వంకాయకూర నచ్చని తెలుగువారు చాలా అరుదు. అతి తరచుగా తినే కూరలలో వంకాయది ప్రథమ స్థానం. శుభమా అశుభమా అనేది పక్కన పెడితే వంకాయ లేకుండా ఏ కార్యం జరగదనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. వంకాయతో వెయ్యి రకాలు అనేది ఒక తెలుగు జాతీయం. . వంకాయల పరిమాణాన్ని బట్టి/ చిక్కే రకాన్ని బట్టి కూరగకానీ, పులుసుగా కాని, మసాలాతో గుత్తి వంకాయ కాని, తెలంగాణా బగారా బైగన్, ఉత్తర భారత విధానంలో బైంగన్ బరత, బెంగాలీల బేగునీ బాజా, అల్లం పచ్చిమిర్చితో కూర, వంకాయ చిక్కుడుకాయ పోపు కూర, వంకాయను కాల్చి పచ్చడిగ గానీ లేక పెరుగుపచ్చడిగగాని, మజ్దిగ పులుసులో, వాంగీ బాత్ లో, గుండ్రంగా చక్రాలుగా తరిగి బజ్జీలుగా ఇలా చెబుతూ వెళుతుంటే వంకాయ వాడకం సూచి పెరుగుతూ పోతుంది తప్ప చెప్పవలసినవి ఇంకా మిగిలే వుంటాయు. అన్ని కాలాలలో చిక్కడం, అతి త్వరగా కూర చేసుకోగలగడం, వేరే కూరలతో కలసి పోగలగడం వంకాయ ప్రాముఖ్యత పెంచే కొన్ని ప్రత్యేకతలు.
తెలుగు వారికి వంకాయతో అవినాభావ సంబంధం వుంది. ఈ చాటు పద్యం చూడండి:
వంకాయ వంటి కూరయు
పంకజముఖి సీతవంటి భామా మణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును గలడే!!
బసవరాజు అప్పారావుగారి ప్రసిద్దికెక్కిన ఈ గీతం:
గుత్తి వంకాయ కూరోయి బావా!
కోరీ వండినానోయి బావా!
తెలుగుసామెతలలో కూడా వంకాయ చోటు సంపాదించుకుంది:
- కొనింది వంకాయ కొసరేది గుమ్మడికాయ
- వంకాయ దొంగిలించిన వాడు టెంకాయకు రాడా
- వగలమారి వంకాయ సెగలేక ఉడికిందట
- పుచ్చు వంకాయలు బాపనయ్యలకు
- వాశిరెడ్డి వెంకటాద్రి నాయుడు తులాభారం తూగితే కారెడ్ల కామక్క వంకాయలభారం తూగిందట
వంకాయతో ఆరోగ్యపరంగా కూడా బోలెడు ఉపయోగాలు ఉన్నాయి. పోషకాలు, ఖనిజాలతోబాటు, వంకాయ యాంటీఆక్సిడెంట్‌గా, క్యాన్సర్‌ను నివారిణిగా. కొలెస్టిరాల్ /మధుమేహాలు తగ్గించడానికి, మూర్చ వ్యాధికు, నిద్రలేమి, కడుపుబ్బరం (రహస్యాలు దాస్తే వచ్చేది కాదు; అజీర్తి వలన వచ్చేది) ఇలా అనేక ఉపశమనాలకు వంకాయ ఉపయోగ పడుతుంది. కాని కొన్నిచోట్ల వంకాయని వాడడం ఇబ్బంది కూడా కలిగించ గలదు. అంత మాత్రాన వంకాయని మన వంటింటి నుంచి తీసి వేయలేము; దాని స్థానాన్ని వేరే దేనితేనో భర్తీ చేయలేము.
You must log in to post a comment.