ఒకే ప్రిపరేషన్‌తో నీట్+ఎంసెట్ సాధించొచ్చిలా..

ఎంబీబీఎస్, మెడికల్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్ష.. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)! అలాగే రాష్ట్ర స్థాయిలో.. బీవీఎస్సీ అండ్ యానిమల్ హజ్బండ్రీ, బీఎస్సీ అగ్రికల్చర్ వంటి కోర్సుల్లో ప్రవేశాలకు జరిపే పరీక్ష ఎంసెట్. కాగా నీట్ జులై 26న జరుగనుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో.. ఎంసెట్(అగ్రికల్చర్,మెడిసిన్) పరీక్ష సైతం జులైలోనే జరిగే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో.. అభ్యర్థులు ఏకకాలంలో రెండు పరీక్షల్లో రాణించేలా ఉమ్మడి ప్రిపరేషన్ సాగించడమెలాగో
తెలుసుకుందాం..

 

కోర్సులు…నీట్, ఎంసెట్(అగ్రికల్చర్, మెడికల్) ద్వారా కింది కోర్సుల్లో ప్రవేశాలను ఖరారు చేస్తారు. అవి..

  • ఎంబీబీఎస్, -బీడీఎస్, -బీవీఎస్సీ అండ్ యానిమల్ హజ్బండ్రీ, – బీఫార్మసీ, -ఫార్మాడీ, -బీఎస్సీ(హానర్స్) అగ్రికల్చర్, -బీఎస్సీ(హానర్స్) హార్టికల్చర్, -బీఎస్సీ ఫారెస్ట్రీ, -బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్, -బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, -బీటెక్ బయోటెక్నాలజీ.
  • నీట్, ఎంసెట్ సంయుక్త ప్రిపరేషన్ పరంగా విద్యార్థులు ముందు రెండు పరీక్షల్లో గరిష్ట వెయిటేజీ లభిస్తున్న పాఠ్యాంశాలను గుర్తించాలి. ఆయా ఛాప్టర్లను పూర్తి స్థాయిలో ప్రిపేరవ్వడంతోపాటు ప్రశ్నల శైలిపై అవగాహన ఏర్పరచుకోవాలి.
ఫిజిక్స్..రెండు పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు ఫిజిక్స్ పరంగా వరుసగా మెకానిక్స్, ఎలక్ట్రోడైనమిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఆప్టిక్స్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ వేవ్స్, మోడ్రన్ ఫిజిక్స్ పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షల్లో వెయిటేజీ పరంగానూ ఇదే క్రమంలో ప్రాధాన్యం దక్కుతోంది. రెండు పరీక్షల్లోనూ మెకానిక్స్‌కు అధిక వెయిటేజీ లభిస్తోంది. మెకానిక్స్‌లో సెమికండక్టర్స్, రిజిడ్‌బాడీ డైనమిక్స్, మోడ్రన్ ఫిజిక్స్, గ్రావిటేషన్‌పై అధిక దృష్టిపెట్టాలి. ఎలక్ట్రోడైనమిక్స్‌లో ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఇండక్షన్ టాపిక్స్‌పై దృష్టిసారించాలి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్‌లో కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ టాపిక్స్ కీలకంగా నిలుస్తాయి. ఆప్టిక్స్‌లో జియోమెట్రికల్ ఆప్టిక్స్ అండ్ ఫిజికల్ ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్‌ను అధ్యయనం చేయాలి. వీటితోపాటు సింపుల్ హార్మోనిక్ మోషన్, సౌండ్ వేవ్స్‌ను సమగ్రంగా అధ్యయనం చేయాలి.

 

కెమిస్ట్రీ..కెమిస్ట్రీని ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీలుగా చదవాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో.. కెమికల్ బాండింగ్, కోఆర్డినేట్ కాంపౌండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షల్లో ఈ రెండు టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. వీటి తర్వాత డీ,ఎఫ్-బ్లాక్ ఎలిమెంట్స్‌ను కీలకంగా భావిం చాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో.. జనరల్ ఆర్గానిక్స్‌తోపాటు కార్బైల్ కాంపౌండ్స్, ఐయూప్యాక్ అండ్ ఐసోమెరిజం, ఆల్కైల్ హాలైడ్, ఆల్కహాల్ అండ్ ఈథర్(రియాక్షన్ మెకానిజం) టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఫిజికల్ కెమిస్ట్రీలో.. కెమికల్ ఈక్విలిబ్రియం, థర్మోడైన మిక్స్ అండ్ థర్మోకెమిస్ట్రీ, కెమికల్ కైనిటిక్స్ అత్యంత కీలకం.

బయాలజీ…బోటనీలో అన్ని టాపిక్స్ నుంచీ దాదాపు సమాన స్థాయిలో ప్రశ్నలు వస్తున్నాయి. ప్లాంట్ అనాటమీ, పాలినేషన్, ఫోటోసింథసిస్, డీఎన్‌ఏ రెప్లికేషన్, కింగ్డమ్ ఆఫ్ మొనెరా, జెనెటిక్ డిజార్డర్స్, సెకండరీ గ్రోత్, ఆల్గే తదితరాలను ముఖ్యమైనవిగా చెప్పొచ్చు. జువాలజీలో ఎండోక్రైన్ సిస్టమ్, ఇమ్యూన్ సిస్టమ్, డెజైస్టివ్ సిస్టమ్, నెర్వస్ సిస్టమ్, స్కెలిటన్ సిస్టమ్ తదితరాలను కీలకంగా భావించాలి. మొత్తంగా చూస్తే జువాలజీలో హ్యూమన్ ఫిజియాలజీకి అధిక వెయిటేజీ లభిస్తుంది.

సిలబస్‌ను అనుసరిస్తూ…అభ్యర్థులు నీట్, ఎంసెట్ సిలబస్‌ను అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. పరీక్షలో సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సిలబస్‌లో లేని అంశాల జోలికి వెళ్లకపోవడమే మంచిది.

నిరంతర ప్రాక్టీస్..పిపరేషన్ పరంగా అధ్యయనంతోపాటు ప్రాక్టీస్ ఎంతో కీలకం. సరైన ప్రాక్టీస్ లేకుంటే చదివిన అంశాలను సైతం మర్చిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిత్యం పాత నీట్ ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. అలాగే గత ఎంసెట్ ప్రశ్నపత్రాలను సాధించాలి. ఆ తర్వాత ప్రశ్నపత్రాల సాధనలో చేస్తున్న పొరపాట్లను గుర్తించి విశ్లేషించుకోవాలి. కష్టసాధ్యంగా అనిపించే ప్రశ్నలను గుర్తించి..వాటిని రివిజన్ సమయంలో తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. సులభంగా ఉన్న ప్రశ్నలను సైతం రివిజన్ చేయాలి. నీట్ పరీక్ష పూర్తిగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ చుట్టూ తిరుగుతుంది. కాబట్టి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం తప్పనిసరి.

మాక్ టెస్టులురోజూ మాక్ టెస్టులు రాయాలి. తద్వారా ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు పరీక్ష పరంగా స్వీయ సామర్థ్యాలపైనా అంచనాకు రావొచ్చు. మాక్‌టెస్టులో చూపిన ప్రతిభ ఆధారంగా ప్రిపరేషన్ వ్యూహాలను మార్చుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

{పశ్నల అవగాహన:ఎంసెట్, నీట్‌లో అడిగే ప్రశ్నల తీరులో తేడా ఉంటుంది. దీంతో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు పరీక్ష హాల్లో తడబడుతున్నారు. నీట్‌లో ప్రశ్నలను సూటిగా కాకుండా.. పరోక్షంగా అప్లికేషన్ దృక్పథంతో అడుగుతారు. కాబట్టి నమూనా ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీసు చేయాలి. తద్వారా మెరుగైన స్కోరును సాధించవచ్చు.

షార్ట్ నోట్స్:ప్రిపరేషన్ సమయంలోనే విద్యార్థులు షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. దీనివల్ల సమయం ఆదా అవడంతోపాటు ముఖ్య అంశాలపైనే ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది. నీట్ బయాలజీ ప్రిపరేషన్‌కు సంబంధించి ఫ్లోచార్ట్‌లు, డయాగ్రామ్స్, షార్ట్ ట్రిక్స్‌ను ఉపయోగించాలి.

ఆరోగ్యం

  • పరీక్షకు ప్రిపేరయ్యే అభ్యర్థులు శారీరక, మానసిక ఆరోగ్యాలపై దృష్టిపెట్టాలి. ప్రోటీన్‌లతో కూడిన ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరు నుంచి ఏడు గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి.
  • పిపరేషన్ పరంగా సానుకూల దృక్పథం ప్రదర్శించాలి. తద్వారా పరీక్ష పరంగా సానుకూల ఫలితాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.
  • ఆత్మవిశ్వాసాన్ని అతి విశ్వాసంగా మారకుండా చూసుకోవాలి..
  • కష్టపడి చదివితే విజయం దానంతట అదే వస్తుందని గుర్తించాలి.

 

 

%d bloggers like this:
Available for Amazon Prime