గాలిపటం ఆకాశంలో ఎందుకు ఎగరగలుగుతుంది? దాని వెనుక ఉన్న ఫిజిక్స్ ఏమిటి?

గాలిలో ఏదైనా వస్తువు ఎగరాలి అంటే అస్థిరంగా ఉండే నాలుగు శక్తుల మధ్య సమతుల్యం ఉంటేనే సాధ్యం అవుతుంది. అవి లిఫ్ట్, డ్రాగ్, బరువు మరియు థ్రస్ట్‌.
లిఫ్ట్: ఏదైనా వస్తువు గాలిలోకి ఎగరడానికి, దాని బరువుకి సమానంగా లేదా మించిన శక్తిని కలిగి ఉండాలి. ఈ శక్తినే లిఫ్ట్ అంటారు. ఈ విధమైన శక్తిని కలిగించడానికి అనుగుణంగా ఎగిరే వస్తువులను రూపకల్పన చేస్తారు. ఉదాహరణకి విమానరెక్కలు రూపొందించేప్పుడు రెక్క పై భాగానికి, కింద భాగానికి తేడా ఉంటుంది. అప్పుడు పైనా, క్రిందా ఏర్పడే గాలి/పీడన అంతరాల వల్ల విమానం పైకి లేస్తుంది.
వెయిట్: భూమి మీద ప్రతి వస్తువుకి కొంత బరువు ఉంటుంది. ఈ బరువు లిఫ్ట్ కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఎగిరే వస్తువుని భూమి వైపు ఆకర్షిస్తుంది.
డ్రాగ్: డ్రాగ్ గాలికి నిరోధ శక్తిగా పని చేస్తుందని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మీరు వాహనంలో వెళ్ళేటప్పుడు మీ చేతిని బయట పెడితే, గాలికి వ్యతిరేకంగా మీ చెయ్యి లాగబడునట్లు మీరు అనుభూతి చెందుతారు. మీ చేతి పరిమాణం, కారు వేగం మరియు గాలి సాంద్రత వంటి కొన్ని అంశాలపై డ్రాగ్ ఆధారపడి ఉంటుంది. మీరు వేగాన్ని తగ్గించినట్లయితే, మీ చేయి లాగడం తగ్గుతుందని మీరు గమనించవచ్చు. ఈ నిరోధాన్నే డ్రాగ్ అంటారు.
థ్రస్ట్‌: థ్రస్ట్‌ అనేది డ్రాగ్ కి వ్యతిరేకంగా మనం సృష్టించే శక్తి.
ఇప్పుడు గాలిపటం విషయానికి వస్తే:
గాలిపటం పైన ఎగురుతున్నప్పుడు మూడు శక్తులు పనిచేస్తూ ఉంటాయి.
  • గాలిపటాన్ని – పైకి పంపే లిఫ్ట్, గాలి ప్రవహించే దిశలో పటాన్ని లాక్కొని వెళ్లే డ్రాగ్, పటాన్ని కిందకి లాగే గురుత్వాకర్షణ/బరువు.
  • వీటికి అదనంగా మనం దారం ద్వారా పటాన్ని నియంత్రించేందుకు ఇచ్చే శక్తి- థ్రస్ట్‌
ఏదైనా వస్తువుని గాలిలో ఎగరవేయ్యడానికి ప్రయత్నించినపుడు , అది వెనుకకు కదలడానికి(డ్రాగ్) మరియు పైకి కదలడానికి(లిఫ్ట్) ప్రయత్నిస్తుంది. ఎప్పుడైతే లిఫ్ట్, తనకు అవరోధమైన పటం యొక్క బరువుని అధిగమిస్తుందో, అప్పుడు గాలిపటం ఎగరడం ప్రారంభమవుతుంది. అలాగే గాలి ప్రవహిస్తున్న దిశలో గాలిపటం కొట్టుకుపోకుండా (డ్రాగ్) మనం దానికి కట్టి ఉన్న దారం ద్వారా అదుపు (థృస్ట్) చేస్తుంటాం.

అలా లిఫ్ట్/డ్రాగ్ పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు, తగిన నియంత్రణ మనం దారం ద్వారా చేస్తూ ఉన్నప్పుడు, ఈ నాలుగు శక్తులు సమతుల్యంగా పనిచేస్తునంత వరుకు గాలిపటం ఎగురుతూ ఉంటుంది.

%d bloggers like this:
Available for Amazon Prime