ఇంజనీరింగ్.. ఈ బ్రాంచులు చదివితే పోటీ తక్కువ.. అవకాశాలు ఎక్కువ

ఇంజనీరింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థుల ఆప్షన్లు.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్లే.
Edu news

ఈ కోర్ బ్రాంచ్‌ల్లో ఇంజనీరింగ్ పూర్తిచేస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదనే భావనే దీనికి కారణం. అయితే బీటెక్ స్థాయిలో వినూత్న బ్రాంచ్‌ల్లో ఇంజనీరింగ్ చేయాలనుకునేవారికి.. ఏరోనాటికల్, మైనింగ్, కెమికల్, మెటలర్జికల్, బయోటెక్నాలజీ తదితర స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్వీయ ఆసక్తితోపాటు అవకాశాలపై అవగాహన ఉన్న విద్యార్థులు ఈ వినూత్న బ్రాంచ్‌లను ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. స్పెషలైజ్డ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల వివరాలు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకుందాం..
కెమికల్ ఇంజనీరింగ్..
రసాయన శాస్త్రాన్ని(కెమిస్ట్రీ) టెక్నాలజీకి అనుసంధానించే ప్రక్రియలోంచే ‘కెమికల్ ఇంజనీరింగ్’ ఆవిర్భవించింది. సిరామిక్స్, ఇంధనాలు, పెట్రోకెమికల్స్, ఎరువులు, ప్లాస్టిక్స్, పేలుడు పదార్థాలు వంటి ఉత్పత్తుల తయారీలో కెమికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కెమికల్ ప్లాంట్ల నిర్వహణ, రసాయన ముడిపదార్థాలను పెద్దఎత్తున వినియోగ వస్తువులుగా మార్చే ప్రాసెసింగ్ విధానం వంటివి ఈ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి. పెట్రోలు, రసాయన, పెట్రోకెమ్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండళ్లకు రూపకల్పన జరుగుతున్న తరుణంలో రానున్న రోజుల్లో కెమికల్ ఇంజనీర్లకు డిమాండ్ ఏర్పడనుందని అంచనా.
 • కోర్ సబ్జెక్టులు: కెమికల్ ప్రాసెస్ ప్రిన్సిపుల్స్, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫ్లూయిడ్ అండ్ పార్టికల్ మెకానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, ప్రాసెస్ డైనమిక్స్ అండ్ కంట్రోల్, బయో కెమికల్ ఇంజనీరింగ్.
 • నైపుణ్యాలు: రసాయనాలపై ఆసక్తి అవసరం. వివిధ రకాల ఆర్గానిక్, ఇనార్గానిక్ రసాయనాలతో పనిచేయగల నేర్పు ఉండాలి. డిస్టిలేషన్ కాలమ్స్, ఎవాపరేటర్స్, హీట్ ఎక్సే్ఛంజర్స్, రియాక్టర్లు, పంపులు, వాల్వ్‌లు, ఇంకా ఇతర క్లిష్టమైన ఆపరేషన్లలో పాల్గొనాల్సి ఉంటుంది. పరిశోధన, ఉత్పత్తులను మిళితం చేసి.. ఫలితాలను విశ్లేషణ చేసేందుకు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా అవసరం.
 • అవకాశాలు: కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫెర్టిలైజర్ పరిశ్రమలు, పెయింట్లు, డైలు, ల్యూబ్రికెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

బయోటెక్నాలజీ..
బయోటెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. సృష్టికి ప్రతి సృష్టి చేయగల క్లోనింగ్ ప్రక్రియ మొదలుకొని.. బయో ఫెర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, బయో ఫ్యూయల్స్, బయో ఫార్మాస్యూటికల్స్, వ్యాక్సీన్స్, ఎంజైమ్స్, హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్, బయో కాస్మోటిక్స్, హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు, జన్యుచికిత్స, జన్యుపరీక్ష, ఔషధ ఉత్పత్తులు, జన్యుపరివర్తిత పంటలు… ఇవన్నీ బయోటెక్నాలజీ పరిశోధనల ఫలితాలే. మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, పర్యావరణ వనరుల్ని అన్వేషించి..వాటిని సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తులుగా మార్చడమే బయోటెక్నాలజీ ఉద్దేశం.

 • కోర్ సబ్జెక్టులు: కల్చరింగ్/బయలాజికల్ సిస్టమ్స్/కణాలు/వాటి సహ ఉత్పన్నాలను పెద్ద బయోరియాక్టర్లలో బయోప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగించి ఉత్పత్తి చేయడాన్ని బయోటెక్నాలజీ కోర్సులో భాగంగా అధ్యయనం చేస్తారు. బయోలాజికల్ సిస్టమ్స్, కల్చరింగ్ మెథడ్స్‌లో భాగంగా ఉష్ణోగ్రత, ఒత్తిడి(ప్రెజర్), ఆక్సీజన్ కంటెంట్, పీహెచ్, వాల్యూమ్.. తదితరాల నియంత్రణపైనా విద్యార్థులకు అవగాహన కల్గిస్తారు.
 • నైపుణ్యాలు: బయోటెక్నాలజీలో రాణించాలంటే.. మంచి లాజికల్, అనలిటికల్ నైపుణ్యాలు ఉండాలి. డిటైల్డ్ ఓరియెంటెడ్, అబ్జర్వేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఎంతటి ఒత్తిడిలోనైనా పనిచేయగలగాలి. బృందంలో పనిచేసే ఓర్పు కావాలి. ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించే దృక్పథం, పరిశోధనల పట్ల ఆసక్తి ఉండాలి. సమస్య పరిష్కారంలో ప్రయోగాత్మక విధానాలను అనుసరించాలి. బయోటెక్నాలజీ ల్యాబ్ ప్రక్రియపై అవగాహన అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్, కంప్యూటర్ స్కిల్స్ కావాలి. టెక్నికల్ రైటింగ్ స్కిల్స్, రికార్డు కీపింగ్ స్కిల్స్ ఉండాలి.
 • కెరీర్ అవకాశాలు: బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు ఫార్మాస్యూటికల్, కెమికల్, వ్యవసాయం–అనుబంధ పరిశ్రమలు, బయో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, రీసెర్చ్ ల్యాబొరేటరీల్లో పనిచేయొచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ వీరికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే మెడిసిన్, వ్యాక్సిన్, నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఫెర్టిలైజర్ ఉత్పాదక పరిశ్రమల్లో కొలువులు దక్కించుకోవచ్చు.

మెటలర్జికల్ ఇంజనీరింగ్..
కార్లు, బైకుల దగ్గరి నుంచి విమానాల వరకు.. వాటికి ఉపయోగపడే లోహ ఉత్పత్తుల డిజైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఉత్పత్తులను అధ్యయనం చేసే ఇంజనీరింగ్ విభాగం.. మెటలర్జికల్ ఇంజనీరింగ్. భిన్న లోహాలు.. వాటి మిశ్రమాలు, వివిధ రంగాల్లో ఆ లోహాల అనువర్తితాలకు సంబంధించిన విస్తృత పరిజ్ఞానాన్ని ఇది విద్యార్థికి అందిస్తుంది. లోహాలు, వాటి స్వభావాలను అధ్యయనం చేస్తుంది. ముడి ఖనిజాల నుంచి అవసరమైన మూలకాలను సేకరించడంలో మెటలర్జికల్ ఇంజనీర్లు కీలకపాత్ర పోషిస్తారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశ్రమలకు అవసరమైన మెటల్స్ను తయారు చేయడం; లోహాలు, వాటి మిశ్రమాలను పరీక్షించడం వంటి విధులు నిర్వహిస్తారు.

 • కోర్ సబ్జెక్టులు: ఎక్స్ట్రాక్టివ్ మెటలర్జి(ముడి ఖనిజాల నుంచి మూలకాలను సేకరించే ప్రక్రియ ఇది); ఫిజికల్ మెటలర్జి(ప్రాబ్లమ్ స్వాలింగ్ అంశాన్ని చర్చిస్తుంది); మెకానికల్ మెటలర్జి(లోహాలు, వాటి మిశ్రమాలను పరీక్షించే పద్ధతులు/ మెకానిజమ్‌లను అధ్యయనం చేస్తుంది); వెల్డింగ్ మెటలర్జి (మెటల్ జాయినింగ్ ప్రాసెసింగ్ పద్ధతుల్ని అధ్యయనం చేస్తుంది); కరోజిన్ మెటలర్జి, పాలిమర్స్, సిరామక్స్, కాంపోజిట్, నానో మెటీరియల్స్ వంటివి.
 • నైపుణ్యాలు: మెటలర్జీ రంగంలో ఆధునిక పరిశోధనలు,ఆవిష్కరణలపై అవగాహనను కలిగి ఉండాలి. విశ్లేషణ సామర్థ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జియాలజీపై పట్టు ఉండాలి. అత్యాధునిక పరికరాల గురించి తెలుసుకోవాలి. లోహాలు, ఇతర పదార్థాల ఉపయోగాలు, లక్షణాలను నిర్ధారించే విశ్లేషణ సామర్థ్యం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
 • కెరీర్ అవకాశాలు: మెటలర్జి విభాగంలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలం. లోహ సంగ్రహణ పరిశ్రమలు, మిశ్రమధాతు ప్లాంట్లలో ఇంజనీర్లుగా అవకాశాలు లభిస్తాయి.

ఏరోనాటికల్ ఇంజనీరింగ్..
ఏరోనాటికల్ ఇంజనీరింగ్.. విమానాలు, ఇతర స్పేస్ వెహికల్స్ అధ్యయనం, డిజైనింగ్, నిర్మాణం తదితరాలకు సంబంధించిన విభాగమిది.

 • కోర్ సబ్జెక్టులు: ఈ కోర్సులో విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్‌ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇందులో ఏరోడైనమిక్స్, ఏయిర్క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఏయిర్క్రాఫ్ట్ ప్రొపల్షన్, ఏయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ వంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి.
 • నైపుణ్యాలు: విమానాలపై ఆసక్తి, మ్యాథమెటికల్, అనలిటికల్, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవసరం. సృజనాత్మకత, భద్రత అంశాలపై అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్, సమయపాలన, ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను అవగాహన చేసుకోవడం ముఖ్యం.
 • కెరీర్ అవకాశాలు: ఏరోనాటికల్ ఇంజనీర్స్కు విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమలో డిజైన్ అండ్ డెవలప్మెంట్లో మంచి డిమాండ్ ఉంది.

మైనింగ్ ఇంజనీరింగ్..

 • చురుకైన, ఉత్సాహవంతులు, చొరవచూపే ప్రతిభావంతులైన యువకులకు మైనింగ్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలం. అతి పురాతన, అతి పెద్ద పరిశ్రమ అయిన మైనింగ్ రంగంలో.. నిత్యం పరిశోధనలకు పెద్దపీట వేస్తారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా యువతకు మైనింగ్‌లో శిక్షణ ఇవ్వడం, కొత్త గనుల అన్వేషణ, ఆధునిక టెక్నాలజీ వినియోగం, ఆధునికీకరణ దిశగా మైనింగ్ ఇంజనీరింగ్ విభాగం కృషిచేస్తోంది.
 • కోర్సు అంశాలు: మైన్ ప్లానింగ్, మైన్ ఎన్విరాన్మెంట్, సర్ఫేస్ మేనేజ్మెంట్, సేఫ్టీ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ రీసెర్చ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మైన్ వెంటిలేషన్, మైనింగ్ మెషినరీ, మైన్ సిస్టమ్స్ అండ్ కంప్యూటర్అప్లికేషన్స్, ఓపెన్ పిట్ మైనింగ్, అండర్‌గ్రౌండ్ మైనింగ్ మెథడ్స్, కోల్, యూఎంఎం (మెటల్), రాక్ ఎక్స్కవేషన్ ఇంజనీరింగ్, మైనింగ్ జియాలజీ, మైన్ లెజిస్లేషన్ అండ్ సేఫ్టీ, æమైన్ సర్వేయింగ్, మైన్ ఎక్స్కవేషన్ ఇంజనీరింగ్, మైన్ సర్ఫేస్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వంటివి.
 • అవకాశాలు: మైనింగ్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు కోర్ మైనింగ్‌తోపాటు అనుబంధ సంస్థల్లో ఉద్యోగాలు పొందొచ్చు. మైనింగ్ ఇంజనీరింగ్ తర్వాత పరిశోధన రంగంలోనూ అవకాశాలు లభిస్తాయి.

ఆసక్తి, పట్టుదల ప్రధానం!యూజీ స్థాయిలో ఏరోనాటికల్, మైనింగ్ తదితర స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లు ఎంచుకోవాలనుకునే అభ్యర్థులకు ఆయా బ్రాంచ్‌లపై అమితమైన ఆసక్తి, గట్టి పట్టుదల ఉండాలి. కొన్ని కళాశాలల్లో కొన్ని బ్రాంచ్‌లకు మంచి పేరుంటుంది. అలాంటి ప్రత్యేక కళాశాలల్లో స్పెషలైజ్డ్ బ్రాంచ్‌లు చదివితే ప్రయోజనం ఉంటుంది. బీటెక్ స్థాయిలో మెకానికల్ తదితర కోర్ బ్రాంచ్‌లు చదివితే… పీజీ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఉన్న స్పెషలైజేషన్ల నుంచి నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. స్పెషలైజ్డ్ బ్రాంచ్‌ల్లో యూజీ కోర్సులు అభ్యసించిన వారికి పీజీ స్థాయిలో పరిమిత సంఖ్యలో స్పెషలైజే షన్లు ఉంటాయి. ఏ బ్రాంచ్ ఎంచుకున్నా… సంబంధిత సబ్జెక్ట్‌లలో నైపుణ్యం సాధిస్తే∙మంచి కెరీర్ అవకాశాలు పొందొచ్చు.

%d bloggers like this:
Available for Amazon Prime