‘ఐపాట్’

దేశంలో ఏటా లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలతో బయటకు వస్తున్నారు. వీరిలో ఉద్యోగాలు లభించేది కొందరికే.
ఐఐటీల్లో ఎంటెక్లో ప్రవేశాలకు నిర్వహించే ‘గేట్’ స్కోర్ ఆధారంగా పలు ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాలు జరుపుతున్నాయి. మరి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఇలాంటి పరీక్ష ఏదైనా ఉందా? అంటే.. ఇంతకాలం ‘లేదు’అనే సమాధానమే వచ్చేది. కాని ఇకపై ప్రైవేటు కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలకు వీలు కల్పించే పరీక్ష ఐపాట్ను భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తొలిసారిగా నిర్వహించనుంది. ఇండస్ట్రియల్ ప్రొఫిషియన్సీ అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్’ (ఐపాట్)లో ప్రతిభ చూపిన ఇంజనీరింగ్ అభ్యర్థులు కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించొచ్చు. ఈ నేపథ్యంలో… ‘ఐపాట్’ పరీక్ష తీరుతెన్నులపై ప్రత్యేక కథనం…
దేశంలో ఏటా 10లక్షల మందికిపైగా ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసుకుంటున్నారు. వీరిలో అధికశాతం మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు పరిశ్రమలు తమకు కావాల్సిన నైపుణ్యాలున్న అభ్యర్థులు దొరక్క ఇబ్బంది పడుతున్నాయి. ఐటీ రంగానికి మినహా, ఇతర పరిశ్రమలకు సరైన సిబ్బంది లభించడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సీఐఐ ఈ రెండు వర్గాలను ఒక్క తాటిపైకి తీసుకొచ్చి ప్రయత్నం ప్రారంభించింది. ఇంజనీరింగ్ అభ్యర్థులకు అప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించి.. పరీక్షలో ప్రతిభ ఆధారంగా స్కోర్ ప్రకటించనుంది. విజయం సాధించిన అభ్యర్థుల ఐపాట్ స్కోర్ను సీఐఐ కంపెనీలతో షేర్ చేసుకుంటుంది. తద్వారా కంపెనీలు తమ అవసరాలకు తగ్గ అభ్యర్థులను నియమించుకునే వీలుకలుగుతుంది. అభ్యర్థులు సైతం ఐపాట్ స్కోర్ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించే అవకాశం కలుగుతుంది. అంటే.. ఐపాట్తో ఇటు కంపెనీలకు సుశిక్షుతులైన సిబ్బంది లభించడంతోపాటు అటు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు అవకాశం కల్పించినట్టు అవుతుంది.
ఎవరికి అవకాశం..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇప్పటికే చాలామంది ‘గేట్’కు సిద్ధమవుతుంటారు. వీరిలో కొందరు మంచి స్కోర్ సాధించి ఐఐటీల్లో పీజీ కోర్సుల్లో చేరిపోగా.. మరికొందరు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు సాధించుకుంటారు. గేట్లో మంచి స్కోరు సాధించలేనివారు, గేట్కు దరఖాస్తు చేయని అభ్యర్థులు, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నవారు ఐపాట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. వీరితోపాటు ఇప్పటికే బీటెక్/బీఈ/ఎంటెక్/ఎంఈ పూర్తి చేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయో పరిమితి నిబంధన లేదు. ఉద్యోగ అనుభవం ఉన్నవారు సైతం దరఖాస్తు చేసకోవచ్చు.
ఐపాట్ ఎలా ఉంటుంది?
‘ఇండస్ట్రియల్ ప్రొఫిషియన్సీ అప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీర్స్’ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ). అంటే ఆన్లైన్ ఎగ్జామ్ అన్నమాట. మొత్తం 100 ప్రశ్నలు– 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. నెగెటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ఐపాట్ ప్రశ్న పత్రంలో మొత్తం నాలుగు సెక్షన్లు ఉంటాయి.
»
సెక్షన్–1:
కాగ్నిటివ్ ఎబిలిటీస్(20 ప్రశ్నలు–20 మార్కులు): ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, అనలిటికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లిష్ కమ్యూనికేషన్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
»
సెక్షన్–2:
ప్రొఫెషనల్ ఎబిలిటీస్: ఈ విభాగంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హెల్త్ సేఫ్టీ అండ్ రిస్క్ మేనేజ్ మెంట్, ఎన్విరాన్మెంటల్ లాస్, సోషల్ రెస్పాన్స్బి లిటీ అండ్ ఎథిక్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, లీగల్, కాంట్రాక్ట్స్ అండ్ ఆర్బిట్రేషన్ విభాగాల నుంచి 20 ప్రశ్నలు– 20 మార్కులకు అడుగుతారు.
సెక్షన్–3(ఎ):
టెక్నికల్ ఎబిలిటీస్: ఈ విభాగంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 10 మార్కులకు 10 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలు 10+2 స్థాయిలో ఉంటాయి.
»
సెక్షన్–3(బి):
టెక్నికల్ ఎబిలిటీస్: ఈ విభాగం ఆయా ఇంజనీరింగ్ బ్రాంచ్ల వారికి వేర్వేరుగా ఉంటుంది. ఇందులో అభ్యర్థులు దరఖాస్తు చేసిన బ్రాంచ్ నుంచి మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఏరో స్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లు ఉన్నాయి. ఆయా సబ్జెక్టుల నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలు ఉంటాయి.
సీఐఐ ఆన్లైన్ ప్రిపరేషన్
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆయా సబ్జెకులు, కామన్ సిలబస్ ప్రకారం సీఐఐ ఆన్లైన్లో శిక్షణను సైతం అందిస్తుంది. ఐపాట్ పరీక్ష ఎలా ఉంటుంది.. ప్రశ్నలు ఎలా వస్తాయి తదితర వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఒకసారి రాసిన పరీక్ష స్కోరు మూడేళ్ల వరకూ పరిగణనలో ఉంటుంది. అంటే ఈ ఏడాది రాసిన ఎగ్జామ్లో వచ్చిన స్కోరుతో వచ్చే మూడేళ్ల వరకు ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఎన్నిసార్లైనా ఐపాట్ రాసుకోవచ్చు.
ముఖ్యాంశాలు
  • దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
  • టెస్ట్ దరఖాస్తు ఫీజు: రూ.1500
  • ఐపాట్ ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 10 మే 2020
  • హాల్ టికెట్ల జారీ: 15 జూన్ నుంచి
  • ఆన్లైన్ ఐపాట్ ఎగ్జామ్: జూలై 04, 05, 11 12
  • స్కోరు కార్డు జారీ: ఆగస్టు 01
  • పూర్తి వివరాలకు వెబ్సైట్: http://www.ipate.in
%d bloggers like this:
Available for Amazon Prime