ఆంధ్రా కాశ్మీర్ – లంబసింగి (విశాఖపట్నం)

ఆంధ్ర రాష్ట్ర కాశ్మీర్ అని విశాఖ జిల్లాలో ఉన్న లంబసింగిని అంటారు. విశాఖ ఏజెన్సీలో ఉనట్టే ఇక్కడ కూడా మంచు ముసుగు మూసేస్తుంది.
చలి కాలంలో ఇక్కడ 0° సెంటిగ్రేడు అంతకంటే తక్కువ కూడా ఉంటుంది. నేను మొదటి సారి ఇక్కడికి 3 సంవత్సరాల క్రితం వెళ్ళాను. చుట్టూ అడవి, ఘాట్ రోడ్డు మీద ప్రయాణం ఎటు చూసినా పచ్చని ప్రకృతి అందులో చక్కటి జలపాతాలు.
సూర్యోదయం ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. ఈ మధ్య ఇక్కడికి ప్రకృతిని ఆస్వాదించడానికి పర్యాటకులు పెరుగుతున్నారు దానితో పాటు వారు వాడిన చెత్త, ప్లాస్టిక్ కవర్లు అన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు దాంతో ఇక్కడి ప్రకృతి చెడిపోతుంది ఏమో అని భయం వేస్తుంది.

అత్యంత చల్లని ప్రదేశం ఆంధ్రా కాశ్మీర్ గా పేరుపొందిన ప్రాంతం లంబసింగి . సముద్రమట్టానికి మూడువేల అడుగుల ఎత్తో చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామమే లంబసింగి. డిసెంబర్, జనవరి నెలలో ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోతుంది. మిగిలిన నెలలోసుమారు పది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. సూర్యోదయం పదిగంటల తరువాతే. అరకులోయ కన్నా చల్లగా ఉండే ఈ ప్రాంతం ఎటు చూసినా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.ఇక్కడున్న పొడవాటి చెట్లమధ్యలోని చల్లని వాతావరణం కారణంగా ఈ ప్రాంతంలో కాఫీ, మిరియాలు తోటల పెంపకం అటవీశాఖవారి అధ్వర్యంలో జరుగుతుంది. రకరాల పక్షుల కిలకిలా రావాలతో వాతావరణం సందర్శకులకు కనువిందుచేస్తుంది. ఇక్కడకు 27 కిలోమీటర్ల దూరంలోనే కొత్తపల్లి జలపాతం ఉంది. సందర్శకులకు చింతపల్లిలో వసతి సౌకర్యం కలదు. చింతపల్లినుండి సీలేరు ఘాట్ రోడ్ లో ప్రయాణించటం ఒక మధురానుభూతి. ఈ ఘాట్ రోడ్ లో పట్టపగలు 12 గంటలకు కూడా మంచు పడుతుంది. వేసవి సెలవులు చల్లగా గడపాలనుకునే వారికి లంబసింగి చాలా అనుకూలం. ఎలా వెళ్లాలి ? లంబసింగికి విశాఖపట్నం దాకా రైలులో వెళ్లి అక్కడ నుండి 101 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగికి టాక్సీలు లేక కార్లలో వెళ్లవచ్చు. చింతపల్లికి 19 కిలోమీటర్ల దూరంలో లంబసింగి గ్రామం ఉంది. నర్సీ పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడనుండి టాక్సీలు లేదా కార్లలో వెళ్లవచ్చు.