‘డ్రోన్’ రంగంలో విసృత ఉపాధి అవకాశాలు

ఇప్పుడు డ్రోన్‌ల గురించి తెలియని వారంటూ లేరు. ముఖ్యంగా డ్రోన్ కెమెరాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ సుపరిచితమే! సాంకేతికత పురోభివృద్ధితో ఆయిల్, గ్యాస్, నిర్మాణం, మైనింగ్, అగ్రికల్చర్.. ఇలా అన్ని రంగాలకు డ్రోన్‌లు విస్తరిస్తున్నాయి.
Current Affairsడ్రోన్‌ల అవసరం, వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను గుర్తించిన డెరైక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) డ్రోన్ నూతన పాలసీ తీసుకొచ్చింది. దీంతో డ్రోన్‌ల వినియోగం మరింత విస్తృతమైంది. ఫలితంగా కెరీర్ అవకాశాలు సైతం పెరుగుతున్నాయి. పదో తరగతి నుంచి ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పట్టభద్రుల వరకూ.. అర్హతలకు తగ్గ ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. డ్రోన్‌ల రంగంలో కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం…

2025 నాటికి డ్రోన్ రంగంలో.. లక్ష కంటే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని తాజా అంచనా. ఇదే సమయంలో డ్రోన్ టెక్నాలజీ, వాణిజ్య అనువర్తనాల మార్కెట్ 2020 నాటికి 7,127 మిలియన్ డాలర్లకు చేరుకోనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న డ్రోన్ విధానం.. పలు నిబంధనలతో డ్రోన్‌ల వినియోగాన్ని అనుమతిస్తోంది. రానున్న రోజుల్లో వాణిజ్య, వ్యాపార రంగాల్లోనూ డ్రోన్‌లను వినియోగించేలా విధాన మార్పులు జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే మరిన్ని రంగాలకు డ్రోన్ సేవలు విస్తరించడం ఖాయం.

ఆర్‌పీఏఎస్ : 
డ్రోన్‌ల‌ను సాంకేతిక పరిభాషలో ఆర్‌పీఏఎస్ (రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్)గా పేర్కొంటారు. డీజీసీఏ కూడా ఆర్‌పీఏస్ పేరుతోనే పాలసీ తీసుకొచ్చింది. ఇప్పటికే పలు కంపెనీలు డ్రోన్‌లు తయారుచేస్తుంటే.. మరికొన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. డ్రోన్‌లను రిమోట్లీ పైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వాటిని ఆపరేట్ చేసేందుకు పైలట్ల అవసరం తప్పనిసరి. ఇక్కడ పైలట్ అంటే..నిర్దేశిత ప్రాంతంలో కూర్చుని రిమోట్ ద్వారా గాలిలో ఎగురుతున్న డ్రోన్ కదలికలను నియంత్రించే వ్యక్తి. ఆర్మీలో వినియోగించే డ్రోన్‌లను యూఏవీ(అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికల్స్) అంటారు.

డ్రోన్‌ పైలట్ :
పదోతరగతి అర్హత, ఇంగ్లిష్‌లో పరిజ్ఞానం ఉంటే చాలు.. ‘డ్రోన్’ పైలట్‌గా కెరీర్ అవకాశాలు దక్కించుకోవచ్చు. ఇందుకోసం డీజీసీఏ నిర్దిష్టంగా నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం డ్రోన్ ఆపరేటర్ డీజీసీఏ నుంచి రిమోట్ పైలట్ లెసైన్స్ పొందాలి. దీని కోసం ముందుగా డీజీసీఏ గుర్తింపు పొందిన ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ నుంచి కనీసం అయిదు రోజులపాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. శిక్షణలో భాగంగా రేడియో టెలిఫోనీ టెక్నిక్స్, ఫ్లయిట్ ప్లానింగ్ అండ్ ఏటీసీ ప్రొసీజర్స్, డీజీసీఏ రెగ్యులేషన్స్, తదితర విమానయాన సంబంధిత టెక్నికల్ అంశాల్లో థియరీ, ప్రాక్టికల్ శిక్షణ పొందుతారు. ప్రస్తుతం ఈ విభాగంలో దేశంలో ఐఐడీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్స్) ఒక్కటే డీజీసీఏ గుర్తింపు పొందింది.

లెసైన్స్ ఎగ్జామ్ :
డీజీసీఏ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత.. డ్రోన్ పైలట్‌గా కెరీర్ ప్రారంభించాలంటే.. డీజీసీఏ లెసైన్స్ తప్పనిసరి. లెసైన్స్ పొందేందుకు డీజీసీఏ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి డ్రోన్ పైలట్ లెసైన్స్ లభిస్తుంది.

  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్స్(ఐఐడీ)
  • మావన్ డ్రోన్ అకాడమీ
  • ఇండియన్ అకాడమీ ఆఫ్ డ్రోన్స్
  • నేషనల్ డ్రోన్ స్కూల్
  • ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ వంటి సంస్థలు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తున్నాయి.

టెక్ విద్యార్థులకు :
ఉపాధి పరంగా టెక్నికల్ విద్యార్థులు డ్రోన్‌ల రంగంలో ప్రయోజనం పొందుతున్నారు. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ కోణంలో ఏరోడైనమిక్స్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు సంస్థలు అవకాశం కల్పిస్తున్నాయి. డ్రోన్‌ల డిజైన్, మోడలింగ్, 3డి ప్రింటింగ్, అసెంబ్లింగ్, ప్రోగ్రామింగ్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

అనలిస్ట్‌ల అవసరం : 
డ్రోన్‌  కెమెరాలు పంపే చిత్రాలను విశ్లేషించి.. సంస్థలకు నివేదికలు ఇవ్వాల్సిన క్రమంలో అనలిస్ట్‌ల అవసరం ఏర్పడుతుంది. ముఖ్యంగా ల్యాండ్ సర్వేయింగ్, మైనింగ్ వంటి రంగాలకు సంబంధించిన అంశాల్లో అనలిస్ట్‌ల అవసరం ఎక్కువగా ఉంటోంది.

పలు జాబ్ ప్రొఫైల్స్ :
డ్రోన్‌/యూఏవీ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్-డ్రోన్ అండ్ రోబోటిక్స్, డ్రోన్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ అండ్ పెలైట్ జాబ్, మైక్రో రోబోట్ అండ్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, డ్రోన్ మెకానికల్ డిజైన్ ఇంజనీర్, డ్రోన్ ఆపరేటర్, యూఏవీ టెస్ట్ పెలైట్, ఆటోమేషన్ ఇంజనీర్.

స్టార్టప్ ప్రోత్సాహం :
మరోవైపు స్వయం ఉపాధి పరంగానూ డ్రోన్‌లు సరికొత్త వేదికలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా డ్రోన్‌ల తయారీ సంస్థలను స్టార్టప్‌లుగా ఏర్పాటు చేసేందుకు అవకాశముంది. ఇప్పటికే మన దేశంలో దాదాపు 150కిపైగా డ్రోన్ తయారీ సంస్థలున్నాయి. మరోవైపు ఈ స్టార్టప్ ఔత్సాహికులకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి ఆర్థిక సహకారం కూడా లభిస్తోంది. ఇప్పటికే డ్రోన్‌ల తయారీలో నిమగ్నమైన ఇండియాఫోర్జ్ సంస్థకు 23.77 మిలియన్ డాలర్ల ఫండింగ్ అందింది. అదే విధంగా ఆరవ్ అన్‌మ్యాన్డ్ సిస్టమ్స్‌కు ఏడున్నర లక్షల డాలర్లు, డిటెక్ట్ టెక్నాలజీస్‌కు ఏడు లక్షల డాలర్లు, క్రోన్ సిస్టమ్స్‌కు 6.6 లక్షల డాలర్లు, ద్రోణ ఏవియేషన్ సంస్థకు ఒక లక్ష డాలర్ల ఫండింగ్ లభించింది. వీటిని దృష్టిలో పెట్టుకుంటే.. భవిష్యత్తులోనూ డ్రోన్ స్టార్టప్ సంస్థలకు ఫండింగ్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పొచ్చు.

విదేశీ అవకాశాలు :
డ్రోన్‌ల వినియోగంలో ప్రస్తుతం అమెరికా తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో భారత్ నిలుస్తోంది. భారత్‌లో 2021 నాటికి 50వేల మంది డ్రోన్ పైలట్ల అవసరం ఏర్పడనుందని అంచనా. డ్రోన్ పైలట్లకు విదేశాల్లోనూ డిమాండ్ నెలకొంది. అసోసియేషన్ ఆఫ్ అన్ మ్యాన్డ్ వెహికిల్ సిస్టమ్స్ ఇంటర్నేషనల్ అంచనాల ప్రకారం-2025 నాటికి అంతర్జాతీయంగా లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఏర్పడనుంది.

భవిష్యత్‌లో మార్పులు :
ప్రస్తుత కొత్త డ్రోన్ పాలసీ కొన్ని రంగాలకే అనుమతిచ్చినప్పటికీ.. భవిష్యత్తులో మరిన్ని రంగాల్లోనూ డ్రోన్‌ల వినియోగానికి అనుమతిచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ-కామర్స్, హెల్త్‌కేర్, ట్రావెల్ రంగాల్లో డ్రోన్‌ల వాడకానికి అనుమతిచ్చే వీలుంది. ఇప్పటికే ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబెర్ దుబాయ్‌లో గత ఏడాది డ్రోన్ ట్యాక్సీని ఆవిష్కరించింది. ఇదే తరహాలో ఫ్రాన్స్‌లో డ్రోన్ అంబులెన్స్ పేరుతో ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించారు. అదే విధంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. ప్రైమ్ నౌ పేరుతో డ్రోన్ డెలివరీ వ్యవస్థను ప్రారంభించి అమెరికాలో పేటెంట్ కూడా సొంతం చేసుకుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే.. భవిష్యత్తులో కచ్చితంగా ఇతర రంగాల్లోనూ ముఖ్యంగా సర్వీస్ సెక్టార్‌లోనూ డ్రోన్‌ల వినియోగానికి అనుమతి ఇవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పదో తరగతితోనే..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, కెరీర్ అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటే.. వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి డ్రోన్ రంగం చేరుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పదోతరగతి అర్హతతో కెరీర్‌లో స్థిరపడే అవకాశాన్ని డ్రోన్‌లు కల్పిస్తున్నాయి. ఇప్పటికే అగ్రికల్చర్, మైనింగ్ రంగాల్లోని పలు సంస్థలు నిపుణులైన డ్రోన్ పైలట్లు లేకపోవడంతో.. తమ సంస్థల్లోని ఉద్యోగులకే డ్రోన్ ఆపరేటింగ్‌లో శిక్షణ ఇప్పించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

వేతనాలు :
ప్రస్తుతం ఆయా రంగాల్లో నెలకొన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. డీజీసీఏ లెసైన్స్ పొందిన డ్రోన్ పైలట్‌లకు విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ప్రారంభంలోనే కనీసం రూ.25వేల జీతం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. సొంతంగా డ్రోన్ కలిగుంటే రోజుకు రూ.ఏడు వేల నుంచి రూ.25 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది.

ఉపాధి వేదికలు ఇవిగో..
ఫొటోగ్రఫీ : 
డ్రోన్‌ పైలట్లకు ఎక్కువగా మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, ఫొటోగ్రఫీ, సినిమా రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి. కారణం.. ఇటీవల కాలంలో సినీ రంగం, ఎలక్ట్రానిక్ మీడియాలో డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేయడం పెరుగుతోంది. అదే విధంగా భారీ సభలు, వేడుకలను డ్రోన్ కెమెరాలతో ఫొటోలు తీయడం పరిపాటిగా మారింది. సినిమా రంగంలో డ్రోన్ పైలట్‌లకు రూ.20 వేల-రూ.30 వేలు వేతనం లభిస్తోంది.
అగ్రికల్చర్ :
డ్రోన్‌ల నార్మలైజ్డ్ డిఫరెన్స్‌ వెజిటేషన్ ఇండెక్స్ మ్యాప్(ఎన్‌డీవీఐ) ద్వారా భూమిలో ఎక్కడ మొక్క బాగా పెరుగుతుందో గుర్తించడంతోపాటు ప్రతి మొక్క ఎంత బాగా పెరిగిందో కూడా తెలుసుకోవచ్చు. కొత్త సాఫ్ట్‌వేర్ డ్రోన్ పైలట్లు సేకరించిన ముడి డేటాను రైతులకు వారి భూమిపై సంభావ్య ప్రాంతాలను సూచించే నివేదికలను రూపొందించడానికి, సమస్యను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించగలదు.
రియల్ ఎస్టేట్ :
ప్రాపర్టీ ఏరియల్/గ్రౌండ్ ఫోటోలు, వీడియోలు తీసి అమ్మకాల పరంగా మంచి వాతావరణాన్ని సృష్టించేందుకు రియల్ ఎస్టేట్‌లో డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అనేక మంది డ్రోన్ పైలట్‌లు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్‌లో ఫ్రీలాన్సర్స్‌గా పనిచేస్తున్నారు.
రవాణా రంగం :రవాణా రంగంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తనిఖీలకు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. తద్వారా తక్కువ ఖర్చు, స్వల్వ వ్యవధిలో తనిఖీలను చేపడుతున్నారు. సాధారణంగా సిబ్బంది ట్రాక్‌పై తిరుగుతూ రైల్వే ట్రాక్‌ను తనిఖీ చేస్తుంటారు. నిర్దిష్ట ప్రాంతంలో ట్రాక్‌ను సర్వే చేసి వాటి వివరాలను రైల్వే టెక్నికల్ విభాగానికి పంపుతారు. రోజుల వ్యవధి పట్టే ఈ కార్యకలాపాలను డ్రోన్‌ల సహాయంతో గంటల్లోనే పూర్తి చేసే అవకాశం ఉంటుంది.

%d bloggers like this:
Available for Amazon Prime