పది, ఇంటర్‌తోనే సర్కారీ కొలువులెన్నో..!

చదువు ఏదైనా అంతిమ లక్ష్యం.. మంచి ఉద్యోగంలో చేరడమే. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగమైతే కెరీర్‌కు ఢోకా ఉండదు. ఉద్యోగ భద్రత, మంచి వేతనంతో పాటు సమాజంలో గుర్తింపు లభిస్తుంది.

What after 10th&interఉన్నత విద్యఅభ్యసించిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయముంది. వాస్తవానికి పదో తరగతి, ఇంటర్‌తోనే సర్కారీ కొలువు సొంతం చేసుకునే సువర్ణావకాశాలు ఎన్నో ఉన్నాయి. టెన్త్, ఇంటర్ అర్హతతో అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకుందాం..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
పోస్టల్ శాఖ :
పోస్టల్ శాఖలో మెయిల్‌గార్డ్, పోస్టుమ్యాన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పదోతరగతి ఉత్తీర్ణత. ఈ ఉద్యోగాలు సాధించిన వారికి నెలకు రూ.22 వేల వేతనంతో స్థానికంగానే పనిచేసే చక్కటి అవకాశ లభిస్తుంది. రాత పరీక్ష ద్వారా పోస్టుల భర్తీ చేపడతారు.
  • గ్రామీణ్‌ డాక్ సేవక్ (జీడీఎస్)-బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), మెయిల్ డెలివరర్ (ఎండీ), ప్యాకర్ పోస్టులను పదోతరగతిలో సాధించిన మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం భర్తీ చేస్తున్నారు.
వెబ్‌సైట్: www.indiapost.gov.in

పారా మిలిటరీ బలగాలు :
జాతీయస్థాయిలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో-టిబెటిన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) తదితర పారామిలిటరీ విభాగాల్లోనూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 18-23 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
ఎస్‌ఎస్‌సీ :
కేంద్రంలో పెద్దసంఖ్యలో పోస్టుల భర్తీని చేపట్టే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతలతో పలు ఉద్యోగాలకు కేలండర్ ప్రకారం నోటిఫికేషన్‌లు విడుదల చేస్తోంది.
ఎంటీఎస్ :
పదోతరగతి అర్హతతో మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ప్రకటన విడుదల చేస్తుంది. 18-25 ఏళ్ల వయసు అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు ఉంటుంది. ఈ పోస్టులకు ఎంపిక పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరుగుతుంది.
సీహెచ్‌ఎస్‌ఎల్ :
ఇంటర్మీడియెట్ అర్హతతో జాతీయస్థాయిలో భర్తీచేసే ఉద్యోగాల్లో ముఖ్యమైన నోటిఫికేషన్ ఇది. పోస్టల్ అసిస్టెంట్స్/సార్టింగ్ అసిస్టెంట్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, లోయర్ డివిజన్ క్లర్క్స్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్, కోర్టు క్లర్క్స్ తదితర కీలకమైన పోస్టులను భర్తీ చేయడానికి ఎస్‌ఎస్‌సీ కంబైన్‌‌డ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (సీహెచ్‌ఎస్‌ఎల్) నోటిఫికేషన్‌ను ఏటా ఎస్‌ఎస్‌సీ విడుదల చేస్తుంది. 18-27 ఏళ్లలోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష, తర్వాత డిస్క్రిప్టివ్ పేపర్, స్కిల్‌టెస్ట్/కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్టుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.

స్టెనోగ్రాఫర్ :

ఇంటర్మీడియెట్ అర్హతతో వివిధ మంత్రిత్వ శాఖల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, డి పోస్టుల భర్తీని కూడా ఎస్‌ఎస్‌సీ చేపడుతుంది. 18-27 ఏళ్ల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష, తర్వాత స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. స్కిల్ టెస్ట్‌లో అభ్యర్థులకు 10 నిమిషాల వ్యవధిలో ఒక డిక్టేషన్ ఇస్తారు. దీన్ని గ్రేడ్-సి కేటగిరీ అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ భాషల్లో నిమిషానికి 100 పదాలను కంప్యూటర్‌పై స్టెనోగ్రఫీ చేయాల్సి ఉంటుంది. అలాగే గ్రేడ్-డి అభ్యర్థులు ఇంగ్లిష్/హిందీ భాషల్లో నిమిషానికి 80 పదాలను స్టెనోగ్రఫీ చేయాలి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. రాత పరీక్షలో వచ్చే మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
వెబ్‌సైట్: www.ssc.nic.in

యూపీఎస్సీ: ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ
ఇంటర్మీడియెట్ అర్హతతో త్రివిధ దళాల్లో అడుగుపెట్టేందుకు మార్గం.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ (ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ) పరీక్ష. ఇంటర్మీడియెట్ అర్హతతో అటు చదువు, ఇటు ఉద్యోగం… రెండూ పొందే అవకాశం ఈ పరీక్ష ద్వారా లభిస్తుంది. యూపీఎస్సీ ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
విద్యార్హతలు: ఎన్‌డీఏ ఆర్మీవింగ్‌కు ఇంటర్మీడియెట్. ఎన్‌డీఏ ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్; ఇండియన్ నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీస్కీమ్‌కు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియలో మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత సర్వీస్ సెలెక్షన్ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) టెస్ట్/ఇంటర్వ్యూలో విజయం సాధించిన వారిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తయ్యాక ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ విభాగాల్లో ఉన్నత ఉద్యోగాలు పొందొచ్చు.
వెబ్‌సైట్www.upsc.gov.in

ఇండియన్ ఆర్మీ :
టెక్నికల్ ఎంట్రీ స్కీమ్:
ఇంటర్ అర్హతతో.. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (10+2) ద్వారా ఇండియన్ ఆర్మీలో చేరొచ్చు. ఇంటర్మీడియెట్‌లో 70 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు చదివిన అభ్యర్థులు దీనికి అర్హులు. ఇంటర్‌లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి రెండు దశల్లో ఎస్‌ఎస్‌బీ సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఎంట్రీ స్కీమ్ ద్వారా ఎంపికైన వారు శిక్షణ పూర్తయ్యాక.. ఇంజనీరింగ్ పట్టాతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.
క్లర్క్/స్టోర్ కీపర్ ఉద్యోగాలు: ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్ స్థాయిలో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్ చదివుండాలి. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
సోల్జర్ (టెక్నికల్): 45 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి ఉండాలి.
సోల్జర్ (నర్సింగ్ అసిస్టెంట్): 50 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ పూర్తిచేయాలి.
సోల్జర్ జనరల్ డ్యూటీ: పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు 17 1/2 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి.
సోల్జర్ ట్రేడ్స్‌మెన్: పదో తరగతి/ఐటీఐ/8వ తరగతి అర్హతతో 17 1/2 ఏళ్ల నుంచి 23 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in

ఇండియన్ నేవీ :
భారత నావికాదళం ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులకు అకడెమిక్ సర్టిఫికెట్లతోపాటు అద్భుతమైన కెరీర్ అవకాశాలు కల్పిస్తోంది. అవి..
10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్: ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్‌లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఇండియన్ నేవీ ఆఫర్ చేసే 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీమ్‌కు అర్హులు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
సెయిలర్: ఇండియన్ నేవీలో ఎంట్రీ లెవల్ పోస్ట్‌గా పేర్కొనే ఉద్యోగం.. సెయిలర్. ఇంటర్మీడియెట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతోపాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ గ్రూప్‌లో ఏదో ఒకటి తప్పనిసరిగా చదివి ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ) ఉంటుంది.
సెయిలర్-ఆర్టీఫీసర్ అప్రెంటీస్: ఇంటర్‌లో 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణతతో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ గ్రూప్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, మెడికల్ టెస్ట్‌ల ద్వారా
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

ఎయిర్‌ఫోర్స్ :ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇంటర్మీడియెట్ అర్హతతో గ్రూప్-ఎక్స్ టెక్నికల్, గ్రూప్-వై పేరుతో పోస్టుల భర్తీ చేపడుతోంది. ఇంటర్మీడియెట్‌లో 50 శాతం మార్కులతో ఎంపీసీ గ్రూపు ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు పొంది ఉండాలి. గ్రూప్-ఎక్స్ టెక్నికల్ పోస్టులకు మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్/ఐటీలో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విభాగానికి ఎంపికైన అభ్యర్థులను ఎయిర్‌ఫోర్స్‌లోని వివిధ సాంకేతిక విభాగాల్లో ఎయిర్‌మెన్‌గా నియమిస్తారు. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, మెడికల్ టెస్ట్ విభాగాల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://careerindianairforce.cdac.in

ఆర్‌బీఐలో ఉద్యోగాలు :
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. ఆఫీస్ అటెండెంట్ పోస్టులను పదో తరగతి అర్హతతో భర్తీ చేస్తుంది. ఇందుకోసం జాతీయస్థాయిలో పరీక్ష, తర్వాత భాషా నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తుంది. దీనికి 18-25 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. పరీక్షలో రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, న్యూమరికల్ ఎబిలిటీ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గతేడాది నోటిఫికేషన్‌కు సంబంధించిన ప్రశ్నపత్రంలో ఒక్కో విభాగం నుంచి 30 చొప్పున మొత్తం 120 ప్రశ్నలను 120 మార్కులకు ఇచ్చారు. అందుబాటులో ఉన్న సమయం 90 నిమిషాలు.
వెబ్‌సైట్: www.rbi.org.in
%d bloggers like this:
Available for Amazon Prime