బోండాలని తెలుగులో మైసూర్ బజ్జీ అని కూడా అంటారు. దీనిని మనవారు ఉదయం ఫలహారంగానూ సాయంత్రాలు చిరుతిండిగానూ తింటూ ఉంటారు.
ఈ బోండాలకి చాలానే చరిత్ర ఉంది. ౧౨వ శతాబ్దంలో కర్నాటకను ఏలిన సోమేశ్వరుడు బోండా తయారీ విధానాన్ని మానసోల్లాస అనే సంస్కృత నిఘంటువులో పేర్కొన్నారట. దక్షిణ భారతం అంతటా ప్రసిద్ధి చెందిన ఈ బోండాల పుట్టినిల్లు మాత్రం కర్నాటకలోనే.
ఇక ఈ మైసూరు బజ్జీ పేరు విషయానికి వస్తే నా అనుకోలు ప్రకారం పూర్వం కర్నాటకను మైసూరు రాష్ట్రంగా వ్యవహరించేవారు, ఆ ప్రాంతం నుంచి వచ్చింది కాబట్టి వీటిని మైసూరు బజ్జీలుగా పిలవడం మొదలుపెట్టి ఉంటారు.
ఈ బజ్జీలు/బోండాలు మనకు వివిధ రకాలుగా లభ్యమవుతున్నాయి. సాదా బోండాలను మైదా పిండితో, ఉల్లి బోండాలని ఇడ్లీ పిండితో తయారు చేస్తారు.
కర్నాటకలోని మంగళూరులో వీటిని గోళిబజె అని అంటారు, వీటి రుచి చాలా బాగుంటుంది.
సుగియన్ అని పిలువబడే ఒకరకం తీపిబజ్జీ కేరళలో చాలా ప్రసిద్ధి.
మహారాష్ట్రలో బంగాళదుంప మసాలా కూరి చేసే బటాటా వడ(ఆలూ బోండా) అంటే మరాఠీలు పడిచస్తారు.
ఇక మన తెలుగు రాష్ట్రాలకి వచ్చేస్తే మనకి కూడా ఉన్నాయండీ మన వెర్షన్ బోండాలు/బజ్జీలు.
శనగ పిండిలో ముంచి వేయించే గుడ్డు బజ్జీ, టమాటా బజ్జీలు. ఇవి ముంత మసాలా బళ్ళమీద బాగా దొరుకుతాయి.
ఈ బజ్జీలన్నీ ఒక ఎత్తయితే వీటిని తలదన్నే ఇంకో బుడ్డోడు కూడా ఉన్నాడండోయ్. ఎవడో కాదు మన బెజవాడ పునుగులు. వీటిని గుటుక్కున ఒక్క వేటులో మింగేయ్యోచ్చు. రుచి గురించి వేరే చెప్పనక్కరలేదు.
You must log in to post a comment.