శివుడి పంచభూత లింగ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? అవి ఏవి?

ప్రాణికోటికి ఆధారమైనవి పంచభూతాలు. అవి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. ఈ ఐదు మూలకాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవే పంచభూత స్థల దేవాలయాలు. విశ్వమంతా నిండి ఉన్న విరూపాక్షుడిదేవాలయాలలో పంచభూత స్థలాలు అత్యంత విశిష్టమైనవిగా వెలుగొందుతున్నాయి. 


దక్షిణ భారతదేశంలో గల ఈ పంచభూత స్థలాలను శివరాత్రి పర్వదినాన సందర్శించడం జన్మధన్యంగా భావిస్తారు భక్తజనం. లయకారుడైన శివుడిని ఎక్కడ వెదకాలని పరితపించే భక్తులకు ఈ పంచభూత స్థలదేవాలయాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇందులో నాలుగు దేవాలయాలు తమిళనాడులో ఉండగా, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో ఉంది.

ఆకాశ లింగం- నటరాజస్వామి ఆలయం:

ఆకాశ లింగం- నటరాజస్వామి ఆలయం:
చిదంబరం తమిళనాడులోని కడలూరు జిల్లాలో గల ముఖ్య పట్టణం చిదంబరం. చెన్నై నుంచి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై ‘యంత్ర’ అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ‘ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీస్థలం ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. తమిళనాడు శివాలయాలకు పుట్టిల్లు అని చెప్పవచ్చు. చోళ, పాండ్య చక్రవర్తులు శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఎన్నో శివాలయాలు ఇక్కడ వెలుగొందుతుంటాయి. తిల్లయ్ కాళీ ఆలయం, పాశుపతేశ్వర ఆలయం, అన్నామలై యూనివర్శిటీ, పిచ్చవరం పిక్నక్ స్పాట్.. లను ఇక్కడ సందర్శించవచ్చు.
ఇది సాక్షాత్ పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రదేశం… శివుని నృత్యం ప్రత్యేకమైనది.. ఇక్కడ చేసేది ఆనంద తాండవం.. ఈ నృత్యాన్ని చూసి విష్ణువు పులకించి పోయాడట.. (ఆనంద తాండవాన్ని చూసేందుకు వెళ్ళిన ఆ సమయం ఆది శేషుడికి కూడా తెలియదు… స్వామి వారి మోములోని ఆనందానికి కారణం తెలుసుకోగా అది ఆనంద తాండవాన్ని చూసిన ఆనందమని చెప్తారు శ్రీ మహావిష్ణువు.. వెంటనే ఆదిశేషుల వారికి ఆ తాండవాన్ని చూడాలనే కోరిక కలుగుతుంది… కేవలం ఈ కోరికను నెరవేర్చుకోవడానికే ఆదిశేషులవారు పతంజలి మహర్షి అవతారం ఎత్తవలసి వస్తుంది..)
అందుకే ఈ క్షేత్రం హరిహర క్షేత్రం.. ఇంకొక విచిత్రమేమంటే శ్రీహరిని చూడాలని వచ్చినవారికి శివదర్శనం.. శివుని చూడాలని వచ్చిన వారికి విష్ణు దర్శనం లభిస్తాయి… ఇక్కడ శివ తత్వం.. విష్ణు తత్వం విడివిడిగా కనపడవు…
చిదంబరంలో శివునికి సంబంధించి నటరాజ స్వామి రూపంలో.. స్ఫటిక లింగ రూపంలో, ఆకాశ లింగ రూపంలో కొలుస్తాము… ఆకాశలింగం అంటే దీనికి వేరే ఆకారం అంటూ ఏమీ ఉండదు. ఆలయపు గోడలో బంగారు రేకుమీద యంత్రంతో బిగించబడి ఉంటుంది. దాని ఎదుట ఒక తెరవేసి ఉంటుంది. లోపలకు వచ్చిన తరువాత ఆ తెర తీసి చూపిస్తారు. అంటే మనకు కనపడనిది చిదంబర రహస్యం అనుకోవాలి.
చిదంబర రహస్యం:
పాశ్చాత్య శాస్త్రజ్ఞుల 8 సంవత్సరాల పరిశోధనల అనంతరం తేలిందేమంటే.. చిదంబరం నటరాజ స్వామి వారి విగ్రహం ఉన్న స్థలం భూమి యొక్క అయస్కాంత క్షేత్ర మధ్యలో ఉందట… ఇదే విషయాన్ని ప్రాచీన తమిళ శాస్త్రవేత్త తిరుమూలార్ అయిదు వేల ఏళ్ళ క్రితమే నిరూపించారని తెలుస్తోంది… చిదంబరంలోని తిరుమందిరం మొత్తం ప్రపంచ శాస్త్ర విజ్ఞానానికే దారి చూపేదిగా ఉందట.
దీనిని అర్థంచేసుకొనేందుకు వంద ఏళ్ళైనా పడుతుందేమో మనకు… ఎందుకంటే అక్కడి శిల్పాల అర్థాలు తెలుసుకోనేందుకు చాలా ఉన్నాయి.. ఉదాహరణకు మానవ ప్రత్యుత్పత్తి సంబంధించిన క్రోమోజోమ్ లు పాముల రూపంలో ఒక దానికి మరొకటి పెనవేసుకున్న విగ్రహమే ఇందుకు ఉదాహరణ…. మనకు భిన్న రూపంలో ఉన్న పాములు మాత్రమే కనపడతాయి..
పృథ్వీ లింగం ఏకాంబరేశ్వరాలయం :
పృథ్వీ లింగం ఏకాంబరేశ్వరాలయం :
కంచి కంచి ఉత్తరభాగాన్ని శివకంచి అంటారు. పంచభూత క్షేత్రాలలో ఒకటైన ఏకాంబరేశ్వరాలయం పృథ్వీ(భూమి)కి సూచికగా ఉంది. భారతదేశంలో అతి పెద్ద గోపురాలలో ఈ ఆలయం ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో కంచిలో గల మామిడి చెట్టు కింద స్వామి వెలసాడు కాబట్టి ఏకాంబరుడు అనే పేరు వచ్చిందని, ఈ స్వామి భూమిని సూచిస్తాడు అని చెబుతారు. దేవాలయం లోపల మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. అలాగే ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దాదాపు 3,500 సంవత్సరాలు వయస్సు గల మామిడి వృక్షం ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం.

వాయు లింగం శ్రీకాళహస్తీశ్వరాలయం
వాయు లింగం శ్రీకాళహస్తీశ్వరాలయం

శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గల ఈ దేవాలయం శ్రీ (సాలీడు), కాళ (పాము), హస్తి (ఏనుగు) ఈ మూడు పేర్లతో ప్రసిద్ధి చెందింది. స్వయంభువుగా వెలసిన ఇక్కడ శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతుంటుంది. ఆ విధంగా ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాళహస్తిని దక్షిణకాశీ అనీ అంటారు. మహాశివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. దేవాలయాన్ని పల్లవులు, తర్వాత చోళులు నిర్మించినట్టుగా శిలాఫలకాల ద్వారా తెలుస్తోంది. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో గల శ్రీకాళహస్తికి ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇతర జిల్లాల నుంచి నేరుగా శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యం ఉంది. శ్రీకాళహస్తికి మూడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్లే రైలు మార్గం కాళహస్తి గుండా వెళుతుంది.
జల లింగం జంబుకేశ్వరాలయం:
జల లింగం జంబుకేశ్వరాలయం:
తిరుచిరాపల్లి తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే త్రిచికి 11 కి.మీ దూరంలో పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వరాలయం ఉంది. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం ‘జలం’ ను సూచిస్తుంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలందుకుంటున్న క్షేత్రం అనీ, జంబు వృక్షాలు (తెల్లనేరేడు) అధికంగా ఉండటం వల్ల కూడా ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. జంబుకేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివలింగం పానపట్టం ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం చూపించేందుకు లింగం పానపట్టుపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి తీసి, ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు ఉంది. చెన్నై నుంచి శ్రీరంగం, అక్కడ నుంచి తిరుచిరాపల్లి చేరుకోవడం సులువు.
అగ్ని లింగం అరుణాచలేశ్వరాలయం :
అగ్ని లింగం అరుణాచలేశ్వరాలయం :
తిరువణ్ణామలై దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రాలలో ‘అగ్ని’ భూతలింగానికి అరుణాచలేశ్వరాలయం ప్రతీక. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఉంది ఈ క్షేత్రం. తేజోలింగం కనుక దీన్ని అగ్ని క్షేత్రం అంటారు. ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దానిచుట్టూ అరుణమనే పురం ఏర్పాటైందని పురాణాలు తెలుపుతున్నాయి. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా చుట్టూ రోడ్డు ఉంది.చెన్నై నుంచి 185 కి.మీ దూరంలో ఉన్న అరుణాచలేశ్వరాలయం. తిరుపతి నుంచీ రైలులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
%d bloggers like this:
Available for Amazon Prime