త్రివిధ దళాల్లోని వివిధ ఉద్యోగాలకు అర్హతలు..నియామక విధానం ఇలా..

సరిహద్దుల్లో గస్తీ కాసే ఆర్మీ.. సముద్రాలను జల్లెడ పట్టే నేవీ.. ఆకాశంలో రక్షణ కవచాన్ని ఏర్పరిచే ఎయిర్‌ఫోర్స్.. ఈ మూడింటిని కలిపి త్రివిధ దళాలుగా పిలుస్తారు.
Career guidanceఈ మూడు సాయుధ దళాల్లో పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ అర్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రక్షణ దళాల్లో కొలువు, కెరీర్ కోరుకునే అభ్యర్థులకు ఉపయోగపడేలా ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీల్లో వివిధ ఉద్యోగాలు, నియామక విధానాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియపై సమగ్ర కథనం…

1. ఇండియన్ ఆర్మీ:
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్ (సీడీఎస్‌ఈ) :

సీడీఎస్‌ఈ(I) పరీక్షకు నవంబర్‌లో; సీడీఎస్‌ఈ (II) పరీక్షకు జూలైలో నోటిఫికేషన్ విడుదలవుతుంది.
విద్యార్హతలు: ఐఎంఏ, ఆఫీసర్స్‌ ట్రైనీ అకాడెమీకి ఏదైనా డిగ్రీ, నేవల్, ఎయిర్ ఫోర్స్‌ అకాడెమీకి ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.

ఎన్‌డీఏ, ఎన్‌ఏ-(I),(II) :
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించే పరీక్ష ఇది. ఏటా రెండు సార్లు నోటిఫికేషన్ విడుదలఅవుతుంది. ఆర్మీ వింగ్‌కు ఏదైనా ఇంటర్/ 10+2, నేవీ, ఎయిర్ ఫోర్స్‌ విభాగాలకు మ్యాథ్‌‌స, ఫిజిక్స్‌తో ఇంటర్/ 10+2 ఉత్తీర్ణత.

డైరె క్ట్ ఎంట్రీ పర్మినెంట్ కమిషన్/షార్ట్ సర్వీస్ కమిషన్:

  • పర్మినెంట్ కమిషన్ (క్యాడెట్ ఎంట్రీ) కింద ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్) నోటిఫికేషన్ విడుదలవుతుంది.
  • డెరైక్ట్ ఎంట్రీ షార్ట్ సర్వీస్ కమిషన్(గ్రాడ్యుయేట్ ఎంట్రీ) కింద ఏటా రెండుసార్లు నోటిఫికేషన్లు విడుదలవుతాయి. ఆయా నోటిఫికేషన్ల ద్వారా అబ్జర్వర్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు :
ఇండియన్ ఆర్మీ డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సును అందిస్తోంది. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
విద్యార్హత:
ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనలియర్ చదువుతున్న అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. సదరు అభ్యర్థులు ఇంజనీరింగ్ ఉత్తీర్ణతకు సంబంధించిన ధ్రువపత్రాన్ని, కోర్సులో చేరిన 12 వారాల్లోపు అందించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఉత్తీర్ణత శాతాల ఆధారంగా షార్ట్ లిస్ట్ రూపొందిస్తారు. ఆ జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థులకు సెలక్షన్ సెంటర్‌కు సంబంధించిన సమాచారాన్ని మెయిల్ ద్వారా తెలియజేస్తారు. ఆయా అభ్యర్థులు సర్వీస్ సెలక్షన్ బోర్డ్(ఎస్‌ఎస్‌బీ) వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి… ఇంటర్వ్యూలకు సంబంధించి తేదీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ ఐదు రోజుల పాటు రెండు దశల్లో జరుగుతుంది. ఫిజికల్, మెడికల్ టెస్టుల ఉత్తీర్ణతతోపాటు బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు, హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎన్‌సీసీ బ్యాక్‌గ్రౌండ్ తదితరాలను పరిగణనలోకి తీసుకొని కోర్సులో ప్రవేశాలను ఖరారు చేస్తారు.
  • ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఏడాదిపాటు శిక్షణ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఆర్మీలో లెఫ్టినెంట్ హోదాతో పర్మినెంట్ కమిషన్ లభిస్తుంది.
 
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (10+2) :
అర్హతలు: ఇంటర్ అర్హతతో ఆర్మీలో ప్రవేశించొచ్చు. ఇంటర్‌లో 70 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు దీనికి అర్హులు. సంబంధిత విద్యార్హత కలిగిన అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్(10+2) ద్వారా ఇంజనీరింగ్ పట్టాతోపాటు లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.
వయసు: 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఇంటర్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికై నవారికి సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) ఐదు రోజులపాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది.

క్లర్క్, స్టోర్ కీపర్ ఉద్యోగాలు :
అర్హత:
ఇంటర్ ఆర్ట్స్/సైన్స్/కామర్స్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఒక్కో సబ్జెక్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు రావాలి.
ఎంపిక విధానం:ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వయసు:
నోటిఫికేషన్ వెలువడిన సంవత్సరంలో పేర్కొన్న నిర్దిష్ట తేదీ నాటికి 17 1/2 నుంచి 23 సంవత్సరాల మధ్యలో ఉన్న వారు అర్హులు.

సోల్జర్ (టెక్నికల్):
అర్హత: 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసి ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఎంపికైన అభ్యర్థులు ఆర్మీలోని టెక్నికల్ విభాగాల్లో సోల్జర్ కేడర్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

సోల్జర్ (నర్సింగ్ అసిస్టెంట్) :
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ పూర్తి చేసుండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు రావాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గంట వ్యవధిలో నిర్వహించే రాత పరీక్షలో జీకే, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి.
వెబ్‌సైట్https://www. joinindianarmy.nic.in

2. ఎయిర్‌ఫోర్స్ :ఏఎఫ్‌క్యాట్ :
ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(ఏఎఫ్‌క్యాట్) ద్వారా భారత వాయుసేనలో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీల్లో అవివాహిత పురుషులు, మహిళలు.. గెజిటెడ్ ఆఫీసర్ హోదాతో స్థిరపడొచ్చు.
అర్హతలు:
ఫ్లయింగ్ బ్రాంచ్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులు రావాలి/ 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్): ఇంటర్, ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో 60 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
గ్రౌండ్‌ డ్యూటీ (నాన్ టెక్నికల్): అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 60 శాతం మార్కులతో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేయాలి.
అకౌంట్స్: 60 శాతం మార్కులతో బీకామ్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్ బ్యాచ్): ఎన్‌సీసీ ఎయిర్‌వింగ్ సీనియర్ డివిజన్ ‘సి’ సర్టిఫికెట్ ఉండాలి. దీంతోపాటు 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ తప్పనిసరి. అలాగే ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో 60 శాతం మార్కులు రావాలి.

వయసు:
ఏఎఫ్‌క్యాట్ అండ్ ఎన్‌సీసీ (ఫ్లయింగ్ బ్రాంచ్): నిర్దేశిత గడువు నాటికి వయోపరిమితి 26 ఏళ్లకు మించరాదు.
గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్/నాన్ టెక్నికల్ బ్రాంచులు: నిర్దేశిత తేదీ నాటికి 20-26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:
తొలిదశలో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్ష(స్క్రీనింగ్ టెస్టు)లో ప్రతిభచూపిన అభ్యర్థులకు డెహ్రాడూన్, వారణాసి, గాంధీనగర్‌లలోని ఏదైనా ఒక ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డు నుంచి కాల్ లెటర్ వస్తుంది. ఆయా సెలక్షన్ బోర్డులు ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్టులు నిర్వహించి కొంతమందిని తదుపరి దశకు ఎంపిక చేస్తాయి. అనంతరం ఆయా అభ్యర్థులకు సైకలాజికల్ టెస్టు, ఫ్లయింగ్ బ్రాంచ్‌కు ఎంపికైన వారికి కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్(సీపీఎస్‌ఎస్) టెస్టు తదితరాలు నిర్వహించి అర్హులను మెడికల్ టెస్టుకు సిఫార్సు చేస్తాయి. తుదిదశలో రిటెన్ టెస్టు, మెడికల్ టెస్టు(ఫిట్‌నెస్) ల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తాయి.

పరీక్ష విధానం:
ఏఎఫ్‌క్యాట్‌ను 300మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు లభిస్తే.. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత పడుతుంది.
గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్) బ్రాంచ్‌ను ఎంపిక చేసుకున్న అభ్యర్థులు ఏఎఫ్‌క్యాట్‌తోపాటు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్(ఈకేటీ)కు హాజరవ్వాల్సి ఉంటుంది. 45 నిమిషాల్లో 50 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

గ్రూప్‌ ఎక్స్, గ్రూప్ వై కొలువులు:
ఇంటర్ లేదా డిప్లొమా పూర్తిచేసిన అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

అర్హతలు:
గ్రూప్-ఎక్స్: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన విద్యలో (మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా) 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమాలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. డిప్లొమాలో ఇంగ్లిష్ సబ్జెక్టులో 50 శాతం మార్కులు తప్పనిసరి.
గ్రూప్‌-వై: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్(లేదా) తత్సమాన కోర్సు 50శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ 50శాతం మార్కులు వచ్చి ఉండాలి. లేదా రెండేళ్ల ఒకేషనల్ ఇంటర్‌ను 50శాతం మార్కులతో పూర్తి చేయాలి. ఒకేషనల్ కోర్సులో ఇంగ్లిష్ సబ్జెక్టులో 50శాతం మార్కులు పొందాలి.
గ్రూప్‌ వై మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్:  గ్రూప్-వై మెడికల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. 10+2/ఇంటర్మీడియెట్/తత్సమాన కోర్సు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులుగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంగ్లిష్ సబ్జెక్టులో 50శాతం మార్కులు తప్పనిసరి. డిప్లొమా విద్యార్థులు గ్రూప్-ఎక్స్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

వయసు: నిర్దిష్ట తేదీ నాటికి 21 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రెండు దశలు ఫేజ్-1, ఫేజ్-2ల్లో పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఫేజ్-1లో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. ఫేజ్-1 అర్హత సాధించిన అభ్యర్థులను ఫేజ్-2కు ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్https://indianairforce.nic.in/

3. ఇండియన్ నేవీ:
నేవీ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ : 
ఇండియన్ నేవీ 10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద ఎజిమల (కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీ నాలుగేళ్ల బీటెక్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నేవీలో ఉద్యోగాలు ఖరారవుతాయి.

విద్యార్హత:
గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంటర్ లేదా తత్సమాన అర్హత. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ పూర్తి చేసి ఉండాలి. ఈ మూడు సబ్జెక్టుల్లో సగటున 70 శాతం మార్కులు, ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. దీంతోపాటు జేఈఈ మెయిన్‌కు హాజరైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

ఎంపిక ప్రక్రియ:
జేఈఈ మెయిన్‌లో పొందిన ర్యాంకు ఆధారంగా సర్వీస్ సెలక్షన్ బోర్డు(ఎస్‌ఎస్‌బీ) అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తుంది. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ రెండు దశల్లో ఉంటుంది. తొలిదశలో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించిన అభ్యర్థులకు సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూలు ఉంటాయి. రెండో దశను పూర్తి చేసుకున్న వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి ఖాళీలు, మెరిట్ లిస్ట్ ఆధారంగా ప్రవేశాలు ఖరారు చేస్తారు.

  • కోర్సుకు ఎంపికైన అభ్యర్థులు నేవల్ అకాడమీలో క్యాడెట్లుగా నాలుగేళ్ల బీటెక్ కోర్సులో ప్రవేశం పొందుతారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) బీటెక్ పట్టా ప్రధానం చేస్తుంది.
  • ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు: అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, భోపాల్, కొయంబత్తూర్, విశాఖపట్నం, కోల్‌కతా.

పైలట్ :
విద్యార్హత:

బీఈ/బీటెక్, ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌ను చదివుండాలి. డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి కమర్షియల్ పైలట్ లెసైన్స్ పొందుండాలి. సవాళ్లతో కూడిన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ.. పైలట్ ఎయిర్‌క్రాప్ట్‌ను నడపాల్సి ఉంటుంది. శుత్రు దేశాల షిప్‌లు; జలాంతర్గాములను గుర్తించి.. దాడి చేయడం వంటివి పైలట్ల ప్రధాన బాధ్యత. పైలట్లు ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లు; షిప్‌లు, సముద్ర ఒడ్డున ఉన్న నేవల్ బేస్ నుంచి ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాఫ్టర్‌లను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది.
శిక్షణ,అభివృద్ధి: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్ అకాడమీలో 22 వారాల నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా ఎయిర్‌ఫోర్స్ అకాడమీ/నేవల్ ఎస్టాబ్లిష్‌మెంట్/ఇందిరా గాంధీ ఉడాన్ అకాడమీ(ఐజీఆర్‌యూఏ)లలో రెండు దశల్లో శిక్షణ ఉంటుంది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి వింగ్‌లు కేటాయిస్తారు.

ఆఫీసర్, సెయిలర్ కేడర్స్:

ఇండియన్ నేవీలో ప్రధానంగా ఆఫీసర్, సెయిలర్ కేడర్లు ఉంటాయి. ఆఫీసర్ కేడర్‌లో ఎగ్జిక్యూటివ్, ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎడ్యుకేషన్, మెడికల్ విభాగాల్లో నియామకాలు జరుగుతాయి.
ఎగ్జిక్యూటివ్ విభాగం:
జనరల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్:
జనరల్ సర్వీస్‌లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులైన వారు వార్‌షిప్‌కి మార్గనిర్దేశం(లీడర్) చేస్తారు. షిప్ సిబ్బందికి దిశానిర్దేశం చేయడం; ఆధునిక యుద్ధ వ్యూహాల రచన తదితరాలు వీరి ప్రధాన విధి.
విద్యార్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్ అకాడమీలో 44 వారాల నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు,షిప్‌ల్లో శిక్షణ ఇస్తారు.

హైడ్రోగ్రఫీ ఆఫీసర్:
హైడ్రోగ్రఫీ ఆఫీసర్లు సముద్ర జలాల్లో సర్వే నిర్వహిస్తారు. అవసరాన్ని బట్టి అంతర్జాతీయ జలాలు, పరస్పర స్నేహసంబంధాల్లో భాగంగా మిత్ర దేశాలకు చెందిన సముద్ర జలాల్లోనూ సర్వేలు చేపడతారు. వీరు అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందించే నావిగేషన్ చార్టులు ప్రపంచంలోని నావికులంతా వినియోగిస్తారు.
విద్యార్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత తప్పనిసరి.
శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్ అకాడమీలో 44 వారాల నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, షిప్‌ల్లో శిక్షణ ఉంటుంది. కోర్సు పూర్తి చేసుకున్న కొంత మందిని గోవాలోని హైడ్రోగ్రఫీ స్కూల్‌లో ఇన్‌స్ట్రక్టర్లుగా నియమిస్తారు.

అబ్జర్వర్ ఆఫీసర్:
అబ్జర్వర్ ఆఫీసర్లు యుద్ధ సమయాల్లో సముద్ర వాయుమార్గాలను పర్యవేక్షిస్తూ.. నేవీ సిబ్బందిని సమన్వయం చేస్తారు. దీంతోపాటు సోనిక్స్, రాడార్స్, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్‌లను ఆపరేట్ చేస్తారు.
విద్యార్హత: బీఈ/బీటెక్. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.

లాజిస్టిక్ ఆఫీసర్:
బడ్జెట్ ప్రణాళిక, అంచనాలు, అమలు; షిప్‌లకు అవసరమైన రోజువారీ స్పేర్ పార్ట్‌లకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. దీంతోపాటు నేవీ సిబ్బందికి అవసరమైన ఆహారం, బట్టలు (యూనిఫామ్)వ్యవహారాలను చూస్తారు. లాజిస్టిక్ ఆఫీసర్లుగా ఎంపికైన వారికి పట్టిక అమలు, ఫైనాన్స్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీల్లో శిక్షణ ఇస్తారు.

విద్యార్హత: మొదటి శ్రేణిలో బీఈ/బీటెక్/ఎంబీఏ/ఎంసీఏ/ఎంఎస్సీ(ఐటీ) ఉత్తీర్ణత లేదా బీఎస్సీ /బీకామ్/బీఎస్సీ(ఐటీ)తోపాటు ఫైనాన్స్/లాజిస్టిక్స్/సప్లయ్ చైన్‌మేనేజ్‌మెంట్/ మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లలో పీజీ డిప్లొమా ఉండాలి. శిక్షణ,అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకడామీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు; అనంతరం వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.

నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్షన్ ఆఫీసర్:విద్యార్హత: మెకానికల్/సివిల్/ఏరోనాటికల్/మెటలర్జీ/నేవల్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేన్లతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. 60శాతం మార్కులు తప్పనిసరి.
శిక్షణ, అభివృద్ధి: ఎంపికైన అభ్యర్థులకు ఎజిమలలోని నేవల్ అకాడమీలో 44 వారాల నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, షిప్‌ల్లో శిక్షణ ఉంటుంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్:
విద్యార్హత: 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ఐటీ) లేదా బీఎస్సీ(ఐటీ) లేదా ఎంటెక్(కంప్యూటర్ సైన్స్) లేదా ఎంఎస్సీ(కంప్యూటర్స్) లేదా బీసీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత. శిక్షణ,అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ ఇస్తారు. వీటిని విజయవంతంగా పూర్తి చేసిన వారికి నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్:
విద్యార్హత: బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి.
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. దీనికి కొనసాగింపుగా వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ ఇస్తారు. వీటిని పూర్తి చేసుకున్నవారు నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాతో చేరతారు.

జడ్జ్ అడ్వకేట్/జ్యుడీషియల్ ఆఫీసర్:విద్యార్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణత. అడ్వకేట్స్ యాక్ట్-1961కింది న్యాయవాదిగా నమోదై ఉండాలి.
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. అనంతరం వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌లలో శిక్షణ పూర్తి చేసుకున్నవారికి నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.

ఫిజికల్ ట్రైనింగ్ ఆఫీసర్ :
అర్హత: అథ్లెటిక్స్/క్రాస్-కంట్రీ/ట్రైత్లాన్/బ్యాడ్మింటన్/ టెన్నిస్/స్క్వాష్/ఫుట్‌బాల్ /హ్యాండ్‌బాల్/హాకీ/బాస్కెట్‌బాల్/వాలీబాల్/క్రికెట్/స్విమ్మింగ్/డైవింగ్/వాటర్ పోలో/కబడ్డీ/బాక్సింగ్ విభాగాల్లో జాతీయ స్థాయి సీనియర్ లెవల్ చాంపియన్‌షిప్స్ లేదా గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.
శిక్షణ, అభివృద్ధి: ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో నేవల్ ఓరియెంటేషన్ కోర్సు ఉంటుంది. అనంతరం వివిధ నేవల్ శిక్షణా కేంద్రాలు, యూనిట్లు, షిప్‌ల్లో శిక్షణ పూర్తి చేసుకున్నవారికి నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదా లభిస్తుంది.

ఇంజనీరింగ్ ఆఫీసర్ :
ఇంజనీర్ ఆఫీసర్(జనరల్ సర్వీస్), సబ్‌మెరైన్ టెక్నికల్ ఆఫీసర్, నేవల్ ఆర్కిటెక్ట్ ఆఫీసర్, ఎలక్ట్రికల్ ఆఫీసర్(జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ ఆఫీసర్(సబ్‌మెరైన్).
విద్యార్హత: నిర్దిష్ట ఉత్తీర్ణతతో సంబంధిత స్పెషలైజేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎడ్యుకేషన్ ఆఫీసర్ :
అర్హత: కనీసం ద్వితీయ శ్రేణితో పోస్ట్ గ్రాడ్యుయేషన్(మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఇంగ్లిష్/కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత లేదా ఇంజనీర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత లేదా ఎకనామిక్స్/హిస్టరీ/పొలిటికల్ సైన్స్‌లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

యూనివర్సిటీ ఎంట్రీ స్కీమ్(యూఈఎస్) :
యూఈఎస్ ద్వారా పర్మనెంట్ కమిషన్, షార్ట్‌సర్వీస్ కమిషన్‌లలో నియామకాలు చేపడతారు. ఏడాదికి ఒకసారి నియామకాలు జరుగుతాయి. వివిధ బృందాలు దేశంలోని అత్యుత్తమ ఇన్‌స్టిట్యూట్‌లను సందర్శించి.. క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. వాటిలో ప్రతిభ చూపినవారికి నియామకాలు ఖరారు చేస్తారు.
విద్యార్హత:
మెకానికల్, మెరైన్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సివిల్, నేవల్ ఆర్కిటెక్చర్ తదితర 18 బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం విద్యార్థులు అర్హులు. నాలుగో సెమిస్టర్ వరకు 60శాతం మార్కులు పొంది ఉండాలి.
వయసు: 19-25 ఏళ్ల మధ్య ఉండాలి.

మరికొన్ని అవకాశాలు…
సీనియర్ సెకండరీ రిక్రూట్(ఎస్‌ఎస్‌ఆర్); మెట్రిక్ రిక్రూట్(ఎంఆర్), మ్యుజీషియన్(ఎంయూఎస్); స్పోర్ట్స్ ఎంట్రీ; ఆర్టిఫిసర్ అప్రెంటిస్ (ఏఏ) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు డిసెంబర్/జనవరి; జూన్/జూలైలో ఎంప్లాయ్‌మెంట్‌న్యూస్, జాతీయ, రీజనల్ న్యూస్ పేపర్లలో ప్రచురితమవుతాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్.. ఇలా వివిధ అర్హతలతో పలు హోదాల్లో అవకాశాలు లభిస్తున్నారుు.
ఆర్టిఫిసర్ అప్రెంటీస్:
విద్యార్హత: మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణత తప్పనిసరి. 60 శాతం మార్కులు సాధించాలి.

సీనియర్ సెకండరీ రిక్రూట్‌మెంట్ (ఎస్‌ఎస్‌ఆర్) :
విద్యార్హత:
 మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టుతో ఇంటర్ ఉత్తీర్ణత. 60 శాతం మార్కులు పొంది ఉండాలి. వయసు 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి.

మెట్రిక్ రిక్రూట్ (ఎంఆర్): చెఫ్, స్టీవార్డ్, శానిటరీ హైజీనిస్ట్(ఎంఆర్).
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
వయసు: 17-21 ఏళ్ల మధ్య ఉండాలి.

మ్యుజీషియన్(ఎంఆర్):
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు మ్యూజిక్‌కి సంబంధించి నిర్దేశిత అర్హతలు ఉండాలి.
వయసు: 17-25 ఏళ్ల మధ్య ఉండాలి. దీంతోపాటు వివిధ నోటిఫికేషన్ల ద్వారా సివిల్ విభాగం కింద ప్యూన్, సఫాయివాలా, వాచ్‌మెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, టెలిఫోన్ ఆపరేటర్స్, ఎల్‌డీసీ, ఛార్జ్‌మెన్ తదితర ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

సెయిలర్ :
ఇండియన్ నేవీలో ఎంట్రీ లెవల్ పోస్టుగా సెయిలర్‌ను పేర్కొంటారు. 10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్‌లతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్సుల నుంచి ఏదైనా ఒక సబ్జెక్టును చదివుండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు ఉంటుంది.
వయసు: 17-20 సంవత్సరాలు.

సెయిలర్-ఆర్టిఫిసర్ అప్రెంటీస్:
మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో లేదా కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

మ్యుజీషియన్:
అర్హత: మెట్రిక్యులేషన్ పాసవ్వాలి.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, ఫైనల్ స్క్రీనింగ్ బోర్డు(టెస్టు), ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్టు, మెడికల్ స్టాండర్డ్స్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వెబ్‌సైట్https://www.joinindiannavy.gov.in

%d bloggers like this:
Available for Amazon Prime