భారతీయ ఋషులు,దేవతలు,భక్తులు


Index of /cover600/8400                 

                             Read Here

సప్త ఋషులు

రాత్రి పూట మనం ఆకాశంలోకి చూసినప్పుడు ఒక ప్రశ్నార్థకంలా కనిపించే నక్షత్ర సమూహమే “సప్తర్షి మండలం”. భారత సాంప్రదాయిక ఖగోళ విజ్ఞానం ప్రకారం అందులో ఉండేవి కేవలం నక్షత్రాలు మాత్రమే కాదని ఏడుగురు దివ్యశక్తి గల మహారుషులే సప్త ఋషులుగా అలా తారారూపంలో సంచరిస్తున్నారనీ ప్రస్తావించారు. ఈ ఏడు నక్షత్రాలను కూడా సప్తర్షులు అంటారు. కేవలం భారతీయులే కాదు! పాశ్చాత్యులు కూడా ఈ సప్తర్షి మండలాన్ని ఖగోళశాస్త్రం ప్రకారం “బిగ్‌ డిప్పర్‌ (Big Dipper)” లేదా “Ursa Major” అని అంటారు.

ఒకవైపు నడి సముద్రం, చుట్టూ చిమ్మచీకటి… ఇలాంటి సందర్భంలో మన పెద్దలకు సప్తర్షి మండలం ఒక దారిని చూపించే సాధనంగా ఉండేది. సముద్రం నుంచి ఎడారి వరకూ బాటసారులకు గమ్యం వైపు నడిపించేది. ఆఖరికి ప్రళయకాలంలో సత్యవ్రతుడనే రాజు సకల జీవరాశులను పడవలోకి చేర్చినప్పుడు, అతనికి దారి చూపింది కూడా సప్తర్షి మండలమే అని చెబుతారు. బహుశా అందుకనే ఆ నక్షత్రమండలానికి సప్తర్షి హోదాను కట్టబెట్టి ఉండవచ్చు.

అసలు సప్తర్షుల పేర్లు ఏమిటి అని ఖచ్చితంగా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే వేర్వేరు పురాణ గ్రంథాలలో వేర్వేరు సప్తర్షులు కనిపిస్తారు. ఒక్కో ప్రమాణం ప్రకారం వారి పేర్లు మారుతూ కనిపిస్తాయి. వేర్వేరు మన్వంతరాలలో కూడా వీరి పేర్లు వేర్వేరుగా కనిపిస్తాయి. కొందరి అభిప్రాయం ప్రకారము సప్తర్షి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదనీ, అది ఒక హోదా అని భావించవచ్చునేమో. కాలానుగుణంగా ఈ హోదాను వేర్వేరు ఋషులు దక్కించుకుంటూ ఉండవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న వైవస్వత మన్వంతరంలో వశిష్ఠుడు, అత్రి, గౌతముడు, కశ్యపుడు, భరద్వాజుడు, జమదగ్ని, విశ్వామిత్రుడు అనేవారు సప్తఋషులు. ఇక మానవ శరీరంలో ముక్కు, చెవి, కన్ను, చర్మము, నాలుక, వాక్కు, మనస్సు అనే ఏడు సప్తఋషి స్థానీయాలని యోగ సంకేతములు.

సప్తర్షి మండలం అనగానే మనకు గుర్తుకువచ్చే మరో విషయం. “అరుంధతీ నక్షత్రం”! తన భర్త వశిష్ఠుని అడుగుజాడల్లో నడిచే అరుంధతి నక్షత్రం ఆయనతో పాటుగానే సప్తర్షి మండలంలో భాగమైందని విశ్వాసం. అందకనే పెళ్లయిన నూతన వధువుకు, అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటారు. అలా భర్తను నిత్యం అనుసరించే అరుంధతి, ఆమెను అంత ఎత్తున నిలబెట్టిన వశిష్ఠులు సప్తర్షి గణంలో ఒక భాగమైపోయారు.

సప్తఋషులు: అగస్త్య మహర్షి

సప్తఋషులలో అగస్త్య మహర్షి ఒకడు. భారతీయ ఇతిహాసాలు, పురాణాలలో ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో ఇతని ప్రస్తావన వస్తుంది. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు. ఋగ్వేదంలో 1.165వ శ్లోకం నుంచీ 1.191వ శ్లోకం వరకూ అగస్త్య మహర్షి, అతని భార్య లోపాముద్రలు వ్రాసినవేనని పురాణ కథనం. ఋగ్వేదమే కాక, ఇతర వైదిక సాహిత్యం కూడా వారు వ్రాసారు. రాముడు అరణ్యవాసాన అగస్త్యుని దర్శించుకొన్నప్పుడు దివ్యఖడ్గాన్నిశరాసనము ఇచ్చాడు. అంతేకాకుండా రామ రావణయుద్ధంలో రాముడు అధైర్యపడకుండా ఆదిత్య మంత్రాన్ని ఉపదేశించి ఆదుకున్నాడు.

అగస్త్యుని మూలాలు పౌరాణికమైనవి. మిగిలిన ఋషులులాగా అగస్త్యుడు తల్లీ, తండ్రులకు పుట్టలేదు. సూర్యుడు (మిత్రుడు), వరుణుడు యజ్ఞం చేస్తుండగా అప్సరసైన ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసిన వారి మనసు చలించి తేజస్సు జారింది. ఊర్వశి ఆ రెండు తేజస్సులను విడి విడి కుండలలో పెట్టింది. ఒక కుండలో వసిష్ఠుడు మరొక కుండలో అగస్త్యుడు పుట్టారు. కుండలో నుండి పుట్టినందున అగస్త్యునికి “కుంభ సంభవుడు” అనే పేరు వచ్చింది. వీరిద్దరినీ “మైత్రా వరుణి” అంటారు. మిత్రుడంటే సూర్యుడు గనుక, మిత్రుడికీ వరుణుడికీ పుట్టిన వాళ్ళనే అర్థంలో అలా పిలుస్తారు.

అగస్త్యుడు ఒక రోజు వనంలోంచి వస్తూవుంటే కొందరు తలక్రిందులుగా వేళ్ళాడుతూ ఉన్నారు. సంతానం లేని తమ వంశపు భవిష్యత్తు తలక్రిందులుగా ఉండడం వల్లనే అలా ఉన్నారని అగస్త్యునికి అర్థమైంది. తన వాళ్ళకోసం తాను పెళ్ళాడాలనుకున్నాడు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన యోగశక్తిని ఉపయోగించి గుణగణాల్లోనూ, వ్యక్తిత్వంలోనూ అన్నిరకాలుగా, ఒక విరాగికి భార్యగా ఉండేందుకు అవసరమైన లక్షణాలు కలిగిన ఒక ఆడశిశువును సృష్టించాడు. ఇదే సమయంలో సంతానం లేక భాధపడుతున్న విదర్భ రాజు భార్య గర్భంలోకి ఆయన సృష్టించిన శిశువును ప్రవేశపెట్టాడు. పుట్టిన బిడ్డకు ఆ రాజదంపతులు లోపాముద్ర అని నామకరణం చేశారు. ఆమెకు యుక్త వయస్సు రాగానే అగస్త్యుడు ఆమెకు తనతో వివాహం జరిపించాల్సిందిగా రాజును కోరాడు. విరాగి అయిన అగస్త్యుని నుంచి ఈ ప్రతిపాదన విన్నరాజు సంశయించినా లోపాముద్ర సందేహించక సమ్మతించింది. దాంతో రాజు వారిద్దరి వివాహం జరిపించాడు. వారికి దృఢస్యుడనే పుత్రుడు. తేజస్వి అనే పిల్లలు కలిగినారు.

అ తరువాత కవేర తనయ శివుని గురించి తపస్సు చేయడం చూసి బ్రహ్మ అగస్త్యుని దగ్గరకు వచ్చి ఆమెని పెళ్ళాడమన్నాడు. తాను నదినవుతానంది. ఒప్పుకున్నాడు. పెళ్ళాడాడు. ఆమెను మంత్రించి కమండలంలో పెట్టుకున్నాడు. ఆమెయే కావేరి నదిగా తరువాత ప్రవహించింది.

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
పూర్వం ఇల్వలుడూ వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు నివసించేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి కామరూప విద్య (సులభంగా తను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య) తెలుసు. ఇల్వలుడికి చనిపోయినవారిని బ్రతికించే సంజీవనీ విద్య తెలుసు. ఎవరైనా బాటసారి వచ్చినపుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. వారు ఆ మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బ్రతికించడానికి సంజీవినీ మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చి ఆ బాటసారిని చంపి తినేవారు. అలా ఒక సారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా వెళుతుండగా ఈ రాక్షస సోదరులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి అందరికీలానే మేక మాంసం వడ్డించాడు. ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా “జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అన్నాడు. ఇది తెలియక ఇల్వలుడు. యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవనీ మంత్రం పఠించాడు. కానీ వాతాపి మాత్రం తిరిగి రాలేదు. అగస్త్యుని మహిమ తెలుసుకొని ఇల్వలుడు మహర్షి కాళ్ళమీద పడి శరణు కోరి మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలిపెట్టి వెళ్ళిపోయాడు.

వింధ్యుని గర్వ మణచుట

మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్యపర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఆకాశాన్ని అందుకొనేలా పెరిగిపోతూ సూర్య చంద్రుల మధ్య నిలబడి రాత్రీ పగలూ తేడా లేకుండా చేసింది. దీంతో రాత్రింబవళ్ళూ సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ఆశ్రయించగా, వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు. అగస్త్యుడు తన వైపుగా రావడంతో దారిమ్మని కోరడంతో ఆశీర్వాదం అర్ధించి వింద్య తలదించి తన రూపాన్ని ఉపసంహరించుకొని ఎప్పట్లాగే ఉండిపోయింది. తాను తిరిగి వచ్చే వరకూ అలాగే ఉండమని చెప్పాడు. కానీ అగస్త్యుడు మళ్ళీ తిరిగి రానేలేదు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. కార్యక్రమాలు యదావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి

ఇదిలా ఉంటే మునులను ముప్పుతిప్పలు పెట్టి రాక్షసులు సముద్ర గర్భంలో దేవతలకు దొరక్కుండా దాక్కొనేవారు. అగస్త్యున్ని వేడుకోవడంతో ఆ సముద్రాన్నంతా ఒక్క గుక్కలో తాగేసాడు. దాక్కున్న రాక్షసులు దొరికిపోయి దేవతల చేతిలో హత మయ్యారు. అలాగే వృత్తాసురుణ్ని వధించడంలో ఇంద్రుడికీ ఇలాగే సముద్రాన్ని తాగి సహకరించాడు.
%d bloggers like this:
Available for Amazon Prime