ఎనస్తీషియాలజిస్ట్ and his duties

ఇక మత్తువైద్యుణ్ణి ఎనస్తీషియాలజిస్ట్ అని అంటారు. సర్జరీ చేసేటప్పుడు ఇతని సహాయం చాలా అవసరం. అయితే ఈ ప్రత్యేక వైద్య విభాగానికీ ఒక శాస్త్రం ఉంటుందని, అదికూడా మూడు సంవత్సరాల పీజీ మరియు తదుపరి సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా వుంటాయని చాలామందికి తెలియదు. ఆపరేషన్ చేసే వైద్యులే పూర్వం మత్తు ఇచ్చేసి సర్జరీ చెయ్యడం వలన ఈ అపోహ చాలామంది సాధారణ ప్రజానీకంలో ఉంది. ఇది పూర్తి స్థాయిలో విశదపరచవలసిన అవసరం, ఆవశ్యకత ఉంది. ఇక చదవండి.
మనకెప్పుడైనా గాయమైతే చిన్న నొప్పిని కూడా భరించలేం. ‘అమ్మా!’ అంటూ మొదలెట్టి, ఆ దెబ్బ పూర్తిగా నయమయ్యేవరకు ఎంతోకొంత నొప్పిని అనుభవిస్తూనే వుంటాం.
అటువంటిది మందులతో నయంకాని రోగానికి శరీరాన్ని కోసి, వైద్యం చేసే ప్రక్రియలో ఎంత నొప్పిని భరించాల్సివుంటుందో ఆలోచించండి!
శస్త్రచికిత్స…. అంటే ఆపరేషన్.
మనందరికీ సుపరిచితమైన ఈ ప్రక్రియ ఎంత చిన్నదైనా, పెద్దదైనా నొప్పిని కలుగజెయ్యక మానదు. ఆ నొప్పిని భరించాల్సిన అవసరం లేకుండా మత్తునివ్వడం ద్వారా ఆ ఇబ్బందిని తొలగించేవాడే ‘మత్తువైద్య నిపుణుడు’
గతకాలంతో పోలిస్తే మత్తువైద్యానికి బాధ్యతలు మరింత పెరిగాయి. ప్రధానంగా వీరి కర్తవ్యాలేమిటో చూద్దాం.
……శరీరంపై ఎక్కడో చిన్న కణితిలాంటిది తొలగించడం దగ్గరనుంచి ఛాతీని చీల్చి హృదయానికి చేసే బైపాస్ ఆపరేషన్ దాకా మత్తువైద్యాన్నివ్వడం
……అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఒకరోగి తీవ్రంగా గాయపడినా, అపస్మారక స్థితిలో వున్నా, అధికరక్తస్రావమై షాక్ కు గురైనా, తలకుగాని, ఛాతీకిగాని బలమైన దెబ్బతగిలి శ్వాసక్రియకు ఇబ్బంది తలెత్తినా మత్తువైద్య నిపుణులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి రోగిని ముందు ప్రాణాపాయ స్థితినుండి బయటపడేసే ప్రయత్నంలో నిష్ణాతులై వుంటారు.
పైన చెప్పినవాటన్నిటికీ వారికి ప్రత్యేకమైన శిక్షణ వుంటుంది. ఇదంతా వారి పోస్ట్‌గ్రాడ్యుయేషన్లో నేర్పిస్తారు. అంతకు పైచదువులైన సూపర్ స్పెషాలిటీ కోర్సులో కూడా ఈ అత్యవసర వైద్యంలో సాధికారత పొందే అవకాశముంది.
……ఇక పెద్దపెద్ద ఆపరేషన్లు జరిగిన పిమ్మట రోగుల్ని ప్రత్యేకమైన వార్డుల్లో కనీసం వారంనుంచి రెండుమూడు వారాలవరకూ వుంచే పరిస్థితి వుంటుంది. ఆ వార్డుల్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐ.సి.యు.)అంటారు. వీటికి ఇన్‌ఛార్జిగా సాధారణంగా మత్తువైద్యులే వుంటారు. వీరిని ‘ఇంటెన్సివిస్ట్స్’ అని వ్యవహరిస్తారు.
ఆ రోగులు పూర్తిగా కోలుకునేవరకూ అక్కడే వుంచి, ఆరోగ్యపరిస్థితి స్థిమితపడ్డ తరవాత సాధారణ వార్డుకి తరలిస్తారు. ఐ.సి.యు.లో వున్నంతవరకు రోగికి ఎటువంటి తీవ్రసమస్య ఎదురవ్వకుండా ఇంటెన్సివిస్ట్ ఇరవైనాలుగు గంటలూ కంటికిరెప్పలా కాపలా కాస్తాడు.
ఇక ఆపరేషన్ గదిలో వీరి కర్తవ్యాలు ఏమిటో గమనిద్దాం.
ఆపరేషన్ అవసరమని భావించిన ఒక రోగిని ముందుగా మత్తువైద్యుడి దగ్గరకు పంపిస్తారు. ఆ రోగిని క్షుణ్ణంగా పరిశీలించి, పరీక్షించి, అతనితోపాటు వున్న కేస్ షీట్ లో రకరకాల వైద్యపరీక్షల రిపోర్టుల్ని పరికిస్తాడు.
మత్తువలన రోగికి కొత్తగా ఇతర సమస్యలు తలెత్తే అవకాశం వుందేమో అని ప్రత్యేక శ్రద్ధతో ఈ కింద చెప్పినవన్నీ అడిగి తెలుసుకుంటాడు:
……అతనికున్న అలవాట్లు, ఆరోగ్యసమస్యలు, ఆహార నియమాలు, వ్యాయామంచేసే అలవాట్లు, ఒకవేళ చేస్తే శరీరం అలసటకి ఎంత త్వరగా గురవుతుంది, బరువైన పనుల్ని చెయ్యగల శరీరదారుఢ్యం వున్నదా లేదా..ఇత్యాది ప్రశ్నలన్నీ అడిగి వివరాలు నోట్ చేసుకుంటాడు.
తరువాత గుండె(హార్ట్), ఊపిరితిత్తులు(లంగ్స్), మూత్రపిండాలు(కిడ్నీ), నాడీవ్యవస్థ(నెర్వస్ సిస్టమ్), కాలేయం(లివర్), జీర్ణప్రక్రియ(గాస్ట్రోఇంటస్టైనల్ సిస్టమ్)…ఈ వ్యవస్థల్లో ఏమన్నా లోపాలుంటే గమనిస్తాడు.
మత్తుమందులు దాదాపుగా చాలావరకు లివర్‌ మీద, కిడ్నీలమీద, బ్రెయిన్ మీద ప్రభావం చూపుతాయి. కొన్నింటివలన గుండె నీరసించే అవకాశం వుంది. మరికొన్ని మందులు రక్తనాళాలను, రక్తాన్ని ప్రభావితం చేస్తాయి. కొన్నింటివలన బీపీ హెచ్చుతగ్గులు తలెత్తవచ్చు. అందుకనే ఇంత క్షుణ్ణంగా పరీక్షించడం!
కుటుంబంలో ఎవరికైనా దీర్ఘకాలిక రోగాలున్న చరిత్రవున్నా రోగిని తరచి తరచి అడిగి తెలుసుకుంటాడు. కొన్ని చర్మవ్యాధులు, కీళ్లవ్యాధులు, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులు సాధారణంగా దీర్ఘకాలికమైనవి. వాటివలన వేరే ప్రధాన సమస్యలు ఎదురవుతాయి. అందువలన ఆ చరిత్రా అడిగి తెలుసుకుంటాడు.
అంతా అయిన తరువాత ఆపరేషన్ గదిలో పేషెంటుకి మానసిక ధైర్యాన్ని కలుగజేస్తాడు. ఏ వ్యక్తికైనా జీవితకాలంలో సాధారణంగా ఒకటిరెండుసార్లకి మించి శస్త్రచికిత్స చేయించుకునే అవసరం వుండదు. అటువంటప్పుడు సహజంగానే ఆ రోగికి చాలా భయం, తెలియని కంగారు వుండి బీపీ పెరిగిపోయి, గుండె వేగంకూడా పెరిగే అవకాశం వుంటుంది.
అందుకని ముందుగా ‘ప్రీమెడికేషన్’ అనే ప్రక్రియ మొదలుపెడతారు. ఇందులో పేషెంటుకి మానసిక వత్తిడిని తగ్గించి, నిద్రపుచ్చే ఇంజెక్షన్లు, ఆపరేషన్ సమయంలో వాంతులు అవకుండా నిరోధించే మందులు, ఎసిడిటీని తగ్గించే మందులు ఇస్తారు.
ఇక ఈ మత్తనేది ప్రధానంగా రెండురకాలు.
1. జనరల్ అనెస్తీషియా
2. రీజనల్ అనెస్తీషియా
జనరల్ అనెస్తీషియా అంటే శరీరం మొత్తానికి ఇంజెక్షన్ల ద్వారా మత్తునిచ్చి, కండరాలని(మజిల్స్) చచ్చుబడేలా(పేరలైజ్) చేసి, శ్వాసక్రియను కూడా ఆపి, మొత్తం శరీరాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. తరవాత అతని శ్వాసవాహిక(ట్రేకియా)లోకి ఒక ట్యూబ్ ని అమర్చి ఆపరేషన్ అయ్యేంతవరకు కృత్రిమంగా శ్వాసనందిస్తాడు.
ఇక ఆపరేషన్ సమయంలో రోగికి బీపీ, గుండెవేగం, మూత్రం ఎంతవుతోంది, శరీర ఉష్ణోగ్రత ఎలావుంది, ఇచ్చిన మత్తుమందుల నుంచి రోగి తిరిగి బయటికి వస్తున్నాడా లేదా, రక్తం ఎంత మోతాదులో పోతోంది, దాని ప్రభావం రోగిపై ఎంతవరకు వుంటుంది… ఇత్యాదులన్నీ అతనే చూసుకుంటాడు. సర్జన్ పూర్తిగా ఆపరేషన్ వ్యవహారంలో నిమగ్నమై వుంటే అది తప్పకుండా సఫలమవుతుంది. అందువల్ల అతనికి ఎటువంటి ఇబ్బందీ కలగని విధంగా ఈ వ్యవస్థలన్నిటి మీదా పూర్తి ‘కంట్రోల్’ అనెస్తటిస్టుకే వుంటుంది.
ఆపరేషన్ పూర్తయ్యేంతవరకు కృత్రిమశ్వాస అందించడానికి ‘బాయిల్’ మెషీన్ అనే పరికరం వుంటుంది. దాని సహాయంతో ఎన్నిగంటలైనా నిరంతరం శ్వాసనందిస్తాడు.
జనరల్ అనెస్తీషియా అనేది ఏ ఆపరేషన్ కైనా ఇవ్వవచ్చు. సాధారణంగా బొడ్డుకు పైభాగంలో జరపవలసిన ఆపరేషన్లకి ఉదాహరణకు బ్రెస్ట్, థైరాయిడ్, టాన్సిల్స్, గొంతు, ముక్కు, చెవి, తలభాగం, గుండె, ఊపిరితిత్తులు, వెన్నెముక ఇత్యాది భాగాలకు ఈ మత్తు అవసరమవుతుంది.
ఇందులో రిస్క్ శాతం ఎక్కువ. అత్యంత శ్రద్ధగా వ్యవహరించాలి. కేవలం మత్తువైద్యుడొకడే కాకుండా అతనికి సహాయపడే టెక్నీషియన్లు, నర్సులు కూడా అప్రమత్తులై వుండాలి. ఇంజెక్షన్లన్నిటినీ పేర్లు రాసి అట్టేపెట్టుకోవాలి. రోగి శరీరం బరువునిబట్టి ఎంత డోసు ఇవ్వాలో ముందుగానే లెక్కలేసుకోవాలి.
ఒకవేళ రోగికి ఏవైనా మందులు పడవని తెలిస్తే వాటికి ప్రత్యామ్నాయంగా వేరే వాటిని ఉపయోగించాలి. ఆపరేషన్ పూర్తైన తరువాత రోగి మత్తునుంచి బయటపడే సమయం కూడా చాలా కీలకమైనది. ఆ సమయంలో పూర్తిగా మత్తునించి కోలుకుని, కళ్లుతెరిచి, మాట్లాడి, చేతులు, కాళ్లు కదపగలుగుతున్నాడని అనిపించిన తరువాతనే ఆపరేషన్ గదినుంచి బయటికి పంపాలి. లేకపోతే మళ్లీ వార్డులో తిరిగి మత్తులోకి జారుకుని శ్వాస ఆగిపోయే ప్రమాదం కూడా వుంటుంది.
ఇక ఆధునిక వైద్యం అందించిన పరికరాలు మానిటర్లు…
ఇవి బీపీ, గుండెవేగం, శ్వాసక్రియలో తేడాలు, రక్తంలో ఆక్సిజన్ శాతం…ఇత్యాదులన్నీ తెలియజేస్తాయి. వీటిని మల్టీపారామీటర్ మానిటర్స్ అంటారు. అయితే ఇవి విద్యుత్, బ్యాటరీ ఆధారంగా పనిచేస్తాయి. మంచి కంపెనీలకు చెందిన మానిటర్లు సాధారణంగా ఎటువంటి ఇబ్బందినీ కలుగజెయ్యవు. అయినాసరే వాటిమీద ఒక కన్నేసి వుంచుతాడు అనెస్తటిస్టు. అవి రోగిని మానిటర్ చేస్తాయి. వాటిని ఇతను మానిటర్ చేస్తాడు.
కరెంట్, బ్యాటరీ సమస్యలవల్ల అవి పనిచెయ్యకపోతే మళ్లీ తిరిగి పనిచేసేంతవరకు మత్తువైద్యుడు తనకున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి రోగి పరిస్థితిని అంచనా వెయ్యగలగాలి.
ఒకవేళ రక్తస్రావం అధికంగా వుందని భావిస్తే అత్యవసరంగా బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తెప్పించి వెంటనే ఎక్కించే బాధ్యతకూడా అనెస్తటిస్టుదే.
ఇక రీజనల్ అనెస్తీషియా:
సాధారణంగా నడుము క్రింద భాగంలో చేసే ఆపరేషన్లకి, కాలి ఎముకలకి, హెర్నియా, హైడ్రొసిల్, మూలవ్యాధి, సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీయడం, గర్భసంచికి చేసే ఇతర శస్త్రచికిత్సలు… ఇత్యాదులన్నీ ఈ రీజనల్ అనెస్తీషియాలోనే చేస్తారు.ఇందులో మళ్లీ రెండురకాలు.
1. స్పైనల్ అనెస్తీషియా 2.ఎపిడ్యూరల్ అనెస్తీషియా
ఈ అనెస్తీషియాలో పేషెంటుకి నడుము పైభాగంలో స్పర్శ తెలుస్తూ వుంటుంది. జ్ఞానం వుంటుంది. అందరి సంభాషణలూ వినగలిగే అవకాశం వుంటుంది. ఆపరేషన్ అయిన తరువాత వార్డుకి పేషెంటుని త్వరగా పంపించే వీలుంటుంది. సిజేరియన్ ఆపరేషన్ సమయంలో ఒకవేళ తల్లికి తన బిడ్డను అప్పటికప్పుడే చూడాలనిపిస్తే చూసే అవకాశమూ వుంటుంది.
ఇక అనెస్తీషియా ఇచ్చేముందు మత్తువైద్యుడికి ఛాలెంజింగ్ గా అనిపించే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం.
అప్పుడే పుట్టిన శిశువులు, నెలలోపు వయసున్న చిన్నారులు, చిన్నపిల్లలు….. వీరికి జన్యుపరంగా వచ్చే కణుతులు, ఉదరసంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, టాన్సిల్స్.. వీటన్నిటికీ ఆపరేషన్లు అవసరమవుతాయి.
వీరికి శరీర పరిమాణాన్ని బట్టి మత్తుమందుల మోతాదుని కొలిచివుంచుకోవాలి. పరికరాలు కూడా మారిపోతాయి. శరీర ఉష్ణోగ్రత చాలా త్వరగా మార్పులు చెందే అవకాశమున్న సమూహమిది. అందువల్ల ఆపరేషన్ గదిలో టెంపరేచర్ని కూడా నియంత్రించాలి. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాలి. అదే సమయంలో రిస్క్ వుండే అవకాశాన్ని కూడా వారికి వివరించి వారినుంచి ప్రత్యేక అనుమతిపత్రం తీసుకోవాలి.
ఇంకొక సమూహం.. వృద్ధులు. వీరి శరీరంలో కీళ్లు, ఎముకలు, కండరాలు అన్నీ పటుత్వం తగ్గివుంటాయి. వీరిని ఆపరేషన్ గదిలో అత్యంత జాగరూకతతో కదపాలి. లేకపోతే కీళ్లు, ఎముకలు విరిగే ప్రమాదాలు తలెత్తవచ్చు. అలాగే వారికిచ్చే మందుల మోతాదూ మారిపోతుంది. సహజంగా చాలామందికి ఆ వయసులో అధిక రక్తపోటు, మధుమేహం వుంటాయి. వాటిని కంట్రోల్ చేసిన పిమ్మట ఆపరేషన్ కి అనుమతించాలి. లేదంటే ఆపరేషన్ స్ట్రెస్ వల్ల అవి తీవ్రస్థాయిలో పెరిగి కొత్తసమస్యలు తలెత్తే అవకాశముంది.
ఇక గుండెకు, మెదడుకు, ఊపిరితిత్తులకు చేసే అత్యంత ముఖ్యమైన ఆపరేషన్లలో పేషెంటుకి ఎంత మోతాదులో ఫ్లూయిడ్స్ ఇవ్వాలి, రక్తం ఆవశ్యకత, సర్జన్లతో కలిసి ఒక బృందంగా ఆలోచిస్తూ, ప్రత్యేక శ్రధ్ధతో వ్యవహరించాల్సివుంటుంది.
ఒకవేళ బైపాస్ సర్జరీ అయినట్లయితే రోగి గుండెను ఆపి, పంప్(హార్ట్ లంగ్ మెషిన్) ద్వారా రక్తప్రసరణను నియంత్రిస్తారు. ఆ సమయంలో ఆ పంప్ ఆపరేటర్ (పర్ఫ్యూజనిస్ట్)తో పరస్పరం చర్చిస్తూ, అవసరాన్నిబట్టి మందుల్ని మారుస్తూ వుండాలి.
ఇటువంటి దీర్ఘకాల ఆపరేషన్లలో ఎంతో సంయమనం, సహనం, నైపుణ్యం అవసరమవుతాయి. అధికసంఖ్యలో ఆపరేషన్లు నిర్వహించిన అనుభవజ్ఞులైన మత్తువైద్యుల సమక్షంలో ఇటువంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.
ఇక అత్యవసర చికిత్సా విభాగంలో మత్తువైద్యుడి పాత్ర:
ముందుగా రోగి స్పృహలో వున్నాడా లేదా,
నాడి కొట్టుకుంటోందా లేదా,
శ్వాస ఆడుతోందా లేదా,
గుండె పనిచేస్తోందా లేదా..
ఒకవేళ లేకపోతే….
వెంటనే గుండెను తిరిగి పనిచేయించడానికి ఛాతీపై లయబద్ధంగా వత్తిడి కల్పిస్తూ, కృత్రిమశ్వాసను అందిస్తూ రోగిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇవ్వడంవల్ల కొన్నిసార్లు గుండెను తిరిగి పనిచేయించే అవకాశం వుంటుంది. ఇతరుల సాయంతో రోగిని ప్రధాన సమస్యనుండి బయటపడేసే ప్రాథమిక చికిత్స (బేసిక్ లైఫ్ సపోర్ట్) చేస్తాడు.
రోగి తిరిగి కాస్తంత కోలుకుంటే అటుపిమ్మట అవసరాన్నిబట్టి అందవలసిన ప్రత్యేక చికిత్స(అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్) కోసం ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కి పంపిస్తాడు.
ఒకవేళ శరీరంలో రక్తం చాలావరకు పోయి, ఐ.వి. ద్వారా ఫ్లూయిడ్స్, రక్తం ఎక్కించవలసివస్తే వెయిన్ దొరకని పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు రోగి మెడభాగంలో వుండే సెంట్రల్ వెయిన్లోకి ఒక ప్రత్యేక ట్యూబ్ ని అమర్చి అధికవేగంతో సరాసరి గుండెదాకా ఫ్లూయిడ్స్ పంపించే ప్రక్రియలో కూడా వీరు నిష్ణాతులై వుంటారు. దీన్ని ‘సెంట్రల్ వీనస్ కాన్యులేషన్’ అంటారు.
దానిద్వారా రోగి త్వరగా కోలుకునే అవకాశమూ మెరుగుపడుతుంది.
ఇవే కాకుండా మత్తువైద్యుడి విధుల్లో ఇంకొక ప్రత్యేకమైన విభాగం ‘నొప్పి నివారణ క్లినిక్’ లేదా ‘పెయిన్ క్లినిక్స్’
దీర్ఘకాలంగా ఎముకలు, వెన్నుపూస, కేన్సర్ తదితర వ్యాధులవల్ల రోగులకి నొప్పి అనేది శాశ్వతంగా వుండే అవకాశం ఎక్కువ. వారికి ఈ పెయిన్ క్లినిక్స్ లో నొప్పిని కొన్నాళ్లపాటు నివారించడానికి ప్రత్యేక వైద్యం అందుతుంది. వెన్నెముకలో ఎపిడ్యూరల్ కేథిటర్ అనే ఒక సన్నని ట్యూబుని అమర్చి మత్తుమందు ఎక్కిస్తారు. శరీరంలో అనేకచోట్ల వుండే నరాలకు వివిధరీతుల్లో మత్తుమందు ఎక్కించి దీర్ఘకాలిక నొప్పుల్ని తగ్గిస్తారు.
ఎటువంటి వైద్యమూ నయంచెయ్యలేని కొన్ని ప్రాణాంతక వ్యాధులున్న రోగులకు కనీసం నొప్పినైనా తగ్గిస్తే వారు బ్రతికినంతకాలం సుఖంగా వుంటారు. అందుకు ఈ పెయిన్ క్లినిక్స్ చాలా ఉపయుక్తమైనవి.
ఇలా బహుముఖ ప్రజ్ఞతో అన్ని వైద్యరంగాలనూ ఆకళింపుచేసుకుని, నిరంతరమూ అప్రమత్తంగా వుండడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ సమావేశాలకు కూడా తరచుగా హాజరవుతూ వుండాలి. మత్తువైద్యానికి సంబంధించి అత్యాధునిక పద్ధతులు ఏమన్నా కొత్తగా ప్రవేశపెడితే వాటిని నేర్చుకోవడానికి సైతం సిద్ధంగా వుండాలి.
రోగులపట్ల ప్రేమ, వారి ఆర్ధికపరిస్థితిపై ఆకళింపు, కుటుంబసభ్యులతో సంప్రదింపులు, ఐసియులలో వున్న రోగుల బంధువులకు రోజూ కౌన్సెలింగ్ చేయడం, వారి పేషెంటు ఆరోగ్యపరిస్థితిని యధాతథంగా ఏరోజుకారోజు తెలియపరుస్తూ వారిని ధైర్యపరచడం…ఇవన్నీ కూడా అనెస్తటిస్టు విధులే!
%d bloggers like this:
Available for Amazon Prime