‘క్యాన్సర్’ అనేది జీవనశైలి వల్ల సంభవిస్తుందా లేదా దురదృష్టం వల్లనా?

క్యాన్సర్’ పలు కారణాల వలన సంభవిస్తుంది.
‘క్యాన్సర్’ అనే దానిని తెలుగులో ‘పుట్టకురుపు’ అంటారు. పుట్ట పెరిగినట్లు పెరుగుతుందని.
వివరణ:
‘క్యాన్సర్’ ఏ అంగంలోనైనా, అవయవం లోనైనా, రావచ్చు. ఒక్కక్క శరీరభాగానికివచ్చే ‘క్యాన్సర్’ కు ఒక్కక్క కారణం ఉంటుంది. అన్ని ‘క్యాన్సర్’ లకూ ఒకే కారణం ఉండదు.
‘క్యాన్సర్’ కారణాలు:
1
కొన్నిరకాల ‘హైడ్రోకార్బన్ల’ నిరంతర స్పర్శ వల్ల ‘క్యాన్సర్’ వచ్చే అవకాశం ఎక్కువ.
పారిశ్రామిక విప్లవం రోజులలో, చిన్నపిల్లలతో ఫ్యాక్టరీ గొట్టాలను శుభ్రం చేయించేవారు. ఎందుకంటే – కైవారం తక్కువగానున్న్న ఆ గొట్టాలలో పెద్దవాళ్ళు దూరలేరు కనుక. పొగ ‘మసి పొర’ గా ఏర్పడిన ఆ గొట్టాలను శుభ్రం చేసిన పిల్లలకు వచ్చిన ‘క్యాన్సర్’ను chimney cancer అనే వాళ్ళు.
2
చలిప్రదేశాలలో శరీరాన్ని వెచ్చ చేసుకునేందుకు చిన్న చిన్న కుంపట్లను పొట్టకు దగ్గరగా పెట్టుకుని, కూర్చునేవాళ్ళు. నిరంతరం, ఆ వేడి తగులుతూంటే, పొట్ట భాగంలో గల చర్మంలో కొన్ని మార్పులు జరిగి, ‘క్యాన్సర్’ వచ్చేది. దీన్ని ‘కాంగ్రీ క్యాన్సర్’ అంటారు.
3
భూగోళంపై కొన్ని ప్రాంతాలలో ఓజోన్ పొర పల్చగానుండటం వలన ultraviolet rays ఎక్కువ సాంద్రతతో క్రిందకు పడటంవలన ఆయా ప్రాంతాలలో చర్మానికి వచ్చే squamous cell ‘క్యాన్సర్’ ఎక్కువ.
4
కొన్ని జాతులలో కొన్ని ‘క్యాన్సర్’లు ఎక్కువ.
ఆఫ్రికన్లలో కొన్ని, జపాన్ వారిలో కొన్ని, ఇలా..
5
శరీరతత్త్వం: జీర్ణాశయ ‘క్యాన్సర్’ వచ్చే వారిలో చాల మందికి Blood Group ‘A’ ఉంటుంది.
6
కొన్ని శరీరభాగాలు ప్రకృతి నిర్దేశించిన పనికి ఉపయోగపడకపోతే,‘క్యాన్సర్’ వస్తుందని ఒక సిద్ధాంతం.
ఉదాహరణకు ఱొమ్ము ‘క్యాన్సర్’. ఇది పిల్లలు లేని స్త్రీలలో, లేదా పిల్లలకు పాలివ్వని స్త్రీలలో ఎక్కువ.
7
కొన్ని శరీరభాగాలు అతిగా దుర్వినియోగపడితే, ‘క్యాన్సర్’ వస్తుందని ఒక సిద్ధాంతం.
ఉదాహరణకు పలువురితో లైంగిక సంబంధం కలిగి ఉండటం.
8
కొన్ని వైరస్ లు కూడ కొన్ని క్యాన్సర్ లకు కారణం.
ఉదాహరణకు Epstein-Barr Virus.
9
సకల రకాల ‘క్యాన్సర్’ లకూ, సామాన్య (common) కారణం చెప్పవలసి వస్తే, అది ‘పొగాకు’.
ఇది కాల్చటం, లేదా నమలటం అనే రూపాలలో శరీరంలో ప్రవేశిస్తుంది.
9A
సిగరెట్ పొగలో science గుర్తించినవి దాదాపు 2000 రసాయనాలున్నాయి. వీటిలో కొన్ని ‘క్యాన్సర్’ కారకాలు. ఇవి పలు శరీరావయవాల ‘క్యాన్సర్’ లకు ప్రత్యక్ష కారణాలు.
ఉదా: పెదవులు, నోరు, గొంతు, స్వరపేటిక, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, అన్నవాహిక, జీర్ణాశయం, పేగులు, మూత్రాశయం, ఇలా…
9B
పొగాకును నమిలినా కూడ ‘క్యాన్సర్’ వస్తుంది. నోరు, బుగ్గల లోపలి భాగం, గొంతు.
10
మద్యం ప్రత్యక్షంగా ‘క్యాన్సర్’ను కలిగించకపోయినా, అవకాశాలను బాగా పెంచుతుంది. ఎందుకంటే – సిగరెట్ పొగలో నుండే కొన్ని సేంద్రియ రసాయన పదార్థాలు (organic chemicals) శరీరద్రవమైన నీటిలో కరగవు. మద్యం (ethyl alcohol) అటువంటి పదార్థాలను కరిగిస్తుంది (organic solvent). తద్వారా ఆయా ‘క్యాన్సర్’ కారకాలు శరీరంలో deep గా వ్యాపిస్తాయి.
11
మనం పీల్చేవి, తినేవి, రాసుకునేవి, పూసుకునేవి – దేనిలోనైనా ‘క్యాన్సర్’ కారకాలుండవచ్చు. మనం ఇళ్ళలో చేసుకునే వేపుళ్ళలో అడుగుకు మిగిలిన మడ్డి (నలుపు) లో హైడ్రోకార్బన్లుంటాయి. ఇటువంటి మడ్డిని తఱచూ వాడితే ‘క్యాన్సర్’ వచ్చే అవకాశాలుండవచ్చు. ఈ భయంతో నూనెను మళ్ళీ వాడని వాళ్ళను కొందరిని చూసాను నేను. అంత ‘అతిజాగ్రత్త’ అనవసరమనిపిస్తుంది. దాని కన్న, మనం నిత్యమూ వాడే plastic containers (water bottles etc.) చాల ప్రమాదకరమని అనిపిస్తుంది. వాటిలో ఏ వస్తువును ఎక్కువ కాలం నిలవ ఉంచినా, ‘క్యాన్సర్’ కారకం కావచ్చు. ప్రత్యేకించి, ఊరగాయలు, వేడి పదార్థాలు, plastic containers లో వేయటం ప్రమాద ద్వారాన్ని దాటినట్లే!
12
విచిత్రమేమిటంటే –
ప్రత్యక్షకారణమైన సిగరెట్, ఖైనీ, గుట్కాలను నిషేధించటంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు.
పరోక్షకారణమైన మద్యాన్ని నిషేధించటంలో కూడ అదే విధానం.
పైగా, ఆయా సిగరెట్లకు, మద్యాలకు, మన ‘హీరో’లు brand ambassadors!
ఏమైనా అంటే – పంచదార అతిగా తింటే సుగర్ వ్యాధి వస్తోంది కదా!
సుగర్ ను ban చేస్తున్నామా? అని సిగరెట్ ప్రియుల వితండ వాదం!
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి!
13
ఇక – ప్రశ్నలో చివరి భాగమైన ‘దురదృష్టం’ గురించి:
‘క్యాన్సర్’ పై పరిశోధన జరుగుతూనే ఉంది. గతంలో అనుకోని అంశాలు ‘క్యాన్సర్’ కారకాలుగా తెలిసి వస్తున్నాయి. ‘అదృష్టం’ అంటే – ‘కనిపించనిది’ అనుకుంటే – నేటి వరకూ కనిపించని (అదృష్టమైన) ఒక కారణం రేపు దృష్టం కావచ్చు. అది దురదృష్టం కావచ్చు.
(అయితే, సాధారణంగా అదృష్టం అనే పదం మంచి ఉద్దేశ్యంలోనే వాడుతున్నాము)
14
‘మృత్యువు’ అనేది ఏదో ఒక రూపంలో వస్తుంది. దానికున్న పలు ద్వారాలలో ‘క్యాన్సర్’ ఒకటి!