సొంత ప్రిపరేషన్ తో సివిల్స్ సాధించండిలా

సొంత ప్రిపరేషన్ తో సివిల్స్ సాధించండిలా..!

ఐఏఎస్..ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐపీఎస్.. ఇండియన్ పోలీస్ సర్వీస్.. దేశంలో డిగ్రీ స్థాయి కోర్సులు పూర్తిచేసుకున్న చాలామంది విద్యార్థుల కలల కొలువులు ఇవి. సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి దేశంలో అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సర్వీసుల్లో చేరాలని తపన పడుతుంటారు. తమ లక్ష్య సాధన దిశగా కొందరు పూర్తిస్థాయి శిక్షణ తీసుకుంటే.. ఇంకొందరు అవసరమైన సబ్జెక్టులకు మాత్రమే కోచింగ్ తీసుకుంటారు. ఇవి రెండూ సాధ్యం కానివారు సొంతంగానే ప్రిపేర్ అవుతుంటారు.
Edu news ‘ఎలాంటి కోచింగ్ లేకుండా సివిల్స్‌లో రాణించడం సాధ్యమేనా’ అన్న అనుమానాలు చాలామంది విద్యార్థులకు ఎదురవుతున్నాయి. శిక్షణ లేకున్నా ప్రణాళికా బద్ధంగా చదివి.. సివిల్స్ పరీక్షలు రాసి అత్యున్నత సర్వీసుల్లో చేరినవారు ఎందరో ఉన్నారు. కరోనా కారణంగా సివిల్స్ 2020 ప్రిలిమ్స్ వాయిదా పడ్డ నేపథ్యంలో.. కోచింగ్ లేకుండానే  సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం…
తొలి సోపానం ఇదే..
తొలిసారిగా సివిల్స్ రాయాలనుకునే ఆశావహుల మనసులో ఉదయించే మొట్టమొదటి ప్రశ్న.. ‘కోచింగ్ లేకుండా ఐఏఎస్ సాధించ లేమా?!’ అని. సివిల్స్ సాధించేందుకు కోచింగ్‌లో చేరడం తప్పనిసరా..? అని ఆలోచిస్తుంటారు. నిపు ణుల అభిప్రాయం ప్రకారం–సివిల్స్ సాధించాల నుకునే అభ్యర్థికి ఉండాల్సిన మొదటి లక్షణం తనపై తనకు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం కలిగి ఉండటం. ఈ లక్షణమే అభ్యర్థి విజయానికి తొలిమెట్టు అవుతుంది. ఏటా వెలువడే సివిల్స్ ఫలితాల్లో ఎలాంటి శిక్షణ లేకుండా సర్వీసులు సాధిస్తున్న వారి సంఖ్య గణనీయంగానే ఉంటోంది.  వారిలో ఐఐటీల్లో చదువుకున్న వారి నుంచి సాధారణ కళాశాలల్లో డిగ్రీ చదువుకున్న అభ్యర్థులు సైతం ఉంటున్నారు.
అవరోధాలు..
కోచింగ్ లేకుండా సివిల్స్‌కు సిద్ధమవుతున్న విద్యార్థులకు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. అవేంటంటే..  ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలి.. ఏ ఏ పుస్తకాలు చదవాలి.. సిలబస్‌లో ముఖ్యమైన అంశాలు ఏమిటి.. సర్వీసు సాధించాలంటే న్యూస్ పేపర్లను చదవడం తప్పనిసరా.. సివిల్స్ కోసం నోట్స్ రూపొందించుకోవడం ఎలా..?! ఇలాంటి ఎన్నో ప్రశ్నలు సివిల్స్ అభ్యర్థులను వెంటాడు తుంటాయి. సివిల్స్ సిలబస్‌లో హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఆఫ్షనల్.. ఇలా చాలా విస్తృతంగా ఉంటుంది.  ఆర్ట్స్ నేపథ్యం అభ్యర్థులకు కనీసం మూడు సబ్జెక్టులపై ఎంతోకొంత అవగాహన ఉంటుంది. కాని ఇంజనీరింగ్/మెడికల్ అభ్యర్థుల కు సివిల్స్ జనరల్ స్టడీస్ సిలబస్ అంతా కొత్తగా కనిపిస్తుంది. ఇలాంటప్పుడే సొంతంగా చదవడం కష్టమని అభ్యర్థులు వెనుకడుగు వేస్తారు. సిలబస్‌ను పూర్తి చేయలేమని భయపడతారు.
వాస్తవం..
పరీక్ష స్వభావాన్ని పూర్తిగా అవగాహన చేసు కుంటే.. ఎలాంటి కోచింగ్ లేకుండానే సొంతంగానే సివిల్స్‌కు సన్నద్ధం కావచ్చు. అయితే సిలబస్‌లోని కొన్ని విషయాలను అర్థం చేసుకోవడంలో విద్యా ర్థులు సమస్యలు ఎదుర్కోవడం సహజం.   ఇలాంట ప్పుడే ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి. ముఖ్యంగా ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న విద్యార్థులు తమకు చరిత్ర, జాగ్రఫీ, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అంశాలు కష్టమనుకుంటారు. గతంలో సివిల్స్ సాధించిన ఐఐటీ విద్యార్థులు తమ ఆప్షనల్‌గా ఆర్ట్స్,హుమాని టీస్ సబ్జెక్టునే  ఎంచుకున్నారన్న విషయాన్ని మరిచిపోరాదు. ఎలాంటి విద్యా నేపథ్యం నుంచి వచ్చినా.. ఇష్టపడి, అంకిత భావంతో, సానుకూల దృక్పథంతో చదివితే.. ప్రిపరేషన్ అంత కష్టమేమీ కాదని గత విజేతలు చెబుతున్నారు.
గైడెన్స్…
సివిల్స్ సిలబస్‌లో చరిత్ర నుంచి పర్యావరణం దాకా.. అనేక అంశాలు ఉంటాయి.   చరిత్రలో.. భారతదేశ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్ర, స్వాతంత్య్రానంతర చరిత్రతోపాటు ప్రపంచ చరిత్రను కవర్ చేయాలి. చరిత్ర ప్రిపరేషన్ పట్ల  సైన్స్, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు కొంత భయం ఉంటుంది. అలాగే సైన్స్ విద్యార్థులకు జాగ్రఫీ, ఎకానమీ వంటి సబ్జెక్టులను అవగాహన చేసుకోవడంలో తొలుత కొంత సమస్య ఎదురవడం సహజమే. అందుబాటులో ఉన్న సమయంలో సిలబస్ అంతా పూర్తిచేయడం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి సందర్భంలో పరీక్షల కోణంలో ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించి పరీక్షకు అవసరమైన రీతిలో చదవడం విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రిపరేషన్..
యూపీఎస్సీ సివిల్స్ సిలబస్ ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, మెడికల్.. ఇలా ఏ నేపథ్యంతో వచ్చినా అందరికీ సమానమేనని మరిచిపోరాదు. కోచింగ్ తీసుకున్నవారికి, సొంతంగా ప్రిపేర్ అయ్యేవారికి మధ్య చిన్న వ్యత్యాసమే ఉంటుంది. కోచింగ్‌లో ఏ సబ్జెక్ట్ ఎంత వరకు చదవాలో చెబుతారు.  కాబట్టి సొంతంగా ప్రిపేరయ్యే అభ్యర్థులు సీనియర్లు, నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు సాగవచ్చు.

వీటిపై దృష్టి..
పాత ప్రశ్న పత్రాలు

కోచింగ్ లేకుండా సివిల్స్ రాయాలని అనుకున్నప్పుడు సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత పాత ప్రశ్న పత్రాలను అధ్యయనం చేయాలి. అందుకోసం  గత  8 నుంచి 10 ఏళ్ల పాత ప్రశ్న పత్రాలను సేకరించి విశ్లేషించాలి.  దీనివల్ల ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు..ఏ విభాగం నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో తెలుస్తుంది. ఇది ముఖ్యమైన టాపిక్స్‌పై దృష్టిపెట్టేందుకు దోహదం చేస్తుంది.
స్టడీ ప్లాన్..
సొంతంగా ప్రిపేర్ అవుతున్నవారికి పటిష్టమైన స్టడీ ప్లాన్ చాలా అవసరం. ఏదో ఒకసారి పరీక్షలు రాసి చూద్దాం అనుకుంటే.. ఎంతో విలువైన ఒక అటెంప్ట్ చేజారిపోతుంది. అలా కాకుండా సిలబస్ ప్రకారం కనీసం ఏడాది కాలానికి సుదీర్ఘ స్టడీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. అందులోనే వారంలో పూర్తి చేయాల్సిన సిలబస్, రోజువారీ ప్లాన్‌తోపాటు స్వల్పకాలిక ప్రణాళికలు కూడా వేసుకోవాలి.
రెగ్యులర్ నోట్స్..
అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యమైన అంశాలను అండర్లైన్ చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే.. సిలబస్ విస్తృతంగా ఉండటం వల్ల ఒకసారి చదివిన టాపిక్ మళ్లీ పూర్తిగా చదివేందుకు సమయం లభించకపోవచ్చు. సొంతంగా నోట్స్ రూపొందించుకుంటే .. ముఖ్యమైన అంశాలను ఒకటికి నాలుగుసార్లు చదివేందుకు వీలవుతుంది. ప్రధానంగా షార్ట్‌నోట్స్ ద్వారా పునశ్చరణ వేగంగా పూర్తి చేసుకోవచ్చు. సిలబస్ ప్రకారం ప్రామాణిక పుస్తకాలు చదివి నోట్స్ రాసుకోవడం మేలు.
కరెంట్ అఫైర్స్..
కోచింగ్ లేకుండా సిద్ధమవుతున్న వారు ప్రామాణిక దినపత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే రాజ్యసభ టీవీ, ఆలిండియా రేడియో వంటి వాటిని క్రమం తప్పకుండా అనుసరించాలి. వీటిని అనుసరిస్తున్నప్పుడే ముఖ్యమైన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ అంశాలను నోట్స్‌గా రాసుకోవాలి. ఫలితంగా కరెంట్ అఫైర్స్‌పై  లోతైన పరిజ్ఞానం సొంతమవుతుంది.
స్వీయ విశ్లేషణ..అభ్యర్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలి. సిలబస్ ప్రకారం చదువుతున్నామా, ఆయా అంశాలను ఆకళింపు చేసుకుంటున్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. అందుకోసం ప్రిలిమ్స్, మెయిన్ మోడల్ ప్రశ్న పత్రాలను, గత ప్రశ్నపత్రాలను సాధించాలి. ఏ టాపిక్‌లో బలహీనంగా ఉన్నామో గుర్తించి.. మెరుగుపరచుకునేందుకు ప్రయత్నం చేయాలి. తీవ్ర పోటీ ఉండే సివిల్స్ వంటి పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడు స్వీయ సామర్థ్య అంచనా చాలా అవసరం.
ఆన్సర్ రైటింగ్..
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ తరహాలో ఉన్నా.. మెయిన్ మాత్రం వ్యాసరూపంలో ఉంటుంది. ఇక్కడ సమయ పాలన కీలక పాత్ర పోషిస్తుంది. అభ్యర్థులు తమకు తెలిసిన ప్రశ్నలకు సమాధానం విస్తృతంగా రాసే ప్రయత్నిస్తారు. అలాంటప్పుడు కొన్ని ప్రశ్నలకే ఎక్కువ సమయం గడిచిపోతుంది.  ఇది ఇతర ప్రశ్నలకు సమాధానాలు రాయడంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పరీక్ష సమయంలో ఇలాంటి సమస్యలు ఎదురుకాకుండా.. అభ్యర్థులు ప్రతిరోజు కొంత సమయం వ్యాసరూప ప్రశ్నలు రాసేందుకు కేటాయించాలి. మెయిన్‌లో విజయానికి  ‘రైటింగ్ ప్రాక్టీస్’ తప్పనిసరి. ఒక ప్రశ్నకు యూపీఎస్సీ ఎంత సమయం ఇచ్చింది. దానిని ఎంత సమయంలో పూర్తి చేయగలిగారో అంచనా వేసుకోవాలి. దీనివల్ల జవాబులు రాసే నైపుణ్యం పెరుగుతుంది. కోచింగ్ లేకుండా సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రతిరోజు తప్పకుండా సమాధానాలు రాయడం సాధన చేయాలి. ఇది వారి రోజువారి స్టడీ ప్లాన్‌లో భాగం కావాలి.
స్వీయ ప్రతిభతో సక్సెస్
సివిల్స్‌లో విజయం  అభ్యర్థి సొంత ప్రతిభపై అధికంగా ఆధారపడి ఉంటుందనేది ఎక్కువమంది నిపుణుల అభిప్రాయం. కాబట్టి సరైన మార్గంలో ప్రిపరేషన్ సాగిస్తే.. కోచింగ్ తీసుకున్నా.. సొంతంగా సిద్ధమైనా ఒక్కటే. కోచింగ్ తీసుకునేవారికి నిపుణుల సలహాలు ప్రత్యక్షంగా లభిస్తాయి. ఇంటి వద్ద సొంతంగా ప్రిపేర్ అయ్యేవారికి ఈ అవకాశం ఉండదు. ఇప్పుడు ఆన్లైన్లో.. పుస్తకాలు, మెటీరియల్, నిపుణుల సలహాలకు కొదవలేదు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగితే విజయం సొంతమవడం ఖాయం.
దారి మాత్రమే చూపుతారు
సివిల్ సర్వీస్ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు దీర్ఘకాలిక ప్రణాళిక వేసుకోవాలి. పాత ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేయాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియాలంటే మాత్రం నిపుణుల గైడెన్స్ అవసరం. కోచింగ్‌లో చెప్పేది కూడా అదే.   కోచింగ్ తీసుకోగానే సర్వీస్ వస్తుందనుకోవడం అపోహ మాత్రమే. కోచింగ్‌లో సబ్జెక్ట్ నిపుణులు దారి మాత్రమే చూపుతారు. అభ్యర్థులు సివిల్స్ పరీక్షల్లో తమ  శ్రమ, శ్రద్ధ, అంకితభావం, సొంత ప్రతిభతోనే రాణించగలరు. సివిల్స్‌లో విశ్లేషణకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఎన్ని పుస్తకాలు చదివాం.. ఎన్ని గంటలు చదివామన్నది ముఖ్యం కాదు.. ప్రతి అంశంపై పూర్తి అవగాహన అవసరం. సొంతంగా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆయా సబ్జెక్టులపై అవగాహన ఉన్న సీనియర్లు గాని, ఇప్పటికే సర్వీస్‌లో ఉన్నవారి సలహాలు గాని తీసుకోవడం మంచిది. ఏడాది పాటు చదివి పరీక్షలో విజయం సాధించకపోయినా.. నిరాశ చెందకూడదు. ఓర్పు, సహనంతో మళ్లీమళ్లీ ప్రయత్నించి సర్వీస్ సాధించాలి.
%d bloggers like this:
Available for Amazon Prime