ఉపవాసం అంటే ఏమిటి అన్న దానికి ఒక నిర్ధిష్ఠమైన అర్ధాన్ని వివరించడం సాధ్యం కాదేమో. ఎందుకంటే విభిన్న మతాలను, ధర్మాలను ఆచరించే వారు ఉపవాసానికి వారి వారి మతాచారాలను అనుసరించి రకరకాల అర్ధాలను చెప్పుకుంటారు. కానీ నాకున్న అవగాహన మేరకు ఉప అంటే సమీపంలో.. వాసం అంటే ఉండటం. అంటే సమీపంలో ఉండటం. ఎవరికి సమీపంలో ఉండాలో మీకు ఈ పాటికి అర్ధమయ్యే ఉంటుంది. భగవంతుని అనుగ్రహం కోసం అతనికి సమీపంలో ఉండటాన్నే ఉపవాసం అంటారు. దాదాపు అన్ని మతాల్లోనూ ఉపవాసం అన్న విధానం ఉంది. క్రిస్టియన్స్ ఈస్టర్ పండగకు ముందు లెంట్ పేరుతో ఉపవాపం చేస్తారు. అలాగే ముస్లింలు రంజాన్ మాసంలో రోజా చేస్తారు. ఇక హిందూ మతంలో ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏడాది మొత్తంలో దాదాపు అన్ని పండగల్లోనూ ఉపవాస దీక్షలు ఉంటాయి. నిర్దేశించుకున్న కాలానికి పూర్తిగా తినకపోవడం లేదా కొద్ది మొత్తంలో ఆహారాన్ని తీసుకోవడం ద్వారా దేవునిపై మనస్సును లగ్నం చేయడం అన్నది దీని ముఖ్యోద్దేశం. అయితే ఇటీవలి కాలంలో దేవున్ని నమ్మని వారు కూడా ఉపవాసం చేస్తున్నారు. ఆరోగ్యాన్ని పెంపోందించుకోవడానికి, బరువు తగ్గడానికి చాలా మంది ఉపవాసాన్ని ఎంచుకుంటున్నారు.
ఆయుర్వేదం ప్రకారం ఉపవాసం చేయడంలో ముఖ్యమైన ఉపమోగం శరీరంలో మలినాలను తొలిగించుకోవడం. మనకు వచ్చే శారీరక ఇబ్బందులకు ప్రధాన కారణం మన శరీరంలో విషతుల్యమైన మలినాలు పేరుకుపోవడమే. ముందు ఉపవాసంతో ఆ మలినాలను తొలిగించుకుని తర్వాత నాణ్యమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మన శరీరాన్ని తాజాగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. ఉపవాసంలో నాలుగు రకాలున్నాయి. అవి
1. నిర్జలోపవాసం : కనీసం నీళ్లు కూడా తాగకుండా చేసే ఉపవాసాన్ని నిర్జలోపవాసం అంటారు. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో నీరు చేరి, వాపు కనిపించినప్పుడు ఇది చేస్తారు. ఇది కేవలం రోగులకు మాత్రమే వైద్యులు సూచిస్తారు. ఆరోగ్యవంతులు ఈ ఉపవాసం చేస్తే శరీరం డీహైడ్రేట్ కు గురవుతుంది.
2. జలోపవాసం : కేవలం మంచినీరు తాగి ఈ ఉపవాసం చేస్తారు. శరీరంలో అధికంగా మలినాలు పేరుకుపోయినప్పుడు ఆయుర్వేద వైద్యులు ఈ విధానాన్ని సూచిస్తారు. మూడు నుంచి ఏడు రోజులు పాటు ఈ ఉపవాసాన్ని చేయిస్తారు. రసాహారాన్ని జీర్ణం చేసుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ జలోపవాసం చేస్తారు.
3. రసోపవాసం : ఈ రసోపవాసం ఇప్పుడు అధికంగా జనాదరణ పొందింది. వారం నుంచి నెలరోజుల వరకూ నిమ్మరసం, నారింజ రసం, బత్తాయి, కమలా, తెనే కలిపిన నీరు, కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లను రోజులో మూడు నుంచి ఐదు సార్లు తీసుకుని ఈ ఉపవాసం చేస్తారు. ఇది కూడా వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి.
4. ఫలోపవాసం : ఈ ఉపవాసంలో కేవలం రసము నిండిన పండ్లను ఆహారంగా తీసుకుంటారు. దానిమ్మ, మామిడి, పుచ్చ, బత్తాయి, ద్రాక్ష మొదలైన పండ్లను మాత్రమే తీసుకుని ఫలోపవాసాన్ని కొనసాగిస్తారు.
అసలు ఉపవాసం చేయడం వలన కలిగే ముఖ్యమైన ఉపయోగం జీర్ణక్రియకు తగినంత విశ్రాంతి లభించి అజీర్ణం వంటి సమస్యలు తొలిగిపోయి జీర్ణ వ్యవస్థ కొత్త శక్తితో పనిచేస్తుంది. అధికంగా ద్రవ పదార్ధాలు తీసుకోవడం వలన కిడ్నీ సమస్యలు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు తొలిగిపోతాయి. గుండె పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా రక్త ప్రసరణ మెరుగవుతుంది. దీని వలన శరీరంలో మెరుపు వస్తుంది. అధిక తిండిని, ఆకలిని అదుపులో పెట్టుకోవడం వలన మనస్సు ప్రశాంతంగా మారుతుంది.
అయితే శారీరంగా బలహీనంగా ఉన్నవారు. చిన్నపిల్లలు, గుండె జబ్బులు, షుగర్ ఉన్నవారు, వృద్ధులు ఉపవాసం చేయకపోవడమే మేలు. ఒక వేళ చేసినా వైద్యులను సంప్రదించి ఒక పూట లేదా రెండు పూటలు ఫలోపవాసం చేయడం మంచిది. లేదంటే కొత్త ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.
అన్నింటికంటే ముఖ్యంగా ఉపవాసం చేయడానికి సరైన ఆరోగ్య అవగాహన చాలా ముఖ్యం. ఉపవాసం సమయంలోనూ శరీరానికి కొన్ని పోషకాలు కావాలి. లేదంటే అసిడీటీ, తలనొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే రోజంతా ఉపవాసం చేసి సాయింత్రం స్వీట్లు, కొవ్వుతో కూడిన ఆహార పదార్ధాలు అధికంగా తింటారు. దీని వలన రోజంతా చేసిన ఉపవాసం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. శరీరతత్వానికి అనుగుణంగా ఉపవాసం విధానాన్ని రూపొందించుకోవాలి. ఉపవాస సమయంలో మితంగా శరీరానికి కావలసిన పోషకాలను మితంగా తీసుకోవడం అలాగే ఉపవాసం ముగిసిన తర్వాత పండ్లు, పచ్చి కూరగాయల సలాడ్లు తింటే మంచి ఫలితాలుంటాయి. అలాగే ఉపవాస సమయంలో మజ్జిగ, నిమ్మరసం, విజిటెబుల్ సూప్స్ వంటివి తరుచుగా తీసుకోవాలి. ఉపవాసం అంటే మన జీర్ణ వ్యవస్థపై భారాన్ని తగ్గించి దాని పనితీరును రెట్టింపు చేసే ప్రక్రియే అన్నది ముందుగా గ్రహించాలి.
You must log in to post a comment.