రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌ కోర్సులు

Career guidanceదేశంలో నేటికీ 60 శాతం మంది ప్రజలు గ్రామాల్లోనే జీవిస్తున్నారు. అందుకే పల్లె ప్రాంతాల ప్రగతికి ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఇందులో స్వచ్ఛంద సంస్థలు సైతం పాల్పంచుకుంటున్నాయి. కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంకులు, ఎన్‌జీవోలు, వివిధ సంస్థలు సామాజిక బాధ్యతగా గ్రామీణ ప్రాంతాలను దత్తత తీసుకొని.. అభివృద్ధి కార్యక్రమాల్లో తమ వంతు చేయూత అందిస్తున్నాయి. అయితే దేశంలోని గ్రామాలన్నీ ఒకే తీరుగా లేవు. కాబట్టి వాటి అవసరాలు ఒకేలా ఉండవు. దాంతో స్థానిక అవసరాలు, సమస్యలు గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు నిపుణుల అవసరం ఏర్పడింది. పల్లె ప్రాంతాల ప్రగతికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి.. సుశిక్షితులైన మానవ వనరులను సిద్ధం చేసే కోర్సులే.. ‘రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాములు’. ఈ నేపథ్యంలో.. రూరల్‌ డవలప్‌మెంట్‌ /మేనేజ్‌మెంట్‌ కోర్సులు, కెరీర్‌ అవకాశాల గురించి తెలుసుకుందాం..
గ్రామీణాభివృద్ధే ధ్యేయం…రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు గ్రామాల్లోని సమస్యలపై అవగాహన ఏర్పడుతుంది. స్థానికంగా ఎప్పటికప్పుడు ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమించాలి.. అందుకు అవసరమైన వనరులు ఏమిటి? ఆయా సమస్యలను ఎలా పరిష్కరించాలి తదితర అంశాలపై శిక్షణ పొందుతారు. కోర్సులో భాగంగా గ్రామీణ ప్రాజెక్టుల ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు సంస్థాగత నైపుణ్యాలను పెంపొందించేలా కోర్సు బోధన కొనసాగుతుంది.
కోర్సులు..ఇంటర్మీడియెట్‌ తర్వాత రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంది. కొన్ని స్టేట్‌ యూనివర్సిటీలు డిగ్రీలో రూరల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సబ్జెక్టును అందిస్తున్నాయి. అలాగే డిగ్రీ తర్వాత పీజీ/పీజీ డిప్లొమా/డిప్లొమా కోర్సుల్లో చేరే వీలుంది. ప్రస్తుతం పలు ఇన్‌స్టిట్యూట్‌లు పీజీ స్థాయిలో∙రూరల్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
డిప్లొమా/డిగ్రీ కోర్సులు..
 • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌.
 • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌.
 • పీజీ డిప్లొమా ఇన్‌ సçస్టయినబుల్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌.
 • పీజీ డిప్లొమా ఇన్‌ ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌.
 • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ ఫైనాన్స్‌.
 • పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ రూరల్‌ మార్కెటింగ్‌.
 • బీఏ రూరల్‌ డెవలప్‌మెంట్‌.
 • బ్యాచిలర్‌ ఆఫ్‌ రూరల్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌.
 • పీజీ స్థాయిలో రూరల్‌ డెవలప్‌మెంట్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌లో.. ఎంఏ, ఎంబీఏలో చేరొచ్చు. ఆ తర్వాత అభ్యర్థులు తమ ఆసక్తిని బట్టి ఎంఫిల్, పీహెచ్‌డీ సైతం పూర్తిచేయవచ్చు.
అర్హతలు..
అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరేందుకు ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణులు అర్హులు. పోస్టు గ్రాడ్యుయేషన్‌ లేదా పీజీ డిప్లొమా/ఎంబీఏ కోర్సుల్లో చేరేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
ప్రవేశ విధానం..పీజీ డిప్లొమా ఇన్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ డవలప్‌మెంట్, ఎంబీఏ రూరల్‌ మేనేజ్‌మెంట్‌/రూరల్‌ డవలప్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌లు ప్రత్యేక ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తుండగా.. మరికొన్ని విద్యా సంస్థలు క్యాట్‌/గ్జాట్‌/మ్యాట్‌/జీమ్యాట్‌/ఆత్మా/సీమ్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ప్రముఖ సంస్థలు..
 • దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు రూరల్‌ మేనేజ్‌మెంట్‌/ రూరల్‌ డెవలప్‌మెంట్‌æ కోర్సులను అందిస్తున్నాయి. పేరున్న విద్యా సంస్థలు అందిస్తున్న ఈ కోర్సులు అధిక డిమాండ్‌ ఉంది. అవి..
 • నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌(ఎన్‌ఐఆర్‌డీ)– హైదరాబాద్‌
 • ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్‌(ఐఆర్‌ఎంఏ) – గుజరాత్‌
 • టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్, గౌహతి)
 • ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)– కల్‌కత్తా
నైపుణ్యాలు..
రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డవలప్‌మెంట్‌ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు వ్యక్తిత్వ పరంగా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పల్లె ప్రజల పట్ల సానుభూతి (ఎంపతి), గ్రామీణ ప్రాంత ప్రజా సమూహాలతో కలిసి పనిచేసే సహనం, ఒప్పించే నేర్పు, మంచి కమ్యూనికేషన్స్‌ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, స్నేహశీలత ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో భాగస్వాములం కావాలనుకునే అమిత ఆసక్తి గలవారు ఈ కోర్సులను ఎంచుకోవచ్చు.
కెరీర్‌..
 • దారిద్య్రరేఖకు దిగువున నివసిస్తున్న కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రారంభిస్తున్నాయి. వీటిని సక్రమంగా అమలు చేయడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు రూరల్‌ డెవలప్‌మెంట్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేసిన వారిని నియమించుంటున్నాయి. దీంతో ఈ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది.
 • రూరల్‌ డెవలప్‌మెంట్‌/రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తిచేసిన వారు ఇటు ప్రభుత్వ రంగంతోపాటు, అటు ప్రైవేటు రంగంలోనూ కొలువులు దక్కించుకోవచ్చు.
 • ప్రధాన్, కేర్, సేవా, సేవా మందిర్, నంది ఫౌండేషన్, తదితర జాతీయ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేయవచ్చు. ఆసక్తి ఉంటే సొంత ఎన్‌జీఓ స్థాపించుకోవచ్చు.
 • ఈ కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు గ్రామీణ సహకార సంస్థలు, వ్యవసాయాధార వ్యాపార సంస్థలు, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ వ్యవసాయ ఉత్పత్తుల మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో పనిచేయవచ్చు.
 • పేరున్న ఇన్‌స్టిట్యూట్స్‌లో కోర్సులో ఉండగానే ఆయా కళాశాలల్లో జరిగే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ ద్వారా అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా కార్పొరేట్‌ కంపెనీలు సోషల్‌ రెస్పాన్సిబిలిటీ స్కీమ్‌ను అమలు చేసేందుకు రూరల్‌ మేనేజ్‌మేంట్‌/డెవలప్‌మెంట్‌ కోర్సులు చేసిన అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. ఇందులో టాటా టెలీ సర్వీసెస్, అమూల్, మాన్‌శాంటో, నాబార్డ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఆదిత్య బిర్లా గ్రూప్, హీరో గ్రూప్, మహీంద్రా అండ్‌ మహీంద్రా వంటి కంపెనీలతోపాటు జాతీయ అంతర్జాతీయ ఎన్‌జీఓలు సైతం ఉన్నాయి.
వేతనాలు..
రూరల్‌ మేనేజ్‌మెంట్‌/డెవలప్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సు చేసినవారికి ఆకర్షణీయ వేతన ప్యాకేజీలు లభిస్తున్నాయి. గత ఏడాది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఆనంద్, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ఎన్‌ఐఆర్‌డీ–హైదరాబాద్‌ విద్యార్థులకు సగటు వార్షిక వేతనం లక్షల్లోనే అందినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
నూరు శాతం ప్లేస్‌మెంట్స్‌..రూరల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉంది. ఎన్‌ఐఆర్‌డీలో ఏడాది కాలపరిమితి గల పీజీ డిప్లొమా కోర్సు, రెండేళ్ల పీజీ కోర్సులు అందిస్తున్నాం. ఇక్కడ ఇప్పటిదాకా తొమ్మిది వందల మంది కోర్సు పూర్తి చేశారు. ప్రతి ఒక్కరూ అత్యున్నత స్థాయిలో సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు కోర్సులో ఉండగానే క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఎంపిక చేసుకుని సెర్ప్‌ వంటి సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అంతేకాదు యూఎన్‌డీపీ వంటి అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. రెండు మూడేళ్ల అనుభవం ఉన్న వారికి అంతర్జాతీయ ఏజెన్సీ కేపీఎంజీ వంటి వాటిల్లో ఆఫర్స్‌ లభిస్తున్నాయి. మరికొంత మంది విద్యార్థులు ఇక్కడ కోర్సు పూర్తికాగానే విదేశాల్లో ఉన్నత విద్యకు వెళుతున్నారు.
%d bloggers like this:
Available for Amazon Prime