డేటాసైన్స్

కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు!

కళ్లు చెదిరే ప్యాకేజీలతో…ఈ ఏడాదిలో 1.5 లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు!

ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో మంచి ఉద్యోగం అందుకోవాలంటే.. ఏ కోర్సులో చేరాలి..ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి.. ఏ విభాగంలో ఉద్యోగావకాశాలెక్కువ?! ఇలాంటి ప్రశ్నలకు సరైన సమాధానమే.. డేటాసైన్స్! 2020లో డేటాసైన్స్ విభాగంలో అదిరిపోయే అవకాశాలు లభిస్తాయని అంచనా..!
 ఇటీవల కాలంలో.. ఈ రంగం.. ఆ రంగం.. అనే తేడా లేకుండా అన్నింటా డేటాసైన్స్ దూసుకుపోతోంది. ఇదే విషయం పలు సర్వేల్లో స్పష్టమైంది. ఇప్పటికే ఎమర్జింగ్ కెరీర్‌గా వెలుగొందుతున్న డేటాసైన్స్.. 2020లో మరింత హాట్‌ఫేవరెట్‌గా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. డేటాసైన్స్ కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం..

కళ్లు చెదిరే ప్యాకేజీలు :
డేటాసైన్స్.. దీన్నే డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ అని కూడా పిలుస్తారు. ఈ విభాగంలో పనిచేసే నిపుణులను డేటాసైంటిస్ట్‌లుగా పిలుస్తారు. డేటాసైన్స్ నిపుణులకు కళ్లు చెదిరే ప్యాకేజీలు లభిస్తున్నాయి. 2019లో డేటాసైంటిస్టులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(బీఎఫ్‌ఎస్‌ఐ) రంగంలో సగటున రూ.13.56 లక్షల ప్యాకేజీ లభించింది. మ్యాన్యుఫ్యాక్చరింగ్‌లో సగటున రూ.11.8 లక్షల వేతనం, హెల్త్‌కేర్‌లో సగటున రూ.11.8 లక్షల వేతనం అందింది. ప్రస్తుతం దేశంలో డేటాసైన్స్ విభాగం మానవ వనరుల కొరత ఎదుర్కొంటోంది. 2020లో కొత్తగా 1.5లక్షల డేటాసైన్స్ ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు అంచనా. గతేడాదితో పోల్చితే ఈ సంఖ్య 62 శాతం అధికం. ఉద్యోగాల కల్పనకు సంబంధించి బీఎఫ్‌ఎస్‌ఐ రంగంముందు వరుసలో నిలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో తయారీ, ఆరోగ్యం, ఐటీ, ఈ-కామర్స్ రంగాలు నిలవనున్నాయి. తాజాగా ఈడీ-టెక్ నిర్వహించిన సర్వేలో బీఎఫ్‌ఎస్‌ఐ రంగం అత్యధిక వేతనాలు అందిస్తున్నట్లు వెల్లడైంది.

2020 డేటాసైన్స్‌దే…
ప్రస్తుతం ఏ విభాగం తీసుకున్నా.. డేటా భారీగా ఉత్పత్తి అవుతోంది. వ్యాపారం, సేవల విభాగాల్లో నిమగ్నమైన కంపెనీలకు అవసరమైన డేటాను సేకరించడం, విశ్లేషించడం కష్టంగా మారుతోంది. దీంతో ఆయా కంపెనీలకు డేటాసైన్స్ నిపుణుల అవసరం తప్పనిసరిగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో డేటాసైన్స్ నిపుణులకు 2020 సంవత్సరం ఆశాజనకంగా ఉండనుందనే వార్తలు ఔత్సాహికులకు ఉత్సాహానిస్తున్నాయి. దేశంలో డేటాసైన్స్ నిపుణులకు భారీ డిమాండ్ నెలకొంది. అర్హులైన అభ్యర్థులు లేనికారణంగా 2019లో ఏకంగా 97,000 కొలువులు ఖాళీగా మిగిలిపోయాయి. కాబట్టి ఇప్పటికే డేటాసైన్స్ రంగంలో ఉన్నవారితోపాటు కొత్తగా ఈ రంగంలో ప్రవేశించాలనుకొనే వారు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకొనే అవకాశం ఉంది.

కావాల్సిన నైపుణ్యాలు ఇవే..
డేటాసైన్స్ అభ్యర్థులకు తెలుసుకోవాలనే తృష్ణ, కష్టపడే తత్వం ఉండాలి. అదే విధంగా నూతన టెక్నాలజీలు, అల్గారిథమ్స్‌పై ఆసక్తి పెంచుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఉన్న వారు డేటాసైన్స్‌లో రాణిస్తారు. మ్యాథ్స్‌లో పట్టు, కోడింగ్‌పై అవగాహన పెంచుకోవడం డేటాసైన్స్ కొలువుకు చాలాఅవసరం. ఇందులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే రాణించగలరనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. అనేకమంది నాన్ ఇంజనీరింగ్ నేపథ్యంతోనూ డేటాసైన్స్‌లో ప్రతిభ చూపుతున్నారు.

అగ్రగామి భారత్ :మ్యాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, రిటైల్, టెలికం, ఆయిల్ అండ్ గ్యాస్, ఎయిర్‌లైన్, ఇ-కామర్స్… ఇలా అన్ని రంగాల్లో సంస్థల నిర్వహణకు డేటా కీలకంగా మారింది. దీంతో సదరు కంపెనీలు డేటా బృందాలను పటిష్టం చేయడంపై దృష్టిపెట్టాయి. ప్రస్తుతం డేటాసైన్స్‌లో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతోంది. మన దేశంలో కోడింగ్ పరిజ్ఞానం కలిగిన యువత పెద్ద సంఖ్యలో ఉండటం వల్లే ఇది సాధ్యమైంది.

కొలువులు ఇక్కడ..?
ప్రముఖ కంపెనీలన్నీ డేటాసైన్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. వాటిలో కొన్ని…
1. యాక్సెంచెర్
2. ఆటోస్
3. ఏంజెల్ బ్రోకింగ్
4. హెచ్‌డీఎఫ్‌సీ
5. డెలాయిట్
6. షాదీ.కామ్
7. క్రెడిట్ విద్య
8. ఐబీఎం
9. ఆదిత్య బిర్లా
10. ఈగెన్ టెక్నాలజీస్
11. డేటా ఫార్చూన్
12. విజ్‌మైండ్స్
13. ఇన్ఫోటెక్ బ వాల్యూడెరైక్ట్.

కోర్సులు ఇవే… కోర్సులు ఇవే…

  • రెగ్యులర్ కోర్సులతో మూక్స్ విధానంలోనూ డేటాసైన్స్ కోర్సులు పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్ విధానంలో కోర్సెరా, ఈడీఎక్స్, ఉడెమీ, ఎంయూనివర్సిటీ తదితర వేదికలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు పలు ప్రయివేటు ఇన్‌స్టిట్యూట్‌లు డేటా అనలిటిక్స్ నైపుణ్యాలను అందిస్తున్నాయి.
  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బిజినెస్, మార్కెట్ సంస్థల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో.. డేటాసైన్స్ నిపుణులు, రీసెర్చర్ల అవసరం పెరుగుతోంది. ఐఐటీలు సైతం బీటెక్‌లో డేటాసైన్స్ స్పెషలైజేషన్‌ను ప్రారంభించాయి.
  • డేటాసైన్స్‌కు సంబంధించి ప్రాథమిక స్థాయిలో సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌లో మ్యాథ్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివిన సైన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వీటిలో చేరవచ్చు. అలాగే మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌తో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు డేటాసైన్స్ పీజీ డిప్లొమా కోర్సులో చేరేందుకు అర్హులు.
  • ఎంపీసీ గ్రూపుతో ఇంటర్ పూర్తి చేసిన వారు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ డేటా సైన్స్ కోర్సులో చేరవచ్చు. బీఎస్సీ(మ్యాథ్స్), బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ సంబంధిత) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు రెండేళ్ల వ్యవధిలోని ఎమ్మెస్సీ బిగ్ డేటా అనలిటిక్స్‌లో చేరేందుకు అర్హులు.
 
కోర్సులు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు ఇవే..:1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్-కేరళ(ఐఐటీఎంకే)
2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)- బెంగళూరు
3. రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ
4. ఐఐటీ హైదరాబాద్
5. ఐఐఐటీ ఢిల్లీ
6. ఐఐటీ ఖరగ్‌పూర్
7. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(సీ-డాక్).
సవాళ్లు..

  • డొమైన్ నాలెడ్జ్‌తోపాటు అనుబంధ నైపుణ్యాలైన మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, పైథాన్, ఎస్‌క్యూఎల్, ఎస్‌ఏఎస్, బిగ్‌డేటా టూల్స్‌పై పట్టున్న వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. అభ్యర్థులు ఆయా నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించడం మేలు.
  • డేటాసైంటిస్టులకు డిమాండ్ పెరుగుతున్నా.. దేశంలోని ఇన్‌స్టిట్యూట్‌లు ఆ స్థాయిలో కోర్సులు నిర్వహించడం లేదు. అంతేకాకుండా డేటాసైన్స్ డొమైన్‌లో అర్హత కలిగిన ఫ్యాకల్టీ కొరత ఎక్కువగా ఉంది.
  • ప్రస్తుతం డేటాసైన్స్ ఔత్సాహికుల్లో కనిపిస్తున్న ప్రధాన లోపం మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ను సరిగ్గా అనువర్తించలేకపోవడం. సింటాక్స్ స్థాయిలో మెషిన్‌లెర్నింగ్ నేర్చుకొని మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌పై దృష్టిపెట్టకపోవడంతో ఈ సమస్య వస్తోంది. కాబట్టి అభ్యర్థులు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌పై దృష్టిసారించాలి.
%d bloggers like this:
Available for Amazon Prime