పూరీలు, బోండాలు తినడం మంచిదేనా? లేక దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయా?

  • బోండాలు మైదా పిండితో చేస్తారు. మైదా పిండి అనేది గోధుమ గింజల్లోనుంచి పైన ఉన్న తవుడు పొర, సాల్యుబుల్ ఫైబర్ అన్నీ పూర్తిగా తీసేయ్యగా మిగిలే పదార్ధం. ఫైబర్ అనేది లేని కారణంగా, తిన్న వెంటనే ఒకేసారి పెద్ద పెద్ద మొత్తాల్లో గ్లూకోస్ రక్తంలోకి చేరడం వల్ల తరచూ అలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పూరి అనేది గోధుమపిండితోనే చేసినప్పటికీ వాటికి పక్క వాయిద్యాలుగా బంగాళదుంప కూర లాంటివి తింటాం కనుక మళ్లీ ఇదే సమస్య ఎదురవుతుంది.
  • నూనెలో అధిక ఉష్ణోగ్రత దగ్గర వేయించడం వల్ల అంతో ఇంతో మిగిలి ఉండే పోషకాలు నశిస్తాయి. అదీ కాక పదే పదే నూనెని వేడి చెయ్యడం వల్ల వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్‌గా పిలవబడే ఒక రకమైన కొవ్వుల శాతం పెరుగుతుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తనాళాలు మూసుకుపోవడం లాంటి ఎన్నో రక్త ప్రసరణ సంబంధిత వ్యాధులకి, హృద్రోగాలకి కారణం అవుతాయి.
  • గోధుమల్లో ఉండే గ్లూటెన్ అనే ఒక ప్రోటీన్ కొంతమందిలో ఎలర్జీ కలిగిస్తుంది అని చెబుతూ ఉంటారు. శరీరంలో వాపుని పెంచుతుందనీ, వ్యాధినిరోధక శక్తిని తగ్గిస్తుందనీ అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రధానంగా సీలియాక్ డీసీజ్‌ అనే వ్యాధిలో ఈ గ్లూటెన్ పాత్ర నిరూపితం అయింది. గ్లూటెన్ ప్రభావం ఇదమిత్థంగా తేలనప్పటికీ, అది కలిగిన పదార్ధాలు మానడం వల్ల కొంతమందికి ఆరోగ్యం మెరుగు అయినట్టు తెలుస్తుంది. దీనిమీద విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి.
  • ఆయుర్వేద ప్రకారంగా నూనెలో వేయించిన పదార్ధాలు శరీరంలోని మూడు దోషాలనీ (వాత, పిత్త, కఫ) పెంచుతాయి. (రెఫరెన్సు : Prakriti : Your Ayurvedic body constitution, by Robert Svoboda)
  • ఇవి మాత్రమే కాక తిన్న తరువాత కొందరిలో గుండె మంట పుట్టడం లాంటి లక్షణాలు మనకి తెలిసినవే.
వీటన్నింటిని బట్టి చూస్తే, అవి ఎప్పుడో ఒకసారి తినాల్సినవే తప్ప తరచూ తినాల్సినవి కాదు అని అర్ధం అవుతుంది.
%d bloggers like this:
Available for Amazon Prime