ఏరువాక పూర్ణిమ పండుగ

ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే దున్నడానికి ప్రారంభమనీ అర్థం. వర్ష ఋతువులో వచ్చే ‘జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి’ ని తెలుగువారు ఏరువాక పూర్ణిమ గా జరుపుకుంటారు. వైశాఖ మాసం పూర్తై జ్యేష్ఠం వచ్చే సరికి వానలు పడటం మొదలౌతాయి, ఎంతలేదన్నా పౌర్ణమి లోగా చిన్న జల్లైనా కొడుతుంది. దాంతో భూమి మెత్తబడుతుంది. తొలకరి జల్లుల రాకతో రైతులు ఆనందోత్సాహాల మధ్య అరక దున్నటంతో పొలం పనులు మొదలౌతాయి. వ్యవసాయానికి కావలసిన వర్షాన్ని కురిపిస్తాడని భావించే ఇంద్రుణ్ని పూజించడం, నాగలిని పూజించి వ్యవసాయ పనులు మొదలుపెట్టడం జ్యేష్ఠ పూర్ణిమ పర్వదిన ముఖ్యాంశాలు.
ఈ రోజున రైతులు వ్యవసాయ పనిముట్లన్నింటినీ శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ అద్ది పూజ చేస్తారు. అలాగే ఎద్దులను కడిగి చక్కగా అలంకరిస్తారు. ఆ పైన పొంగలిని ( కొన్ని ప్రాంతాల్లో పులగం ) వండి వర్షానికి అధిదేవత అయిన ఇంద్రుణ్ని పూజించి నివేదన చేస్తారు. ఆ తరవాత ఆ పదార్థాలను ఆవులకు, ఎడ్లకు తినిపిస్తారు. ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను, నూనెలను తాగిస్తారు. కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్ష్యాలు తినిపిస్తారు. అనంతరం రైతులందరూ సామూహికంగా ఎద్దులను తోలుకుని వారి పొలాలకు వెళ్లి దుక్కి దున్నుతారు (ఇప్పుడు ఆ ఎద్దులు చోటులో “ట్రాక్టర్లు” వచ్చాయి).
ఈ పండుగనాడు చేసే మరో ముఖ్యమైన వేడుక ఎడ్ల పందేలు. ఎద్దులను అలంకరించి పరిగెత్తిస్తారు. అంతేకాకుండా ఎద్దులకు బండలు (బరువైన రాళ్లు) కట్టి పరుగులు తీయిస్తారు. దీన్ని బండలాగుడు పోటీ అంటారు.
ఏరువాక పౌర్ణమిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పాటిస్తారు. కర్నాటక ఈ ఉత్సవాన్ని ‘కారణి హబ్బ’ అని పిలుస్తారు. పాడిపంటలకు, పొలం పనులకు ఎలాంటి ఆటంకాలు ఎదురుకావద్దని కోరుకుంటూ దున్నటం మొదలుపెడతారు. మన వద్ద ఏరువాక పూర్ణిమగా పిలిచే ఈ పండుగకు ‘కృషిపూర్ణిమ’, ‘హలపూర్ణిమ’, ‘ఉద్‌వృషభయజ్ఞం’ అనే పేర్లతో కూడా పిలవబడుతుంది.
ఏరువాక పౌర్ణమి రోజునే ఇళ్ళలో పనిచేసే జీతగాళ్ళ సంవత్సరం ముగిసి కొత్త సంవత్సరం మొదలవుతుంది. తెలుగు సినిమాల్లో కూడా ఏరువాక ప్రముఖంగా కనిపించింది. “రోజులు మారాయి” చిత్రం కోసం ఏరువాక నేపథ్యంలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు “ఏరువాక సాగారో రన్నో చిన్నన్న… నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా…” అని పాట కూడా రాశారు.
అయితే, పొలం దున్నడానికి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, ఋతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు… ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక కేలెండర్‌ను ఏర్పరిచారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా… ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.
%d bloggers like this: