Posted in CAREER_Civils

ఇంటర్ నుంచే ‘సివిల్స్’ పై గురి

సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి 24 ప్రతిష్టాత్మక సర్వీసుల్లో పోస్టుల భర్తీకి నిర్వహించే మూడంచెల ఎంపిక ప్రక్రియ! ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్స్ పరీక్షల్లో విజయం సాధించి.. ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఉన్నత కొలువులు సొంతం చేసుకోవాలనేది..
Edu newsదేశంలోని లక్షల మంది ప్రతిభావంతుల లక్ష్యం!! గతంలో డిగ్రీ, పీజీ పూర్తిచేశాకే సివిల్స్ గురించి ఆలోచించేవాళ్లు. కాని ఇటీవల కాలంలో ఇంజనీరింగ్, మెడిసిన్ లాగే ఇంటర్మీడియెట్‌లోనే సివిల్స్‌పై గురి పెడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది! ఈ నేపథ్యంలో.. ఇంటర్‌తోనే సివిల్స్ ప్రిపరేషన్ సాధ్యాసాధ్యాలపై విశ్లేషణాత్మక కథనం…

ఇంటర్ ప్లస్ జేఈఈ కోచింగ్ ఇప్పటివరకు మనందరికీ తెలిసిన విషయమే. ఇంజనీరింగ్ లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు ఇంటర్‌లో చేరిన మరుక్షణం నుంచే ఇంటర్ ప్లస్ జేఈఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి ట్రెండే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల విషయంలోనూ కనిపిస్తోంది. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసేందుకు కనీస అర్హత డిగ్రీ. కాని ఇంటర్‌లో చేరగానే సివిల్స్ ప్రిపరేషన్ దిశగా కసరత్తు ప్రారంభిస్తున్నారు. అందుకోసం ఇంటర్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్/సివిల్స్ కోచింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇంటర్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ విధానంలో.. ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు ముందుగా ఇంటర్మీడియెట్, దానికి కొనసాగింపు బ్యాచిలర్ డిగ్రీ కోర్సులను అందిస్తున్నాయి. దీనికి సమాంతరంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా శిక్షణనిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఇంటర్మీడియెట్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్‌గా గుర్తింపు పొందుతోంది. ఇంటర్‌తోనే సివిల్స్ ప్రిపరేషన్ విధానం దక్షిణ భారత దేశంలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు, చెన్నైలలో ఈ ధోరణి పెరుగుతోంది. కానీ.. ఉత్తరాదిలో బ్యాచిలర్ డిగ్రీ తర్వాతే సివిల్స్ దిశగా అడుగులు వేస్తున్నారు.

బలమైన పునాది ఓకే.. కానీ :ఇంటర్మీడియెట్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ ప్రిపరేషన్ విధానం వల్ల సివిల్స్ పరీక్షల్లో విజయానికి అవసరమైన పునాది పడుతుంది. ఫలితంగా సివిల్స్ పరీక్షల్లో చిన్న వయసులోనే విజయం సాధించే అవకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కొంత వరకు వాస్తవమే అయినప్పటికీ.. సివిల్ సర్వీస్ పరీక్షల విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ప్రతి రెండు, మూడేళ్లకి ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. దాంతో ఇంటిగ్రేటెడ్ విధానంలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు.. ఎంపిక విధానంలో మధ్యలో మార్పులు జరిగితే మళ్లీ మొదటికి రావాల్సి వస్తుంది.

తరగతి గది బోధన :
ఇంటిగ్రేటెడ్ సివిల్స్ ప్రిపరేషన్ విధానంలో అధిక శాతం తరగతి బోధనకే ప్రాధాన్యం ఉంటోంది. దీంతో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయానికి అవసరమైన పరిశీలన, విశ్లేషణ సామర్థ్యం, స్వీయ అవగాహన వంటి విషయాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సివిల్స్ పరీక్షల్లో విజయానికి సమకాలీన పరిణామాలపై అవగాహన, పరిసరాల పరిశీలన చాలా అవసరం. అంతర్జాతీయంగా, జాతీయంగా, స్థానికంగా జరిగే పరిణామాలను నిరంతరం తెలుసుకోవాల్సి ఉంటుంది. అధిక సమయం తరగతి గది బోధనకే కేటాయించాల్సిన పరిస్థితుల్లో తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం,అవగాహన పెంచుకోవడం కష్టంగా మారే ఆస్కారముంది. ఫలితంగా చివరకు అది సివిల్స్ పరీక్షల్లో విజయంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే వాదన వినిపిస్తోంది.

ఆప్షనల్స్ పరంగా..
ఇంటర్ నుంచి సివిల్స్ విధానంలో.. ఆఫ్షనల్‌లో మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. ఇంటర్‌లో హెచ్‌ఈసీ, బీఏలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, జాగ్రఫీ వంటి సబ్జెక్ట్‌లు చదివిన అభ్యర్థులు.. మెయిన్‌లో ఈ ఆప్షనల్స్‌లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. వీరికి బ్యాచిలర్ స్థాయి నుంచే ఆయా సబ్జెక్ట్‌లపై పూర్తి స్థాయి పట్టు లభిస్తుంది. మరోవైపు సివిల్స్ మెయిన్‌కు ఉపయోగపడేలా శిక్షణ ఇస్తుండటం కూడా కలిసొస్తుంది. తద్వారా ఆప్షనల్ పేపర్లలో మంచి మార్కులు సాధించే అవకాశముంది.

లక్ష్యంపై స్పష్టత ఉంటేనే…
ఇంటర్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ ప్రిపరేషన్ విధానంలో విద్యార్థులకు తమ భవిష్యత్తు లక్ష్యంపై స్పష్టత ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే తర్వాత కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. ఈ విధానంలో అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటర్మీడియెట్ స్థాయిలో హెచ్‌ఈసీ, సీఈసీ వంటి గ్రూప్‌లనే అందిస్తున్నాయి. ఆ తర్వాత కొనసాగింపుగా బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఏ కోర్సులను మాత్రమే బోధిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్దిష్ట లక్ష్యం లేకుండా ఇంటిగ్రేటెడ్ విధానంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు.. భవిష్యత్తులో సివిల్స్ పరీక్షల్లో ప్రతికూల ఫలితాలు ఎదురైతే.. వారికి కెరీర్ పరంగా చాలా పరిమితమైన ప్రత్యామ్నాయాలు ఉంటాయనేది నిపుణుల అభిప్రాయం.

సరైన నిర్ణయమేనా..?
ప్రస్తుతం అధిక శాతం మంది విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు, ఇతరుల సలహాతోనే ఇంటర్‌తోనే సివిల్స్ ప్రిపరేషన్ దిశగా అడుగులు వేస్తున్నారు. అంటే..16,17ఏళ్ల వయసులోనే నిర్ణయం జరిగిపోతోంది. ఈ వయసులో విద్యార్థులకు తమ కెరీర్ లక్ష్యాల గురించి, తమ శక్తి సామర్థ్యాల గురించి సరైన అవగాహన ఉండదు. దాంతో వారు సరైన నిర్ణయం తీసుకోలేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సబ్జెక్ట్‌ల విషయంలోనూ సొంతంగా ఆలోచించే పరిణితి కూడా తక్కువే. మరోవైపు ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్‌లో విద్యార్థులు ఎక్కువ సమయం తరగతి బోధనకే పరిమితమవుతున్నారు. ఫలితంగా సమకాలీన అంశాలను ఎలా అవగాహన చేసుకోవాలి.. పరీక్షల్లో, భవిష్యత్‌లో అన్వయించుకోవడం..వాటి ప్రభావం ఏంటి? తదితర అంశాలపై సొంత ఆలోచన ఉండటంలేదు. అంతేకాకుండా ఇంటర్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ సివిల్స్ విధానంతో.. సివిల్స్ పరీక్షల్లో విజయం సాధిస్తున్న వారు ఎంతమంది? అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. డిగ్రీ అర్హతతోనే విజయం సాధించి సర్వీసులకు ఎంపికైన వారి సంఖ్య అయిదు నుంచి ఆరు శాతం మధ్యలోనే ఉంటోంది.

డిగ్రీ తర్వాతే సివిల్స్ కసరత్తు :ప్రస్తుతం సివిల్స్ పరీక్షలు రాస్తున్న వారిలో 70 శాతం మంది బ్యాచిలర్ డిగ్రీ తర్వాతే సివిల్స్ కసరత్తు ప్రారంభిస్తున్నారు. డిగ్రీ తర్వాత అడుగులు వేస్తేనే సత్ఫలితాలు లభిస్తాయనే అభిప్రాయం ఎక్కువ మంది అభ్యర్థుల్లో కనిపిస్తోంది. విజేతల్లో అధిక శాతం మంది బ్యాచిలర్ డిగ్రీ తర్వాత రెండు, లేదా మూడో ప్రయత్నంలో విజయం సాధిస్తున్నారు. పీజీ తర్వాతే సివిల్స్‌వైపు చూస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. దీనికి కారణం.. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ కసరత్తు ప్రారంభించి.. సమాంతరంగా పీజీ కూడా చదువుతున్నారు. పీజీలో సివిల్స్‌కు ఉపయోగపడే సబ్జెక్టును ఎంచుకుంటున్నారు. పీజీ స్థాయిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, లిటరేచర్ సబ్జెక్ట్‌లను స్పెషలైజేషన్‌గా చదువుతున్నారు. దాంతో వీరికి ఓ వైపు సబ్జెక్టు నైపుణ్యం.. మరోవైపు మానసిక పరిణితి రెండూ లభిస్తున్నాయి. ఇవి సివిల్స్‌లో విజయానికి దోహదం చేస్తున్నాయి.

సమస్యలపై అవగాహన :
సివిల్స్ పరీక్షలో.. అభ్యర్థులకు సామాజిక సమస్యలపై ఉన్న అవగాహన.. ఆయా సమస్యలపై స్పందించే తీరును పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి సామాజిక పరిస్థితులు తెలుసుకోవడం, స్వీయ విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవడం పరీక్షల్లో విజయానికి ఎంతో కీలకంగా మారుతోంది. దీన్ని గుర్తించే చాలామంది అభ్యర్థులు డిగ్రీ, పీజీ తర్వాత ఈ దిశగా కసరత్తు ప్రారంభిస్తున్నారు. ఇంటర్‌తోనే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ శిక్షణతో సమస్యలపై అవగాహన, స్వీయ విశ్లేషణ వంటి నైపుణ్యాలు లభించే అవకాశం తక్కువనే అభిప్రాయం వినిపిస్తోంది.

ఏ కోర్సుతో ఎంతమంది..?
ఇటీవల కాలంలో సివిల్స్ ఫలితాలు, అభ్యర్థుల విద్యా నేపథ్యాలను చూస్తే.. పీజీ, బీటెక్ అభ్యర్థులు దాదాపు 60 శాతం మేరకు ఉంటున్నారు. ఆ తర్వాత క్రమంలో ఎంబీఏ, లా, ఎంబీబీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివిన అభ్యర్థులు నిలుస్తున్నారు. ఇక వయో వర్గాల వారీగా చూసినా.. విజేతల్లో అధిక శాతం మంది 24 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయసు వారే ఉంటున్నారు. అంటే.. వ్యక్తిగతంగా పూర్తి స్థాయి అవగాహన, పరిణితి ఉన్న అభ్యర్థులే విజయం సాధిస్తున్నారని చెప్పొచ్చు.

కోచింగ్‌తో ప్రయోజనం..
ఇంటర్‌తోనే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా..! అనే సందేహం తలెత్తడం సహజం. దీనివల్ల బేసిక్స్ పరంగా అభ్యర్థులకు బలమైన పునాది ఏర్పడుతుంది. సివిల్స్ పరీక్షల తీరుతెన్నులపై ముందు నుంచే అవగాహన లభిస్తుంది. పరీక్ష విధానంపై స్పష్టత వస్తుంది. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ప్రజంటేషన్ నైపుణ్యాలు అలవడే అవకాశం ఉంది. అంతిమంగా ఇవి కొంతమేరకే ఉపయోగపడతాయనేది అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సివిల్స్‌లో విజయానికి అభ్యర్థికి ప్రతి అంశంపై స్వీయ అవగాహన, విశ్లేషణ నైపుణ్యం తప్పనిసరి. వాటిని వ్యక్తపరిచే కోణంలో ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ప్రజెంటేషన్ అదనపు నైపుణ్యాలుగా దోహదపడతాయి.

ఇంటర్‌లోనే సివిల్స్ ప్రిపరేషన్.. సానుకూలతలు-ప్రతికూలతలు :
సానుకూలతలు :

  • బేసిక్స్‌పై బలమైన పునాది ఏర్పడుతుంది.
  • సివిల్స్ విధానంపై చిన్న వయసులోనే అవగాహన వస్తుంది.
  • ఆప్షనల్ సబ్జెక్ట్‌ల పరంగా మెరుగ్గా రాణించే అవకాశం.
  • ప్రజెంటేషన్ స్కిల్స్ మెరుగయ్యే వీలుంది.

ప్రతికూలతలు :

  • సమకాలీన అంశాలపై అవగాహన లేకపోవడం
  • స్వీయ విశ్లేషణ, క్రిటికల్ థింకింగ్ లేమి
  • మానసికంగానూ పరిణితి తక్కువగా ఉండటం
  • ప్రత్యామ్నాయ కెరీర్స్ విషయంలో ఇబ్బందులు

బ్యాచిలర్ డిగ్రీ నుంచి బెటర్ :

సివిల్స్ లక్ష్యంగా చేసుకున్న అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ నుంచి ఆ దిశగా కసరత్తు ప్రారంభిస్తే సత్ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటర్ నుంచే కృషి చేయాలనే ఆలోచన రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే ఈ విషయంలో స్వీయ ఆసక్తి మేరకే ముందుకు సాగాలి. విద్యార్థులు తరగతి బోధనకే పరిమితం కాకుండా.. సొంతంగా ఆలోచించే సామర్థ్యం పెంచుకునేందుకు కృషి చేయాలి. అప్పుడే మంచి ఫలితాలు లభిస్తాయి.

Leave a Reply