రధ సప్తమి

సప్త సప్తి వహ ప్రీత సప్త లోక ప్రదీప
సప్తమీ సహితో దేవా గృహాణార్ఘ్యం దివాకరా!


లోకబాంధవుడు, గ్రహాలకు అధిపతి, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుని జన్మతిథి మాఘశుద్ధ సప్తమి. దీనికే రథసప్తమి అని పేరు. రథసప్తమినాటి బ్రాహ్మీ ముహూర్తంలో ఆకాశంలోని తారకలన్నీ రథాకారం దాల్చి, సూర్యరథాన్ని తలపింప చేస్తాయని ప్రతీతి. ఈవేళ్టి నుంచి సూర్యునికి భూమి చేరువ కావడం ప్రారంభమవుతుంది. అంటే భానుడి కిరణాలు భూమికి పుష్కలంగా అందడం ఆరంభమవుతుంది. సర్వదేవమయుడైన ఆదిత్యుని ఆరాధించడం వల్ల తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.

రథసప్తమినాడు స్నానం చేసేటప్పుడు సూర్యభగవానుని మనసారా స్మరిస్తూ తలపై జిల్లేడు, రేగు, చిక్కుడు ఆకులు పెట్టుకుని స్నానం చేయాలని ధర్మశాస్త్రం చెబుతోంది. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైనది. అందువల్ల గురువు నుంచి మంత్రదీక్ష తీసుకోవడానికి, నోములు పట్టడానికి అనుకూలమైన రోజు. ఉపదేశం ఉన్న మంత్రాలను జపం చేయడం సత్ఫలితాలను ప్రాప్తింప చేస్తుంది.

రథసప్తమినాడు సూర్యాష్టకం లేదా ఆదిత్యహృదయాన్ని 9 మార్లు పఠించి, ఆవుపేడ పిడకలను కాల్చిన నిప్పు సెగపై ఆవుపాలతో పరమాన్నం వండి, దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదించడం వల్ల సమస్త వ్యాధులు, శోకాలు నశించి, సుఖ సంపదలు చేకూరతాయని శాస్త్రోక్తి. జిల్లేడు, రేగు, దూర్వాలు, అక్షతలు, చందనం కలిపిన నీటిని లేదా పాలను రాగిపాత్రలో ఉంచి సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఇహలోకంలో సకల సంపదలు, పరంలో మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి, కోణార్క సూర్యదేవాలయం తదితర సూర్యక్షేత్రాలలో ఈవేళ విశేషపూజలు జరుగుతాయి. అంతేకాదు, తిరుమల శ్రీవేంకటేశ్వరుని ఆలయంలో రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరికి ఈవేళ రథసప్తమీ వ్రతం చేయడం ఆనవాయితీ.