ఈ కామర్స్

ఈ-కామర్స్… ఆన్‌లైన్ షాపింగ్.. నేడు మన దైనందిన జీవితంలో భాగం! బిర్యానీ నుంచి యాపిల్ ఫోన్ వరకూ.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ-కామర్స్ సైట్లను.. ఆశ్రయిస్తున్న వైనం! ఇంటి దగ్గరికే తమకు నచ్చిన వస్తువులను ఈ-కామర్స్ సంస్థలు అందిస్తుండటమే ఇందుకు కారణం! దాంతో గత కొంతకాలంగా ఈ-కామర్స్ రంగం కళకళలాడుతోంది! ముఖ్యంగా ఫుడ్, రిటైల్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి విభాగాల్లో.. ఈ-కామర్స్ దూసుకుపోతోంది!! ఇదే ఇప్పుడు యువతకు కొలువుల కల్పతరువుగా మారింది. పలు సంస్థల అంచనాల ప్రకారం-ఈ కామర్స్‌లో రానున్న మూడేళ్లలో అందుబాటులోకి వచ్చే ఉద్యోగాల సంఖ్య దాదాపు పది లక్షలు. ఈ నేపథ్యంలో.. ఈ-కామర్స్ రంగంలో లభించే కొలువులు.. సరికొత్త జాబ్ ప్రొఫైల్స్.. అవసరమైన అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం…
Career Guidance‘రానున్న అయిదేళ్లలో భారత్‌లో మిలియన్ ఉద్యోగాలను కల్పిస్తాం’-ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ‘సీఈవో జెఫ్ బెజోస్’ చేసిన తాజా ప్రకటన. ఇది ఒక్క అమెజాన్ సంస్థకు సంబంధించి భవిష్యత్తు నియామకాల ప్రణాళిక మాత్రమే. దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, పేటీఎం వంటి వాటి నియామక ప్రణాళికలను కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ సంఖ్య రానున్న అయిదేళ్లలో దాదాపు 20 లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణుల అంచనా. నియామకాల పరంగా ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ అంచనాలు, డెలాయిట్ సంస్థ నివేదికలు, ఇతర సంస్థల నివేదికలను పరిగణనలోకి తీసుకుంటే.. 2022 నాటికి ఈకామర్స్ రంగం పది లక్షలకు పైగా కొలువులకు వేదికగా నిలవనుంది. ఈ-కామర్స్ కార్యకలాపాలపై నియంత్రణ విధించాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నప్పటికీ.. ఈ- కామర్స్ సంస్థలకు పెరుగుతున్న ఆదరణే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మరోవైపు 2021 చివరి నాటికి ఈ-కామర్స్ మార్కెట్ విలువ 84 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా.

ముఖ్యంగా ఆ అయిదు :ఈ-కామర్స్, ఆన్‌లైన్ సేల్స్ కార్యకలాపాల పరంగా అయిదు విభాగాలు పురోగమన బాటలో నడుస్తూ.. యువత ఉపాధికి ఊతమవివ్వనున్నాయి. రిటైల్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, టికెటింగ్ అండ్ ట్రావెలింగ్, క్లాసిఫైడ్ జాబ్ పోర్టల్స్, హైపర్‌లోకల్స్ విభాగాల్లో నియామకాల సంఖ్య ఊపందుకోనుంది. ఇప్పుడు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి అనేక ఈ-లెర్నింగ్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఉద్యోగ అన్వేషణలో ఉన్న అభ్యర్థుల కోసం కొత్త జాబ్ పోర్టల్స్ ఏర్పాటవుతున్నాయి. వీటి నిర్వహణకు సమర్థవంతమైన నిపుణుల అవసరం ఉంటుంది. దాంతో ఆయా విభాగాల్లో ఎంట్రీ లెవల్ నుంచి ఉన్నత స్థాయి వరకూ.. కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

లాజిస్టిక్స్ విభాగం :ఉద్యోగాల కల్పన విషయంలో ముందంజలో నిలుస్తున్న మరో ఈ కామర్స్ విభాగం.. లాజిస్టిక్స్. ముఖ్యంగా రిటైల్ ఈ-కామర్స్ సెగ్మెంట్‌లో లాజిస్టిక్స్ పాత్ర ఎంతో కీలకం. ఒక వస్తువును వినియోగదారుడు ఆర్డర్ చేసినప్పటి నుంచి అతని చేతికి చేరే వరకూ.. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సజావుగా డెలివరీ చేయడమే లాజిస్టిక్స్ నిపుణుల ప్రధాన బాధ్యత. కాబట్టి లాజిస్టిక్స్‌లో భారీ సంఖ్యలో సిబ్బంది నియామకానికి ఈ-కామర్స్ సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ప్రొడక్ట్ డిజైన్ టు మార్కెటింగ్ :ఈ-కామర్స్ సంస్థల్లో ప్రస్తుతం ప్రొడక్ట్ డిజైన్ మొదలు బ్రాండింగ్, మార్కెటింగ్, హెచ్‌ఆర్, ఫైనాన్స్.. ఇలా పలు విభాగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా సంస్థలు బ్రాండింగ్, మార్కెటింగ్‌కు ప్రాధాన్యమిస్తూ.. ఇందుకు సంబంధించి ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, సీఆర్‌ఎం, మార్కెటింగ్ విభాగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఫిన్‌టెక్ సంస్థల్లో ఫైనాన్స్ నిపుణుల అవసరం పెరుగుతోంది. అలాగే ప్రస్తుతం ఈ-కామర్స్ రంగంలో అందుబాటులో ఉన్న జాబ్ ప్రొఫైల్స్‌ను చూస్తే.. సంప్రదాయ డిగ్రీ కోర్సులు మొదలు టెక్ గ్రాడ్యుయేట్ల వరకూ.. అన్ని రకాల అర్హతలున్న వారికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. పదో తగరతి నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకూ.. ప్రతి ఒక్కరికీ అవకాశాలకు వేదికగా ఈ-కామర్స్ రంగం నిలుస్తోంది. ఎంబీఏ చేసిన వారికి ఉన్నత స్థాయి ఉద్యోగాలు లభిస్తున్నాయి.

ఏఐ నిపుణులకు డిమాండ్ :ఈ-కామర్స్ రంగంలో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. దాంతో ఏఐ, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలున్న వారి కోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు.. ఐఐటీలు వంటి టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించి ఏఐ నిపుణుల నియామకాలు చేపడుతున్నాయి. రోబోటిక్ స్కిల్స్ ఉన్న వారికి ప్రాధాన్యం లభిస్తోంది.

డేటా అనలిటిక్స్ :ఈ-కామర్స్ రంగంలో వినియోగదారుల డేటాను క్రోడీకరించి వారికి అవసరమైన పర్సనలైజ్డ్ ప్రొడక్ట్స్‌ను గుర్తించడం కీలకంగా మారింది. అందుకే వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్‌ల గురించి తెలియజేసి.. వారిని ఆకట్టుకోవడం ద్వారా వ్యాపార కార్యకలాపాలు విస్తరించేలా సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈకామర్స్ విభాగాల్లో కొలువుల పరంగా డేటా అనలిటిక్స్ నిపుణులకు ఇటీవల కాలంలో ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా డేటాఅనలిటిక్స్, డేటాసైన్స్ విభాగాల్లో ప్రత్యేక కోర్సులు, సర్టిఫికేషన్లు చేసిన వారికి ఈ-కామర్స్ సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. ఎంట్రీ లెవల్‌లోనే డేటా అనలిస్ట్‌లకు రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.

పదో తరగతి అర్హతతోనే..ఈ-కామర్స్ సంస్థల్లో ఆన్‌లైన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్; ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం; డెలివరీ అసోసియేట్స్; ప్యాకర్స్; లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్స్, మేనేజర్స్; ఫోన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్; కస్టమర్ రిలేషన్ ఎగ్జిక్యూటివ్స్; వేర్‌హౌస్ సూపర్‌వైజర్స్/మేనేజర్స్, డెలివరీ హబ్ మేనేజర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, ప్యాకర్స్,ఫోన్ బ్యాంకింగ్ ఎగ్జిక్యూటివ్స్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్/కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ వంటి ఉద్యోగాలకు పదోతరగతి మొదలు సంప్రదాయ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణుల వరకూ అందరూ అర్హులే. కోర్ సెక్టార్‌లోని లాజిస్టిక్స్, డేటా అనలిస్ట్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధిత అర్హతలున్న వారికి సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రారంభంలో 15వేల వేతనం దక్కుతోంది. నైపుణ్యాలుంటే కోర్ విభాగాల్లో నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు వేతనం అందుకోవచ్చు.

సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామర్స్, డెవలపర్స్ :కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ-కామర్స్ సంస్థల్లో ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్, ప్రోగ్రామర్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. కోడింగ్, ప్రోగ్రామింగ్, కంప్యూటర్ లాంగ్వేజ్ నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌గా, ఎగ్జిక్యూటివ్స్‌గా సంస్థలు నియమించుకుంటున్నాయి. ఎంట్రీ లెవల్‌లోనే సగటున రూ. నాలుగు లక్షల వార్షిక వేతనం అందుతోంది.

వెబ్ డెవలపర్స్ :ఈ-కామర్స్ సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్న మరో విభాగం.. వెబ్ డెవలప్‌మెంట్. ఏ సంస్థ అయినా వినియోగదారులను ఆకట్టుకోవాలంటే.. ముందుగా సదరు సంస్థ వెబ్‌సైట్ ఆకర్షణీయంగా ఉండాలి. ఇందుకోసం వెబ్ డిజైనర్స్, డెవలపర్స్, వెబ్ పేజ్ అడ్మినిస్ట్రేటర్స్‌కు డిమాండ్ నెలకొంది. వీరికి ప్రారంభంలో రూ.మూడు లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తోంది.

కోర్సులు :

 • ఈ-కామర్స్ రంగంలో లభిస్తున్న కొలువులు, వాటికి అవసరమైన అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్న ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేక కోర్సులను అందిస్తున్నాయి.
 • ప్రముఖ బీ-స్కూల్స్ తాము అందిస్తున్న పీజీ ప్రోగ్రామ్‌లలో ఈ-కామర్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నాయి.
 • కోర్ టెక్నాలజీస్ పరంగా బీటెక్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు ఏఐఎంఎల్‌కు సంబంధించి కోర్సును అందిస్తున్నాయి.
 • ఐఐఎంలు, ఐఐటీల్లో సైతం ఏఐఎంఎల్, డేటాసైన్స్, డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్‌కు సంబంధించి ప్రత్యేక కోర్సులు అందుబాటులోకి వచ్చాయి.
 • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఈ-కామర్స్ సంస్థ.. ఏడాది వ్యవధిలో పీజీ డిప్లొమా ఇన్ ఈ-కామర్స్ బిజినెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఆన్‌లైన్ విధానంలో అందిస్తోంది.
 • వీటితోపాటు పలు ప్రముఖ ఆన్‌లైన్ సర్టిఫికేషన్ సంస్థలు సైతం ఈ విభాగాల్లో ఆన్‌లైన్ కోర్సులను అందిస్తున్నాయి.

స్టార్టప్‌లకు ప్రోత్సాహం..స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తామని తాజాగా కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనడంతో ఈ-కామర్స్ రంగానికి మరింత ఊతం లభించనట్లు అయింది. స్టార్టప్ కంపెనీల్లో దాదాపు సగం సంస్థలు ఈ-కామర్స్ లేదా బీటుబీ, బీటుసీ విధానంలో ఆన్‌లైన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇదే ఈ-కామర్స్ రంగంలో లక్షల ఉద్యోగాల కల్పనకు కారణమవుతోంది. మొత్తంగా చూస్తే రానున్న మూడేళ్లలో ఈ-కామర్స్ రంగం యువతకు కొలువుల కామధేనువుగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ రంగంలోని నిపుణులు భరోసా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ రంగంలో కొలువులు దక్కించుకోవడానికి అవసరమైన కోర్సులు, కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఈ-కామర్స్ నియామకాలు.. ముఖ్యాంశాలు

 • రానున్న మూడేళ్లలో పది లక్షలకు పైగా ఉద్యోగాలు.
 • ఏఐ, ఎంఎల్; డేటా అనలిటిక్స్ విభాగంలో దాదాపు మూడు లక్షల కొలువులు.
 • ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం విభాగాలకు పెరుగుతున్న డిమాండ్.
 • సీఆర్‌ఎం, ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ తదితర జాబ్స్‌కు ప్రారంభంలో రూ.రెండు లక్షల వార్షిక వేతనం.
 • కోర్ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్‌లో సగటున రూ.నాలుగు లక్షల వార్షిక వేతనం.
 • వెబ్ డెవలపర్స్, వెబ్ అడ్మినిస్ట్రేటర్స్‌కు రూ.2.5 లక్షల సగటు వార్షిక వేతనం
 • ఐఐఎంలు, ఐఐటీలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో ఏఐఎంఎల్, డేటాసైన్స్ విభాగాల్లో కోర్సులు.

ఈ-కామర్స్ ఉద్యోగాలు..అవసరమైన నైపుణ్యాలు

 • సంబంధిత విభాగంలో అకడమిక్ నైపుణ్యం
 • మార్కెట్ పరిస్థితులను విశ్లేషించే సామర్థ్యం
 • వినియోగదారుల అభిరుచులను గుర్తించే లక్షణం
 • సరికొత్త నైపుణ్యాలను సొంతం చేసుకోగలగడం
 • కమ్యూనికేషన్ స్కిల్స్
టెక్నికల్ విభాగాల్లో డిమాండ్ :ఈ-కామర్స్ రంగంలో లక్షల సంఖ్యలో కొలువులు లభిస్తాయనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇతర విభాగాలతో పోల్చితే టెక్నికల్ విభాగాల్లో మంచి వేతనాలు సొంతం చేసుకోవచ్చు. మార్కెటింగ్, ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్‌కు సంబంధించిన నైపుణ్యాలతో ఈకామర్స్ కొలువులు దక్కించుకోవచ్చు. ప్రధానంగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఎస్‌ఈఎం, ఎస్‌ఈఓ నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. కొలువులు లభిస్తాయి.
%d bloggers like this:
Available for Amazon Prime