యాక్సిడెంట్స్, ఇతర గాయాలకు సంబంధించిన కేసుల చిక్కుముడిని పరిశీలిస్తారు.

ఫోరెన్సిక్ ఆర్కిటెక్చర్ :
మార్చురీలు, ఫోరెన్సిక్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లను డిజైన్ చేస్తారు. ఇది ఆర్కిటెక్చర్, ఫోరెన్సిక్ కలయికగా ఉంటుంది.

ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ అనాలసిస్ :
డీఎన్‌ఏ టెస్ట్‌లు నిర్వహించడం ఈ విభాగంలో పనిచేసే నిపుణుల బాధ్యత. అలాగే రక్తానికి సంబంధించి సూక్ష్మ విశ్లేషణ చేస్తారు.

ఫోరెన్సిక్ పాథాలజీ :
అనుమానాస్పద స్థితిలో మరణించిన వ్యక్తికి పోస్ట్‌మార్టం నిర్వహించి.. మరణం వెనుక గల కారణాలను వెల్లడిస్తారు. ప్రమాదవశాత్తు మరణించారా, సహజ మరణమా, హత్య, ఆత్మహత్యా అనే విషయాలపై కచ్చితమైన నివేదిక అందిస్తారు.

ఫోరెన్సిక్ వెటర్నరీ :
చనిపోయిన జంతువుల కళేబరాలకు పరీక్షలు నిర్వహించడం, జంతువుల అనవసర మరణాల వెనుక కారణాలను పరిశీలించడం వీరి ప్రధాన కర్తవ్యం.

ఫోరెన్సిక్ టాక్సికాలజీ :
విష ప్రభావం కారణంగా మరణించిన వారి కేసులపై వీరు పరిశోధన చేస్తారు. విషం సదరు వ్యక్తే తాగాడా లేక మరెవరైనా విష ప్రయోగం చేశారా అనే విషయాలను నిర్ధరిస్తారు. డ్రగ్స్ సహా ఇతర ఏ మత్తు పదార్థాలు తీసుకున్నా.. ఎంత మోతాదులో తీసుకున్నారు, తీసుకున్న డ్రగ్ పేరును గుర్తిస్తారు.

వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్ నిపుణులు :
పేరులో సూచించినట్లుగానే ఈ విభాగంలో పనిచేసే నిపుణులు జంతువులు, వన్యప్రాణుల సంబంధిత అంశాలపై పనిచేస్తారు. చాలా సందర్భాల్లో జంతువుల తోలు, ఏనుగు దంతాలు వంటి వాటికి విపరీతమైన ధర ఉంటుంది. ఇందుకోసం నేరస్థులు జంతువులను చంపి, ముఖ్యమైన అవయవాలను అక్రమ రవాణా చేస్తారు. ఈ నేరస్థులను పట్టుకోవడానికే వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది.

ఫోరెన్సిక్ లింగ్విస్ట్‌లు :
ఈ విభాగంలో పనిచేసే వారు నేరం జరిగిన చోట లభించిన పేపర్స్, ఆడియోలకు సంబంధించిన వివరాలు ఏమైనా లభిస్తే వాటిని పరిశీలిస్తారు. లభించిన పేపర్స్‌కు టెస్ట్‌లు నిర్వహించి వాటిని ఎవరు రాశారు, సంతకం ఎవరిది, ఆడియో టేప్‌లోని వాయిస్ నకిలీదా, గొంతు ఎవరిది అనే విషయాలపై పరీక్షలు నిర్వహించి నిజనిర్ధారణ చేస్తారు.

ఫోరెన్సిక్ అడొంటాలజీ :ఒంటిపైన గాట్లు ఏమైనా ఉంటే వాటికి కారణమైన వారు ఎవరు అనేదానిపై వీరు పరిశీలన జరుపుతారు. జంతువుల కారణంగా జరిగిందా లేదా మనుషుల గోళ్లతో, పళ్లతో గాయపరిచారా అనే విషయాలను పరిశీలిస్తారు.

ఫోరెన్సిక్ అకౌంటెంట్లు :
ఫోరెన్సిక్ అకౌంటింగ్ ద్వారా ఆర్థిక నేరగాళ్లను పట్టుకోవడం సులభమవుతుంది. వివాదాల్లో ఉన్న కంపెనీల ఆర్థిక లావాదేవీలను అర్థమయ్యే రీతిలో కోర్టు ముందు ఉంచడం వీరి ప్రధాన కర్తవ్యం.

 

%d bloggers like this:
Available for Amazon Prime