సీటీ స్కాన్ వల్ల కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని విన్నాను. ఇది ఎంతవరకూ నిజం?

సి.టి (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కాన్ లో ఎక్స్- కిరణాలు (x-rays) మన శరీరం గుండా ప్రయాణిస్తాయి. ఎక్స్-కిరణాలు ఒక రకమైన అయనీకరణ రేడియేషన్ (ionising radiation). ఈ కిరణాలను మన శరీరం అన్ని అవయవాలు కొంతమేరకు పీల్చుకుంటాయి. ఇందువలన కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. అయినా స్కాన్ చేయడం వలన లాభాలు, రేడియేషన్ వలన వచ్చే ప్రమాదంకంటే ఎక్కువ గా ఉన్న సంధర్భాల్లో సి.టి స్కాన్ చేయడం జరుగుతుంది.
ఉదాహరణకు ఒక వ్యక్తికి దగ్గు,ఆయాసం, గల్ల లో రక్తం పడటంలాంటివి ఉంటే, క్షయ లేదా ఊపిరితిత్తులకు సంభందించిన క్యాన్సర్ వంటి వ్యాధులు నిర్ధారించడానికి సి.టి స్కాన్ చేస్తాం. ఇటువంటి సమయం లో రేడియేషన్ వల్ల వచ్చే ప్రమాదం కంటే వ్యాధి ని కనిపెట్టి, వెంటనే చికిత్స ప్రారంభించడం ముఖ్యం.
సి.టి స్కాన్ లో కాంట్రాస్ట్ అనే పదార్థం కొన్నిసార్లు ఇవ్వవలసి వస్తుంది. రోగికి ఇంతకుముందే కిడ్నీలకు సంబంధించిన వ్యాధి ఉంటే, ఈ కాంట్రాస్ట్ వలన అది ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంది.అందుకే కిడ్నీలకు సంభందించిన వ్యాధులతో బాధ పడుతున్న వారికి కాంట్రాస్ట్ ఇవ్వరు.