ఇంగ్లిష్ పట్టండి.. కొలువు కొట్టండి..!

ఇంటర్నెట్ రాకతో ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. ఉన్నత విద్య, ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్లడం సర్వసాధారణమైంది.
Career guidance

మన విద్యార్థులు ఎక్కువగా వెళ్లే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో మనగలిగేందుకు ఇంగ్లిష్ తప్పనిసరి. అంతేకాదు స్వదేశంలోనూ ఏ పోటీ పరీక్షలో, ఏ ప్రవేశ పరీక్షలో మెరుగ్గా రాణించాలన్నా.. ఇంగ్లిష్ వచ్చి ఉండాలి. కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్వ్యూల్లో నెగ్గాలన్నా.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఆఫర్ సొంతం చేసుకోవాలన్నా.. ఇంగ్లిష్ నైపుణ్యం లేకుంటే కష్టమే!! ప్రస్తుత పరిస్థితుల్లో కెరీర్‌కు లైఫ్‌లైన్‌గా మారిన ఇంగ్లిష్‌పై పట్టు బిగించేందుకు.. ఇప్పుడు కరోనా కారణంగా అందివచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లాక్డౌన్ రోజుల్లో ఇంట్లోనే ఉండి.. ఇంగ్లిష్ నేర్చుకునేందుకు అందుబాటులో ఉన్న పలు ఆన్లైన్ మార్గాల గురించి తెలుసుకుందాం..
బ్రిటిష్ కౌన్సిల్…
ఇంగ్లిష్ బోధనలో బ్రిటిష్ కౌన్సిల్ పెట్టింది పేరు. ఇది పిల్లల నుంచి పెద్దల వరకూ.. వివిధ వయసుల వారు, వారి అవసరాలకు తగ్గట్టు ఇంగ్లిష్ బోధనా నిపుణులతో కోర్సులను రూపొందించి అందిస్తోంది. ఇందులో కొన్ని లెవెల్స్‌ను ఉచితంగాను, మరికొన్నింటిని స్వల్ప రుసుం చెల్లించి ఆన్లైన్లో పొందవచ్చు. వీడియో, ఆడియో పాఠాల ద్వారా ఇంగ్లిష్‌ను నేర్చుకోవచ్చు. ఆయా పాఠ్యాంశాలు పూర్తయ్యాక ఉచితంగా పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఇందులో ప్రధానంగా ఆన్లైన్ కోర్సులతోపాటు లిజనింగ్, రీడింగ్, రైటింగ్ స్కిల్స్, ఇంగ్లిష్ గ్రామర్, వొకాబ్యులరీ, బిజినెస్ ఇంగ్లిష్, జనరల్ ఇంగ్లిష్ వంటి విభాగాలు అందుబాటులో ఉన్నాయి. చిన్నారులకు, యువతకు స్థాయిని బట్టి అర్థమయ్యేలా బోధన కొనసాగుతుంది. ఇంగ్లిష్ టీచర్ల బోధనా పటిమను మెరుగుపరిచేలా పలు కోర్సులను రూపొందించారు. అంతేకాకుండా ఎప్పుడు కావాలన్నా ‘ఆన్లైన్ ఇంగ్లిష్ ట్యూటర్’ విధానం సైతం అందుబాటులో ఉంది. దీనికి కోర్సును బట్టి స్వల్ప మొత్తం చెల్లించి పాఠాలు వినవచ్చు. అవసరమనుకుంటే.. ఫోన్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్https://learnenglish.britishcouncil.org
బీబీసీ లెర్నింగ్…
ఆన్లైన్ ఇంగ్లిష్ కోర్సులను అందించడంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మరో వేదిక.. ‘బీబీసీ లెర్నింగ్ ఇంగ్లిష్’. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంగ్లిష్ లెర్నర్స్ కోసం ఉచితంగా ఆడియో, వీడియో, టెక్స్›్ట మెటీరియల్‌ను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా ఇందులో చక్కటి వీడియో పాఠాలు పొందుపరిచారు. వివిధ దేశాలకు చెందిన వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఇంగ్లిష్ చెప్పే విధానం అద్భుతంగా ఉంది. వివిధ స్థాయిల్లోని వారికి అర్థమయ్యేలా కోర్సులు రూపొందించారు. అంతేకాదు.. గ్రామర్, వొకాబ్యులరీ, ప్రనౌన్సేషన్, న్యూస్ రివ్యూ, బిజినెస్ ఇంగ్లిష్, ఫర్ చిల్డ్రన్, ఫర్ టీచర్స్.. ఇలా వివిధ విభాగాలు ఉంటాయి. లెర్నర్స్.. ఇంగ్లిష్ ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకునేందుకు ‘క్విజ్’లు సైతం ఈ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇందులో అధికంగా వీడియో పాఠాలే ఉన్నాయి. కాబట్టి ఏబీసీడీలు వస్తే చాలు.. ఇంగ్లిష్ నేర్చుకునే అవకాశం ఉంది. ‘బీబీసీ లెర్నింగ్ ఇంగ్లిష్ యాప్’ కూడా అందుబాటులో ఉంది. దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎప్పుడైనా, ఎక్కడైనా సరే ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్https://www.bbc.co.uk/learningenglish
ఎడెక్స్ లాంగ్వేజెస్..
ప్రపంచ వ్యాప్తంగా పలు యూనివర్సిటీలు అందించే షార్ట్‌టర్మ్ ఇంగ్లిష్ కోర్సులు ఎడెక్స్ పోర్టల్ ద్వారా పొందవచ్చు. ఇందులోనూ మనకు ఏ స్థాయి కోర్సు అవసరమో దాన్ని ఎంచుకొని ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. ఇక్కడ దాదాపు అన్ని కోర్సులు ఉచితంగానే అందిస్తున్నారు. ప్రధానంగా బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో మాట్లాడే ఇంగ్లిష్ కాస్త భిన్నంగా ఉంటుంది. ఆయా దేశాల వొకాబ్యులరీ, గ్రామర్ ప్రకారం అక్కడ టాప్ యూనివర్సిటీలు, కాలేజీలు రూపొందించిన కోర్సులు ఇందులో చూడొచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్www.edx.org/learn/english
ఏబీఏ ఇంగ్లిష్..
ఏబీఏ ఆన్లైన్ ఇంగ్లిష్ కోర్సుల్లో చాలా రకాలు ఉన్నాయి. ముఖాముఖి కోర్సులు, ఆన్లైన్ కోర్సులు, ప్రైవేట్ క్లాసులు వంటివి వాటిలో కొన్ని. ఏ కోర్సు ఎవరికి అనువుగా ఉంటుందో.. ఎంతవరకు అవసరమో తెలుసుకోవడం కష్టం. అందుకు అనువుగా ‘ఏబీఏ ఇంగ్లిష్’ ఆన్లైన్ ప్రొవైడర్ కోర్సులను అందిస్తోంది. ఇక్కడా నేర్చుకునేవారి అవసరం, సామర్థ్యాన్ని బట్టి బిగినర్స్, లోయర్–ఇంటర్మీడియెట్, ఇంటర్మీడియెట్, అప్పర్–ఇంటర్మీడియెట్, అడ్వాన్స్డ్, బిజినెస్ స్థాయిలు ఉన్నాయి. ఇందులో నచ్చిన కోర్సును ఎంచుకోవచ్చు. ఆన్లైన్ ఇంగ్లిష్ కోర్సును మనకు అనువైన సమయంలో ఎక్కడ నుంచైనా నేర్చుకోవచ్చు. ఇందులో ఫేస్ టు ఫేస్ కోర్సు, ఆన్లైన్ కోర్సు అని రెండు రకాలు ఉన్నాయి. ఫేస్ టు ఫేస్ తరగతులకు ఫీజు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఆన్లైన్ కోర్సులకు మాత్రం అందులో పదో వంతు చెల్లిస్తే సరిపోతుంది.
పూర్తి వివరాలకు వెబ్సైట్https://www.abaenglish.com
ఫ్యూచర్ లెర్న్..అవకాశాలకు ఇంగ్లిష్ ప్రాణ వాయువు అన్నది∙అందరికీ తెలిసిందే. ప్రపంచంలో విస్తృతంగా మాట్లాడే భాషల్లో ఇది ఒకటి. 50కి పైగా ప్రపంచ దేశాల్లో అధికారిక భాష. కాబట్టి ప్రపంచంతో అనుసంధానమై.. మన అవకాశాలు మెరుగుపరచుకోవాలన్నా.. ఎంఎన్సీల్లో కెరీర్‌కు మార్గం వేసుకోవాలన్నా.. ఇంగ్లిష్ తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ‘ఫ్యూచర్ లెర్న్’ పోర్టల్‌లో బేసిక్ ఇంగ్లిష్ నుంచి వివిధ స్థాయిల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ ఇంగ్లిష్ 1–ఎలిమెంటరీ, బేసిక్ ఇంగ్లిష్ 2–ప్రి ఇంటర్మీడియెట్, ఇంగ్లిష్ ఫర్ వర్క్ప్లేస్తోపాటు ఐఈఎల్టీఎస్ అభ్యర్థుల కోసం లిజనింగ్, రైటింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. ఈ సైట్లో ఇంగ్లిష్‌తోపాటు జర్మన్, ఇటాలియన్, స్పానిష్ వంటి పలు విదేశీ భాషలు సైతం నేర్చుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్https://www.futurelearn.com
ఎలిసన్ కోర్సులు..ఇంగ్లిష్ భాష.. ఒకేలా కనిపిస్తున్నా.. ప్రాంతాన్ని, అవసరాన్ని, ఎదుటివారిని బట్టి వినియోగించాలి. రెస్టారెంట్‌కు వెళ్లి అత్యున్నత స్థాయి గ్రామర్, వొకాబ్యులరీ ఉపయోగిస్తే అవతలి వారికి భాష అర్థం కాదు. అలాగే బిజినెస్ మీటింగ్‌లో కూర్చుని రెస్టారెంట్æ భాష మాట్లాడితే వింతగా చూస్తారు. అందుకే ఎక్కడ ఏ స్థాయి భాష మాట్లాడాలో ఆన్లైన్ పోర్టల్ ‘ఎలిసన్’లో నేర్చుకోవచ్చు. ఇందులో బోధనకు, ఈమెయిల్స్ రాసేందుకు, సాహిత్య అభిలాష ఉన్నవారికి, జర్నలిజంలో ఉన్నవారికి వేర్వేరు వొకాబ్యులరీతో కోర్సులను అందుబాటులో ఉంచారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://alison.com/courses/english
పెర్ఫెక్ట్లీ స్పోకెన్..
ఇంగ్లిష్ నేర్చుకునేందుకు మెచ్చిన కోర్సును ఎంచుకొని పాఠాలు నచ్చితేనే ఫీజు చెల్లించవచ్చని ఈ పోర్టల్ ప్రకటించింది. ముందుగా ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఇందులో ఇంటర్మీడియట్ లెవెల్, అప్పర్ ఇంటర్మీడియట్ లెవెల్, ఎఫెక్టివ్ ఒకాబ్యులరీ స్కిల్స్, బిజినెస్ ఇంగ్లిష్, మీటింగ్ ఇంగ్లిష్ స్కిల్స్, ఎలైట్ స్పీకింగ్ వంటి వివిధ రకాల కోర్సులను అందిస్తోంది. అంతేకాదు.. ప్రి ప్లాన్, స్టూడెంట్ ప్లాన్, ప్రొ ప్లాన్ పేరుతో మూడు విభాగాల్లో ఇంగ్లిష్ లెర్నింగ్ కోర్సులను అందుబాటులో ఉంచింది. మనకు నచ్చిన కోర్సును ఎంచుకొని ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://perfectlyspoken.com

ఇవే కాకుండా కోర్స్ఎరా (coursera) వంటి చాలా మూక్స్ (మాసివ్ ఆన్లైన్ కోర్సెస్) ఇంగ్లిష్ లెర్నింగ్ కోర్సులను అందిస్తున్నాయి. ఎవరికి వారు తమకు నచ్చిన కోర్సును ఎంచుకొని ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు.

%d bloggers like this:
Available for Amazon Prime