ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియెట్ కీలక దశ. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు తొలి అడుగులు పడేది ఇక్కడే. ఇటీవలే ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. రెండేళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాసిన విద్యార్థులు.. ఇప్పుడు తీసుకునే నిర్ణయంపైనే భవిష్యత్తు గమనం ఆధారపడి ఉంటుంది. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ పూర్తి చేసిన వారిలో అధిక శాతం మంది ఇంజనీరింగ్ వైపు.. బైపీసీ విద్యార్థుల్లో ఎక్కువ మంది మెడిసిన్ వైపు ఆసక్తి చూపుతున్నారు.
|
కామర్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ, సీఏ, సీఎస్, సీఎంఏ వంటి కోర్సులు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. సదరు కోర్సులో మెరుగ్గా రాణించి మంచి నైపుణ్యాలు సొంతం చేసుకుంటే.. చక్కటి కెరీర్‌లో స్థిరపడొచ్చు. ఈ నేపథ్యంలో.. ఇంటర్మీడియెట్‌లో గ్రూప్‌ల వారీగా భవిష్యత్తు అవకాశాలపై విశ్లేషణ..
ఎంపీసీతో.. బీఎస్సీ:
ఇంజనీరింగ్‌లో కోరుకున్న కాలేజీలో, బ్రాంచ్‌లో ప్రవేశం లభించకుంటే… ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయం.. సంప్రదాయ డిగ్రీ కోర్సుగా భావించే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ). బీఎస్సీలోనూ పలు కొత్త స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుత జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌కు సరితూగేలా బీఎస్సీలో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కాంబినేషన్లతో గ్రూప్ సబ్జెక్ట్‌లు ఎంచుకునే అవకాశముంది. ఇటీవల కాలంలో ఇంజనీరింగ్‌కు చక్కటి ప్రత్యామ్నాయంగా బీఎస్సీని పలువురు విద్యార్థులు ఎంచుకుంటున్నారు.
ఐఐఎస్సీ–బెంగళూరు.. దేశంలోనే పేరున్న విద్యాసంస్థ.. నాలుగేళ్ల వ్యవధి గల బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(రీసెర్చ్) ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పిస్తోంది. దీనిలో బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మెటీరియల్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ విభాగాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం ఎనిమిది సెమిస్టర్‌లుగా జరిగే ఈ కోర్సులో చివరి సెమిస్టర్‌లో పూర్తిగా రీసెర్చ్ ప్రాజెక్టు చేయాల్సి ఉంటుంది. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై)/జేఈఈ–మెయిన్/జేఈఈ–అడ్వాన్స్‌డ్/నీట్ –యూజీ ద్వారా ప్రవేశం పొందొచ్చు.
మరో ప్రతిష్టాత్మక సంస్థ.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్‌ఈఆర్) క్యాంపస్‌ల్లో.. బీఎస్, బీఎస్–ఎంఎస్(డ్యూయల్ డిగ్రీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన(కేవీపీవై)/జేఈఈ–అడ్వాన్స్‌డ్/స్టేట్ అండ్ సెంట్రల్ బోర్డ్స్ చానల్–ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ద్వారా వీటిలో ప్రవేశించొచ్చు.
ఉద్యోగ అవకాశాలు
ఎంపీసీ పూర్తిచేసిన విద్యార్థులు వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగావకాశాలు దక్కించుకునే వీలుంది. ప్రధానంగా యూపీఎస్సీ–నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) అండ్ నేవల్ అకాడమీ(ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ ద్వారా త్రివిధ దళాల్లో(ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్) ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. అకడమిక్ శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఢిల్లీ నుంచి డిగ్రీ పట్టాలు చేతికందుతాయి. శిక్షణ సమయంలో ఆకర్షణీయ స్టైపెండ్ కూడా లభిస్తుంది. రక్షణ దళాల్లో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ విధానంలోనూ.. ఇంటర్మీడియెట్ ఎంపీసీ విద్యార్థులు అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ(10+2) లెవల్(ఎస్‌ఎస్‌సీ–సీహెచ్‌ఎస్‌ఎల్) ఎగ్జామినేషన్ ద్వారా చిన్న వయసులోనే కేంద్ర ప్రభుత్వ కొలువులను చేజిక్కించుకోవచ్చు. |
ఎంపీసీ గ్రూప్ ఉత్తీర్ణతతో.. సుస్థిర కెరీర్, సమున్నత హోదాను అందించేత్రివిధ దళాల్లో అడుగుపెట్టొచ్చు. ఇందుకోసం యూపీఎస్‌సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ) ఎగ్జామినేషన్‌లో విజయం సాధించాల్సి ఉంటుంది. విజేతలు తాము ఎంపిక చేసుకున్న విభాగం(ఇండియన్ ఆర్మీ/ ఎయిర్‌ఫోర్స్/ నేవల్ అకాడమీ)లో శిక్షణ పూర్తి చేసుకోవాలి. శిక్షణ కాలంలో స్టైఫండ్ సైతం లభిస్తుంది. ఆర్మీ కేడెట్స్‌గా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బీఎస్సీ/బీఏ డిగ్రీ; నేవల్, ఎయిర్‌ఫోర్స్ కేడెట్‌గా శిక్షణ పొందిన వారికి బీటెక్‌తోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకు హోదాతో త్రివిధ దళాల్లో కెరీర్ ప్రారంభమవుతుంది.
డిఫెన్స్‌లో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్:
ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మరో మంచి అవకాశం.. ఇండియన్ ఆర్మీలోని 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్. ఎంపీసీ అభ్యర్థుల అకడెమిక్ మెరిట్ ఆధారంగా నిర్వహించే ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలో ప్రతిభ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు త్రివిధ దళాలలకు చెందిన మిలటరీ అకాడమీలలో శిక్షణ లభిస్తుంది. ఈ శిక్షణ పూర్తి చేసుకుంటే.. బీటెక్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్డ్ ర్యాంకుతో కెరీర్ ప్రారంభించొచ్చు. వీటికోసం ఇండియన్ ఆర్మీ, నేవీలు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి.
బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్(బీవీఎస్సీ), బీఎస్సీ హార్టికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ తదితర కోర్సుల్లో చేరడం ద్వారా.. బైపీసీ విద్యార్థులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కించుకోవచ్చు.
ప్రస్తుత ఆధునిక జీవనశైలి కారణంగా ‘ఆయుష్’ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. అందువల్ల బీహెచ్‌ఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ), బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్), బ్యాచిలర్ ఆఫ్ యునాని మెడిసిన్ అండ్ సర్జరీ(బీయూఎంఎస్); బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్స్(బీఎన్‌వైఎస్) తదితర కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలకు కొదవలేదు.
బీ ఫార్మసీ, ఫార్మా–డి కోర్సులు పూర్తిచేసిన వారికి ఫార్మాస్యూటికల్, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. వీటి తర్వాత డాక్టోరల్ కోర్సులు పూర్తిచేసి రీసెర్చ్ లేబొరేటరీల్లో అత్యున్నత హోదాలు అందుకోవచ్చు.
ఇంటర్మీడియెట్ బైపీసీ తర్వాత గ్రాడ్యుయేషన్ కోర్సులు అనగానే గుర్తుకొచ్చేది.. బీఎస్సీ(బీజెడ్‌సీ–బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ). ప్రస్తుత ఆధునిక అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల గ్రూపు సబ్జెక్టులతో బీఎస్సీ కోర్సు అందుబాటులో ఉంది. బీఎస్సీ (బోటనీ, కెమిస్ట్రీ; న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్), బీఎస్సీ (ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్) వంటి కోర్సులను పలు కళాశాలలు అందిస్తున్నాయి. ఆసక్తిని బట్టి బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ తదితర సబ్జెక్టులున్న గ్రూప్‌లను కూడా ఎంపిక చేసుకోవచ్చు.
బైపీసీ విద్యార్థులు తమ ఆసక్తి మేరకు ఎంచుకున్న కోర్సును అనుసరించి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్), ఎంసెట్ తదితర ప్రవేశ పరీక్షలకు హాజరై అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఫార్మసీ కోర్సులు:బైపీసీ విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఫార్మసీ కోర్సులు. బీఫార్మసీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ(ఫార్మా-డి), డిప్లొమా ఇన్ ఫార్మసీ.. ఇలా మూడు స్థాయిల కోర్సులకు బైపీసీ ఉత్తీర్ణులు అర్హులు. బీఫార్మసీ, ఫార్మా-డికి ఎంసెట్‌లో ర్యాంకు ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇవి పూర్తి చేసుకున్న వారికి ఫార్మాస్యుటికల్ కంపెనీలు, క్లినికల్ రీసెర్చ్ సంస్థల్లో ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగాలు లభిస్తాయి.
విభిన్న కోర్సులు: బైపీసీ విద్యార్థులకు మరెన్నో ప్రత్యామ్నాయ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ, డైరీటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, ఫిషరీస్, ఆక్వాకల్చర్ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీ (బీజెడ్‌సీ)తోపాటు బయోకెమిస్ట్రీ, బయోఫిజిక్స్,బయోఇన్ఫర్మాటిక్స్, మైక్రోబయాలజీ తదితర లైఫ్ సెన్సైస్ కోర్సుల్లో చేరే వీలుంది.
మెడికల్, పారామెడికల్: బైపీసీ విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి, బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ సెన్సైస్ తదితర మెడికల్ కోర్సులనూ ఎంచుకోవచ్చు. వీటితోపాటు.. పారామెడికల్ కోర్సులుగా పేర్కొనే ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఆప్టోమెట్రీ, మెడికల్‌ల్యాబ్ టెక్నీషియన్‌లలో డిప్లొమా, పీజీ డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేస్తే.. ప్రభుత్వ వైద్య విభాగాలతోపాటు, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా.. నర్సింగ్ కూడా చక్కటి అవకాశాలు కల్పిస్తోంది. ప్రస్తుతం బైపీసీ ఉత్తీర్ణులకు డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ స్థాయిల్లో నర్సింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
కెరీర్ అవకాశాలు: బైపీసీ విద్యార్థులకు ప్రత్యేకంగా ఉన్న కెరీర్ అవకాశాలను పరిశీలిస్తే.. బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది. దీనిద్వారా నాలుగేళ్లపాటు శిక్షణనిచ్చి బీఎస్సీ నర్సింగ్ సర్టిఫికెట్‌తోపాటు ఇండియన్ ఆర్మీకి చెందిన హాస్పిటల్స్‌లో పర్మనెంట్ హోదాలో ఉద్యోగం ఖరారు చేస్తుంది.
సీఈసీ/ఎంఈసీ….
సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్(సీఈసీ); మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్(ఎంఈసీ) గ్రూపుల్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారికి ఉన్నత విద్య, ఉపాధి మార్గాలకు కొదవలేదు. అన్ని రంగాలూ ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉండడం, ఆర్థిక వనరుల సక్రమ నిర్వహణపైనే కంపెనీల విజయం ఆధారపడి ఉండటంతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కామర్స్ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుత జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న బీకామ్, ఎంబీఏ కోర్సులు కూడా ఉన్నత కెరీర్‌కు దారి చూపుతున్నాయి. విద్యార్థులు ఏ కోర్సులో చేరినా.. ఉజ్వల కెరీర్ సొంతం కావాలంటే.. నైపుణ్యాలను పెంచుకోవాలి
సీఏ, సీఎస్, సీఎంఏ: కామర్స్ విభాగంలో ప్రొఫెషనల్ కోర్సులు.. చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కంపెనీ సెక్రటరీ(సీఎస్), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ(సీఎంఏ). ఇతర గ్రూపుల వారూ ఈ కోర్సుల్లో చేరొచ్చు. సీఈసీ, ఎంఈసీ గ్రూపుల విద్యార్థులకు ఈ కోర్సులు మరింత అనుకూలమనే అభిప్రాయం ఉంది. ప్రతి కోర్సులోనూ ఉండే మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. కార్పొరేట్ సంస్థల్లో అకౌంటింగ్, ఫైనాన్స్, జనరల్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ విభాగాల్లో ఆఫీసర్ హోదాతో కెరీర్ ప్రారంభించొచ్చు.
ఇంటర్ సీఈసీ/ఎంఈసీ విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో బీకామ్ కోర్సు అందుబాటులో ఉంటుంది. బీకామ్(కంప్యూటర్ అప్లికేషన్స్) వంటి కోర్సులు పూర్తిచేయడం ద్వారా ఉన్నతవిద్య/ఉద్యోగం పరంగా మంచి అవకాశాలుంటాయి.
- బీకాం: ఉన్నత విద్య పరంగా సీఈసీ విద్యార్థులకు మొదట గుర్తొచ్చేది బ్యాచిలర్ ఆఫ్ కామర్స్(బీకామ్). కామర్స్, అకౌంటింగ్ వంటి కాంబినేషన్లతోపాటు జాబ్ మార్కెట్ అవకాశాలకు తగ్గట్లు.. ఈ-కామర్స్, టాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీస్, అడ్వర్టయిజింగ్ అండ్ మార్కెటింగ్ వంటి విభిన్న స్పెషలైజేషన్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
- పొఫెషనల్ కోర్సులు: సీఈసీ విద్యార్థులు కామర్స్ విభాగంలో ప్రొఫెషనల్ కోర్సులుగా పేర్కొనే చార్టర్డ్ అకౌంటెన్సీ(సీఏ), కాస్ట్ అకౌంటెన్సీ(సీఎంఎస్), కంపెనీ సెక్రటరీ(సీఎస్) కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. వీటిని పూర్తి చేయడం ద్వారా కార్పొరేట్ కొలువులు ఖాయం చేసుకోవచ్చు. ఉన్నత విద్య పరంగా ఎంబీఏ వంటి మేనేజ్‌మెంట్ కోర్సులు, ఎంకామ్ వంటి పీజీ కోర్సులూ చేసే అవకాశముంది.
ఉద్యోగావకాశాలు: కామర్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన వారికి తక్షణం ఉపాధి కల్పించే అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ కోర్సులు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ట్యాలీ, వింగ్స్, ఫోకస్, పీచ్‌ట్రీ వంటి అకౌంటింగ్ సాఫ్ట్‌వేర్ కోర్సుల సర్టిఫికెట్స్ సొంతం చేసుకుంటే.. సంస్థల్లో జూనియర్ స్థాయిలో అకౌంటెంట్స్‌గా కొలువు సాధించే అవకాశం ఉంది.
జీఎస్‌టీతో జాబ్స్: ప్రస్తుతం జీఎస్‌టీ అమలవుతున్న నేపథ్యంలో కామర్స్ విద్యార్థులకు ఇది కూడా కలిసొచ్చే అంశంగా మారుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని స్వల్పకాలిక కోర్సులు పూర్తి చేయడం ద్వారా ఆయా కంపెనీల్లో జీఎస్‌టీ కన్సల్టెంట్స్‌గా వ్యవహరించొచ్చు.
హెచ్‌ఈసీ.. పోటీ పరీక్షలకు మేటి
హెచ్‌ఈసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఉన్నత విద్య పరంగా బీఏలో చేరొచ్చు. బీఏలో చదివే సబ్జెక్టులపై పట్టుసాధించడం ద్వారా పలు పోటీ పరీక్షల్లో ముందుండేందుకు ఆస్కారం లభిస్తుంది. అత్యున్నత సివిల్ సర్వీసెస్ నుంచి గ్రూప్-4 వరకూ.. అన్ని పోటీ పరీక్షల్లోనూ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర సబ్జెక్ట్‌లు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని హెచ్‌ఈసీ విద్యార్థులు ఇంటర్మీడియెట్‌తోపాటు బీఏ స్థాయిలోనూ చదువుతారు. కాబట్టి హెచ్‌ఈసీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిగతా అభ్యర్థులతో పోల్చితే కొంత ముందంజలో నిలుస్తారని చెప్పొచ్చు.
- బీఏలో ఆధునికత: బీఏ కోర్సు కూడా ఆధునికత సంతరించుకుంటోంది. బీఏలో మాస్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ వంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో చేరడం ద్వారా మీడియా, మార్కెటింగ్ విభాగాల్లో ఉపాధి పొందొచ్చు.
ప్రస్తుతం ఇంటర్మీడియెట్ అర్హతగా సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులు.. తాము ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు దీటుగా రాణించలేమని ఆందోళన చెందక్కర్లేదు. ఎందుకంటే.. యూజీసీ అమల్లోకి తెచ్చిన సీబీసీఎస్(చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) విధానం ప్రకారం.. బ్యాచిలర్ డిగ్రీలో ఏదైనా ఒక గ్రూప్‌లో చేరిన అభ్యర్థులు తమ మేజర్ సబ్జెక్ట్‌తోపాటు అందుబాటులో ఉన్న మైనర్ సబ్జెక్ట్‌లను కూడా చదవొచ్చు. తద్వారా జాబ్ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు అందిపుచ్చుకోవచ్చు. మైనర్ సబ్జెక్టులను ఎంపిక చేసుకునేటప్పుడు ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలి. కారణం.. వీటికి కూడా క్రెడిట్స్ ఇచ్చే విధానం అమల్లో ఉంది. కేవలం మార్కెట్ డిమాండ్ కోణాన్ని పరిగణనలోకి తీసుకుని, ఆసక్తి లేకున్నా సబ్జెక్టులను ఎంపిక చేసుకుంటే వాటితో రాణించడం కష్టమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ప్రస్తుతం సంప్రదాయక డిగ్రీ కోర్సుల్లోనే పలు వినూత్న కాంబినేషన్లతో గ్రూప్ సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎంచుకునే క్రమంలో భవిష్యత్తు అవకాశాలను బేరీజు వేసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.
ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ :ఇంటర్మీడియెట్ అర్హతతోనే కోర్సులో చేరి.. పీజీ సర్టిఫికెట్‌తో బయటికి వచ్చే అవకాశం కల్పించే ప్రోగ్రామ్‌లు.. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్. వాస్తవానికి అన్ని యూనివర్సిటీల్లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాలని 2008లోనే జాతీయ స్థాయిలో నిర్ణయించారు. క్రమేణా వీటిని అందిస్తున్న వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అమల్లోకి వస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ.. పీజీ స్థాయిలో కొత్త సబ్జెక్ట్‌లను కూడా ఆఫర్ చేస్తున్నారు.
అర్హత… ఇంటర్ :
ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులతో విద్యార్థులకు ప్రధాన ప్రయోజనం.. ఇంటర్మీడియెట్‌తోనే పీజీలో ప్రవేశం పొందే అవకాశం ఉండటం. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల వల్ల విద్యార్థులకు కలిగే మరో ఉపయోగం… సమయం ఆదా అవడం. ఉదాహరణకు టెక్నికల్ కోర్సుల పరంగా ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ ప్రోగ్రామ్ వ్యవధి అయిదేళ్లు. అదే సంప్రదాయ విధానంలో.. బీటెక్ నాలుగేళ్లు, ఆ తర్వాత ఎంటెక్‌కు మరో రెండేళ్లు చదవాలి. అంటే.. రెగ్యులర్ విధానంలో బీటెక్, ఎంటెక్ పూర్తిచేయాలంటే ఆరేళ్లు పడుతుంది. ఇంటిగ్రేటెడ్ పీజీ ద్వారా ఐదేళ్లలోనే అటు బీటెక్ పట్టాతోపాటు ఇటు ఎంటెక్ సర్టిఫికెట్ కూడా చేతికి అందుతుంది. ఎంతో విలువైన ఒక ఏడాది సమయం కలిసొస్తుంది. ఇది వారు తమ కెరీర్ పరంగా ముందంజలో నిలిచేందుకు అవకాశం కల్పిస్తుంది.
రెండు డిగ్రీలు :
అయిదేళ్ల వ్యవధి ఉండే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల్లో అడుగుపెట్టిన విద్యార్థులు.. తొలి మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్లు పీజీ స్థాయి సబ్జెక్టులను అభ్యసించాలి. తొలి మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను చదివిన విద్యార్థులు.. పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్, అయిదేళ్ల తర్వాత పీజీ సర్టిఫికెట్ లభిస్తుంది. మూడేళ్ల తర్వాత పీజీ ప్రోగ్రామ్‌లో కొనసాగడం ఇష్టం లేకపోతే.. బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ అందుకోవచ్చు.
బీటెక్+ఎంబీఏ :
ప్రస్తుతం మన దేశంలో ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల పరంగా మేనేజ్‌మెంట్ కోర్సులు ముందంజలో నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు బీటెక్ పూర్తికాగానే.. ఎంబీఏ వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే పలు ఇన్‌స్టిట్యూట్‌లు, బీస్కూల్స్‌లో బీటెక్+ఎంబీఏ పేరుతో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లకు శ్రీకారం చుట్టాయి. ఫలితంగా విద్యార్థులకు ఒకవైపు టెక్నికల్ స్కిల్స్, మరోవైపు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు రెండూ లభిస్తున్నాయి.
సైన్స్ కోర్సులు :
సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీలు.. సైన్స్ విభాగంలో.. ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ+ఎంఎస్సీ వంటి ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా విద్యార్థులకు ఐ.ఎమ్మెస్సీ పేరుతో సర్టిఫికెట్ లభిస్తోంది. ఈ విధానంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు.. సదరు యూనివర్సిటీలోనే పీహెచ్‌డీ ప్రవేశంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ విధానం అమలవుతోంది.
సోషల్ సెన్సైస్ :
ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల పరంగా క్రమేణా క్రేజ్ పెరుగుతున్న మరో విభాగం.. సోషల్ సెన్సైస్. సంప్రదాయ బీఏ కోర్సుల ఔత్సాహికులు.. భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. టిస్, జేఎన్‌యూ వంటి ప్రముఖ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు.. ఇంటిగ్రేటెడ్ ఎంఏ పేరుతో పలు ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో ఎంఏ స్థాయిలో సోషల్ వర్క్, సోషియాలజీ, రూరల్ డెవలప్‌మెంట్, ఎన్‌జీవో మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లు అందిస్తున్నాయి.
అయిదేళ్ల ‘లా’ కోర్సు :
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు కెరీర్ పరంగా చక్కటి బాట వేస్తున్న మరో కోర్సు.. అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ. ఇంటర్మీడియెట్ అర్హతతో లాసెట్, క్లాట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత ఆధారంగా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, నేషనల్ లా యూనివర్సిటీల్లో న్యాయశాస్త్ర పట్టా చేతికందుతుంది. ఇటీవల కాలంలో విద్యార్థుల వైపు నుంచి కూడా ఈ కోర్సుల పట్ల ఆదరణ పెరుగుతోంది.
ఐఐటీలు, ఐఐఎంల్లోనూ..
టెక్నికల్, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అంతర్జాతీయంగా మంచి పేరున్న ఐఐటీలు, ఐఐఎంలు కూడా పలు ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాయి.
-
ఐఐటీ-చెన్నై 2006లోనే ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సును అందుబాటులోకి తెచ్చింది.
- ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
- ఐఐటీ-కాన్పూర్, రూర్కీలు కూడా ఈ తరహా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
- ఐఐఎం-ఇండోర్ కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ పేరుతో ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రత్యేక కోర్సును నిర్వహిస్తోంది.
- సైన్స్ కోర్సులకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఐఐఎస్‌ఈఆర్‌ల్లో సైతం బీఎస్+ఎంఎస్ పేరుతో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది.
ప్రముఖ యూనివర్సిటీలు :
- సెంట్రల్ యూనివర్సిటీలు
- ఐఐటీ-ఖరగ్‌పూర్, చెన్నై, రూర్కీ
- ఐఐఎం-ఇండోర్
- ఢిల్లీ యూనివర్సిటీ
- బిట్స్-పిలానీ
- ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ
- నేషనల్ లా యూనివర్సిటీస్
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్‌తో విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే వారు పీజీ స్థాయిలో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్లకు సంబంధించిన కోర్సులను చదివే వెసులుబాటు లభిస్తుంది. అలాగే ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోణంలో ఆలోచిస్తే.. బ్యాచిలర్ స్థాయి నుంచే విద్యార్థుల్లో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ పెరుగుతుంది.
ఇంటర్ తర్వాత లా, పర్యాటకం, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్/స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ అండ్ డైటీటిక్స్, ఫ్యాషన్ డిజైన్/టెక్నాలజీ, మాంటిస్సోరి టీచింగ్, లైబ్రరీ సైన్సెస్, ఇంటీరియర్ డిజైనింగ్, హోంసైన్స్, ఫారెన్ లాంగ్వేజెస్, మేనేజ్‌మెంట్, లాజిస్టిక్స్ అండ్ సప్లయ్‌చైన్ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్,ఈవెంట్ మేనేజ్‌మెంట్, ఫైన్‌ఆర్ట్స్ తదితర విభాగాలు కూడా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు ఆసక్తి, ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ కెరీర్ అవకాశాలు తదితరాలను పరిగణనలోకి తీసుకొని కోర్సు ఎంపికపై నిర్ణయం తీసుకోవాలి.
ఇంటర్మీడియెట్ తర్వాత విద్యార్థులు తమ గ్రూపులకు అనుగుణంగా పలు బ్యాచిలర్ కోర్సుల్లో చేరొచ్చు. ఎంపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్‌లో చేరి మంచి అవకాశాలు అందుకోవచ్చు. ఆసక్తి ఉంటే రీసెర్చ్ దిశగా అడుగులు వేయొచ్చు. బైపీసీ అభ్యర్థులు మెడికల్ కోర్సుల్లో చేరితే వైద్య రంగంలో స్థిరపడొచ్చు. టాప్ కాలేజీలో, నచ్చిన బ్రాంచిలో సీటు సాధించాలంటే.. ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించాలి. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జేఈఈ, నీట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. విద్యార్థులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో సివిల్ సర్వీసెస్‌తోపాటు రాష్ట్ర స్థాయి గ్రూప్స్ తదితర పోటీ పరీక్షల్లోనూ సత్తా చాటొచ్చు. ఎంచుకునే కోర్సు ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్, అనలిటికల్ నైపుణ్యాలు పెంచుకుంటే మంచి కెరీర్ సొంతం అవుతుంది.
‘లా’: హెచ్‌ఈసీ విద్యార్థులకు అందుబాటు ఉన్న ముఖ్య కోర్సు.. లా. జాతీయ స్థాయిలో నిర్వహించే క్లాట్, రాష్ట్ర స్థాయిలో జరిపే లాసెట్ ద్వారా అయిదేళ్ల బీఏఎల్‌ఎల్‌బీ కోర్సులో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది. లా కోర్సులో కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, కార్పొరేట్ లా తదితర కొత్త సబ్జెక్టులు ప్రవేశపెడుతున్నారు. ఆయా సబ్జెక్టుల అధ్యయనం ద్వారా ‘లా’ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు.. న్యాయవాద వృత్తికే పరిమితం కాకుండా.. కార్పొరేట్ కొలువులు సైతం సొంతం చేసుకునే వీలుంది.
You must log in to post a comment.