జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఎవరు? అనేక సార్లు అరెస్టయిన ఫ్లాయిడ్ కోసం అమెరికా ఎందుకు రగులుతోంది?

జార్జ్ ఫ్లాయిడ్

తెల్లజాతి పోలీసు కాళ్ల కింద నలిగి చనిపోయి, తన మరణంతో అమెరికా అంతటినీ కదిలించక ముందే.. ఆఫ్రో-అమెరికన్ అయిన జార్జి ఫ్లాయిడ్ తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు.
అతని జీవితంలో ఘనతలున్నాయి. 1992లో హ్యూస్టన్‌లో ఉంటున్నప్పుడు యేట్స్ స్కూల్‌ లయన్స్ జట్లు తరఫున టెక్సాస్‌ స్టేట్ ఫుట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌లో ఫ్లాయిడ్‌ పాల్గొన్నారు. రన్నర్స్ అప్‌ టీమ్‌లో అతను సభ్యుడు.
అతని జీవితంలో పతనాలు కూడా ఉన్నాయి. 2007 సంవత్స్రరంలో ఒక దొంగతనం కేసులో ఫ్లాయిడ్‌ ఐదు సంవత్సరాల జైలు శిక్షను కూడా అనుభవించారు.
మిన్నీపోలిస్‌ నగరంలో మే 25న ఒక పోలీస్‌ కాళ్ల కింద నలిగి మరణించే నాటికి అతను ఓ సాదాసీదా అమెరికన్ పౌరుడు. వ్యక్తిగతంగా, సామాజికంగా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ మెరుగైన జీవితాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి. దేశంలో లక్షమందికి పైగా చంపి, నాలుగు కోట్ల మందిని నిరుద్యోగులుగా చేసిన ఒక మహమ్మారి అమెరికాను చుట్టేస్తున్న సమయంలో ఆయన హత్యకు గురయ్యారు.
టెక్సాస్‌లోని హ్యూస్టన్‌ నగరంలో, నల్లజాతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ పుట్టి పెరిగారు. సిటీ సెంటర్‌కు ఈ ప్రాంతం దక్షిణ భాగంలో ఉంటుంది. ప్రముఖ సింగర్‌, లిరిక్‌ రైటర్‌ బెయాన్స్ కూడా అక్కడే పెరిగారు. కెనడాకు చెందిన ప్రముఖ ర్యాపర్‌ డ్రేక్‌ కూడా ఈ ప్రాంతంలోని వారి సంగీతాభిరుచిని తరచూ మెచ్చుకునేవారు. 1990లలో హూస్టన్‌లో ఉన్నప్పుడు ఫ్లాయిడ్‌ కూడా హిప్‌-హాప్‌ గ్రూపుల్లో తిరుగుతూ స్పిట్‌బార్స్‌లో పాలు పంచుకునేవారని చెబుతారు.
జార్జ్ ఫ్లాయిడ్
చాలా అమెరికన్‌ నగరాలలాగే హ్యూస్టన్‌లో కూడా పేదరికం, జాతి వివక్ష, ఆర్ధిక అసమానతలు కనిపిస్తాయి. ఫ్లాయిడ్‌ నివసించే మూడో వార్డులో ఇళ్ల స్థలాల విషయంలో తరచూ ఉద్రిక్తతలు, హింస చోటు చేసుకుంటుంటాయి. ”ఇక్కడికి వేరే ప్రాంతం వాళ్లను తీసుకొస్తే…”అమ్మో నేనింత పేదరికాన్ని ఎప్పుడూ చూడలేదని ఆశ్చర్యపోతారు” అని రోనీ లిల్లార్డ్ బీబీసీతో అన్నారు.
”ఇక్కడి వాళ్లలో చాలామంది ఇప్పటికీ 1920లో కట్టించిన చెక్క ఇళ్లలో నివాసం ఉంటుంటారు. పేదరికం నుంచి ఇక్కడ ఎవరూ తప్పించుకోలేరు” అని రికాన్సైల్‌ పేరుతో ర్యాపర్‌ షోలు నిర్వహించే లిల్లార్డ్ చెబుతున్నారు. క్యూనీ హోమ్స్ పేరుతో ఉండే కాలనీలో నివాసముంటున్నఫ్లాయిడ్‌ పేరు చుట్టుపక్కల చాలామందికి తెలుసు. క్యూనీ హోమ్స్‌ అంటే ఇటుకతో కట్టిన భవనాలు అని అర్ధం. ఆ బిల్డింగ్‌లలో ఉండేవారిని ‘బ్రిక్‌ బాయ్స్‌’ అంటారు.
ఆరడుగుల, ఆరంగుళాల పొడవున్న ఫ్లాయిడ్‌కు అథ్లెటిక్స్‌ కోసం పుట్టినట్లు కనిపిస్తారు. టీనేజ్‌లో ప్లాయిడ్‌ను స్నేహితులు ‘జెంటిల్‌ జెయింట్‌’ అని పిలిచేవారు. బాస్కెట్‌బాల్‌, అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆడటంలో ఆయన దిట్ట. ”నేను చాలా ఆశ్చర్యపోయేవాడిని, 12 సంవత్సరాల వయసులోనే ఫ్లాయిడ్‌ 6 అడుగుల 2 అంగుళాల పొడవు ఉండేవారు” అని అతని చిన్ననాటి స్నేహితుడు, అతని టీమ్‌మేట్‌ జోనాథన్‌ వీల్‌ స్థానిక మీడియాతో అన్నారు. ”అంత పొడవున్న వ్యక్తిని అంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు” అని చెప్పారు.
జార్జ్ ఫ్లాయిడ్
జాన్‌ యేట్స్‌ హైస్కూలు ఫుట్‌బాల్‌ జట్టుకు ఆడిన ఫ్లాయిడ్‌ 88వ నంబర్‌ జెర్సీ ధరించేవారు. ఆ తర్వాత సౌత్‌ ఫ్లోరిడా స్టేట్‌ కాలేజ్‌ బాస్కెట్‌బాల్‌ జట్టుకు ఎంపికయ్యారు. 1993 నుంచి 1995 వరకు అక్కడే జార్జ్‌ అక్కడే చదువుకున్నారని సీఎన్‌ఎన్‌ తెలిపింది. కొన్నాళ్ల తర్వాత టెక్సాస్‌ తిరిగి వచ్చి కింగ్స్‌విల్లేలోని ఏ అండ్‌ ఎమ్ యూనివర్సిటీలో చేరారు. కానీ డిగ్రీ పూర్తి చేయలేదు.
ఆ తర్వాత కొన్నాళ్లకు ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. డ్రగ్స్‌ సరఫరా, దొంగతనం కేసుల్లో అనేకసార్లు అరెస్టయ్యారు ఫ్లాయిడ్‌. మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డ నేరంపై 2007లో కోర్టు ఫ్లాయిడ్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ”జైలు నుంచి విడుదలయ్యాక, మంచి మనిషిగా మారే క్రమంలో జార్జ్‌, స్థానికంగా పనిచేసే మత సంస్థ రిసరెక్షన్‌ హ్యూస్టన్‌లో చేరారు” అని అతని చిన్ననాటి మిత్రుడు లిల్లార్డ్‌ వెల్లడించారు. ” తాను మారడమే కాదు…తన చుట్టూ ఉన్న తన కమ్యూనిటీ వాళ్ల గురించి కూడా ఆలోచించేవారు” అని లిల్డార్డ్‌ అన్నారు.
తుపాకీ హింసను విడనాడాలంటూ ఫ్లాయిడ్‌ ఇచ్చిన సందేశపు వీడియోను 2017లో చిత్రీకరించినట్లు భావిస్తున్నారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ”మీరు ఇంటికి రండి” అంటూ చెడుదారి పట్టిన యువతకు సందేశం ఇచ్చారు ఫ్లాయిడ్‌. క్రైస్తవ మత సంబంధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి 2018లో ఫ్లాయిడ్‌ మిన్నెసోటాకు వెళ్లినట్లు అతని కుటుంబం హ్యూస్టన్‌ క్రానికల్‌ పత్రికకు వెల్లడించింది. ”సరికొత్త జీవితం ప్రారంభించాలనుకున్నారు” అని అతని క్లాస్‌మేట్ క్రిస్టోఫర్‌ హ్యారిస్‌ అన్నారు. ” తనలో వచ్చిన మార్పుపట్ల అతను చాలా సంతోషంగా ఉన్నారు” అని హ్యారిస్‌ వెల్లడించారు.
జార్జ్ ఫ్లాయిడ్
క్రైస్తవ మిషనరీ ‘సాల్వేషన్‌ ఆర్మీ’లో ప్లాయిడ్‌ కొన్నాళ్లు సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. కొన్నాళ్లు లారీడ్రైవర్‌గా, ఓ డ్యాన్స్‌ క్లబ్‌లో బౌన్సర్‌గా కూడా పని చేశారు. అక్కడ ఆయన్ను ‘బిగ్‌ ఫ్లాయిడ్‌’ అని పిలిచేవారు. కోవిడ్‌ -19 సంక్షోభం కారణంగా వ్యాపారాలు దెబ్బతినడంతో చాలామంది అమెరికన్లలాగానే ఫ్లాయిడ్‌ కూడా ఇబ్బందుల్లో పడ్డారు.
అరెస్టయిన రోజున ఆయన 20 డాలర్ల నకిలీ నోటుతో సిగరెట్లు కొనడానికి ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ఫ్లాయిడ్‌ మరణంపై మొదలైన నిరసనలు అమెరికావ్యాప్తంగా హింసకు కారణమయ్యాయి. వివిధ నగరాల్లో వందలమందిని పోలీసులు అరెస్టు చేశారు. పలు రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్‌ పోలీసులు రంగంలోకి దిగి శాంతి భద్రతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
”ఒక మంచి మనిషిని చంపేశారు” అని చెప్పిన ప్లాయిడ్‌ మిత్రుడు లిల్లార్డ్‌ కూడా నిరసన ప్రదర్శనల్లో హింసపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ” అతను క్షమాపణలకు కరిగిపోయే వ్యక్తి. ప్రజల మనిషి” అన్నారు లిల్లార్డ్‌. ”తాను చనిపోక ముందు కూడా తనలాంటి చాలామంది కష్టాల్లో ఉన్నారని అతనికి తెలుసు” అని లిల్లార్డ్‌ వ్యాఖ్యానించారు. ”ఈ ఆందోళన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను దాటి పోయింది. ఇది ఒకరకంగా అమెరికా మీద అమెరికన్ల ఆక్రోశం” అని అభివర్ణించారు లిల్లార్డ్‌.
%d bloggers like this:
Available for Amazon Prime