తెలుగు భాషకు అక్షరములు యాభై ఆరు. ఇరవై ఒకటవ శతాబ్దం మొదటి రోజుల్లో బాగా వాడుకలో ఉన్నవి 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది.
తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.
అచ్చులు:
ఇవి 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:
హ్రస్వములు – కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.
దీర్ఘములు – రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
ప్లుతములు – ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.

హల్లులు:
ఇవి 37 అక్షరములు. క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అందురు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు కలవు.
పరుషములు – హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి – క, చ, ట, త, ప.
సరళములు – హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి – గ, జ, డ, ద, బ.
స్థిరములు – పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి – ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.
స్పర్శములు – ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.
క వర్గము – క, ఖ, గ, ఘ, ఙ
చ వర్గము – చ, ఛ, జ, ఝ, ఞ
ట వర్గము – ట, ఠ, డ, ఢ, ణ
త వర్గము – త, థ, ద, ధ, న
మ వర్గము – ప, ఫ, బ, భ, మ

ఉభయాక్షరములు:
ఇవి 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.
సున్న – దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు కలవు. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్న ను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.
సిద్ధానుస్వారము – శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.
సాధ్యానుస్వారము – వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.
అరసున్న – దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు కలవు. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు. కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.
విసర్గ – ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.
తెలుగు భాష ఎప్పుడు పుట్టింది?
మొట్టమొదటి తెలుగు శాసనాలు:
తెలుగు మాట కనిపించే మొట్ట మొదటి శాసనం క్రీస్తు శకం 200కి చెందినది. బ్రహ్మీ లిపిలో ఉన్న ఈ శాసనం గుంటూరు జిల్లా అమరావతిలో దొరికింది. అంతకు పూర్వం అశోకుడు, బౌద్ధ మత ప్రచారానికి తన దూతలను ఆంధ్రదేశానికి పంపినట్లు అశోకుడి కాలం నాటి శాసనాల ద్వారా తెలుస్తోంది. పూర్తిగా తెలుగు భాషలో రాసిన శాసనాలు మనకు క్రీస్తు శకం ఆరవ శతాబ్దినుండి దొరుకుతున్నాయి. వీటిలో కడప జిల్లా ఎర్రగుడిపాడు (క్రీశ 575-600), కలమళ్ళ (క్రీశ 576-600) లో దొరికిన శాసనాలు మొట్ట మొదటివి. ఆరో శతాబ్దికి ముందు ఆంధ్ర ప్రాంతంలో శాసనాలు సంస్కృత ప్రాకృత భాషలలో వేసేవారు కానీ వాటిలో ఉన్న ఊళ్ళ పేర్లు, మనుష్యుల పేర్లు తెలుగువే. ఈ శాసనాలలో ఉన్న ఏళూరు, తాన్ఱికొన్ఱ (తాటికొండ) మొదలైన ఊళ్ళ పేర్లు ఆ రోజులలో సామాన్య ప్రజలు తెలుగే మాట్లాడే వారని నిరూపిస్తుంది.
ప్రాచీన కావ్యాలలో ఆంధ్ర/తెలుగు ప్రస్తావన:
రామాయణంలో సుగ్రీవుడు సీతాదేవి ఉనికిని గూర్చి వెతుకవలసిన స్థలాలను పేర్కొనే సందర్భంలో వరుసగా దండకారణ్యం, గోదావరీ నది, తరువాత, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య దేశాలున్నట్టు చెప్పాడు. ధర్మరాజు రాజసూయం చేసే ముందు దక్షిణ దిగ్విజయ యాత్రకు సహదేవుని పంపినట్లు అతడు పాండ్యులు, ద్రవిడులతో పాటు ఆంధ్రులను, కళింగులను, ఓఢ్రులను జయించినట్లు భారతంలో ఉంది. బౌద్ధ సారస్వతంలో చోళరఠ్ఠం, కళింగరఠ్ఠం, ద్రమిళరఠ్ఠం తో పాటు గోదావరినదికి ఇరు వైపుల అళక, ముళక దేశాలున్నట్లు, ఇవి రెండు అంధక రాష్ట్రాలని “సుత్తనిపాత” గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన గ్రీక్ రాయబారి మెగస్తనీస్ మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32కోటలున్నాయని పేర్కొన్నాడు.
ఆంధ్ర జాతి ప్రస్తావన మొట్టమొదటి సారి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతుంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దికి చెందిన భరతుని నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర భాషా ప్రస్తావన మనకు కనిపిస్తుంది. నాటకాలలో సంస్కృత ప్రాకృతాలే కాక సామాన్య ప్రజలు మాట్లాడే భాషలను వాడవచ్చని చెబుతూ, శకార, ఆభీర, చండాల, శబర, ద్రమిళ, ఆంధ్ర జాతుల భాషలను కూడా వాడవచ్చని ఇందులో ఉంది. ఐతే ఆంధ్ర రాజులు, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర జాతి అన్న పదాలలో ఆంధ్ర శబ్దం తెలుగుకు పర్యాయపదంగా తీసుకుంటే క్రీస్తు పూర్వం 7వ శతాబ్దికి ముందుగానే ఆంధ్ర/తెలుగు ప్రత్యేక జాతిగా గుర్తింపబడిందని చెప్పవచ్చు.
భాషా శాస్త్ర పరంగా తెలుగు కాలనిర్ణయం:
తమిళంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండీ సాహిత్యం లభిస్తోంది. తమిళం లోనూ కన్నడలోనూ తాలవ్యీకరణ (palatalization) లో వ్యత్యాసం కనబడుతోంది కాబట్టి, అవి రెండు కనీసం మూడు నాలుగు వందల యేండ్ల ముందుగా విడివడి ఉండాలి. ఆ రకంగా పూర్వ-తమిళం క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దంలో ప్రత్యేక భాషగా ఏర్పడి ఉండవచ్చు. కానీ దక్షిణ ద్రావిడ భాషలకూ, దక్షిణ-మధ్య ద్రావిడ భాషలకూ శబ్ద నిర్మాణంలోనూ, వాక్య నిర్మాణంలోనూ అనేక వ్యత్యాసాలు కనిపిస్తాయి. దక్షిణ ద్రావిడ భాషలైన తమిళ-కన్నడ లతో పోలిస్తే తెలుగు-కువి-గోండీ లలో కనిపించే వ్యత్యాసాలో కొన్ని:
వర్ణవ్యత్యయం (metathesis): తెలుగు-కువి-గోండి భాషలలో మూల ద్రావిడ ధాతువులోని అచ్చు తరువాతి హల్లు పరస్పరం స్థానం మార్చుకుంటాయి.
తెలుగులో బహువచన ప్రత్యయం- లు. తమిళాది దక్షిణ భాషల్లో ఇది -కళ్, -గళు.
క్త్వార్థక క్రియలు తమిళాదుల్లో -తు -ఇ చేరటం వల్ల ఏర్పడుతాయి. తెలుగు-కువి-గోండి భాషలలో -చి, -సి చేరటం వల్ల ఏర్పడుతాయి. ఉదా: వచ్చి, చేసి, తెచ్చి, నిలిచి వరుసగా తమిళంలో వన్దు , కెయ్దు, తన్దు, నిన్ఱు.
పైన పేర్కొన్న లక్షణాలన్నీ దక్షిణ మధ్య ద్రావిడ భాషలన్నిటిలో ఉండి దక్షిణ ద్రావిడ భాషలో లేనివి. అంటే ఈ మార్పులన్నీ తెలుగు-కువి-గోండి ఒకే భాషగా కలిసి ఉన్న రోజులలో మూల దక్షిణ ద్రావిడ భాషనుండి విడిపోయిన తరువాత వచ్చిన మార్పులన్న మాట. అన్ని ముఖ్యమైన మార్పులు రావటానికి కనీసం 400-500 సంవత్సరాలు పట్టవచ్చు. అంటే తెలుగు-కువి-గోండి భాషలు దక్షిణ మధ్య ద్రావిడ ఉప శాఖగా క్రీస్తు పూర్వం 1100 సంవత్సరంలో మూల దక్షిణ ద్రావిడం నుండి విడిపోవచ్చు. ఇదే నిజమైతే క్రీస్తు పూర్వం 700-600 వరకే తెలుగు ఒక ప్రత్యేక భాషగా స్వయంప్రతిపత్తిని కలిగి ఉండవచ్చునని మనం ఊహించవచ్చు[1]. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్ర జాతిని ప్రత్యేక జాతిగా పేర్కొనడం ఈ లెక్కతో సరిపోతుంది కూడా!
ఈ రకమైన కాలనిర్ణయం సాపేక్ష కాలమానాల (relative chronology) మీద ఆధారపడ్డదే కానీ పద, ధాతు వ్యాప్తి గణాంకాల (lexicostatistics) మీద ఆధారపడ్డది కాదు. ద్రావిడ భాషల పూర్వచరిత్ర పై ఇంకా పరిశోధనలు ఇతోధికంగా జరిగితే గాని తెలుగు భాషా జనన కాలనిర్ణయాన్ని నిష్కర్షగా చెప్పలేం.
ఆధార గ్రంథాలు:
Dravidian Languages Bhadriraju Krishnamurti Cambridge University Press (2003)
Comparative Dravidian Linguistics: Current Perspectives Bhadriraju Krishnamurti (2001)
ద్రావిడ భాషలు పి. ఎస్. సుబ్రమణ్యం (1994)
History and Geography of Human Genes Luigi Luca Cavalli-Sforza, Paolo Menozzi, Alberto Piazza (1994)
భాష, సమాజం, సంస్కృతి భద్రిరాజు కృష్ణమూర్తి (2000)
Journey of Man: A Genetic Odyssey Spencer Wells (2002)
తేనెకన్నా తియ్యనిది: తెలుగు (ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్)

ద్రవిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాణ్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, మొదటి శకం బి.సి లో శాతవాహన రాజులు సృష్టించిన “గధాశప్తశతి” అన్న మహారాష్ట్రీ ప్రాకృత్ పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ ,గోదావరి మధ్య భూభాగంలో నివాసం ఉండే పెద్ద వారయి ఉంటారని నిర్ణయించ వచ్చు.
అశోకుడి చారిత్రక శకానికి చెందిన బ్రాహ్మి లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించినట్టుగా నమ్ముతున్నారు. తెలుగు యొక్క తూర్పు చాళుక్యుల లిపిని వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపి తో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలనే కనిపిస్తుంది.
తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శకంకి చెందినది. 11వ శతాబ్దంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగులోని మొట్టమొదటి సాహిత్య కావ్యం.
విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి కృష్ణదేవరాయల ఆదరణలో 16 వ శతాబ్దంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది. శ్రీనాథుని “శృంగార నైషధం,” పోతన “దశమస్కంధం”, జక్కన “విక్రమార్క చరిత్ర”, తాళ్ళపాక తిమ్మక్క “సుభద్రా కల్యాణం”, మొదలైనవి మహారాజు కృష్ణదేవరాయల స్వర్ణయుగం కంటె ముందుగానే ఉన్న కొన్ని గొప్ప సాహిత్యాలు. స్వతహాగా కవియైన కృష్ణదేవరాయల మహారాజు తన “ఆముక్తమాల్యద” తో “ప్రబంధం” అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.
కర్నాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, మరియు క్షేత్రయ్య వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగునే ఎంచుకొన్నారు.
తెలుగు లిపిలో చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్ఛరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు “అచ్చులు” మరియు “హల్లులు” అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ , చదవడానికీ, అచ్చు “అ” ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో “మాత్రలు” అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ “మాత్రల” ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం “పూర్ణవిరామం”తో కానీ, “దీర్ఘవిరామం”తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.
తెలుగును సాధారణంగా ఒకదానితో ఒకటి కలిసి చేరి పోయే భాషగా గుర్తిస్తారు, ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి. తెలుగును ఒక ద్రవిడ భాషగా గుర్తించడానికున్న ఎన్నో మార్గాలలో ఇదొక్కటి.
తెలుగుకు “విభక్తి” సంప్రదాయం కూడా ఉంది. తెలుగులో ప్రతి పదమూ ఒక అచ్చుతోనే ముగింపు పొందడంతో, 19వ శతాబ్దపు యాత్రీకులు సాధారణంగా దీనిని “ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్” ( తూర్పు దేశపు ఇటాలియన్ భాష ) గా పరిగణించేవారు.
1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లో సాధ్యమయ్యింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డ్స్వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు “భావకవిత్వం” అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.
మొట్టమొదటి నవలగా పరిగణించబడుతూన్న కందుకూరి వీరేశలింగంగారి “రాజశేఖరచరిత్రము” తో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గురజాడ అప్పారావుగారు, గిడుగు రామ్మూర్తి వారి “ముత్యాల సరాలు”, కట్టమంచి రామలింగారెడ్డిగారి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకులు) “ముసలమ్మ మరణం”, రాయప్రోలు సుబ్బారావుగారి “త్రుణకంటకం” మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యవహారిక భాషను వాడడం “వ్యావహారిక భాషా వాదా”నికి దారితీసింది.
You must log in to post a comment.