`పది` తర్వాత ఉన్నత విద్యావకాశాలు..

పదో తరగతి.. విద్యార్థి జీవితంలో కీలక దశ. దీన్ని విజయవంతంగా దాటాక ఎంపిక చేసుకున్న మార్గమే విద్యార్థి కెరీర్‌ను నిర్దేశిస్తుంది. టెన్త్ తర్వాత ద్యార్థులకు  పాలిటెక్నిక్, ఇంటర్మీడియెట్, ఐటీఐ.. ఇలా వివిధ కోర్సులు అందుబాటులో ఉంటాయి.

పాలిటెక్నిక్ కోర్సులు..

 • పదో తరగతి అర్హతతో సాంకేతిక విద్యను అందుకొని సుస్థిర కెరీర్‌కు మార్గం వేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి పాలిటెక్నిక్ కోర్సులు.
 • మూడేళ్లు/మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి తెలుగు రాష్ట్రాల్లోని ఆయా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్స్ ఏటా నిర్వహించే పాలీసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు)కు హాజరై ర్యాంకు సొంతం చేసుకోవాలి. ఈ ఏడాది ఏపీ పాలిసెట్, టీఎస్ పాలీసెట్‌లకు నోటిఫికేషన్ విడుదలైంది.
 • ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో ఎక్కువ కాలం చదువుకు కేటాయించలేమని భావించే వారికి చక్కని మార్గం పాలిటెక్నిక్ కోర్సులు.
 • పదో తరగతి తర్వాత బీటెక్ కోర్సు పూర్తిచేయాలంటే ఆరేళ్లు అవసరం. అదే పాలిటెక్నిక్ కోర్సు పరంగా మూడేళ్లు/మూడున్నరేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తిచేసుకొని ఉద్యోగంలో స్థిరపడే అవకాశం లభిస్తుంది.
 • సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, మైనింగ్, ఇంస్ట్రుమెంటేషన్ వంటి మూడేళ్ల డిప్లొమా కోర్సులతోపాటు మెటలర్జికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ తదితర మూడున్నరేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు గార్మెంట్ టెక్నాలజీ, క్రాఫ్ట్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ, ఫుట్‌వేర్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ టెక్నాలజీ, సిరామిక్ టెక్నాలజీ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
 • పాలిటెక్నిక్ కోర్సులు పూర్తిచేసినవారు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పొందడంతోపాటు స్వయం ఉపాధి మార్గాలు చూసుకోవచ్చు.
 • చదివిన బ్రాంచ్‌కు అనుగుణంగా సంబంధిత పరిశ్రమల్లో సూపర్‌వైజర్ స్థాయి ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. డిప్లొమా అభ్యర్థులకు ప్రాక్టికల్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో కంపెనీలు వీరికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.
 • పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు.. ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈ-సెట్)లో ర్యాంకు ఆధారంగా లేటరల్ ఎంట్రీ విధానంలో నేరుగా బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు.

ఇంజనీరింగ్‌కు ఎంపీసీ..

 • రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సులో ఎంపీసీ గ్రూప్ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదువుతారు.
 • ఈ గ్రూప్‌లో అకడమిక్‌గా రాణించాలంటే.. కొన్ని సహజ నైపుణ్యాలు అవసరం. మ్యాథ్స్‌పై ఆసక్తితో పాటు కంప్యుటేషనల్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్, పుస్తకాల్లో చదివిన సైన్స్ అంశాలను అన్వయించ గలిగే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్.. ఎంపీసీ.
 • ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల ప్రధాన లక్ష్యం.. ఇంజనీరింగ్. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్ తదితర ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి బీటెక్ కోర్సుల్లో అడుగుపెట్టొచ్చు.
 • ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా.. ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ టెక్నాలజీ, సీఏ/సీఎస్/సీఎంఏ తదితర ప్రొఫెషనల్ కోర్సులు, డైరీ టెక్నాలజీ, లా, డిజైన్ కోర్సులు, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ.. ఇలా అనేక ఉన్నత విద్యావకాశాలకు ఎంపీసీ గ్రూప్ అర్హతగా నిలుస్తోంది.
 • వాస్తవానికి ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులు మెడిసిన్ తప్ప.. ఏ కోర్సులోనైనా చేరేందుకు అర్హులని చెప్పొచ్చు.
 • ఎన్‌డీఏ, ఇండియన్ ఆర్మీ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం వంటి పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా బ్యాచిలర్ డిగ్రీతోపాటు డిఫెన్స్ రంగంలో కెరీర్‌ను కూడా సొంతం చేసుకోవచ్చు.
 • ఇవి కాకుండా భవిష్యత్తులో సైన్స్ రంగంలో స్థిరపడాలనుకుంటే… బీఎస్సీ పూర్తిచేసిన తర్వాత పలు రీసెర్చ్ కోర్సుల్లో చేరేందుకు అవకాశముంది.
 • ఎంపీసీ పూర్తిచేసిన వారు టీచింగ్ కెరీర్‌పై ఆసక్తి ఉంటే డైట్‌సెట్ ద్వారా డీఈడీ కోర్సులో చేరొచ్చు.

బైపీసీ.. మెడిసిన్‌తోపాటు మరెన్నో!

 • బైపీసీ విద్యార్థులు రెండేళ్ల ఇంటర్మీడియెట్‌లో భాగంగా బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదువుతారు.
 • లైఫ్ సెన్సైస్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులకు సరితూగే గ్రూప్ బైపీసీ. వాస్తవానికి బైపీసీ గ్రూప్‌లో చేరే విద్యార్థుల లక్ష్యం.. ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో చేరడం.
 • నీట్‌లో ఉత్తీర్ణత సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశించొచ్చు. అదే విధంగా ఎయిమ్స్ ఎంట్రన్స్, జిప్‌మర్, ఇతర మెడికల్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు అభ్యసించొచ్చు.
 • మెడికల్ కోర్సులతోపాటు వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, బ్యాచిరల్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీహెచ్‌ఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్), బీఫార్మసీ, ఫార్మ్-డీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, బయోటెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ తదితర కోర్సుల్లో చేరొచ్చు.

కామర్స్ కెరీర్‌కు సీఈసీ/ఎంఈసీ :

 • నేటి ఆధునిక ప్రపంచంలో కార్పొరేట్ కొలువులకు కేరాఫ్‌గా నిలుస్తోంది సీఈసీ. రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సులో భాగంగా సీఈసీ విద్యార్థులు.. కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులను అధ్యయనం చేస్తారు.
 • వాస్తవానికి సీఈసీ విద్యార్థులకు ఉన్నత విద్య పరంగా బీకామ్ కోర్సు ముఖ్య మార్గంగా నిలు స్తోంది. బీకామ్ చేస్తూనే చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి జాబ్ గ్యారెంటీ కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించడం ద్వారా ఉజ్వల కెరీర్‌కు మార్గం వేసుకోవచ్చు.
 • కామర్స్ ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేయడం ద్వారా కంపెనీల్లో ఇంటర్నల్ ఆడిటర్స్, స్టాక్ ఆడిటర్స్, ఫైనాన్షియల్ మేనేజర్స్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీస్ వంటి వైట్ కాలర్ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు.
 • సీఈసీ విద్యార్థులు బీకామ్ డిగ్రీ పూర్తిచేసుకున్నాక పీజీ స్థాయిలో ఎంబీఏలో చేరొచ్చు. అలాగే పీజీ స్థాయిలో ఎంకామ్‌లోనూ చేరే అవకాశముంది. ఇటీవల కాలంలో జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా బీకామ్, ఎంకామ్‌ల్లోనూ వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉంటున్నాయి.
 • అకౌంటింగ్ రంగంలో రాణించాలనుకునే విద్యార్థులు ఎంబీఏ ఫైనాన్స్ స్పెషలైజేషన్ ద్వారా ఆ లక్ష్యం నెరవేర్చుకోవచ్చు. ఐఐఎంలు, ఇతర ప్రముఖ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంబీఏ కోసం క్యాట్, మ్యాట్, సీమ్యాట్ తదితర ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంబీఏలో చేరేందుకు బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో నిర్వహించే ఐసెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
 • మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్ గ్రూప్ సబ్జెక్టులుగా ఉండే ఎంఈసీ గ్రూప్‌నకు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోంది. ఈ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. మ్యాథమెటిక్స్ అర్హతగా ప్రవేశం లభించే బీఎస్సీ కోర్సులోనూ.. అటు కామర్స్ అర్హతగా ప్రవేశం లభించే బీకామ్ కోర్సుల్లోనూ అడుగు పెట్టొచ్చు.
 • ఎంఈసీ విద్యార్థులు ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సుల్లో ఇతరులతో పోల్చితే మెరుగ్గా రాణించే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
 • ఇంటర్మీడియెట్ సీఈసీ/ఎంఈసీ విద్యార్థులు సంప్రదా య బీకాంతోపాటు బీఏ కోర్సులు అభ్యసించొచ్చు. వీటితోపాటు లా కోర్సులోనూ చేరే వీలుంది.

పోటీ పరీక్షలకు బెస్ట్.. హెచ్‌ఈసీ

 • రెండేళ్ల ఇంటర్మీడియెట్ కోర్సులో భాగంగా హెచ్‌ఈసీ విద్యార్థులు హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ సబ్జెక్టులను చదువుతారు.
 • హెచ్‌ఈసీ ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్న విద్యార్థులు డిగ్రీ స్థాయిలో బీఏలో చేరొచ్చు. ఇటీవల కాలంలో జాబ్ మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా బీఏ డిగ్రీ ఆధునికత సంతరించుకుంటోంది. బీఏలో కొత్త కాంబినేషన్లు కనిపిస్తున్నాయి.
 • బీఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ వంటి కోర్సులను పూర్తిచేయడం ద్వారా మీడియా రంగంలో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే విద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా స్పెషలైజేషన్‌లో బీఏ పూర్తిచేస్తే బ్యాచిలర్ డిగ్రీతోనే సంబంధిత రంగంలో కెరీర్‌ను సుస్థిరం చేసుకోవచ్చు.
 • ఇంటర్మీడియెట్ హెచ్‌ఈసీ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయ కోర్సు లా. ఇంటర్మీడియెట్ అర్హతతో జాతీయస్థాయిలోని లా యూనివర్సిటీలు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్) ద్వారా బీఏ ఎల్‌ఎల్‌బీలో చేరొచ్చు. ప్రముఖ లా యూనివర్సిటీల్లో ఈ కోర్సు పూర్తిచేసిన వారికి కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.
 • హెచ్‌ఈసీ విద్యార్థులు బీఏ పూర్తిచేశాక.. పీజీ స్థాయిలో ఎంఏ, ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరొచ్చు.
 • హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ (హెచ్‌ఈసీ)పై పట్టు సాధించడం ద్వారా సివిల్స్, గ్రూప్స్ తదితర ఉద్యోగ పోటీ పరీక్షల్లో తేలిగ్గా విజయం సాధించొచ్చు అనేది నిపుణుల అభిప్రాయం.

ఐటీఐ :

 • పదోతరగతి తర్వాత ఒకటి రెండేళ్ల తక్కువ వ్యవధిలోనే సాంకేతిక విద్యలో నైపుణ్యం పొందే అవకాశం కల్పిస్తున్న కోర్సు ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్)లు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ పరిధిలోని ఐటీఐల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిట్టర్, రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషనింగ్ తదితర పదుల సంఖ్యలో రెండేళ్లు, ఏడాది, ఆర్నెళ్ల వ్యవధి గల ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి.
 • ఐటీఐ కోర్సుల్లో ప్రవేశాలకు సాధారణంగా ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వెలువడుతుంది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఒకేషనల్ ట్రైనింగ్ పరిధిలో ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ ఒకేషనల్ ట్రైనింగ్ కౌన్సిల్స్ ప్రవేశ ప్రక్రియలు నిర్వహిస్తాయి.
 • రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వందల సంఖ్యలో ఐటీఐలు ఏర్పాటయ్యాయి.
 • ఐటీఐ పూర్తయ్యాక పారిశ్రామిక సంస్థల్లో ఎంట్రీ లెవల్లో టెక్నీషియన్స్‌గా అడుగుపెట్టొచ్చు. అదే విధంగా అప్రెంటీస్‌షిప్ పూర్తిచేసుకుని ఎన్‌సీవీటీ నిర్వహించే అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ పొందితే ఉద్యోగ సాధనలో మరింత ప్రాధాన్యం లభిస్తుంది.
%d bloggers like this:
Available for Amazon Prime