కెరీర్ ఆఫ్టర్ 10.. ప్లస్ టు

మెడిసిన్ మధ్యలోనే మానేసి.. సింగర్‌గా మారి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారున్నారు.. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో చదువు వదిలేసి.. లాలో చేరి గొప్ప లాయర్లుగా పేరు గడించినవారున్నారు.. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మనలో చాలా మంది టెన్త్ అయ్యాక బైపీసీ కాకుండా ఎంపీసీలో చేరాల్సింది… ఎంపీసీ కాకుండా సీఈసీలో చేరాల్సింది.. హెచ్‌ఈసీ కాకుండా ఎంఈసీలో చేరాల్సింది అని బాధపడుతుంటారు… ఈ కోర్సు కాకుండా ఇంకో కోర్సులో చేరాల్సింది… ఈ జాబ్ కాకుండా మరో జాబ్ కోసం ట్రై చేయాల్సింది అని..! ఎందుకు అలా చేశారు… మీకు నచ్చిన కోర్సులో ఎందుకు చేరలేదు. ఇష్టమైన కెరీర్‌ను ఎందుకు ఎంచుకోలేదు.. అని అడిగితే నూటికి 99 శాతం మంది చెప్పే సమాధానం ఒక్కటే…అదే సరైన గెడైన్స్ లేకపోవడం. సో! టెన్త్, ఇంటర్ పూర్తయ్యాక తీసుకునే నిర్ణయం ఎంతో కీలకం.. అందుకే అడుగేసే ముందే ఆలోచించాలి!!

ఎన్నో కెరీర్లు
10+2 తర్వాత ఐఐటీలు… ఇంజనీరింగ్.. మెడిసిన్… వీటిల్లో చేరకపోతే భవిష్యత్ లేదనే ఆలోచన సరికాదు.. ప్రతి ఒక్కరూ ఇంజనీర్లు, డాక్టర్లు కానవసరం లేదు. ప్రపంచంలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, హాస్పిటల్స్ మాత్రమే లేవు. మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్… స్కూల్ డ్రాప్‌అవుట్! ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం డెల్ కంప్యూటర్స్‌ను స్థాపించిన మైకెల్ డెల్… చదువు మధ్యలోనే ఆపేశారు. ఐపాడ్, ఐఫోన్‌లతో టెక్నాలజీ రంగాన్ని ఉర్రూతలూగించిన యాపిల్ కంపెనీ స్థాపకుడు స్టీవ్ జాబ్స్‌ది అరకొర చదువే! కాబట్టి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి టాప్ కాలేజీలు, కోర్సులొక్కటే మార్గంకాదు. ఐఐటీలు, ఇంజనీరింగ్, మెడిసిన్‌లో చేరడమనేది జీవన్మరణ సమస్య ఎంతమాత్రం కాదు. సంప్రదాయ కోర్సులతోపాటు ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఇంటీరియర్ డెకరేషన్, హెల్త్‌కేర్, పారామెడికల్, లాంగ్వేజెస్, అడ్వర్‌టైజింగ్, మైక్రోఫైనాన్స్, ఎడ్యుకేషన్, మీడియా, టెలివిజన్, స్పోర్ట్స్, ట్రావెల్ అండ్ టూరిజం, ఏవియేషన్, కమర్షియల్ పెలైట్, యానిమేషన్, కంపెనీ సెక్రటరీ, క్యాబిన్ క్రూ, హాస్పిటాలిటీ… ఇలా… కెరీర్ ప్రపంచం ఆకాశమంత విశాలంగా ఉంది! అంతరిక్షంలో నక్షత్రాలెన్ని ఉన్నాయో.. అంతకుమించిన అవకాశాలున్నాయ్!! ఆరంభంలోనే ఐదంకెల జీతాలందించే కోర్సులున్నాయి. ప్లేస్‌మెంట్స్‌లో కార్పొరేట్ జాబ్ ఖాయం చేసే కాలేజీలూ ఉన్నాయి. సేవతోపాటు సంపాదన, సం తృప్తిని మిగిల్చే కెరీర్స్ ఉన్నాయి. సృజనాత్మకతకు పదునుపెట్టే కోర్సులకూ కొదవలేదు. స్వయం ఉపాధితో పైకొచ్చే మార్గమూ లేకపోలేదు.

అందుబాటులో ఉన్న కోర్సులు.. ఏ కోర్సులో చేరితే భవిష్యత్‌లో అవకాశాలు బాగుంటాయి? ఏ కెరీర్ ఎంచుకుంటే.. ఫ్యూచర్ బ్రైట్‌గా ఉంటుంది. ఏ కోర్సులో ఎక్కడ చేరాలి. ఆయా కోర్సుల్లో అడ్మిషన్‌కు ఏ పరీక్షలు రాయాలి. వినూత్న కోర్సులందించే ఇన్‌స్టిట్యూట్‌లు.. అరుదైన కెరీర్ అవకాశాలపై కొన్ని రోజుల పాటు సాక్షి కెరీర్స్ విస్తృత సమాచారం అందించనుంది.

ఆఫ్టర్ టెన్త్ఎంపీసీఎంపీసీ అనగానే తల్లిదండ్రులు, విద్యార్థులు చేసే భవిష్యత్తు ఆలోచన.. ఇంజనీరింగ్. వాస్తవానికి ఇంజనీరింగ్ అనేది ఎంపీసీ తర్వాత ఉన్న వంద దారుల్లో ఒక దారి మాత్రమే. డిగ్రీలో బీఎస్సీ చేయొచ్చు.. ఫ్యాషన్ టెక్నాలజీ.. లా.. చార్టర్డ్ అకౌంటెన్సీ.. యానిమేషన్, మీడియా కోర్సులు.. ఉన్నత విద్యకు వీల్లేకుంటే.. తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సివస్తే.. డిప్ల మో కోర్సులు, సర్టిఫికెట్ కోర్సులతో తక్షణ ఉపాధి, ఉద్యోగావశాలెన్నో.. ఇంజనీరింగ్, లేదా డిగ్రీ తర్వాత సివిల్స్, ఐఎఫ్‌ఎస్, ఐఈఎస్‌లతోపాటు ఏపీపీఎస్సీ గ్రూప్స్, రైల్వే, డిఫెన్స్, బ్యాంకింగ్ రంగాల్లో అవకాశాలు పుష్కలం.

బైపీసీతల్లిదండ్రులు, విద్యార్థుల ఆశలు, ఆశయాలకు రూపం.. బైపీసీ. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీఎన్‌వైఎస్, బీయూఎంఎస్ వంటి వైద్య కోర్సులతోపాటు వెటర్నరీ సెన్సైస్ కోర్సులు, అగ్రికల్చర్, ఫార్మసీ, పారామెడికల్… ఇలా ఎన్నో అవకాశాలు బైపీసీ విద్యార్థుల సొంతం. ఆధునిక ప్రపంచ పోకడలు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఎక్స్ రే టెక్నాలజీ, రేడియాలజీ, ప్రోస్తటిక్స్, ఆర్థోటిక్స్, డయాలసిస్ వంటి కోర్సులను ముందుకు తెచ్చింది. సంప్రదాయకంగా ఇంటర్ తర్వాత లైఫ్ సెన్సైస్‌లో… బయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్, బయోఇన్ఫర్మేటిక్స్, మైక్రోబయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, జెనిటిక్స్, జెనిటిక్ ఇంజనీరింగ్, బోటనీ, జువాలజీలతో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని… పీజీ, పీహెచ్‌డీలతో రీసెర్చ్, టీచింగ్ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. బోటనీ, జువాలజీలను ఆఫ్షన్స్‌గా తీసుకొని ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఎంపికైనవారెందెరో. బైపీసీ అంటే.. ఎంబీబీఎస్, అగ్రికల్చరల్ కోర్సులేకాదు.. అత్యున్నత శిఖరాలకు ఎదగడానికి ఇంకా ఎన్నో మార్గాలున్నాయి.

సీఈసీఇంటర్‌లో సీఈసీ పూర్తి చేయడం ద్వారా.. సహజంగా అందుబాటులో ఉండే బీకాం, బీబీఏ, బీబీఎంల్లో చేరొచ్చు. వీటి తర్వాత ఎంబీఏ చదివి సంస్థల నిర్వహణలో పాలుపంచుకునే కీలక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. మేనేజ్‌మెంట్ నిపుణులుగా ఎదగొచ్చు. మరోవైపు చార్టర్డ్ అకౌంటెంట్, ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ(సీఎస్) వంటి జాబ్ గ్యారెంటీ కోర్సులూ చదవొచ్చు. ఏ కంపెనీకైనా వీరి అవసరం ఉంటుంది. ఇవి కష్టమనుకుంటే.. కాదనుకుంటే.. క్లాట్ రాసి జాతీయస్థాయిలోని ప్రతిష్టాత్మక లా కాలేజీల్లో న్యాయవిద్యను అభ్యసించొచ్చు. అకౌంటింగ్ ప్యాకేజెస్.. కామర్స్ విద్యార్థుల కోసమే. దాంతోపాటు బ్యాంక్ జాబ్స్, షేర్ మార్కెట్ కొలువులు, గ్రూప్-1,2,4వంటి ఉద్యోగాలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి సంప్రదాయ అవకాశాలతోపాటు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఆర్గనైజేషన్స్, ఫైనాన్షియల్ విభాగాల్లోనూ కామర్స్ అభ్యర్థులు కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

హెచ్‌ఈసీఇంటర్మీడియెట్‌లో హెచ్‌ఈసీ పూర్తిచేసిన అభ్యర్థులు డిగ్రీలో బీఏలో చేరొచ్చు. హెచ్‌ఈసీ విద్యార్థులు సైన్స్, టెక్నాలజీ కోర్సులు మినహాయించి… యానిమేషన్, ట్రావెల్ అండ్ టూరిజం, అడ్వర్‌టైజింగ్, జర్నలిజం, బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి అన్నిరకాల క్రేజీ కోర్సుల్లో చేరిపోవచ్చు. వీటితోపాటు జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులూ తెరపైకి వస్తున్నాయి. గ్రూప్స్, సివిల్ సర్వీసెస్‌ను లక్ష్యంగా నిర్ణయించుకున్న వాళ్లకు హెచ్‌ఈసీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఆఫ్టర్ 10+2…10+2 పూర్తికాగానే ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా కళ్లముందు కనిపించేది బీఎస్సీ/బీకామ్/బీఏ. వందల సంఖ్యలో కాలేజీలు.. వేల సంఖ్యలో సీట్లు. నేటి ఐటీ యుగంలో.. ప్రస్తుత మార్కెట్ ఎకానమీకి తగ్గట్లు కొన్ని ప్రత్యేక స్కిల్స్‌ను మెరుగుపరచుకుంటూ ఈ కోర్సుల్లో ఏది పూర్తిచేసినా.. అవకాశాలకేమీ కొదవలేదు. లా వంటి ప్రొఫెషనల్ కోర్సులతోపాటు రీసెర్చ్‌కూ బాటవేసుకోవచ్చు.

బ్యాచిలర్ ఆఫ్ సైన్స్బ్యాచిలర్ డిగ్రీ పూర్తయ్యాక ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సైన్స్ సబ్జెక్టుల పట్ల ప్రత్యేక ఆసక్తితో రీసెర్చ్ దాకా వెళ్లాలనుకునేవారు నిశ్చింతగా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్‌లో చేరొచ్చు. అంతేకాదు.. గ్రాడ్యుయేషన్ తర్వాత క్లైమెట్, ఎర్త్ సిస్టమ్ సెన్సైస్, వైల్డ్‌లైఫ్ సెన్సైస్‌లో అరుదైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఐతే ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో భారీ జీతాలతో జాబ్స్.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రీటైల్, మెడికల్, హెల్త్‌కేర్, ఫార్మారంగాల్లో అవకాశాలు ఊపందుకోవడంతో.. గత కొన్నేళ్లుగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల కంటే ఇంజనీరింగ్, మెడికల్, మెడికల్ అనుబంధ ఫార్మా వంటి కెరీర్స్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్)లు సైన్స్‌లో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెట్టినా… సాధారణ కాలేజీల్లో సైన్స్ కోర్సులకు పెద్దగా ఆదరణ పెరగలేదు. దాంతో సైన్స్, ఆర్ట్స్ కోర్సులకు పేరుగాంచిన ఢిల్లీ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలు సైతం కరిక్యులంలో పాలిమర్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వంటి అనుబంధ అంశాలను చేరుస్తున్నాయి. మరికొన్ని కాలేజీలు సైన్స్ విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచేదిశగా ప్రాజెక్టు వర్క్‌లను ప్రవేశపెడుతున్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ఏడు లక్షల వార్షిక ప్యాకేజీ.. ఈ వేతన ప్యాకేజీ ఏ ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలోనో క్యాం పస్ ప్లేస్‌మెంట్స్‌లో వచ్చింది కాదు. ఇది బీకామ్ హానర్స్ చదివిన విద్యార్థికి ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఇచ్చిన ఆఫర్! ఇది శ్రీరాం కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ యూనివర్సిటీ లాంటి కామర్స్ కోర్సులకు పేరుగాంచిన కాలేజీల్లో సాధ్యమైంది. అంటే.. జాబ్ మార్కెట్‌లో కామర్స్ కోర్సులకు కావల్సినంత డిమాండ్ ఉంది. కాకపోతే సబ్జెక్ట్, స్కిల్స్ ఉన్నవాళ్లు మాత్రమే జాబ్ ఆఫర్స్ అందుకుంటున్నారు. సబ్జెక్ట్ ఏదైనా కెరీర్ ఏదైనా రాణిస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు అన్ని యూనివర్సిటీల్లో, అన్ని కాలేజీల్లో కామర్స్ కోర్సులున్నాయి. సంప్రదాయ బీకామ్ కామర్స్‌తోపాటు మార్కెట్ అవసరాలకు తగ్గట్లు బీకామ్ విత్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, బీకామ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ వంటి కోర్సులను యూనివర్సిటీలు ప్రవేశపెడుతున్నాయి. బీకామ్‌తో చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, కాస్ట్ అకౌంటెంట్ వంటి ఏ ప్రొఫెషనల్ కోర్సును పూర్తిచేసినా వెనక్కు తిరిగి చూసుకునే పనే ఉండదు. ఇవి కాదనుకుంటే కంపెనీ సెక్రటేరియల్ ప్రాక్టీస్, యాక్చూరియల్ సెన్సై స్ వంటి వినూత్న అవకాశాలూ ఉన్నాయి.

బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ఆర్ట్స్ విభాగంలో ఉన్నన్ని సబ్జెక్టులు వేరే ఏ స్ట్రీమ్‌లోనూ లేవని చెప్పొచ్చు. దేశంలో ఎక్కువమంది చేరేది కూడా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లోనే. కొంతకాలం వరకూ బీఏ అంటే…ఏదో ఒక డిగ్రీ కోసం చేరడమనే అభిప్రాయం ఉండేది. కాని ఇప్పుడు ఎకనామిక్స్, సైకాలజీ వంటి సబ్జెక్టులకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా.. ఆర్ట్స్ అభ్యర్థులకు కెరీర్ అవకాశాలు మెరుగవుతున్నాయి. బీఏతోనే ఆగిపోకుండా… ఎంబీఏ, లా, మీడియా, టీచింగ్, హెచ్‌ఆర్, అడ్వర్‌టైజింగ్… విభాగాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్‌కు దీటైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ఆకాశంలో ఎగిరే విమానం.. రోడ్డుపై తిరిగే వాహనాలు.. పట్టాలపై పరుగులుపెట్టే రైళ్లు.. సముద్రంలో ప్రయాణించే ఓడలు.. చివరకు నిత్యకృత్యమైన సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లుఅన్నీ ఇంజనీరింగ్ ఆవిష్కరణలే! పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకం. ఐఐటీలు, నిట్‌లు, ఐఐఐటీల్లో ఇంజనీరింగ్ పూర్తిచేసినవారితోపాటు సబ్జెక్టుపై పట్టున్న ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి అవకాశాలు అనేకం. ఇంజనీరింగ్‌లో ప్రవేశానికి ప్రతిష్టాత్మక ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, ఎంసెట్ మార్గాలు. ఈ ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ వంటి బ్రాంచ్‌ల్లో దేశవ్యాప్తంగా పది లక్షలకుపైగా ఇంజనీరింగ్ సీట్లుంటే…ఒక్క మన రాష్ట్రంలోనే 3 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మెడిసిన్తెల్లకోటు, స్టెతస్కోప్.. డాక్టర్ డ్రెస్ కోడ్. ఈ డ్రెస్ కోడ్ లక్షల మంది కల. కానీ నిజం చేసుకోగలిగేది కేవలం 30వేల మందే. దేశంలో ఎంబీబీఎస్ కోర్సుకున్న డిమాండ్‌కు ఇదే నిదర్శనం. సీట్లు తక్కువ.. పోటీ ఎక్కువ కోర్సు ఏదంటే ఠక్కున గుర్తుకొచ్చేది ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ అంటే-బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. ఇంటర్‌లో బైపీసీ తర్వాత మెడిసిన్‌లో చేరడానికి మెడికల్ ఎంట్రన్స్ రాయాలి. మన రాష్ట్రంలో దాదాపు 4500 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్న్‌షిప్‌తో కలుపుకొని 5 ఏళ్లకు పైగా సాగే ఎంబీబీఎస్ తర్వాత అవకాశాల గురించి ఆలోచించాల్సిన పనేలేదు. ఈ ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కామన్ ఎంట్ర న్స్ ఎగ్జామ్‌ని ‘నీట్’ నిర్వహించనున్నారు.

ఫార్మసీదేశంలో ఫార్మా రంగం ఉజ్వలంగా దూసుకుపోతోంది. ఔషధ తయారీ కంపెనీలు…బల్క్ డ్రగ్స్ యూనిట్లు.. బహుళజాతీ కంపెనీలు… రాన్‌బాక్సీ, అరబిందో, రెడ్డి ల్యాబ్స్, నాట్కో, దివిల్యాబ్స్-ఇలా అనేక ఫార్మా కంపెనీలు.. రోగాలను సమర్థంగా ఎదుర్కొనే మందుల తయారీపై దృష్టిసారించాయి. దాంతో ఫార్మా నిపుణులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. డిఫార్మసీ, బీఫార్మసీ, ఫార్మ్‌డి, ఎంఫార్మసీ, ఫార్మసీలో పీహెచ్‌డీ వరకూ విద్యను అభ్యసించవచ్చు. ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి కనీస అర్హత: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ.

హెల్త్‌కేర్హెల్త్‌కేర్‌లో భారత్ బాగా వెనుకబడి ఉందనేది అన్ని సూచీల సారాంశం. విస్తరణకు అన్ని విధాల స్కోప్ ఉన్న రంగం హెల్త్‌కేర్. హెల్త్‌కేర్‌లో అనేక విభాగాలు.. పబ్లిక్ హెల్త్, మెంటల్ హెల్త్, యాక్సిడెంట్స్/ట్రామ్, డ్రగ్ అబ్యూస్/డీఅడిక్షన్, హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేషన్, నర్సింగ్ సెంటర్లు, మెడికల్ లేబొరేటరీ సర్వీసెస్‌ల్లో అనేక రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
 
%d bloggers like this:
Available for Amazon Prime