తుపాన్లు

తుపాన్లు ఎందుకు, ఎలా ఏర్పడతాయి?
 
సముద్రపు నీరు ఆవిరైనప్పుడు అక్కడి గాలి వేడెక్కుతుంది. వేడెక్కువైన గాలి తేలిక పడి పైకి వెళ్లిపోతుంది. దీంతో అక్కడ ఖాళీ (వ్యాక్యూమ్) ఏర్పడి పీడనం తగ్గుతుంది. అధిక పీడనం ఉన్న చోట నుంచి తక్కువ పీడనం ఉన్న చోటుకు గాలి ప్రవహిస్తుంది. పీడనం తగ్గేకొద్దీ గాలి వేగం పెరుగుతుంది. సముద్ర వాతావరణంలో ఈ అలజడి ఏర్పడినప్పుడు, అక్కడ పీడనం తగ్గిపోతుంది. ఈ మొత్తం ప్రక్రియను ద్రోణి (టర్ఫ్) అంటారు. ఇది స్థిరంగా ఉండకుండా వందల కిలోమీటర్లు పాకుతుంది. ఇదే తుపానుకు తల్లి.
పీడనం తగ్గే కొద్దీ తీవ్రత పెరుగుతుంది. ఆ పీడనం తగ్గే కొద్దీ దాని పేరు మారుతూ వస్తుంది. ‘ద్రోణి’లో పీడనం తగ్గితే అల్ప పీడనం (లో ప్రెజర్) అవుతుంది. ఆ తరువాత క్రమంగా వాయుగుండం (డిప్రెషన్), తీవ్ర వాయుగుండం (డీప్ డిప్రెషన్), తుపాను (సైక్లోన్), తీవ్ర తుపాను (సివియర్ సైక్లోన్), అతి తీవ్ర తుపాను (సూపర్ సైక్లోన్).. ఇలా పీడనం తగ్గే కొద్దీ తుపాను తీవ్రత పెరిగే కొద్దీ ఈ క్రమంలో పేర్లు ఇస్తారు.
తుపాన్లను ఎవరు గుర్తిస్తారు?
తుపాన్లను ముందుగా అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలు గుర్తిస్తాయి. అవి పంపే ఛాయా చిత్రాలను ఇస్రోలో ఉండే శాస్త్రవేత్తలు, భారత వాతావరణ శాఖలో ఉండే అధికారులు పరిశీలించి ఏ సముద్రంలో ఏ అక్షాంశం, రేఖాంశం దగ్గర తుపాను కేంద్రం ఉన్నదో, అది ఏ దిశగా, ఎంత వేగంతో కదులుతున్నదో గమనించి మనకు చెబుతారు. డాప్లర్ వెదర్ రాడార్’ అనే వ్యవస్థ తన పరిధిలోని 500 కి.మీ దూరంలో మేఘాల జాడను కనిపెట్టగలుగుతుంది. తుపాన్లు ఈ రాడార్ పరిధిలోకి వచ్చినప్పుడు ఆ సమాచారం కూడా మనకు అందుతుంది.
మేఘాల తీవ్రత, గాలి వేగం ఎంత ఉందో ఈ రాడార్ ద్వారా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు చెన్నై, మచిలీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్‌లలో ఈ రాడార్ వ్యవస్థలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో వారం రోజుల ముందుగానే తుపాన్ల గురించి తెలుసుకోవచ్చు. ఎక్కడ పీడనం తగ్గి అలజడి ఏర్పడుతుందో ఆ ప్రాంతాన్ని వాతావరణ శాఖ గుర్తిస్తుంది. అది ఎంత వేగంగా మారుతోందో గమనిస్తూ ప్రకటనలు విడుదల చేస్తారు. చాలా తుపాన్లు ద్రోణి నుంచి తుపానుగా మారడానికి నాలుగు నుంచి ఏడు రోజుల సమయం పడుతుంది. కానీ, కొన్ని అతి వేగంగా మారిపోతాయి. అలాంటి సందర్భాల్లో ముందస్తుగా తీవ్రతను అంచనా వేయడం కష్టం అవుతుంది.
తుపాను లోపల ఎలా ఉంటుంది?
మధ్యలో ఖాళీగా ఉండి, చుట్టూ దట్టమైన మేఘాలు అల్లుకుని ఉండే వ్యవస్థను తుపాను అంటారు. అంటే, పై నుంచి చూస్తే మేఘాలతో తయారైన వలయంలా ఉంటుందనుకోవచ్చు. ఆ మధ్యలోని ఖాళీని సైక్లోన్ ఐ (కన్ను) అని పిలుస్తారు. ఆ ఖాళీ చుట్టూ అత్యంత బలమైన భారీ వర్షాలు కురిపించే మేఘాలుంటాయి.
తీరాన్ని తాకడం – తీరం దాటడం
 
కదులుతూ వెళ్ళడం తుపాను లక్షణం. అది ఎంత పెద్దగా ఉంది, ఎంత వేగంగా కదులుతున్నది అనేది కీలకం. సుముద్రం నుంచి కదులుతూ వచ్చే తుపాను ఎక్కడో ఒక చోట భూమి మీదకు వస్తే దాన్ని ‘తీరం దాటడం’ అంటారు. ఒక భారీ మేఘం ఓ ఊరి మీదకు వచ్చిందనుకుంటే, అది వెంటనే క్షణంలో మాయం అయిపోదు కదా. నెమ్మదిగా కదులుతూ వెళుతుంది. మేఘం వెళ్లగానే నీడ కూడా వెళ్లిపోతుంది. తుపాను కూడా అంతే. తుపాను కేంద్రం అంచులు సముద్రం నుంచి భూమి మీదకు ప్రవేశించగానే ‘తీరాన్ని తాకిన తుపాను’ అంటారు. అది పూర్తిగా భూమి మీదకు వచ్చేస్తే అప్పుడు ‘తీరం దాటిన తుపాను’ అంటారు. తుపాను వ్యాసం 50 కి.మీ నుంచి 500 కి.మీ దాకా ఉండొచ్చు. అంటే, అది ఎంత భారీ తుపాను అయితే, తీరం దాటడానికి అంత ఎక్కువ సేపు పడుతుంది.
ఈ తుపాను సముద్రంలో ఉన్నంతసేపు దానికి బలం ఉంటుంది. తీరం దాటిన తరువాత దాని శక్తి క్రమంగా తగ్గిపోతుంది. సముద్ర నీటి ఉష్ణోగ్రతల వల్ల తుపాన్లకు ఆవిరి చేరి థర్మల్ ఎనర్జీ అందుతుంది. దాంతో అది మరింత బలపడుతుంది. భూమి మీదకు రాగానే ఆ శక్తి అందడం ఆగిపోతుంది. సముద్రంలో తుపాను కదలడానికి ఏ అడ్డంకులూ ఉండవు. కానీ, భూమి మీద చెట్లు, భవనాలు, కొండలు వంటివన్నీ అడ్డంగా ఉంటాయి. అంతేకాదు, సముద్రంలో మాదిరిగా భూమిపై తుపానుకు నీరు అందదు. దీంతో అది క్రమంగా బలహీనపడుతుంది. అప్పుడు క్రమంగా తుపాను తీవ్ర వాయుగుండంగా, తరువాత వాయుగుండంగా, ఆ తరువాత అల్ప పీడనంగా మారిపోతూ ఉంటుంది.
కానీ, ఇదంతా క్షణాల్లో జరిగిపోయేది కాదు. గంటల సమయం పడుతుంది. తుపాను వేగమైన గాలులతో, భారీ వానలతో, దట్టమైన మేఘాలతో భూమి మీదకు వస్తుంది. సముద్రంలో అది ఎంత వేగంగా కదిలినా, ఎంత బలంగా కదిలినా, ఎంత భారీగా వాన కురిసినా ఆ ప్రభావం మనకు తెలీదు. కానీ అది భూమి మీదకు అంతే బలంగా వచ్చినప్పుడు విధ్వంసం సృష్టిస్తుంది. చెట్లు, స్తంభాలు విరిగిపోతాయి. అక్కడి నుంచి అది అలా కదులుతూ పోతూ బలహీనపడుతూ ఉంటుంది.
తుపాను తీవ్రతను బట్టి, అది భూమి మీదకు ప్రవేశించిన ప్రాంతాన్ని బట్టి విధ్వంసం ఆధారపడి ఉంటుంది. అంటే, పట్టణ ప్రాంతంలో వస్తే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఖాళీ ప్రాంతాల్లో అయితే కాస్త తక్కువ నష్టం ఉంటుంది. పంట చేలు, తోటలు ఉన్న చోట మరో రకమైన నష్టం సంభవిస్తుంది. ఇక తుపాను అధిక వ్యాసంతో ఉండి, దట్టమైన మేఘాలతో ఉంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అన్ని తుపాన్లూ మనకు తెలియవు
 
నిజానికి సముద్రంలో అనేక తుపాన్లు ఏర్పడతాయి. అన్నిటినీ వాతావరణ శాఖ వారు గుర్తించి వాటికి పేర్లు పెడతారు. కానీ, తీరం మీద ప్రభావాన్ని చూపేవి కొన్నే ఉంటాయి. వాటి గురించే ఎక్కువ వార్తలు చూస్తాం. ఇక తీరాన్ని తాకకపోయినా, సముద్రంలో ఉంటూనే తీరానికి దగ్గరగా ఉండడం వల్ల కూడా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, గాలులు వస్తుంటాయి. భారత్‌ను ఆనుకుని ఉన్న అరేబియా సముద్రం, హిందూ మహా సముద్రం, బంగాళాఖాతాల్లో తుపాన్లు ఏర్పడుతుంటాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలోని అండమాన్ ప్రాంతంలో ఎక్కువ తుపాన్లు పుడతాయి.
హెచ్చరికలు
 
తుపానుకు సంబంధించిన ప్రమాద హెచ్చరికలు ఓడరేవులకు వేరుగా, మామూలు పౌరులకు వేరుగా ఉంటాయి. ఓడరేవులు సముద్రంలో ఉన్న ఓడలకు సమాచారం ఇవ్వడం కోసం, తీరంలో ఆపిన బోట్లకు సంబంధించిన సంరక్షణ కోసం ఈ ఏర్పాటు ఉంటుంది. ఒకే తుపాన్‌కు సంబంధించి, ఒక ఓడరేవుకు ఉన్న హెచ్చరిక ఇంకో ఓడరేవుకు ఉండదు. అలాగే ఒక ప్రాంతంలో రెడ్ ఎలర్ట్ ఉంటుంది. మరో ప్రాంతంలో ఆరెంజ్ ఎలర్ట్ ఉండొచ్చు. తుపాన్‌ తీవ్రతను బట్టి అధికారులు వివిధ రకాల హెచ్చరికలు జారీ చేస్తుంటారు.
%d bloggers like this: